సంగీత సారథి
హిందుస్థానీ సంగీతంలో కిరానా ఘరానా, బెనారసీ ఘరానా సంప్రదాయాల మేళవింపుగా రాగాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు సారథి ఛటర్జీ. తండ్రి వద్ద కిరానా ఘరానా, గురువు వద్ద బెనారసీ ఘరానా సంప్రదాయాల్లో పొందిన శిక్షణ, నిరంతర సాధనతో సంగీత ప్రపంచంలో తనదైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు. హైదరాబాదీ శ్రోతలను అలరించేందుకు తొలిసారిగా ఇక్కడకు వచ్చిన సారథి ఛటర్జీ కొద్దిసేపు ‘సిటీప్లస్’తో ముచ్చటించారు. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే..
నేను పుట్టి పెరిగిందంతా కోల్‌కతా. నాన్న ప్రొఫెసర్ అరుణ్‌కుమార్ ఛటర్జీ హిందుస్థానీ సంగీతంలో కిరానా ఘరానా సంప్రదాయానికి చెందిన గాయకుడు. అమ్మ సెఫాలీ బెంగాలీ భక్తి పాటలు పాడేది. అక్క మహువా కూడా మంచి గాయని. సంగీత నేపథ్యంలో పుట్టిపెరగడంతో సహజంగానే రాగాలు ఒంటబట్టాయి. అలాగని సంగీతం నేర్చుకోవాలంటూ నాన్న నాపై ఎన్నడూ ఒత్తిడి తేలేదు. చిన్నప్పుడు కూనిరాగాలు తీసేవాడిని. కూనిరాగాలు విన్న అమ్మ ఓ రోజు సంగీతంపై శ్రద్ధపెట్టమని సలహా ఇచ్చింది. తనకు తెలిసిన కొన్ని రాగాలు కూడా నేర్పింది.
ఆ రాగాలు నా నోట విన్న నాన్న కూడా ప్రశంసించారు. నాన్న ప్రశంసతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఐదేళ్ల ప్రాయంలోనే ఆకాశవాణిలో రవీంద్రనాథ్ ఠాగోర్ పద్యాలు పాడాను. పదిహేడేళ్ల ప్రాయంలోనే 1981లో ఆకాశవాణి సంగీత పోటీల్లో మొదటి బహుమతి సాధించాను. నాన్న దగ్గర కిరానా ఘరానా సంప్రదాయంలో సాధన చేశా. తర్వాత పండిట్ రాజన్ మిశ్రా, సాజన్ మిశ్రాల వద్ద బెనారసీ ఘరానా నేర్చుకున్నా.
గాత్రంతో పాటు తబలా వంటి వాద్యాలనూ అప్పుడప్పుడు వాయిస్తుంటా. ఇక నా కుటుంబం గురించి చెప్పాలంటే.. నా భార్య షర్మిల లెక్చరర్. మా అబ్బాయి సప్తక్ ఛటర్జీ కూడా సింగర్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు. సంప్రదాయ సంగీతాన్ని భావి తరాలకు అందించాలనే లక్ష్యంతో 2006లో ‘సంగీతం’ పేరుతో సొసైటీని ఏర్పాటు చేశా.
రిచ్ మ్యూజిక్ సిటీ...
నేను హైదరాబాద్ రావడం తొలిసారి. ఎప్పటి నుంచో ఈ సిటీలో నా గాత్రాన్ని లైవ్‌గా వినిపించాలనుకుంటున్నా. ‘స్పిక్మాకే’ సంస్థ వారు ఇక్కడ కచేరీ చేయాలని ఆహ్వానించగానే మారు మాట్లాడకుండా ఓకే చేశా. సిటీవాసులు హిందూస్థానీ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తారని విన్నా. ఈ నగరంలో నాన్నకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. భవిష్యత్‌లో ఇక్కడ మరిన్ని కచేరీలు చేయాలనుకుంటున్నా.
..:: వాంకె శ్రీనివాస్