Hindustani music
-
మన సంగీతానికి నీరాజనం!
మనిషి జీవితంలో ఓ అంత ర్భాగం సంగీతం. అన్ని సందర్భాల్లోనూ ఆయా భావాలను వ్యక్తం చేయడానికి సంగీతం ఒక వాహిక. అయితే ప్రపంచంలో అనేక రకాల సంగీత సంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో భారతీయ సంగీత సంప్రదాయాలకు చాలా విశిష్ట స్థానం ఉంది. భారతీయ సంగీతం రాగ ప్రధానమైనది అయితే పాశ్చాత్య సంగీతం స్వరమేళన ప్రధానం. భారతీయ సంగీతం గురించి వేదాల్లో ఒకటైన సామ వేదంలోనూ ప్రస్తావితమయ్యింది. భరతముని తన ‘నాట్యశాస్త్రం’ (క్రీ.పూ. 2వ శతాబ్దం నుండి క్రీ.శ. 2 వ శతాబ్దం)లో భారతీయ సంగీతం గురించి విపులంగా వివరించాడు. మధ్య ఆసియా నుండి వచ్చిన తుర్కీయులు, తాతార్లు, పర్షియన్లు, అఫ్గాన్లు పాలన చేస్తున్నప్పుడు భారతీయ సంగీతం ఉత్తర, దక్షిణ సంగీత సంప్రదాయాలుగా విడిపోయింది. ఉత్తర సంప్రదాయాన్ని ‘హిందుస్తానీ’ సంగీతమనీ, దక్షిణపు సంప్రదాయాన్ని∙‘కర్ణాటక’సంగీతం అనీ పిలవడం ప్రారంభమయింది. అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఆస్థానంలో పార్శీ దేశానికి చెందిన అమీర్ ఖుస్రూ ఉండేవాడు. ఇతడు పార్శీ సంగీతంలోని రాగ క్రమ పద్ధతిని భారతీయ సంగీతంతో మేళవించి ఒక కొత్త సంగీత సంప్రదాయాన్ని సృష్టించాడు. అదే ‘హిందుస్తానీ’ సంగీతం. హిందూస్తానీ సంగీతం ‘రాగ రాగిణుల’ చిత్ర కళా సంప్రదాయాన్ని కూడా సృష్టించింది. ఒక రాగాన్ని వినేప్పుడు కలిగే భావనావృత్తి కొన్ని దృశ్యరూపాలతో సంలగ్నమై ఉంటుంది. అటువంటి దృశ్యరూపాన్ని చిత్రరూపంలో పొందుపరచేందుకు ఉత్తర భారతంలో కృషి జరిగింది. ఆ కృషి ఫలితాలే రాగరాగిణి చిత్రాలు. హిందూస్తానీ సంప్రదాయంలో సూరదాసు, తులసీదాసు, మీరాబాయి, జయదేవుడు వంటివారు భక్తి సంగీతాన్ని సుసంపన్నం చేశారు. కొందరు గజల్స్ రూపంలో మధురభక్తిని సృష్టించారు. దక్షిణ భారతదేశంలో పేరు పొందిన భారతీయ సంగీతం కర్ణాటక సంగీతం. ‘కర్ణాటిక్’ అనే పదానికి సంస్కృత పదం అయిన ‘కర్ణేషు అతతి’ (చెవులకు ఇంపైన సంగీతం కనుక కర్ణాటక సంగీతం) మూలం అని కొందరి పరిశోధకుల అభిప్రాయం. ‘కరనాడు’ అంటే సముద్ర తీరం అనీ, మూడు వైపులా సముద్ర తీరం గల దక్షిణ భారతదేశంలో పుట్టిన సంగీతం కనుక దక్షిణ సంగీత సంప్రదాయానికి కర్ణాటక సంగీతం అనే పేరు వచ్చింది అనీ మరికొందరి అభిప్రాయం. కర్ణాటక సంగీత సంప్రదాయంలో హిందుస్తానీ సంప్రదాయంలాగా భక్తి, శృంగార రసాలకు ప్రాధా న్యం ఎక్కువగా ఉంటుంది. శృంగార రసం కొన్ని సందర్భాల్లో పరిణతి చెంది భక్తిగా రూపాంతరం చెందుతుంది. త్యాగయ్య, శ్యామశాస్త్రి, పురంధరరాసు, రామదాసు వంటి వాగ్గేయకారుల పదసాహిత్యం భక్తి కోవకి చెందినది. జావళీలు, ప్రత్యేకించి క్షేత్రయ్య పదాలు శృంగార రసానికి చెందినవి. కర్ణాటక సంగీతంలో ప్రధాన లక్షణంగా పరిగణించే రాగాన్ని పతంగుడు పేర్కొన్నాడు. రాగాల్లో కొన్ని రాగాలు ఉల్లాసాన్నీ, మరికొన్ని రాగాలు విషా దాన్నీ, కొన్ని కరుణ రసాన్నీ స్ఫురింపజేస్తాయి. ఈ విధంగా ఆ యా రాగాలు శ్రోతల హృదయంలో ఆయా అనుభూతులను కలిగించగలుగుతున్నాయి. కర్ణాటక సంగీతశాస్త్రంలో మరో ప్రాధాన్య లక్ష్యం ‘శ్రుతి’. ‘శ్రు’ (అంటే వినుట) అనే ధాతువు నుండి ‘శ్రుతి’ అనే పదం పుట్టింది. భారతీయ సంగీతానికి గమకాలు ఒక విశిష్టతను చేకూర్చాయి. గానానికి వీటిని మాల అలంకారాలుగా వర్ణింపవచ్చునని సంగీతవేత్తల అభిప్రాయం. కర్ణాటక సంగీత సంప్రదాయంలో తెలుగు భాష ప్రధాన పాత్ర పోషించింది. తెలుగు భాష మధురమైన భాష. ఈ భాష పదాలకూ, వ్యాకరణానికీ సరైన ప్రాధా న్యమిస్తూ శ్రావ్యమైన కూర్పులను అందిస్తుంది. అలాంటి కూర్పులు వాగ్గేయకారులచే స్వరపరచబడి పద్యం అందాన్ని మరింత పెంచాయి. అందుకనే కాబోలు ఆనాటి తొలి సంకీర్తనాచార్యుడు అన్నమయ్య మొదలుకొని రామదాసు, క్షేత్రయ్య; సంగీత మూర్తి త్రయంలోని త్యాగయ్య, శ్యామశాస్త్రి, తమిళులైన పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, ముత్తయ్య భాగవతార్; కన్నడ దేశానికి చెందిన మైసూర్ వాసుదేవాచారి ఇత్యాది వాగ్గేయకారులు తెలుగు భాషనే ఎంచుకొని, తమ రచనలు సాగించారు. అంతటి విశిష్టమైనది మన తెలుగు భాష. అందుకనే తెలుగు రాష్ట్రాల పునర్విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో మొట్ట మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ‘కృష్ణ వేణి సంగీత నీరాజనం’ అనే సంగీతోత్సవాన్ని ఈ డిసెంబరు 10 నుండి 12 వరకు విజయ వాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో, అలాగే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, కృష్ణానది దుర్గా ఘాట్ల వద్ద ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ నిర్వహిస్తోంది. ఈ సంగీతోత్సవం ముఖ్య ఉద్దేశ్యం మన అద్భుతమైన సంగీత సంప్రదాయాలను పరిరక్షించడం... తద్వారా హరికథ, నామ సంకీర్తన సంప్రదాయాలపై దృష్టిని పునరుద్ధరించే ప్రయత్నం చేయడం; తెలుగు భాష గొప్పతనాన్నీ, వారసత్వాన్నీ వెలుగులోకి తీసుకు రావడం. ఈ ఉత్సవం సంగీత కళాశాలల విద్యా ర్థులకూ, విశ్వ విద్యాలయాల విద్యార్థులకూ నేర్చుకోవ డానికీ, వారి ప్రతిభను ప్రదర్శించ డానికీ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఆర్. మల్లికార్జున రావు వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు -
యంగ్ టాలెంట్: మధుర స్వర రాగ మీరా
ఒకవైపు హిందుస్థానీ సంగీతం మరోవైపు వెస్ట్రన్ మ్యూజిక్... వెరసి ఆమె పాటకు కొత్త చూపును ఇచ్చాయి. ‘పాట అంటే వాద్యాల ఘోష కాదు... మనల్ని మనం పుస్తకంలా చదువుకోవడం కూడా’ అంటున్న మీరా దేశాయ్ పరిచయం... అమెరికాలో పుట్టి పెరిగినా, తన సంగీత, సాహిత్యాలలో ‘భారతీయత’ ఎక్కడికీ పోలేదు. సందేహం ఉంటే...‘ఐ హ్యావ్ నెవర్బీన్ హ్యాపియర్ టు బీ లాస్ట్’ ఈపీ(ఎక్స్టెండెడ్ ప్లే)లో పాటలు వినండి చాలు. తల్లిదండ్రులు మీరాకు గుజరాతి భాష నేర్పించారు. చిన్న వయసులోనే ఎన్నో భజనలను తల్లి ద్వారా నేర్చుకుంది. అలా తన మాతృభాషపై ఆసక్తి పెరిగింది, పదిహేడు సంవత్సరాల వయసులో తొలి పాట రాసిన మీరాకు తొలిసారిగా న్యూయార్క్‌లో జరిగిన ఒక సంగీత కచేరిలో హిందుస్థానీ శాస్త్రీయసంగీత దిగ్గజం పండిట్ జస్రాజ్ను చూసే అదృష్టం దక్కింది. ఆ క్షణమే తనకు హిందుస్థానీ సంగీతం అంటే చెప్పలేనంత ఇష్టం ఏర్పడింది. ప్రతిరోజూ తన చెవుల్లో హిందుస్థానీ సంగీతం మారుమోగేది. ఎందరు గాయకులో, ఎన్ని ఘరానాలో! హిందుస్థానీ దగ్గరే ఆగిపోలేదు. వెస్ట్రన్ మ్యూజిక్‌లో పదిసంవత్సరాల పాటు శిక్షణ పొందింది. ఫిమేల్ జాజ్ స్టార్స్...నైనా సిమోన్, నోరా జోన్స్, పాప్ సింగర్–సాంగ్ రైటర్స్ సారా బెరిలెస్, టోరీ కెల్లీ...తాను అభిమానించే జాబితాలో చేరిపోయారు. వారి ప్రభావం తన పాటలపై కనిపిస్తుంది. తన డెబ్యూ ఈపి ‘ఐ హ్యావ్ నెవర్బీన్ హ్యాపియర్ టూ బీ లాస్ట్’ విడుదలైనప్పుడు తనదైన సొంతగొంతు వినిపించింది. రకరకాల సంగీతధోరణుల ప్రభావంతో పెరిగిన మీరాకు అది అంత తేలికైన విషయం కాదు. ‘మనదైన సొంతగొంతు వినిపించాలంటే, కంఫర్ట్‌జోన్ నుంచి బయటికి రావాలి’ అంటుంది మీరా. పాట అంటే వాయిద్యాల ఘోష కాదు. అందులో ఎమోషన్ డెప్త్ శ్రోతలను హంట్ చేయాలి. అది మీరా పాటల్లో వినిపిస్తుంది. ‘డివైన్’ పాటలో ఇలా రాసింది మీరా... ‘నా జీవితాన్ని తెరిచిన పుస్తకంలా చదువుకోవాలని ఉంది’ జీవితపుటలను తిరగేసుకోవడంలో ఉన్న సౌలభ్యం ఏమిటంటే, ఎక్కడ ఆగిపోయాం, ఎక్కడికి వెళుతున్నాం, ఎక్కడికి వెళ్లాలి? అనే ప్రశ్నలకు సాధికారికమైన సమాధానాలు వెదుక్కోవచ్చు. ఇక ‘డిస్టెన్స్’ పాట దగ్గరికి వస్తే...దూరం పెరగడం అనేది అన్ని విషయాల్లోనూ భారమైన విషయమేమీ కాదు. కొన్ని విషయాల్లో అది శక్తిని ఇచ్చే పని. మనల్ని మనం పునరావిష్కరించుకునే పని. ఎక్కడి వరకో ఎందుకు? మనలోని బద్దకానికి దూరంగా జరిగితే, నిర్మాణరాహిత్యానికి దూరంగా జరిగితే... అదేమీ ప్రతికూలత కాదు. మనల్ని మనం తీర్చిదిద్దుకోవడమే. వెదుక్కుంటూ వెళితే మన మూలాల జాడ దొరుకుతుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వెళ్లడం ద్వారా తన రూట్స్లోకి వెళ్లింది మీరా. ‘ఆల్ మై లైఫ్ ఐ హ్యావ్ బీన్ ప్రేయింగ్ సెర్చింగ్ ఫర్ సమ్‌థింగ్...’ అని తన ‘డివైన్’ లో చరణాలను పాడుకునే ఉంటుంది ఇరవై ఆరు సంవత్సరాల మీరా. ఆమె వెదుకుతున్నది అక్కడ ఏమైనా కనిపించిందా? ఒకవేళ కనిపిస్తే అది కచ్చితంగా ఆమె పాటలో వినిపిస్తుంది. వేచిచూద్దాం. -
‘హిందుస్తానీ’ దిగ్గజం అన్నపూర్ణ కన్నుమూత
