అప్రమత్తత అవసరం | Sakshi Editorial On Nipah Virus | Sakshi
Sakshi News home page

అప్రమత్తత అవసరం

Published Fri, Sep 15 2023 12:39 AM | Last Updated on Fri, Sep 15 2023 12:39 AM

Sakshi Editorial On Nipah Virus

మరపునపడిందనుకున్న ఆ పేరు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. మనిషి మెదడును దెబ్బ తీసే ప్రాణాంతక నిపా వైరస్‌ (ఎన్‌ఐవీ) మరోసారి దేశంలో జడలు విప్పుతోంది. వస్తూనే కేరళలో ఇద్దరి ప్రాణాలు బలి తీసుకొని, పాజిటివ్‌ వచ్చిన మరికొందరి ఆరోగ్యాన్ని అయోమయంలోకి నెట్టి, సన్నిహితంగా మెలిగిన మరో 800 మందిపై వైద్యపర్యవేక్షణ పెట్టాల్సిన పరిస్థితి తెచ్చింది.

వీరిలో 77 మంది ప్రమాదస్థితిలో ఉన్నారనీ, వైరస్‌ సోకినవారిలో 155 మంది ఆరోగ్య కార్యకర్తలూ ఉన్నారనీ వస్తున్న వార్త ఆందోళన పెంచుతోంది. నిపా సోకితే సహాయక చికిత్సే తప్ప, రోగాన్ని తగ్గించే మందులు కానీ, నివారించే టీకా కానీ ఇప్పటిదాకా లేకపోవడమే పెద్ద సమస్య.

కోళిక్కోడ్‌ జిల్లాలోని 9 గ్రామ పంచాయతీలను ఇప్పటికే కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి, స్కూళ్ళు – ఆఫీసులు – ప్రజారవాణాకు సెలవిచ్చి, సభలూ సమావేశాలపై నియంత్రణలు పెట్టాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కేరళలో మొదలైన ఈ ప్రకంపనలు ఇప్పుడు దేశం మొత్తాన్నీ అప్రమత్తం చేస్తున్నాయి.  

కలుషిత ఆహారం, రోగితో సాన్నిహిత్యం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించడం నిపా వైరస్‌ స్వభావం. 1998లో తొలిసారిగా మలేసియా, సింగపూర్లలో పందుల పెంపకందార్లలో, వాటితో సన్నిహితంగా మెలిగే ఇతరుల్లో ఈ వైరస్‌ తొలిసారి బయటపడింది. అప్పట్లో 300 పైచిలుకు మందికి వైరస్‌ సోకితే, వంద మందికి పైగా మరణించారు.

ఆపై అది వేలాది మైళ్ళు ప్రయాణించి, వివిధ దేశాలకు విస్తరించడం, వైరస్‌ సోకినవారిలో 72 నుంచి 86 శాతం మంది మరణించడం సంచలనమైంది. వైరస్‌ సోకిన గబ్బిలాలు, పందుల శరీరద్రవాల ద్వారా మనుషుల కిది వ్యాపిస్తుందట. నిపా సోకితే జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు, తలనొప్పి, వాంతులతో మొదలై పరిస్థితి తీవ్రమైతే మెదడువాపు, మూర్ఛలతో రోగి కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాట. 1998 – 2015 మధ్య 600కు పైగా కేసులు వచ్చాయని అది లెక్క తేల్చింది.

ఈ మాయదారి వైరస్‌ మన దేశంలో పంజా విసరడం ఇదేమీ తొలిసారి కాదు. గడచిన అయి దేళ్ళలో ఇది నాలుగోసారి. మెదడు మీద దాడి చేసే ఈ అనారోగ్య భూతం 2018 మేలో మొదటిసారి వచ్చినప్పుడు దానిని కట్టడి చేసేలోగా వైరస్‌ సోకిన 23 మందిలో 21 మంది మరణించారు. ఆ తరువాత 2019, 2021ల్లో కూడా కేరళ తీరాన్ని ఈ వైరస్‌ తాకింది.

మలబారు సీమలో బయటపడ్డ ఈ తాజా నిపా కేసులకు బంగ్లాదేశ్‌ వేరియంట్‌ కారణమని గుర్తించారు. మిగతావాటితో పోలిస్తే ఈ వేరియంట్‌ వ్యాప్తి తక్కువే అయినా, సోకినవారిలో సగటున నూటికి 70 మంది మరణిస్తున్నారన్న గణాంకాలు గుబులు రేపుతున్నాయి. రోగులకు సన్నిహితంగా మెలిగినవారు ఐసొలేషన్‌లోకి వెళ్ళడం, జనమంతా మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి కార్యాచరణ అయింది. 

ప్రపంచవ్యాప్తంగా చూస్తే, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గబ్బిలపు వైరస్‌ పదేపదే విరుచుకు పడే ప్రమాదం ఎక్కువని మేలో రాయిటర్స్‌ పరిశోధన తేల్చింది. విచ్చలవిడిగా అడవుల నరికివేత, ఇష్టారాజ్యపు పట్టణీకరణ, ఫలితంగా వన్యప్రాణులతో మానవ సంఘర్షణ – వీటన్నిటి పర్యవసానం ఇదని ఆ పరిశోధన గుర్తించింది.

ఇక, మన దేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక సహా 8 రాష్ట్రాల్లోని గబ్బిలాల్లో ఈ ప్రాణాంతక వైరస్‌ ఛాయలున్నట్టు ఈ ఏడాది జూలైలో భారతీయ వైద్య పరిశోధనా మండలి అధ్యయనం సైతం నిర్ధరించింది. అయితే, కేరళపైనే తరచూ ఈ వైరస్‌ దాడికి కారణం – జనసాంద్రత, భౌగోళిక పరిస్థితులు, వానలంటూ రకరకాల ప్రచారాలున్నాయి. కచ్చితమైన కారణా ల్నింకా కనిపెట్టాల్సి ఉంది. ప్రస్తుతానికి కేంద్ర బృందం కేరళ వెళ్ళి సంక్షోభంలో సాయపడుతోంది. 

నిపాకు ప్రధాన కారణమని భావిస్తున్న ఫ్రూట్‌ బ్యాట్స్‌ (పండ్లను కొట్టే గబ్బిలాల) సంఖ్య కేరళలో ఎక్కువైతే కావచ్చు కానీ, వాటి నిర్మూలన కుదరదు. కాబట్టి, ఒకేచోట, ఒకేలా కాకపోయినా ఏటా నిపా వైరస్‌ ముప్పు తప్పదని గ్రహించి, కేరళ సహా అన్ని రాష్ట్రాలూ జాగ్రత్తపడాలి. జంతువుల నుంచి మానవులకు సోకే ఇలాంటి ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల ఆనుపానులు పసిగట్టేందుకు మహమ్మారులపై పరిశోధన అవసరం. కానీ, కేరళే కాదు... కేంద్రం కూడా నిపాపై తగినంత శ్రద్ధ చూపలేదనే చెప్పాలి.

పుణేలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ తరహాలో తిరువనంతపురంలో అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పినా, అది ఇప్పటికీ పూర్తిగా కార్యాచరణలోకి దిగలేదు. అంతకంతకూ పెరుగు తున్న సాంక్రమిక వ్యాధుల రీత్యా తక్షణమే ఆ సంస్థ సేవలపై దృష్టి సారించాలి. 2018 నిపా తాకి డిలో, తర్వాత కరోనా కాలంలో సమర్థనీయంగా పనిచేసిన కేరళ మరోసారి కృతనిశ్చయం చూపాలి. 

ఇప్పటి వరకు ఇండియా, బంగ్లాదేశ్, సింగపూర్, మలేసియా, ఫిలిప్పీన్స్‌ లాంటి ఆసియా దేశాలకే ఈ వైరస్‌ పరిమితమైంది. ప్రపంచంలోని ఇతర దేశాలకు ఇది విస్తరించకపోవడం అదృష్టమే. కానీ, భవిష్యత్తులో విస్తరించదనే నమ్మకం ఏమీ లేదు. వైరస్‌ల విజృంభణలు, ప్రాణాంతక రోగాలు... ప్రపంచానికి కొత్త కాకపోవచ్చు. అయితే, చికిత్స లేని రోగాలు, వైరస్‌లపై శాస్త్రీయ పరిశోధనలతో ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా పోరాడాల్సిన అవసరాన్ని తాజా నిపా కేసులు గుర్తుచేస్తున్నాయి.

నిన్న కాక మొన్న కరోనా కట్టడిలో అలాంటి పోరే మానవాళికి మేలు చేసిందని మరచిపోరాదు. అయితే, అందుకై పరిశోధన – అభివృద్ధి విభాగానికి కావాల్సిన వనరుల్ని అందించడం తక్షణ అవసరం. ఈలోగా చేతుల శుభ్రత, మాస్కుధారణ, స్వచ్ఛమైన ఆహారాన్నే భుజించడం సదా ఆరోగ్యమనీ, అది మన చేతుల్లోని పని అనీ అందరం గుర్తించాలి. ఎందుకంటే... చికిత్స కన్నా నివారణ, భయం కన్నా అప్రమత్తతే పరమౌషధం! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement