మధ్య భారతంలో మహా పోరు
జాతిహితం
మందిర్ ఊపు తరువాత బీజేపీ పటిష్టం కావడానికి కారణం అది కుల రాజకీయాలను అర్థం చేసుకుంది. కుల సమీకరణలను కాంగ్రెస్ కంటే వేగంగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. కాంగ్రెస్ ఇటీవలి కాలంలో కింద కులాల నుంచి ఒక్క కీలకమైన నాయకుడిని కూడా అందించలేకపోయింది. ఉత్తరప్రదేశ్, బిహార్లలో కాంగ్రెస్‌లో కంటే బీజేపీలోనే పెద్ద పెద్ద ఓబీసీ నాయకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇటీవలి దశాబ్దాలలో చూస్తే కాంగ్రెస్ పార్టీలో కనిపించే అతి పెద్ద ఓబీసీ నాయకుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక్కరే.
కులం, రాజకీయాల పరస్పరానుబంధం భారతదేశంలోను, విదేశాలలోను డజన్ల కొద్దీ, ఇంకా చెప్పాలంటే వందల కొద్దీ పీహెచ్డీ సిద్ధాంత వ్యాసాలను రాయించింది. ఈ విషయం మీద పరిశోధన చేస్తూ జీవితకాలం విద్యార్థి వేతనాలు పొందిన వ్యక్తులు ఈ అంశాన్ని లోతుగా విశ్లేషించారు. నేను మన రాజకీయాలలో కులం పాత్ర గురించి మాట్లాడుతున్నాను. అయితే పరిశోధకుడి ముసుగులో మాత్రం కాదు, రాజకీయాంశాలను నివేదించే పత్రికా రచయితగానే వాటి గురించి మాట్లాడుతున్నాను.
ఈ వారం జాతిహితం శీర్షికకు ఉత్తర బిహార్‌లోని ముజఫర్‌పూర్ కేంద్రం నుంచి రాయడానికి మించిన అర్హత కలిగిన మరో అంశం కనిపించదు కూడా. ఎన్నికల తీరును పరిశీలించడానికి ఆ ప్రాంతంలో వారం రోజులుగా తిరుగుతూ, గోడల మీద రాతలు చదువుకుంటూ ఇది రాశాను. ఎన్నికల వార్తలను సేకరించడానికి బిహార్ వెళితే, ఒక గంట సమయంలో ‘కులం’ అనే మాటను ఆరుసార్లయినా వింటాం. ఇంకో రాష్ట్రానికి ఈ పని మీద వెళితే ఆ మాటే ఇంకొన్ని సార్లు తక్కువగా వినిపిస్తుంది. అంతేగానీ సంభాషణల మధ్య నుంచి ఆ పదం ఎక్కడికీ పోదు. బహుశా పశ్చిమ బెంగాల్, కొంత వరకు అసోం ఇందుకు మినహాయింపు అనుకోవచ్చు.
కులరాజకీయాల గురించి తెలుసుకోవాలంటే ఎన్నికలకు మించిన సందర్భం మరొకటి ఉండదు. 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సమ యంలో హరియాణాలోని కురుక్షేత్ర నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు విస్తుపోయే అనుభవం ఒకటి ఎదురైంది. అప్పుడు షెడ్యూల్డ్ కులాలకు (అప్పుడు దళిత్ అన్న పదం పెద్దగా ఉపయోగించేవారు కాదు) చెందిన జిల్లా పోలీసు అధిపతి ఒకరు- భజన్‌లాల్ విధేయుడు- నాకు కొన్ని విషయాలు చెప్పారు. ఆయన ఒక నోట్ ప్యాడ్ తీసుకుని ఒక్కొక్క కులాన్ని విభజించి, దాని వాటాను సూచిస్తూ బొమ్మలు గీసి, ఎవరు ఏ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉందో వివరించాడు.
చివరికి ఆయన చెప్పినదేమిటంటే, షెడ్యూల్డ్ కులాల ఓట్లు ఎటు పడితే, అటు కాటా మొగ్గుతుందనీ, అందులో మూడింట రెండు వంతుల ఓట్లు ‘మనవి’ (అంటే ఆయన అభిమానించే బాబూ జగ్జీవన్‌రామ్ సామాజిక వర్గానివి) అని చెప్పాడు. తరువాత సామూహికంగా పార్టీ ఫిరాయించి సంచలనం సృష్టించినా, అప్పటికి భజన్‌లాల్ బాబూజీ వైపు ఉన్నారు. ఎస్సీలలో మిగిలిన వారు ఎవరు అని నేను అడిగాను. ‘మిగిలినవి కింది కులాల వారివి’ అని ఆ పోలీస్ చీఫ్ చెప్పాడు. కులం గురించి అంత యథేచ్ఛగా మాట్లాడడానికి ఆయన తన స్థాయి నుంచి పక్కకు జరిగాడని నేను అనుకున్నాను.
తరువాత కాలంలో కూడా ఇలాంటివే మరో రెండు సందర్భాలు తటస్థించాయి. 1983లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సుదీర్ఘ సమ్మె జరిగినప్పుడు, ‘బ్రాహ్మణులు, ఠాకూర్లు, భూమిహార్లు; తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బిహార్ అంటూ ఒక ఆచార్యుడు చాలా సహాయపడే రీతిలో కుల పరిభాషలో అక్కడి రాజకీయాలను గురించి వివరించిన తీరు చూసి నాకు చాలా ఆసక్తి కలిగింది. అయితే కులం ప్రాధాన్యం బాగా ప్రస్ఫుటమైనది మాత్రం ఎనభై దశకంలో రాజీవ్‌గాంధీ, ఆయన పార్టీ కాంగ్రెస్ పతనమైన తరువాతే. కాన్షీరామ్ తన సామాజిక సిద్ధాంతాన్ని రాజకీయ పార్టీగా మలచి, ఆ దశాబ్దపు ఎన్నికలలో మూడో శక్తిగా అవతరించారు.
బోఫోర్స్ వివాదంపై రాజీవ్ మంత్రిమండలి నుంచి రాజీనామా చేసి, మళ్లీ పార్లమెంటుకు రావడానికి వీపి సింగ్ అలహాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అమితాబ్ బచ్చన్ తిరోగ మనంలో పడ్డారు. కాంగ్రెస్ తన అభ్యర్థిగా లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రిని బరిలోకి దింపింది. కాన్షీరామ్ ‘ఓట్లు మావి, రాజ్యాం మీదా, ఇకపై సాగదు’ అన్న తన నినాదంతో రంగంలో దిగారు. ఆయన అప్పుడు దేని గురించి మాట్లాడారో తలుచుకుంటే మాలో కొందరు విస్తుపోతూ ఉంటాం. తరువాత ఆయనకు వచ్చిన ఓట్లు, మూడో స్థానానికి పరిమితం కావడం చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది.
వీపీ సింగ్ మండల్ కమిషన్ నివేదిక అమలులో పెట్టడం, అగ్రవర్ణాల నిరసనలు, మూడో ఫ్రంట్‌కు ములాయం సింగ్ యాదవ్, లాలూప్రసాద్ అగ్రసేనానులు కావడం వంటి పరిణామాలతో తరువాత మూడేళ్ల కాలంలో కులం సత్తా ఏమిటో వెల్లడైంది. అప్పుడే మందిర్ పరిణామాలు తలెత్తడంతో వెనుకబడిన కులాల ఆధిపత్యాలను తగ్గించడానికి దోహదం చేసింది. ఆ తరువాతే కీలకమైన మధ్య భారత రాజకీయాలు మండల్, కమండల్ పేర్లతో పిలుచుకోవడం మొదలైంది.
బిహార్ ఎన్నికల పోరును లాలూ యాదవ్ ఈ స్థాయికి తీసుకువెళ్లారు. అయితే సుశీల్ మోదీ మాత్రం మండల్, కమండల్ రెండూ తమతోనే ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు. పాతికేళ్ల తరువాత ఇప్పుడు బిహార్ ఎన్నికలలో మండల్ కన్న బిడ్డలే కీలక పాత్రధారులయ్యారు. వారి విజయం- ఇంకో మాటలో చెప్పాలంటే కుల రాజకీయాల మీదే ఆధార పడి ఉంది. అందుకే వీరిని సవాలు చేస్తున్న నరేంద్ర మోదీ బృందం కూడా ఆ భాషలోనే మాట్లాడవలసి వస్తున్నది.
సెక్యులర్/ కమ్యునల్ అంశం మీద మోదీ మాట్లాడితే ఇప్పటికీ, మీరు పోరాడదలచిన శత్రువు ఎవరు? పొరుగు మతమా; దారిద్య్రమా? చెప్పండన్న ధోరణిలోనే మాట్లాడుతున్నారు. అయితే బిహార్‌లో మాత్రం తన కులం గురించిన మూలాలను ఓటర్ల ముందు ఆవిష్కరిస్తున్నారు. ఆయన పార్టీలోని సీనియర్ నాయకుడు సుశీల్ మోదీ కూడా అత్యంత వెనుబడిన వర్గాల నుంచి లేదా ఈబీసీల నుంచి వచ్చారని మోదీని శ్లాఘిస్తున్నారు.
కులం ఆధిక్యం గురించి బీజేపీ రాజకీయాలకీ, ఆరెస్సెస్ సిద్ధాంతానికీ మధ్య వైరుధ్యాలు వ్యక్తమయ్యాయి. ఆరెస్సెస్‌కు వర్ణం అనే అంశంలో మౌలికంగా ఆమోదం ఉన్నా, కులాన్ని విభజన శక్తిగా పునర్ మూల్యాంకన చేయడానికి కూడా ఆమోదం ఉంది. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించడం గురించి అక్కడ నుంచి ప్రశ్న రావడం అందుకే. హిందూ చింతనలో కులాన్ని ఒక విభజన శక్తిగానే ఆరెస్సెస్ చూస్తుంది. అయితే అగ్రకులాలను వదులుకోవడం దాని ఉద్దేశం కాకపోయినా, మండల్ రాజకీయాలతో పాత రాజకీయ వ్యవస్థ కదలడం, రాజకీయ వారసత్వాలు మారడం దానికి రుచించదు.
బిహార్ ఎన్నికలలో బీజేపీ అవకాశాల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా ఆలోచించకుండా రిజర్వేషన్లను సమీక్షించాలనడం అందుకే. ఆరెస్సెస్ లక్ష్యం పాతదే. కులం ద్వారా వచ్చిన విభజనను విశ్వాసం ద్వారా ఐక్యం చేయడం. మండల్ వారసులు గతంలోని డీఎంకె వారి వలె నాస్తికులు కాదు, ఏ వ్యవస్థనీ విశ్వసించని వారు కూడా కాదు. అయితే రాజకీయ వారసత్వాలను కులం ద్వారా పటాపంచలు చేయాలని వారు కోరుకుంటున్నారు. అందుకే వెనుకబడిన లేదా కింది కులాల రాజకీయాలు ఆరెస్సెస్ పాలిట శాపంగా మారాయి. కానీ నరేంద్ర మోదీ, అమిత్‌షాలకు వారి రాజకీయ ప్రాధాన్యాలు స్పష్టంగా తెలుసు. కాబట్టే వారు రిజర్వేషన్ రాజకీయాల వైపు మొగ్గారు.
ప్రస్తుతం బీజేపీ కేంద్రంలో పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్న ప్పటికీ, చరిత్రలో మున్నెన్నడూ లేనన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్నప్పటికీ, తన ప్రత్యర్థి కాంగ్రెస్ పతనావస్థలో మూలుగుతున్నప్పటికీ విశ్వాసానికీ, కులానికీ మధ్య ఏర్పడిన పోటీలో ఇప్పుడు కుల మే గెలుస్తున్నదని చెప్పడానికి నేను సందేహించను. అయితే బీజేపీ ప్రధాని ఈబీసీ వర్గానికి చెందినవారు. ఈ విషయాన్ని అది గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు, ముఖ్యంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వంటివారు వెనుకబడిన కులాల నుంచి వచ్చినవారే.
