సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అంతులేని సమస్యలు తెచ్చిపెడుతోంది. వర్షాకాల సీజన్ మొదలై 15 రోజులు కావస్తున్నా నైరుతి స్తంభించడంతో సాధారణంకన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రుతుపవనాల రాక ఆలస్యంతో వర్షాలు కురవక కోటి ఎకరాల్లో ఖరీఫ్ సాగుపై రైతులు దిగాలు చెందుతున్నారు. భారీ రిజర్వాయర్లలో నిల్వలు ఖాళీ కావడం, భూగర్భ జలాల్లోనూ మునుపెన్నడూ లేని రీతిలో భారీ తగ్గుదల కనిపిస్తుండటం ఆందోళన రేపుతోంది. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో తాగునీటి ఇక్కట్లు మొదలవగా అవి మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ నెల 20 నుంచి రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశం ఉంటుందన్న సంకేతాలు కొంత ఉపశమనం కల్గిస్తున్నాయి.
46 శాతం లోటు వర్షపాతం...
రాష్ట్రంలో మామూలుగా జూన్‌లో 136 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉంది. కానీ రుతుపవనాల ఆలస్యంతో సాధారణంకన్నా 46 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ నెలలో సాధారణం కంటే 60–70% తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఈ నెల 8నే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినా అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుపాను ప్రభావంతో అవి స్తంభించాయి. దీంతో రాష్ట్రంలో సాధారణంకంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, కొము రం భీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. అయితే గత రెండ్రోజులుగా నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా రాష్ట్రంవైపు కదులుతున్నాయి. అవి ఈ నెల 20న రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జూలై నుంచి సాధారణంకంటే 60–70శాతం అధిక వర్షపాతం నమోదవుతుందని స్పష్టం చేస్తున్నారు.
ఎస్సారెస్పీ పరిస్థితి ఇలా..
చుక్కలేని కొత్త నీరు...
రాష్ట్రంలో ప్రధాన రిజర్వాయర్లన్నీ నోరెళ్లబెట్టాయి. ఏ రిజర్వాయర్‌లోనూ చెప్పుకోదగ్గ రీతిలో నీటి నిల్వలు లేవు. ఒక్క ఎల్లంపల్లిలో మాత్రం ఒకట్రెండు నెలల తాగునీటి అవసరాలకు సరిపడే నిల్వలు ఉండగా మిగతావన్నీ ఎండిపోయి కనిపిస్తున్నాయి. గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సింగూరు, నిజాంసాగర్‌లో చుక్కనీరు లేదు. ఎస్సారెస్పీది అదే పరిస్థితి. బేసిన్‌లో మొత్తంగా 215 టీఎంసీల నిల్వ ప్రాజెక్టులుండగా ఏకంగా 200 టీఎంసీల నీటి లోటు కనబడుతోంది. ప్రస్తుతం జూన్ మూడో వారంలోకి వస్తున్నా ఇంతవరకు చుక్క నీటి ప్రవాహాలు లేవు. సాధారణంగా గోదావరిలో జూన్ రెండో వారం నుంచి నీటి ప్రవాహాలు ఉండే అవకాశం ఉన్నా రుతుపవనాల ఆలస్యం కారణంగా ఇంతవరకు ప్రవాహాల జాడ కనిపించడం లేదు. ఈ ప్రభావం గోదావరి బేసిన్‌లోని 15–18 లక్షల ఎకరాలపై ప్రభావం చూపనుంది. కృష్ణా బేసిన్‌లోనూ ఇవే పరిస్థితులున్నాయి.
నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టుల్లో 537 టీఎంసీలకుగాను ప్రస్తుతం 375 టీఎంసీల నీటి లోటు ఉంది. ఇందులో సాగర్‌లో ప్రస్తుతం 128.63 టీఎంసీల నీటి లభ్యత కనబడుతున్నా ఇదంతా కనీస నీటి మట్టాలకు దిగువన ఉన్నదే. ఇక్కడ డెడ్ స్టోరేజీ 510 మీటర్లుకాగా ఇప్పటికే 508 మీటర్ల వరకు వెళ్లి హైదరాబాద్ తాగునీటి అవసరాలపై నీటిని అత్యవసర పంపింగ్ చేస్తున్నారు. శ్రీశైలంలో 215 టీఎంసీలకుగాను 32.24 టీఎంసీల లభ్యతగా ఉండగా ఇప్పటికే కనీస నీటిమట్టాలకు దిగువకు వెళ్లి ఇరు రాష్ట్రాలూ నీటిని తీసుకుంటున్నాయి. ఎగువన కర్ణాటక ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లో 225 టీఎంసీల నీరు చేరితేగానీ రాష్ట్ర ప్రాజెక్టులకు నీళ్లు రావు. సాధారణ వర్షపాతాలు నమోదయ్యే ఏడాదుల్లోనూ ఆగస్టు, సెప్టెంబర్ వరకు రాష్ట్ర ప్రాజెక్టులు నిండవు. ప్రస్తుతం రుతుపవనాల ఆలస్యం కారణంగా అక్టోబర్ వరకు ప్రాజెక్టులు నిండుతాయో లేదో చెప్పలేని పరిస్థితులున్నాయి. ఇదే జరిగితే జూరాల, సాగర్ కింద 11 లక్షల ఎకరాల ఆయకట్టుపై ప్రభావం పడే అవకాశం ఉంది. మధ్యతరహా ప్రాజెక్టుల్లోనూ ఎక్కడా నీళ్లు రాలేదు. రాష్ట్రంలో 40 వేలకుపైగా చెరువులు ఉండగా 90 శాతానికిపైగా చెరువులు ఎండిపోయి కనిపిస్తున్నాయి. దీంతో వీటి కింద సాగయ్యే 25 లక్షల ఎకరాలు సాగుక్లిష్టంగానే మారనుంది.
