
కాశీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏడో దశలో జూన్ 1న పోలింగ్ జరుగనున్న వారణాసిలో వార్ వన్ సైడే అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. పోల్ అయ్యే ఓట్లలో అత్యధిక శాతం ప్రధాని మోదీకే పడటం ఖాయమన్నారు. మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో తెలుగువారు అత్యధికంగా నివసించే పాండే హవేలీ, సోనార్ పుర తదితర ప్రాంతాల్లో ఆయన డోర్ టు డోర్ ప్రచారం చేయడంతో పాటు తెలుగు సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు.
సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ వారణాసిలో మోదీ విజయం ఖాయమని, అయితే దేశంలోనే అత్యధిక మెజారిటీ రావాలంటే పోలింగ్ శాతం పెరిగేలా చూడాల్సిన అవసరం ఉందని తెలుగు సంఘాల ప్రతినిధులను కోరారు. తెలుగు ఓటర్ల పోలింగ్ నూటికి నూరు శాతం జరిగేలా చూడాలని శ్రీరామ తారక ఆంధ్రాఆశ్రమంలో వారణాసి తెలుగు సమితి కార్యదర్శి వి.వి.సుందర శాస్త్రిని కోరారు. పలు మఠాలు, సత్రాల్లో తెలుగు సంఘాలతో జరిగిన సమావేశాల్లో స్థానిక కార్పొరేటర్ ముఖర్జీతో పాటు హైదరాబాద్ నుంచి వెళ్లిన బీజేపీ నాయకులు గీతా మూర్తి, బొమ్మ జయశ్రీ, ఉమారాణి, సంగప్ప, విక్రమ్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, పరిణిత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment