
పదోన్నతులకు పచ్చజెండా
యూనివ ర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీలో అధ్యాపక పదోన్నతులకు పాలకల మండలి పచ్చజెండా ఊపింది. కెరీర్ అడ్వాన్స్ స్కీమ్(సీఏఎస్) కింద అసిస్టెంట్ నుంచి అసోసియేట్, అసోసియేట్ నుంచి ప్రొఫెసర్‌కు పదోన్నతుల కోసం ఫిబ్రవరి చివరి వారంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇందులో అర్హత పొందినవారికి పదోన్నతులు ఇవ్వడానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. ఎస్వీ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం దాదాపు సంవత్సరం తర్వాత జరిగింది.
ఇటీవలే పాలకమండలి పునరుద్ధరణ అనంతరం జరిగిన తొలి సమావేశం ఇదే. కొత్తగా పాలకమండలి సభ్యులుగా నియమితులైన 9 మందిలో 8 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. అమరరాజా గ్రూపు సంస్థల చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు ఈ సమావేశానికి రాలేదు. ఎస్వీయూ వీసీ దామోదరం అధ్యక్షత వహించారు. పదోన్నతుల విషయంలో కోర్టు ఉత్తర్వులకు లోబడి అర్హులైన అధ్యాపకలకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని తీర్మానించారు. ఎస్వీయూ 54వ స్నాతకోత్సవాన్ని ఏప్రిల్‌లో జరపాలని పాలకమండలి నిర్ణయించింది.
రూ.163.8 కోట్లతో బడ్జెట్
రూ.163.8 కోట్లతో యూనివర్సిటీ బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది. యూనివర్సిటీ నిధుల వినియోగంపై ఫైనాన్స్ సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ కమిటీకి వీసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పాలకమండలి సభ్యులు గురుప్రసాద్, బాలసిద్ధముని ఈ కమిటీలు సభ్యులుగా కొనసాగనున్నారు. ఈ కమిటీ యూనివర్సిటీలో నిధుల వినియోగాన్ని పర్యవేక్షిస్తుంది. 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో ఏపనికి ఎంత ఖర్చు చేశారో పూర్తి వివరాలతో పాలకమండలి ముందు ఉంచాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి సూచించారు.
అకడమిక్, అడ్మినిస్ట్రేషన్, డెవలప్‌మెంట్ అంశాలపై వచ్చే సమావేశంలో పూర్తిస్థాయి చర్చ జరగాలని సభ్యులు సూచించారు. రెక్టార్ ఎం.భాస్కర్, రిజిస్ట్రార్ దేవరాజులు, పాలక మండలి సభ్యులు ప్రొఫెసర్ అబ్బయ్య, బాలసిద్ధముని, గురుప్రసాద్, రెడ్డిల్యాబ్స్ సీఈవో జీవీ ప్రసాద్, హరి, చంద్రయ్య, అరుణ, బాబు పాల్గొన్నారు.