
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ కొన్ని ప్రాంతాల్లో 25 శాతం అధిక, మరికొన్ని ప్రాంతాల్లో అదే మోతాదులో లోటు వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గణాంకాలు పేర్కొన్నాయి. అయితే వచ్చేవారం ఉత్తరాది, మధ్య భారత్‌లకు రుతుపవనాలు విస్తరిస్తాయని అంచనా వేసింది. ఈ ప్రాంతాల్లో భానుడి ప్రతాపం ఇంకా కొనసాగుతుండగా రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఈనెల 27నుంచి ఉత్తరాది, మధ్య భారత్‌లో వాతావరణం చల్లబడటంతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అదనపు డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. జూన్ 29న దేశ రాజధాని ఢిల్లీకి రుతుపవనాలు తాకనున్నాయని చెప్పారు. రానున్న 48 గంటల్లో ఒడిషా, పశ్చిమ బెంగాల్ సహా గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో, మహారాష్ట్ర, తూర్పు యూపీలో వర్షాలు కురుస్తాయన్నారు.
ఇక నైరుతి రుతుపవనాల రాకతో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు శనివారం నాటికి మైనస్ 10గా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment