టెట్‌.. ఇదేమి టెస్ట్‌! | Disagreement in teachers unions on eligibility test | Sakshi
Sakshi News home page

టెట్‌.. ఇదేమి టెస్ట్‌!

Published Sat, Jan 13 2024 4:40 AM | Last Updated on Sat, Jan 13 2024 9:04 AM

Disagreement in teachers unions on eligibility test - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించడం విద్యాశాఖకు సవాల్‌గా మారింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో టెట్‌ పెట్టడం అనివార్యం కావడంతో ఇందుకు సంబంధించిన కసరత్తుపై అధికారులు దృష్టి సారించారు. అయితే దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొండిగా టెట్‌ పెట్టే ఆలోచన చేస్తే ఉద్యమించడానికి సిద్ధమంటూ కొన్ని సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

టెట్‌ తప్పని సరి అనుకుంటే కొత్తవారితో కలిపి కాకుండా టీచర్ల వరకే అంతర్గత పరీక్ష నిర్వహించాలని మరికొన్ని సంఘాలు అంటున్నాయి. కానీ దీన్ని అంగీకరించేది లేదని 2012 తర్వాత నియమితులైన టీచర్లు స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే కోర్టుకెళ్తామని చెబుతున్నారు. దీంతో విద్యాశాఖ గందరగోళంలో పడింది.  

ఎన్ని లింకులో..: టెట్‌లో ఉత్తీర్ణులైన వారే టీచర్‌ పోస్టుకు అర్హులు. టెట్‌లో అర్హత సాధిస్తేనే ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం సాధ్యమవుతుంది. ఈ మేరకు కేంద్రం నిబంధన విధించింది. పదోన్నతులు లభిస్తేనే విద్యాశాఖలో వాస్తవ ఖాళీలు తెలుస్తాయి. అప్పుడే మెగా డీఎస్‌ఈ చేపట్టడం సాధ్యమవుతుంది. ఇలా ఒకదానికి మరొకటి లింక్‌ ఉండటంతో సమస్య కొలిక్కి వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. మరోవైపు మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్న ప్రభుత్వ హామీ విషయంలో నిరుద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇలా సంక్లిష్టంగా మారిన    ఈ సమస్యపై త్వరలో చర్చించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రికి ఓ నివేదిక ఇచ్చే యోచనలో ఉన్నారు. 

టీచర్లలో సిలబస్‌ ఆందోళన 
టెట్‌ రాయాల్సిన చాలామంది ఉపాధ్యాయుల్లో ఆందోళన క న్పిస్తోంది. ఇప్పుడున్న సిలబస్‌ ప్రకారం పరీక్ష రాయడం కష్టమని వారు భావిస్తున్నారు. సర్విస్‌లో ఉన్న టీచర్లు దశాబ్దాల తరబడి ఏదో ఒక సబ్జెక్టును మాత్రమే బోధిస్తున్నారు. మేథ్స్‌ చెప్పే టీచర్‌కు సైన్స్, సైన్స్‌ చెప్పే టీచర్‌కు మేథ్స్‌లో అవగాహన ఉండే అవకాశం లేదు. అన్ని సబ్జెక్టులపై పట్టు ఉంటే తప్ప టెట్‌ అర్హత పొందడం కష్టం. ఇప్పటి యువకులతో పరీక్షలో పోటీ పడలేమని భావిస్తున్నారు.

ఈ కారణంగానే టెట్‌ అనివార్యమైతే సులభంగా ఉండే డిపార్ట్‌మెంటల్‌ పరీక్ష మాదిరి ప్రత్యేకంగా నిర్వహించాలని కోరుతు న్నారు. జనరల్‌ అభ్యర్థులకు 150 మార్కులకు 90 మార్కులు వస్తేనే అర్హత లభిస్తుంది. కాగా కోచింగ్‌ తీసుకున్నప్పటికీ బీఈడీ అభ్యర్థులు రాసే పేపర్‌–2లో ఓసీలు 5 శాతం మాత్రమే అర్హత సాధిస్తుండటం గమనార్హం.  

టెట్‌ ఎంతో కీలకం 
కేంద్ర ప్రభుత్వం 2010లో విద్యా హక్కు చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం టీచర్‌గా పనిచేయాలనుకునే వారు టెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఆ అర్హత ఉంటేనే పదోన్నతి పొందడానికి కూడా అర్హులు. దీని అమలుకు సంబంధించి నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ 2012లో ఆదేశాలు జారీ చేసింది. అయితే 2012 కన్నా ముందు ఎక్కడా టెట్‌ లేదనే అభిప్రాయంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టెట్‌ తప్పనిసరి నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇదే 2022 వరకు కొనసాగుతూ వచ్చింది. కాగా 2022లో పదోన్నతులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో సమస్య మొదలైంది.

టెట్‌ అర్హత ఉన్న టీచర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో పదోన్నతులకు టెట్‌ తప్పనిసరి అని కోర్టు తీర్పు చెప్పింది. ఫలితంగా టెట్‌ పరీక్ష నిర్వహించడం విద్యాశాఖకు అనివార్యమైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 1.03 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో 2012 కన్నా ముందు నియమితులైన వారు 80 వేల మంది ఉంటారు. మిగతా వాళ్ళంతా టెట్‌ అర్హత ఉన్నవాళ్ళే. కాగా పదోన్నతులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని విద్యాశాఖ మరోసారి కోరినప్పటికీ నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌ అంగీకరించలేదు. 

టెట్‌పై ఉద్యమిస్తాం 
 ఏళ్ళ తరబడి బోధించే ఉపాధ్యాయుడికి టెట్‌ తప్పనిసరి చేయడం సహేతుకం కాదు. ఈ చట్టం తెచ్చినప్పుడే వ్యతిరేకించాం. ఈ ఒక్కసారైనా టెట్‌ లేకుండా పదోన్నతులు ఇవ్వాలి. కానీ టెట్‌నే కొలమానంగా భావిస్తే మాత్రం ఉద్యమిస్తాం. -  పి.నాగిరెడ్డి (టీపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) 

ప్రభుత్వమే ఆలస్యం చేసింది 
టెట్‌పై ప్రభుత్వమే ఆలస్యం చేసింది. ఈ కారణంగానే పదోన్నతులు రాకుండా ఆగిపోయాయి. శాఖపరమైన టెట్‌ నిర్వహిస్తే ఇప్పటికే ఉపాధ్యాయులు అర్హత సాధించే వాళ్ళు. టెట్‌ లేకుండా ముందుకెళ్ళడం కష్టమే. కాబట్టి ఉపాధ్యాయులు దీనికి సిద్ధపడాల్సిందే.  – చావా రవి (టీఎస్‌యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి) 

డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలా నిర్వహించాలి 
టెట్‌ అర్హత పొందకుండా పదోన్నతులు పొందడం కష్టమే. అయితే దీర్ఘకాలంగా పనిచేస్తున్న టీచర్లకు టెట్‌ పరీక్ష అంతర్గతంగా నిర్వహించాలి. ఇతర విద్యార్థులతో కాకుండా వేరుగా చేపట్టాలి. దీన్నో డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌లా చేపడితే మేలు.   – పింగిలి శ్రీపాల్‌రెడ్డి (పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement