తిరువనంతపురం: కేరళలో నిఫా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరోకేసు వెలుగులోకి వచ్చింది. 39 ఏళ్ల మరో వ్యక్తికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో నిఫా వైరస్ బారిన పడినవారి సంఖ్య ఆరుకు చేరింది. వైరస్ ప్రభావంతో ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు మరణించారు. కాగా.. వైరస్ వ్యాప్తితో శుక్రవారం ప్రార్థనలు బంద్ చేశారు.
వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతుండటంతో కాంటాక్ట్ లిస్ట్ కూడా క్రమంగా హెచ్చవుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 950 మంది కాంటాక్ట్ లిస్ట్‌లో ఉండగా.. 213 మంది అధిక ముప్పు ఉన్న జాబితాలో ఉన్నారు. కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారిలో 287 మంది హెల్త్ వర్కర్లే కావడం గమనార్హం. అధిక ముప్పులో ఉన్న 15 మంది షాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు.
కంటెయిన్‌మెంట్ జోన్‌లో ఏడు గ్రామాలు..
నిఫా వైరస్‌తో రాష్ట్రంలో ఇప్పటికే ఇద్దరు మరణించారు. కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించిన ఏడు గ్రామ పంచాయితీల్లో ఎలాంటి రాకపోకలు జరపరాదని కోజికోడ్ జిల్లా కలెక్టర్ ఏ గీతా తెలిపారు. ఆతన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపర గ్రామాలు కంటైన్‌మెంట్ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఈ ప్రాంతాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సమయం తర్వాత దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
పాఠశాలలు బంద్..
నిఫా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. కంటెయిన్‌మెంట్ జోన్‌లో ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామశాఖ ఆఫీస్‌లు తక్కువ స్టాఫ్‌తో నడపాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మూసివేయాలని కోరారు. కంటైన్‌మెంట్ జోన్‌లో మాస్కులు తప్పనిసరి అని తెలిపారు. శానిటైజర్లు వాడాలని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని చెప్పారు.
అప్రమత్తమైన కేంద్రం..
కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ బృందాలను కేరళకు పంపించింది. కోజికోడ్ మెడికల్ కాలేజీలో సంచార ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పందులు, గద్దల నుంచి మనుషులకు వైరస్ వ్యాప్తిపై పరిశోధనలు చేయనున్నారు.
బంగ్లాదేశ్ వేరియంట్..
ఇప్పటివరకు రాష్ట్రంలో నిఫా వైరస్ పట్ల భయపడాల్సిన పనిలేదని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్‌గా పేర్కొన్న ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్.. మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. వ్యాప్తి రేటు తక్కువగా ఉన్నప్పటికీ మరణాల సంఖ్య అధికంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు.
కర్ణాటకలో అలర్ట్..
కేరళలో నిఫా వైరస్ పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. సరిహద్దు జిల్లాల్లో ఫీవర్ సర్వెలెన్స్ వంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అనుమానిత కేసులకు ఆస్పత్రుల్లో పడకలు సిద్ధం చేయడం సహా వైద్యులకు శిక్షణ తరహా చర్యలు చేపడుతోంది.
ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్‌లా ఆడగలను: సింథియా
Comments
Please login to add a commentAdd a comment