కరువు కాటు | Deficit rainfall in Nellore District | Sakshi
Sakshi News home page

కరువు కాటు

Published Wed, Oct 5 2016 2:12 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

కరువు కాటు - Sakshi

కరువు కాటు

 
  •  జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు
  • ఖరీఫ్‌కు చినుకు లోటు... 
  •  రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం (–54.9) నమోదు నెల్లూరే
ఉదయగిరి:
జిల్లాను కరువు కమ్మేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుత సీజన్‌లో వర్షపులోటు –54.9గా నమోదైంది. రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం నమోదైన జిల్లాగా (ఖరీఫ్‌ సీజన్‌లో) నెల్లూరే కావటం విశేషం. ఉత్తర, హస్త, చిత్తకార్తెలు.. ఒక్కొక్కటి కరిగిపోతున్నా చినుకు జాడ కనిపించడం లేదు. ఈ కార్తెల్లో వర్షం ఎక్కువగా నమోదవుతుంది. ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలు వర్షానికి బలమైన నెలలుగా భావిస్తారు. గత వారంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడినా నెల్లూరు జిల్లాలో మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. సాధారణంగా కోస్తా జిల్లాల్లో వర్షాలు పడితే ఆ ప్రభావం మన జిల్లాపై కూడా ఉంటుంది. ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఖరీఫ్‌ (జూన్‌–సెప్టెంబర్‌)లో ఏకంగా సాధారణ వర్షపాతంలో 50 శాతం పైగా లోటు కనిపించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 
జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు వెంటాడుతూనే ఉన్నాయి. ఏ ఏడాదికాయేడాది వాతావరణంలో మార్పులు స్పష్టంగా చోటుచేసుకుంటున్నాయి. వర్షాలు కురుస్తాయని భావిస్తున్న నెలలు, కార్తెలు మొహం చాటేస్తున్నాయి. దీంతో సకాలంలో పంటలు సాగుచేసే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో మెట్ట నియోజకవర్గాలైన ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, తదితర ప్రాంతాల్లో వర్షాలు లేక మెట్టపైర్లు సాగుకాలేదు. జిల్లాలో ప్రతి ఏడాదీ సెప్టెంబర్‌ చివరినాటికి మినుము వేత వేయటం పూర్తవుతుంది. కానీ ఈ ఏడాది ఇంతవరకు సాధారణ విస్తీర్ణంలో పది శాతం కూడా సాగుకాలేదు. ఈ ఒక్క ఉదాహరణే చాలు..జిల్లాలో కరువు ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేయటానికి. 
వర్షపాతం లోటు
ఈ ఏడాది వర్షపాతాన్ని పరిశీలిస్తే జూన్‌ నుంచి అక్టోబర్‌ 3వ తేదీ వరకు జిల్లాలో 351.4 మి.మీ సాధారణ వర్షపాతం నమోదుకావాలి. అయితే అక్టోబరు 4వ తేదీవరకు 170.5 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే జిల్లాలో సాధారణ వర్షపాతంకంటే 54.9 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో మిగతా జిల్లాలకంటే మన జిల్లాలోనే తక్కువ వర్షం కురిసిందన్నమాట. 
అన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులే
జిల్లాలో 46 మండలాల్లోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మండలాల్లో –21 నుంచి 78 శాతం మధ్య తీవ్ర లోటు వర్షాభావం నెలకొనివుంది. వరికుంటపాడు, అనంతసాగరం, తడ, మర్రిపాడు మండలాల్లో గత నెల మొదటి వారం వరకు వర్షం కాస్త మెరుగ్గా ఉన్నా ఆ తర్వాత చినుకు జాడ లేదు. 
రబీ వాసుల్ని కరుణించేనా...!
జిల్లా రైతులకు ఖరీఫ్‌ సీజన్‌ చేదు అనుభవాన్నే మిగిల్చింది. నేలతల్లినే నమ్ముకున్న అన్నదాతల కలలు తల్లకిందులయ్యాయి. ఈ నెల 15 నుంచి పారంభమయ్యే రబీ సీజన్‌పైనే రైతన్నలు గంపెడాశలు పెట్టుకున్నారు. అక్టోబర్‌లో కురిసే వర్షాలనుబట్టే రబీ సీజన్‌ పంటలు ఆధారపడి ఉంటాయి. ఈ నెలలో కూడా వరుణుడు కరుణించకపోతే జిల్లాలోని మెట్ట రైతులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. గత ఏడాది రబీ సీజన్‌లో జిల్లాలో 9.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. మరి ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాలి.
 
జూన్‌ – సెప్టెంబరు 3వతేది వరకు సాధారణ వర్షపాతం 351.4 మి.మీ 
ఈ ఏడాది నమోదైన వర్షపాతం 170.5 మి.మీ
వర్షపాతం లోటు – 54.9 శాతం
గత ఏడాది వర్షపాతం వివరాలు
జూన్‌లో లోటు  –22.5 శాతం
జులైలో  లోటు  – 70.9 శాతం
ఆగస్టులో వర్షపాతం   + 78.3 శాతం
సెప్టెంబర్‌లో వర్షపాతం    +11.4 శాతం
 
 
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement