సాక్షి, బళ్లారి : ఓ రైతుకు పరిహారం ఇవ్వడంలో బళ్లారి జిల్లా అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) కార్యాలయ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ కార్యాలయ ఫర్నీచర్‌ను కోర్టు ఆదేశాల మేరకు కోర్టు సిబ్బంది బుధవారం జప్తు చేశారు. బళ్లారి జిల్లా తోరణగల్లు వద్ద ఏర్పాటు చేసిన వీఎస్‌పీఎల్ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వం 1979లో కుడితినికి చెందిన రైతు వెంకటప్ప ఆధీనంలోని 20.47 ఎకరాల భూమిని ఎకరా రూ.6,500 ప్రకారం సేకరించింది. పరిహారం పూర్తిగా అందకపోవడంతో సదరు రైతు 1997లో కోర్టును ఆశ్రయించారు.
కోర్టు స్పందించి రైతుకు రూ.3లక్షల పరిహారం ఇవ్వాలని అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయ అధికారులను ఆదేశించినా ఎలాంటి స్పందన లేకపోయింది. దీంతో కార్యాలయ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని వెంకటప్ప కుమారుడు ఘన శ్యామ సుందరమూర్తికి సూచిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈనేపథ్యంలో మంగళవారం శ్యామసుందరమూర్తి ఏసీ కార్యాలయాన్ని జప్తు చేసేందుకు వెళ్లగా ఏసీ అందుబాటలో లేరు. దీంతో అధికారులు ఒకరోజు గడువు తీసుకున్నారు.
బుధవారం ఉదయం వరకూ పరిహారం విషయంపై అధికారులు ఎలాంటి హామీ ఇవ్వలేకపోయారు. దీంతో ఘన శ్యామ సుందరమూర్తితో పాటు కోర్టు సిబ్బంది శ్రీకాంత్, సంబంధిత లాయరు ఏసీ కార్యాలయానికి చేరుకుని ఏసీ కుర్చీతో పాటు పలువురు అధికారుల కుర్చీలు, ఇతర సామగ్రిని జప్తు చేసి లారీలోకి వేసి కోర్టుకు అప్పగించారు. రైతుకు ప్రభుత్వం పరిహారం అందించిన తర్వాతనే ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న సామగ్రిని తిరిగి ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు.
కార్యాలయానికి తాళాలు: కోర్టు సిబ్బంది ఏసీ కుర్చీతోపాటు ఇతర అధికారుల కుర్చీలను జప్తు చేసి స్వాధీనం చేసుకోవడంతో కూర్చునేందుకు కుర్చీలు లేక అధికారులు కార్యాలయానికి తాళం వేశారు. జిల్లాధికారి తర్వాత అంతే హోదా కలిగిన అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని జప్తు చేయడం, ఆ తర్వాత అధికారులు కార్యాలయానికి తాళాలు వేయడం నగరంలో చర్చనీయాంశమైంది. దాదాపు 30 ఏళ్లపాటు రైతుకు పరిహారం అందించకుండా అధికారులు ఎందుకు కాలయాపన చేశారనే విషయంపై స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా పలువురు రైతులు అక్కడికి చేరుకుని ఘనశ్యామసుందరమూర్తికి మద్దతు తెలిపారు.
బళ్లారి ఏసీ కార్యాలయ ఫర్నీచర్ జప్తు
Published Thu, Sep 5 2013 6:47 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
Advertisement
Advertisement