ముంబై: ప్రముఖ హిందుస్తానీ సంగీత కళాకారిణి అన్నపూర్ణదేవి(92) కన్నుమూశారు. కొన్నేళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు అన్నపూర్ణాదేవి ఫౌండేషన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. హిందుస్తానీ సంగీతానికి విశిష్ట సేవలు అందించిన అన్నపూర్ణాదేవిని 1977లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ప్రముఖ హిందుస్తానీ సంగీతకారుడు ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ ఆమె సోదరుడే. ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్‌ను అన్నపూర్ణాదేవి 1941లో వివాహమాడి, 1962లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత తన జీవితకాలంలో అధికభాగం బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న అన్నపూర్ణాదేవి..ముంబైకి మకాం మార్చి కొద్ది మంది శిష్యులకు శిక్షణ ఇవ్వడానికే అంకితమయ్యారు. ఆమె శిష్యుల్లో హరిప్రసాద్ చౌరాసియా(బన్సూరి), ఆశిష్ ఖాన్(సరోద్), అమిత్ భట్టాచార్య(సరోద్), బహదూర్ఖాన్(సరోద్), బసంత్ కాబ్రా(సరోద్), , జోతిన్ భట్టాచార్య(సరోద్), నిఖిల్ బెనర్జీ(సితార్), నిత్యానంద్ హల్దీపూర్(బన్సూరి), పీటర్ క్లాట్(సితార్), ప్రదీప్ బారట్(సరోద్), సంధ్యా ఫాడ్కే(సితార్), సరస్వతి సాహా(సితార్), సుధీర్ ఫాడ్కే(సితార్), సురేశ్ వ్యాస్(సరోద్) తదితర ప్రముఖులున్నారు. అన్నపూర్ణదేవి మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం తెలిపారు. తండ్రే గురువు.. ‘మా’గా పిలుచుకునే అన్నపూర్ణాదేవిది సంప్రదాయ సంగీత నేపథ్యమున్న కుటుంబం. 1927లో మధ్యప్రదేశ్‌లోని మైహర్ పట్టణంలో ఉస్తాద్ బాబా అల్లాఉద్దీన్ ఖాన్, మదీనా బేగం దంపతులకు ఆమె జన్మించారు. బాల్యంలో ఆమె పేరు రోషనారాఖాన్ కాగా, అప్పటి మైహర్ మహారాజు బ్రిజ్‌నాథ్ సింగ్ ఆమెను అన్నపూర్ణ అని సంబోధించడంతో ఆ పేరే స్థిరపడిపోయింది. ఐదేళ్ల ప్రాయం నుంచే తండ్రి ఉస్తాద్ బాబా నుంచి సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు. తొలుత సితార్ వైపు మొగ్గుచూపినా, తరువాత సూర్బహర్(తక్కువ పిచ్ ఉండే సితార్)పై మక్కువ పెంచుకుని అందులోనే ప్రావీణ్యం సంపాదించారు. సంప్రదాయ హిందుస్తానీ సంగీతంలో ‘సేనియా మైహర్ ఘరానా’ అనే శైలిని నెలకొల్పడంలో ఆమె తండ్రి విశేష కృషి చేశారు. -
లెజెండరీ మ్యుజీషియన్ అన్నపూర్ణా దేవి కన్నుమూత
సాక్షి, ముంబై : ప్రముఖ హిందూస్థానీ సంగీత విద్వాంసురాలు, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత అన్నపూర్ణా దేవి(91) కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా వయోభారంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం ముంబైలోని బ్రీచ్ కాండీ తుదిశ్వాస విడిచారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని మహిళా వాయిద్యకారులకు ఆదర్శంగా నిలిచిన అన్నపూర్ణా దేవి మరణం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. అన్నపూర్ణ దేవి ఫౌండేషన్ స్థాపించి సామాజిక సేవలో భాగమైన ఆమె మరణం తీరని లోటని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబమంతా సంగీత విద్వాంసులే.. అన్నపూర్ణా దేవి ప్రముఖ సంగీత విద్వాంసుడు, ఉస్తాద్ బాబా అలావుద్దీన్ ఖాన్, మదీనా బేగంల కుమార్తె. ఆమె అసలు పేరు రోషనార ఖాన్. తండ్రి నుంచి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రోషనార సర్బహర్(వీణ) వాయించడంలో ప్రావీణ్యం సంపాదించారు. ఆమె ప్రతిభను గుర్తించిన మిహైర్ ఎస్టేట్ మహరాజ బ్రిజినాథ్ ఆమె పేరును అన్నపూర్ణగా మార్చారు. అన్నపూర్ణ సోదరుడు ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ కూడా సంగీత విద్వాంసుడే కావడం విశేషం. కాగా అన్నపూర్ణ తన 14వ ఏట ప్రముఖ సితార్ విద్వాంసుడు రవి శంకర్‌ను పెళ్లి చేసుకున్నారు. 20 ఏళ్ల అనంతరం ఆయన నుంచి విడాకులు తీసుకుని రుషి కుమార్ పాండ్యా అనే వ్యక్తిని వివాహమాడారు. ఆమె ఒక్కగానొక్క కుమారుడు (రవి శంకర్- అన్నపూర్ణ దంపతుల కుమారుడు) శుభేంద్ర శుభో శంకర్ 2013లో తన 50వ ఏట కన్నుమూశారు. -
మంజునాదం
హిందుస్థానీ సంగీతంలో గ్వాలియర్ ఘరానా, కయన్ సంప్రదాయాల మేళవింపుతో రాగాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు మంజూషా పాటిల్. సంగీత ప్రేమికులైన తల్లిదండ్రుల ప్రోత్సాహం.. నిరంతర సాధనతో సంగీత ప్రపంచంలో తనదైన స్థానాన్ని సొంతం చేసుకున్నారీమె. హైదరాబాదీ శ్రోతలను అలరించేందుకు తొలిసారి ఇక్కడకు వచ్చిన ముంజూషా పాటిల్ కొద్దిసేపు ‘సిటీప్లస్’తో ముచ్చటించారు. నేను పుట్టి పెరిగిందంతా మహారాష్ట్ర సాంగ్లీలో. అమ్మనాన్నలకు సంగీతమంటే ప్రాణం. ఎక్కడ కచేరి జరిగినా వారితో పాటు నన్ను తీసుకెళ్లేవారు. దీంతో సహజంగానే రాగాలు ఒంటబట్టాయి. అలాగని సంగీతం నేర్చుకోవాలంటూ పేరెంట్స్ నాపై ఎన్నడూ ఒత్తిడి తేలేదు. 12 ఏళ్ల వయస్సులోనే సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నా. మిరాజ్‌లోని అఖిల భారత గాంధర్వ మహావిద్యాలయలో సంగీత విశారద్ పూర్తి చేశా. తరువాత కొల్హాపూర్‌లోని శివాజీ యూనివర్సిటీ నుంచి ఎంఏ (మ్యూజిక్)లో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఓ సంగీత పోటీలో నా గాత్రం విన్న దివంగత పండిట్ డీవీ కనెబువా స్వరం బాగుందని ప్రశంసించారు. ఆయన దగ్గరే ఆగ్రా, గ్వాలియర్ ఘరానా సంప్రదాయంలో సాధన చేశా. ప్రస్తుతం పద్మశ్రీ పండిట్ ఉల్హాస్ కషల్కర్ ప్రోత్సాహంతో ముందుకుసాగుతున్నా. మంచి ఆదరణ... నేను హైదరాబాద్ రావడం తొలిసారి. ఎప్పటి నుంచో నా గాత్రాన్ని నగరవాసులకు వినిపించాలని అనుకుంటున్నా. ‘ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్’ వారు ఇక్కడ కచేరీ చేయాలని ఆహ్వనించగానే మారు మాట్లాడకుండా ఓకే చేశా. ఈ నగరంలో హిందూస్థానీ మ్యూజిక్కు మంచి ఫాలోయింగ్ ఉంది. నా కచేరీకి వచ్చిన ప్రజలను చూస్తుంటే ఇది అర్ధమవుతోంది. భవిష్యత్‌లో ఇక్కడ మరిన్ని కచేరీలు చేయాలనుకుంటున్నా. ఇక్కడి స్పైసీ ఫుడ్ నచ్చింది. -వీఎస్ -
సంగీత సారథి
హిందుస్థానీ సంగీతంలో కిరానా ఘరానా, బెనారసీ ఘరానా సంప్రదాయాల మేళవింపుగా రాగాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు సారథి ఛటర్జీ. తండ్రి వద్ద కిరానా ఘరానా, గురువు వద్ద బెనారసీ ఘరానా సంప్రదాయాల్లో పొందిన శిక్షణ, నిరంతర సాధనతో సంగీత ప్రపంచంలో తనదైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు. హైదరాబాదీ శ్రోతలను అలరించేందుకు తొలిసారిగా ఇక్కడకు వచ్చిన సారథి ఛటర్జీ కొద్దిసేపు ‘సిటీప్లస్’తో ముచ్చటించారు. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే.. నేను పుట్టి పెరిగిందంతా కోల్‌కతా. నాన్న ప్రొఫెసర్ అరుణ్‌కుమార్ ఛటర్జీ హిందుస్థానీ సంగీతంలో కిరానా ఘరానా సంప్రదాయానికి చెందిన గాయకుడు. అమ్మ సెఫాలీ బెంగాలీ భక్తి పాటలు పాడేది. అక్క మహువా కూడా మంచి గాయని. సంగీత నేపథ్యంలో పుట్టిపెరగడంతో సహజంగానే రాగాలు ఒంటబట్టాయి. అలాగని సంగీతం నేర్చుకోవాలంటూ నాన్న నాపై ఎన్నడూ ఒత్తిడి తేలేదు. చిన్నప్పుడు కూనిరాగాలు తీసేవాడిని. కూనిరాగాలు విన్న అమ్మ ఓ రోజు సంగీతంపై శ్రద్ధపెట్టమని సలహా ఇచ్చింది. తనకు తెలిసిన కొన్ని రాగాలు కూడా నేర్పింది. ఆ రాగాలు నా నోట విన్న నాన్న కూడా ప్రశంసించారు. నాన్న ప్రశంసతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఐదేళ్ల ప్రాయంలోనే ఆకాశవాణిలో రవీంద్రనాథ్ ఠాగోర్ పద్యాలు పాడాను. పదిహేడేళ్ల ప్రాయంలోనే 1981లో ఆకాశవాణి సంగీత పోటీల్లో మొదటి బహుమతి సాధించాను. నాన్న దగ్గర కిరానా ఘరానా సంప్రదాయంలో సాధన చేశా. తర్వాత పండిట్ రాజన్ మిశ్రా, సాజన్ మిశ్రాల వద్ద బెనారసీ ఘరానా నేర్చుకున్నా. గాత్రంతో పాటు తబలా వంటి వాద్యాలనూ అప్పుడప్పుడు వాయిస్తుంటా. ఇక నా కుటుంబం గురించి చెప్పాలంటే.. నా భార్య షర్మిల లెక్చరర్. మా అబ్బాయి సప్తక్ ఛటర్జీ కూడా సింగర్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు. సంప్రదాయ సంగీతాన్ని భావి తరాలకు అందించాలనే లక్ష్యంతో 2006లో ‘సంగీతం’ పేరుతో సొసైటీని ఏర్పాటు చేశా. రిచ్ మ్యూజిక్ సిటీ... నేను హైదరాబాద్ రావడం తొలిసారి. ఎప్పటి నుంచో ఈ సిటీలో నా గాత్రాన్ని లైవ్‌గా వినిపించాలనుకుంటున్నా. ‘స్పిక్‌మాకే’ సంస్థ వారు ఇక్కడ కచేరీ చేయాలని ఆహ్వానించగానే మారు మాట్లాడకుండా ఓకే చేశా. సిటీవాసులు హిందూస్థానీ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తారని విన్నా. ఈ నగరంలో నాన్నకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. భవిష్యత్‌లో ఇక్కడ మరిన్ని కచేరీలు చేయాలనుకుంటున్నా. ..:: వాంకె శ్రీనివాస్