న్యూఢిల్లీ: నిరుపేదలకు వైద్యసేవలు అందించని ప్రయివేటు ఆస్పత్రులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ఆరోగ్యశాఖ అధికారులను కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ప్రశ్నించింది. ఢిల్లీ హైకోర్టు 2007లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ), రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాయితీలతో భూములు పొందిన ప్రయివేటు ఆస్పత్రులు ఆర్థికంగా బలహీనులైన (నెలసరి ఆదాయం రూ. 4,000 కంటే తక్కువ) వారికి ఉచితంగా వైద్య సేవలు అందించాలి. ఆస్పత్రిలోని మొత్తం పడకల్లో 10 శాతం వాటిని పేదలకు కేటాయించాలి. అలాగే ఔట్ పేషంట్ విభాగంలోని(ఓపీడీ) రోగుల్లో 25 శాతం మంది పేదవారికి ఉచితంగా వైద్యం అందించాలి. అయితే కోర్టు ఆదేశాన్ని అమలు చేయడంలో జరుగుతున్న ఆలస్యాన్ని సీఐసీ గుర్తించింది.
ఇందుకు బాధ్యులైన ఆరోగ్య శాఖ సమాచార అధికారులైన ఆర్‌ఎన్.దాస్, లిలీ గాంగ్మైయికి రూ. 25 వేల మేర జరిమానా విధించింది. పిటిషినర్, బాధిత అధికారుల వాదన విన్న తర్వాత ఈ ఆలస్యం వెనుక స్వార్ధపూరిత ఆసక్తి, అవినీతి జరిగి ఉండవచ్చని సీఐసీ అభిప్రాయపడింది. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పింది. భవిష్యత్తులో కూడా కోర్టు తీర్పు అమలు జరుగుతుందనే ఆశ కలగడం లేదని సీఐసీ కమిషనర్ ఆచార్యులు పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించే ప్రయివేటు ఆస్పత్రులకు లాభాలు చేకూర్చడానికి కాకుండా పేదవారికి సేవచేసేందుకు ఆరోగ్య శాఖ పనిచేయాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఈ ఆస్పత్రుల నుంచి పన్ను వసూలు చేసి ప్రజాధనాన్ని కాపాడాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నానన్నారు. వీటిని వసూలు చేయడంలో ఆలస్యం జరిగితే అది ప్రజలపై ప్రభావానికి కారణమవుతుందని, తద్వారా అధికారులు తమ బాధ్యతల నుంచి తప్పుకోవడమే అవుతుందని ఆచార్యులు పేర్కొన్నారు.
అక్రమంగా సంపాదించిన డబ్బును రికవరీ చేయాలి
ఢిల్లీ హైకోర్టు 2007లో ఇచ్చిన తీర్పు ఆధారంగా ప్రయివేటు ఆస్పత్రులు అక్రమంగా సంపాదించిన డబ్బును హెల్త్ డెరైక్టరేట్ రికవరీ చేయాలని రాకేశ్ కుమార్ గుప్తా సీఐసీలో ఫిర్యాదు చేశారు. ‘ఆరోగ్య శాఖకు చెందిన ఇద్దరు అధికారులకు వరుసగా ట్రాన్స్‌పరెన్సీ ప్యానల్ షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ వారు వాటిని పట్టించుకోలేదు. సమాచారాన్ని అందించాల్సిన అధికారులు ఆలస్యం చేస్తున్నారు’ అని పిటిషనర్ గుప్తా ఆరోపించారు. అంతేకాకుండా కొన్ని ఆస్పత్రులకు సంబంధించి ఎలాంటి వివాదం లేదని, కానీ వాటి నుంచి డబ్బును రికవరీ చేయడానికి అధికారులు సిద్ధంగా లేరని ఆయన పేర్కొన్నారు. ప్రయివేటు ఆస్పత్రుల నుంచి అధికారులు పెద్దమొత్తంలో డబ్బు తీసుకొని వారిపై సరైన చర్యలు చేపట్టడం లేదనే అనుమానం వ్యక్తం చేశారు.
ఆర్టీఐ ప్రశ్నకు సమాధానమివ్వకుండా ఉండడానికి అధికారులు కొత్త దారులు వెతుకుంటున్నారనే సంగతిని సీఐసీ కమిషనర్ ఆచార్యులు దృష్టికి పిటిషినర్ తీసుకెళ్లారు. ఇది ‘స్పెషల్ కమిటీ అధీనంలో ఉందని, కేసు పురోగతిపై తాము సమాధానం ఇవ్వాల్సిన పనిలేదని’ వారు చెబుతున్నారన్నారు. కాగా, ఈ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు విఫలమైంద నే దానికి సంబంధించిన కారణాలను నివేదిక రూపంలో అందించాలని ఆరోగ్య సేవల విభాగం డెరైక్టర్ ఎన్వీ కామత్‌ను సీఐసీ ఆదేశించినట్లు రాకేష్ తెలిపారు. నివేదిక సమర్పించడానికి 30 రోజుల గడువు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు తీర్పు అమలుకు సంబంధించిన ఫైలును అకారణంగా వివిధ విభాగాలు ఎందుకు అట్టిపెట్టుకున్నాయో చెప్పాలని ఆరోగ్య శాఖను సీఐసీ కోరినట్లు పిటిషినర్ తెలియజేశారు.
కోర్టు ఉత్తర్వులు పాటించని ఆస్పత్రులపై చర్యలేవి?: సీఐసీ
Published Mon, Feb 16 2015 10:57 PM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM
Advertisement