ట్యాంకర్‌తో పొలానికి నీళ్లు పెడుతున్న రామకృష్ణ
ఇందూరు (నిజామాబాద్ అర్బన్) : ఈ ఏడాది జిల్లాలో వర్షాలు అంతంత మాత్రంగానే కురిసా యి. ఒక్క ఆగస్టు నెలలోనే ఆశాజనకంగా 40 సెం టీ వర్షపాతం నమోదై జిల్లాను ఆదుకుంది. జూన్ 1 నుంచి వర్షకాలం ముగిసే సమయానికి సెప్టెంబర్ 31 వరకు రెండు, మూడు అల్ప పీడనాలే వచ్చాయి. జూన్‌లో 19, జూలైలో 21, సెప్టెంబర్‌లో 03 సెంటీ మీటర్ల వర్షపాతం గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వర్షకాలం సీజన్‌లో మొత్తంగా 94 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదవాల్సి ఉండగా, మైనస్ 12 సెంటీ మీటర్లతో కేవలం 83 సెంటీ మీటర్లు కురిసి జిల్లాలో లోటు, సాధారణ వర్షపాతం నమోదైంది. ఫలితంగా ఏడు మండలాలు లోటు వర్షపాతంలో ఉండగా, 19 మండలాలు సాధారణం, కేవలం ఒక్క మోర్తాడ్ మండలమే అధిక వర్షపాతంలో ఉంది. వాస్తవానికి సాధారణ వర్షపాతం అంటే మైనస్‌లో ఉన్నట్లే అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వారు చెప్పిన లెక్క ప్రకారం మైనస్‌లో ఉన్న మండలాలు 23 ఉన్నాయి.
గతేడాది కంటే మేలే కానీ...
గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 60 సెంటీ మీటర్ల సగటు వర్షపాతమే కురిసింది. అంటే జిల్లాలో దాదాపు కరువు ఛాయలు కనిపించాయి. ఈ ఏడాది గతేడాది కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ లోటు వర్షపాతం నుంచి బటయపడలేకపోయాం. ఒక్క ఆగస్టు నెలలోనే 40 సెంటీ మీటర్లకు పైగా వర్షం కురవడం వల్ల కొంత మేలు జరిగింది. ఇటు ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపడం వల్ల పంటలకు ఎలాంటి నీటి సమస్య ఏర్పడలేదు. ప్రస్తుతం వర్షకాలం ముగిసి చలికాలం ప్రారంభమైంది. ఉదయం, రాత్రుల్లో చల్లగానే ఉంటున్నా వాతావరణం మధ్యాహ్నం వేళలో సూర్యుడు మండిపోతున్నాడు. ఉక్కపోత వాతావరణం ఏర్పడుతోంది. చెరువుల్లో, ప్రాజెక్టుల్లో ఎండా కాలం సమయానికి నీళ్లు లేకపోతే సాగుకు, తాగునీటికి కష్టాలు తప్పేటట్లు లేదు.
ట్యాంకర్‌తో పొలానికి నీళ్లు
సిరికొండ: సిరికొండ మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మూడేళ్లుగా మండలంలో వర్షాలు పెద్దగా కురవలేదు. దీంతో భూగర్భజలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోయాయి. చెరువులు కూడా నిండలేదు. బోరుబావుల్లో నుంచి నీళ్లు రాకపోతుండటంతో ఖరీఫ్‌లో సాగు చేసిన పొలాలను కాపాడుకోవటానికి రైతన్నలు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన బడాల.రామకృష్ణ అనే రైతు తన పొలాన్ని కాపాడుకోవటానికి ట్యాంకర్‌తో నీళ్లు పోస్తున్నాడు.
లోటు వర్షపాతం మండలాలు
- మెండోరా
- ముప్కాల్
- నిజామాబాద్ రూరల్
- ధర్పల్లి
- ఇందల్వాయి
- రుద్రూర్
- జల్
సాధారణ వర్షపాతం మండలాలు
- మోపాల్
- కమ్మర్‌పల్లి
- భీమ్‌గల్
- బాల్కొండ
- మాక్లూర్
- నిజామాబాద్ నార్త్
- నందిపేట్
- కోటగిరి
- బోధన్
- సిరికొండ
- ఆర్మూర్
- డిచ్‌పల్లి
- వేల్పూర్
- ఏర్గట్ల
- వర్ని
- ఎడపల్లి
- నవీపేట్
- నిజామాబాద్ సౌత్
- జక్రాన్‌పల్లి
ఈ వర్షాకాల సీజన్‌లో నెల వారీగా కురిసిన వర్షపాతం (సెంటీ మీటర్లు)
జూన్ -19
జూలై -21
ఆగస్టు -40
సెప్టెంబర్ -03
మొత్తం -83
కురవాల్సిన వర్షపాతం - 94 సెంటీ మీటర్లు
కురిసిన వర్షపాతం- 83 సెంటీ మీటర్లు
Comments
Please login to add a commentAdd a comment