మంగళవారం విద్యాశాఖ, అటవీశాఖ అధికారులతో సమీక్షిస్తున్న డిప్యూటీ సీఎం కడియం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లోని 5,90,980 మంది బాలికలకు ఈ నెల 24 నుంచి హెల్త్ అండ్ హైజీన్ కిట్లు పంపిణీ చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. దీనిపై మంగళవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులతో సమీక్షించారు. అలాగే హరితహారం కార్యక్రమంపైనా సమీక్ష జరిపారు. ఈ నెల 31 వరకు జిల్లా పరిషత్, ప్రభుత్వ, మోడల్ స్కూళ్లు, గురుకుల, కేజీబీవీ, పాఠశాల ల్లోని బాలికలందరికీ హైజీన్ కిట్లు అందించాలని నిర్ణయించారు. ఈ కిట్లలో బాలికలకు కావాల్సిన 14 రకాల వస్తువులు ఉండేలా రూపొందించారు.
ఏడాదికి సరిపడా వస్తువులను ఒకేసారి ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. దీనికోసం ఒక్కో విద్యార్థినిపై ఏటా రూ.1,600 ఖర్చు చేస్తున్నామని, మొత్తంగా రూ.100 కోట్ల వరకు వెచ్చిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల బాలికలు 4,18,440 మంది, మోడల్ స్కూళ్ల బాలికలు 55,195 మంది, కేజీబీవీ బాలికలు 80,999 మంది, గురుకులాల విద్యార్థినులు 9,651 మంది, ఎయిడెడ్ పాఠశాలల బాలికలు 26,695 మంది.. మొత్తం 5,90,980 మంది బాలికలకు కిట్లను అందజేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.
25న ‘హరిత పాఠశాల–హరిత తెలంగాణ’
రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ఈ నెల 25 నుంచి ‘హరిత పాఠశాల–హరిత తెలంగాణ’ కార్యక్రమం చేపట్టాలని కడియం అధికారులను ఆదేశించారు. హరితహారం నిర్వహణకు ప్రతి పాఠశాలలో విద్యార్థులతో గ్రీన్ బ్రిగేడ్లను నియమించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులు గ్రీన్ బ్రిగేడ్ల కోసం దుస్తులు, టోపీలు, రుమాళ్లు సమకూర్చాలన్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో ఉన్న దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు దాదాపు కోటి పూలు, పండ్ల మొక్కలు ఇవ్వాలని వెల్లడించారు.
హరితహారంలో నాటిన మొక్కల్లో బతుకుతున్న మొక్కల శాతం విద్యాసంస్థల్లోనే ఎక్కువగా ఉందన్నారు. జనగామ జిల్లా కొడకండ్ల గ్రామం లోని రెసిడెన్షియల్ పాఠశాలలో గతంలో నాటిన మొత్తం వెయ్యి మొక్కలనూ పరిరక్షించారని చెప్పారు. సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ప్రిన్సి పల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీకే ఝా, కళాశాల విద్యాకమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment