టెట్ నిబంధనల్లో మార్పులు!
చివరి సంవత్సరం విద్యార్థులకు అవకాశంపై తర్జనభర్జన
వార్షిక పరీక్షల్లో ఫెయిలై టెట్‌లో అర్హత సాధిస్తే సమస్యలు
డిగ్రీ ఉన్న డీఎడ్‌లకు పేపర్-2 రాసే అర్హత తొలగింపు
{పభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు
టెట్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడే అవకాశం!
జనవరి 24న పరీక్ష నిర్వహణపైనా సందేహాలు
5 లక్షల మందికి ఎదురుచూపులే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో పలు మార్పులు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉమ్మడి ఏపీలో ఇచ్చిన ఉత్తర్వులు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం, కొన్ని లోపాలు ఉన్న నేపథ్యంలో వాటిని సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాతే టెట్‌కు దరఖాస్తులు స్వీకరించనుంది. తొలుత వరంగల్ ఉప ఎన్నికల తరువాత టెట్ దరఖాస్తులను స్వీకరించాలని భావించినా.. ఈ సవరణల నేపథ్యంలో వాయిదా వేసింది. సోమవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు టెట్ నిబంధనల్లో సవరణలను పేర్కొంటూ విద్యాశాఖ సోమవారం సాయంత్రమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ఈ సవరణలను డిసెంబర్ మొదటి వారంలోగా జారీ చేస్తే... ముందుగా నిర్ణయించిన మేరకు జనవరి 24న టెట్‌ను నిర్వహించే అవకాశం ఉంటుంది. లేకపోతే పరీక్ష కూడా వాయిదా పడనుంది. మొత్తంగా టెట్ కోసం ఎదురుచూస్తున్న దాదాపు 5 లక్షల మందికి నిరాశ తప్పేలా లేదు.
కొత్త రూల్స్ ప్రతిపాదనలివీ..
ఇంతకుముందు బీఎడ్, డీఎడ్ వంటి ఉపాధ్యాయ కోర్సు ఫైనలియర్ చదువుతున్నవారిని కూడా టెట్ రాసేందుకు అనుమతించారు. టెట్ సర్టిఫికెట్‌కు ఏడేళ్ల వ్యాలిడిటీ, నియామకాల్లో 20 శాతం మార్కుల వెయిటేజీ ఉంది. అయితే కోర్సు ఫైనలియర్‌లో ఫెయిలై, టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఉన్నారు. వారు తమ కోర్సులో తర్వాతి ఏడాది ఉత్తీర్ణులవుతున్నా... తిరిగి టెట్ రాయకపోవడమో, రాసినా అర్హత సాధించకపోవడమో జరుగుతోంది. కానీ డీఎస్సీ నియామకాల సమయంలో బీఎడ్/డీఎడ్‌లో పాస్ కావడానికి ముందే రాసిన టెట్‌ను చూపిస్తుండడంతో సమస్యలు వస్తున్నాయి. దీనితో న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశమూ ఉంది. దీంతో ఫైనలియర్ విద్యార్థులకు టెట్ రాసే అవకాశం ఇవ్వొద్దని భావిస్తున్నారు.
ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు (ఎస్జీటీ పోస్టులు) డీఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు. వారు టెట్ పేపర్-1 రాయాలి. 6 నుంచి 8వ తరగతి వరకు (స్కూల్ అసిస్టెంట్ పోస్టులు) బోధించాలంటే బీఎడ్ చేసిన అభ్యర్థులు అర్హులు. వారు టెట్ పేపర్-2లో రాయాలి. అయితే బీఎడ్ చేసినవారు పేపర్-1 రాసేందుకు అనర్హులని ఎన్‌సీటీఈ స్పష్టం చేసింది. దీంతో ఎస్జీటీ పోస్టులన్నీ డీఎడ్ అభ్యర్థులకే పరిమితమయ్యాయి. అయితే రాష్ట్రంలో డీఎడ్ అభ్యర్థులకు డిగ్రీ ఉంటే పేపర్-2 రాసేందుకు ప్రస్తుతం అవకాశముంది. దీనిపై బీఎడ్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో డీఎడ్‌తో డిగ్రీ ఉన్నవారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అవకాశం ఇవ్వవద్దన్న డిమాండ్ ఉంది. దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
అలాగే టెట్ కనీస అర్హత మార్కుల విధానం, విద్యార్హత పరీక్షలైన ఇంటర్, డిగ్రీలలో కనీస మార్కులు ఉంటేనే (45 శాతం ఉండాలా?.. 50 శాతం ఉండాలా?) టెట్ రాసేందుకు అనుమతిచ్చే అంశంపైనా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరనున్నారు.
ఇక జనవరి 24న టెట్ నిర్వహణకు విద్యాశాఖ చర్యలు చేపట్టడంతో ప్రైవేటు స్కూళ్ల టీచర్లు మూకుమ్మడి సెలవులు పెట్టి పరీక్షకు ప్రిపేరవ్వడానికి సిద్ధమయ్యారు. అయ్యాయి. దీంతో యాజమాన్యాలు గగ్గోలు పెడుతూ విద్యాశాఖ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లాయి. పరీక్షల సమయంలో టెట్ పెడితే ఇబ్బందులు వస్తాయని.. ఏప్రిల్, మే నెలల్లో టెట్ నిర్వహించాలని కోరాయి. దీనిపైనా నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.