నిజానికి మహారాష్ట్రకు ఒక బ్రాహ్మణ ముఖ్య మంత్రి వచ్చినప్పుడు, హరియాణాకు రెండు దశాబ్దాల తరువాత జాట్ కులానికి చెందని వ్యక్తి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు - 2014 సంవత్సరం కేవలం ఆ రెండు సందర్భాలలోనే కులాన్ని పరిగణనలోనికి తీసుకోలేదు. ఊహించడానికి వీలుకాని ఇలాంటి సంఘటనలు ఎక్కడో అక్కడ త్వరలో పునరావృతమవుతాయి. బిహార్‌లో బీజేపీ గెలిచినా అలాంటి సంఘటనకు మాత్రం అవకాశం లేకపోవచ్చు. అక్కడ వెనుకబడిన లేదా దళిత నాయకుడు ముందు వరసలో నిలవడం ఖాయం.
1989 మందిర్ ఊపు తరువాత బీజేపీ పటిష్టం కావడానికి కారణం అది కుల రాజకీయాలను అర్థం చేసుకుంది. కుల సమీకరణలను కాంగ్రెస్ కంటే వేగంగా అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది. కాంగ్రెస్ ఇటీవలి కాలంలో కింద కులాల నుంచి ఒక్క కీలకమైన నాయకుడిని కూడా అందించలేక పోయింది. ఉత్తరప్రదేశ్, బిహార్లలో కాంగ్రెస్‌లో కంటే బీజేపీలోనే పెద్ద పెద్ద ఓబీసీ నాయకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇటీవలి దశాబ్దాలలో చూస్తే కాంగ్రెస్ పార్టీలో కనిపించే అతి పెద్ద ఓబీసీ నాయకుడు కర్ణాటక ముఖ్య మంత్రి సిద్ధరామయ్య ఒక్కరే. ఆయనను దేవెగౌడ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ దిగుమతి చేసుకుంది.
బీజేపీ ఎందుకు పటిష్టమైందంటే, అది కొత్త వాస్తవాన్ని అంగీకరించింది కాబట్టేనని చెప్పడం సముచితంగా ఉంటుంది. కొత్తగా వస్తున్న వారి కోసం, వెనుకబడిన కులాలవారి ప్రతిభ నిరూపణ కావడం కోసం అగ్రకులాలకు చెందిన తన పాతతరం నాయకులను తప్పుకునేటట్టు బీజేపీ చేయగలిగింది. కాంగ్రెస్ పతనమైందంటే, ఈ వాస్తవాన్ని అది గుర్తించకపోవడం వల్లనే. అయితే బిహార్ ఎన్నికల ప్రచారంలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఈ మార్పుల పట్ల ఆరెస్సెస్‌లో కొంత అసహనం రేగినట్లు తొలి సంకేతాల వల్ల అర్థమవుతున్నది.
అలాగే సెక్యులర్ కూటమిలో తనది మూడో స్థానమేనన్న వాస్తవాన్ని కాంగ్రెస్ ఆమోదిస్తున్నట్టు కూడా కనిపిస్తున్నది. ప్రస్తుతం బీజేపీలో అంతర్గతంగా ఉన్న సందేహాలను సర్దుబాటు చేయడంలో ఆ పార్టీ ప్రదర్శించే సామర్థ్యం, కాంగ్రెస్ సహా ఇతర కులవాద పార్టీలు, ఓటు బ్యాంకు పార్టీలు ప్రదర్శించే వాస్తవిక దృక్పథం మధ్య భారత రాజకీయాల దిశను నిర్దేశిస్తాయి. ఇప్పటికీ పోటీ సాధికార రాజకీయాలకూ, హిందూత్వకూ మధ్య, ఇంకా- ఏది ఐక్యం చేయగలదు; ఏది విభజించగలదు? విశ్వాసమా, కులమా? అనే అంశాల మధ్యనే నెలకొని ఉంది.
- శేఖర్ గుప్తా
twitter@shekargupta