భూగర్భ జలాలు దయనీయం..
రాష్ట్రంలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు అడుగింటి పోతున్నాయి. లోటు వర్షపాతం కారణంగా చాలా జిల్లాల్లో రబీ పంటల సాగుకు రైతులు బోర్లపై ఆధారపడటంతో మట్టాల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. గతేడాది మే నెలలో రాష్ట్ర సాగటు నీటిమట్టం 12.73 మీటర్లు ఉండగా ఈ ఏడాది అది 14.46 మీటర్లుగా నమోదైంది. గతేడాది మే నెల మట్టాలతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 1.83 మీటర్ల దిగువకు పడిపోయాయి. మెదక్ జిల్లాలో ఏకంగా 26.47 మీటర్లకు భూగర్భ నీటిమట్టం పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సంగారెడ్డి, సిధ్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో 20 మీటర్లకన్నా ఎక్కువగా నీటి మట్టాలు పడిపోగా కామారెడ్డి, సిరిసిల్ల, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లోనూ గడ్డు పరిస్థితులే ఉన్నాయి. భూగర్భమట్టాలు తగ్గుతుండటంతో చాలా జిల్లాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి కటకట మొదలైంది. బోర్లు పనిచేయకపోవడంతో పట్టణాల్లో వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. ఈ దృష్ట్యానే సాగునీటి ప్రాజెక్టుల్లో తొలి ప్రాధాన్యం తాగునీటి అవసరాలకేనని తేల్చి చెబుతోంది. మిషన్‌భగీరధ అవసరాలకు రెండు బేసిన్‌ల ప్రాజెక్టుల నుంచి కనిష్టంగా 60 టీఎంసీల నీటిని పక్కన పెట్టాకే సాగు అవసరాలకు నీటి విడుదల ఉంటుందని స్పష్టంగా చెబుతోంది. ప్రస్తుతం ఈ రెండు బేసిన్‌ల పరిధిలోనూ నిల్వలు తగ్గుతున్న క్రమంలో వర్షాలపైనే భవిష్యత్ ఆధారపడి ఉంది.
ఇప్పుడే వర్షాధార పంటలు వద్దు...
ఖరీఫ్ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.07 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు సాగు లక్ష ఎకరాలకు మించింది లేదు. ఈ సాగు సైతం బోర్లు కింద జరిగినదే. గతేడాది ఇదే సమయానికి 5 లక్షల ఎకరాలు సాగు జరిగినట్లు వ్యవసాయశాఖ నివేదికలు చెబుతున్నాయి. అంటే గతేడాది కంటే గణనీయంగా తక్కువ విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. ఖరీఫ్ వరి సాధారణ సాగు విస్తీర్ణం 35 లక్షల ఎకరాలుకాగా ఇప్పటివరకు ఎక్కడా నార్లు పోసిన దాఖలాలు కనిపించడం లేదు. వర్షాలు కురిస్తే జూలై, ఆగస్టులో వరి నాట్లు పుంజుకోనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసిన ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి పరిధిలోని కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ, రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ మేరకు ఒక సంయుక్త ప్రణాళికను రూపొందించి శనివారం విడుదల చేశాయి.
దాని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల వర్షపాతం సాధారణం కంటే 60–70శాతం వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉండగా జూలైలో 60–70 శాతం ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రుతుపవన వర్షాలు కానందున వర్షాధార పంటలు విత్తుకోకూడదని సూచించింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత తేలికపాటి నేలల్లో 50–60 మిల్లీమీటర్ల వర్షపాతం, బరువు నేలల్లో 60–70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాక వర్షాధార పంటలైన సోయా చిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, పత్తి తదితర పంటలు విత్తుకోవాలని తెలిపింది. వరి సాగు చేసే పొలాల్లో తొలకరి వర్షాలను ఉపయోగించుకొని జనుము, జీలుగను పచ్చిరొట్ట పైరుగా, ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాల్లో పెసరను పైరుగా లేక పచ్చిరొట్టగా విత్తుకోవాలని సూచించింది. పెసర, జొన్న ఈ నెల 30వ తేదీ వరకు, మొక్కజొన్న, పత్తి, సోయాచిక్కుడు జూలై 15 వరకు, కంది జూలై 31 వరకు, ఆముదం ఆగస్టు 15 వరకు విత్తుకోవడానికి అనువైన సమయమని వెల్లడించింది. వరినార్లు వేసుకోవడానికి దీర్ఘకాలిక రకాలను జూన్ 20 వరకు, మధ్యకాలిక రకాలు జూలై 10 వరకు, స్వల్పకాలిక రకాలు జూలై 31 వరకు అనువైన సమయమని తెలిపింది.
రాష్ట్రంలో మూడు రోజులు తేలికపాటి వర్షాలు
కోస్తాంధ్ర తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 4.5 కి.మీ నుంచి 5.8 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం తెలిపింది. ఈ ప్రభావంతో రాగల 4–5 రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
వర్షం కోసం ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
కాశిబుగ్గ: రాష్ట్రంలో వర్షాలు కురవాలని కోరుతూ వరంగల్ నగరంలోని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వర్షాకాలం ప్రారంభమైనా చినుకు జాడ లేకపోవడంతో సామాన్య ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వరుణుడు కరుణించి వానలు కురిపించాలని కోరుతూ వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోని ముస్లిం సోదరులు వెయ్యి మంది వరకు ఆదివారం ఉదయం వరంగల్ ఓసిటీ మైదానానికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment