మనిషి జీవితంలో ఓ అంత ర్భాగం సంగీతం. అన్ని సందర్భాల్లోనూ ఆయా భావాలను వ్యక్తం చేయడానికి సంగీతం ఒక వాహిక. అయితే ప్రపంచంలో అనేక రకాల సంగీత సంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో భారతీయ సంగీత సంప్రదాయాలకు చాలా విశిష్ట స్థానం ఉంది. భారతీయ సంగీతం రాగ ప్రధానమైనది అయితే పాశ్చాత్య సంగీతం స్వరమేళన ప్రధానం. భారతీయ సంగీతం గురించి వేదాల్లో ఒకటైన సామ వేదంలోనూ ప్రస్తావితమయ్యింది.
భరతముని తన ‘నాట్యశాస్త్రం’ (క్రీ.పూ. 2వ శతాబ్దం నుండి క్రీ.శ. 2 వ శతాబ్దం)లో భారతీయ సంగీతం గురించి విపులంగా వివరించాడు. మధ్య ఆసియా నుండి వచ్చిన తుర్కీయులు, తాతార్లు, పర్షియన్లు, అఫ్గాన్లు పాలన చేస్తున్నప్పుడు భారతీయ సంగీతం ఉత్తర, దక్షిణ సంగీత సంప్రదాయాలుగా విడిపోయింది. ఉత్తర సంప్రదాయాన్ని ‘హిందుస్తానీ’ సంగీతమనీ, దక్షిణపు సంప్రదాయాన్ని∙‘కర్ణాటక’సంగీతం అనీ పిలవడం ప్రారంభమయింది. అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఆస్థానంలో పార్శీ దేశానికి చెందిన అమీర్ ఖుస్రూ ఉండేవాడు. ఇతడు పార్శీ సంగీతంలోని రాగ క్రమ పద్ధతిని భారతీయ సంగీతంతో మేళవించి ఒక కొత్త సంగీత సంప్రదాయాన్ని సృష్టించాడు. అదే ‘హిందుస్తానీ’ సంగీతం.
హిందూస్తానీ సంగీతం ‘రాగ రాగిణుల’ చిత్ర కళా సంప్రదాయాన్ని కూడా సృష్టించింది. ఒక రాగాన్ని వినేప్పుడు కలిగే భావనావృత్తి కొన్ని దృశ్యరూపాలతో సంలగ్నమై ఉంటుంది. అటువంటి దృశ్యరూపాన్ని చిత్రరూపంలో పొందుపరచేందుకు ఉత్తర భారతంలో కృషి జరిగింది. ఆ కృషి ఫలితాలే రాగరాగిణి చిత్రాలు. హిందూస్తానీ సంప్రదాయంలో సూరదాసు, తులసీదాసు, మీరాబాయి, జయదేవుడు వంటివారు భక్తి సంగీతాన్ని సుసంపన్నం చేశారు. కొందరు గజల్స్ రూపంలో మధురభక్తిని సృష్టించారు.
దక్షిణ భారతదేశంలో పేరు పొందిన భారతీయ సంగీతం కర్ణాటక సంగీతం. ‘కర్ణాటిక్’ అనే పదానికి సంస్కృత పదం అయిన ‘కర్ణేషు అతతి’ (చెవులకు ఇంపైన సంగీతం కనుక కర్ణాటక సంగీతం) మూలం అని కొందరి పరిశోధకుల అభిప్రాయం. ‘కరనాడు’ అంటే సముద్ర తీరం అనీ, మూడు వైపులా సముద్ర తీరం గల దక్షిణ భారతదేశంలో పుట్టిన సంగీతం కనుక దక్షిణ సంగీత సంప్రదాయానికి కర్ణాటక సంగీతం అనే పేరు వచ్చింది అనీ మరికొందరి అభిప్రాయం.
కర్ణాటక సంగీత సంప్రదాయంలో హిందుస్తానీ సంప్రదాయంలాగా భక్తి, శృంగార రసాలకు ప్రాధా న్యం ఎక్కువగా ఉంటుంది. శృంగార రసం కొన్ని సందర్భాల్లో పరిణతి చెంది భక్తిగా రూపాంతరం చెందుతుంది. త్యాగయ్య, శ్యామశాస్త్రి, పురంధరరాసు, రామదాసు వంటి వాగ్గేయకారుల పదసాహిత్యం భక్తి కోవకి చెందినది. జావళీలు, ప్రత్యేకించి క్షేత్రయ్య పదాలు శృంగార రసానికి చెందినవి.
కర్ణాటక సంగీతంలో ప్రధాన లక్షణంగా పరిగణించే రాగాన్ని పతంగుడు పేర్కొన్నాడు. రాగాల్లో కొన్ని రాగాలు ఉల్లాసాన్నీ, మరికొన్ని రాగాలు విషా దాన్నీ, కొన్ని కరుణ రసాన్నీ స్ఫురింపజేస్తాయి. ఈ విధంగా ఆ యా రాగాలు శ్రోతల హృదయంలో ఆయా అనుభూతులను కలిగించగలుగుతున్నాయి. కర్ణాటక సంగీతశాస్త్రంలో మరో ప్రాధాన్య లక్ష్యం ‘శ్రుతి’. ‘శ్రు’ (అంటే వినుట) అనే ధాతువు నుండి ‘శ్రుతి’ అనే పదం పుట్టింది. భారతీయ సంగీతానికి గమకాలు ఒక విశిష్టతను చేకూర్చాయి. గానానికి వీటిని మాల అలంకారాలుగా వర్ణింపవచ్చునని సంగీతవేత్తల అభిప్రాయం.
కర్ణాటక సంగీత సంప్రదాయంలో తెలుగు భాష ప్రధాన పాత్ర పోషించింది. తెలుగు భాష మధురమైన భాష. ఈ భాష పదాలకూ, వ్యాకరణానికీ సరైన ప్రాధా న్యమిస్తూ శ్రావ్యమైన కూర్పులను అందిస్తుంది. అలాంటి కూర్పులు వాగ్గేయకారులచే స్వరపరచబడి పద్యం అందాన్ని మరింత పెంచాయి. అందుకనే కాబోలు ఆనాటి తొలి సంకీర్తనాచార్యుడు అన్నమయ్య మొదలుకొని రామదాసు, క్షేత్రయ్య; సంగీత మూర్తి త్రయంలోని త్యాగయ్య, శ్యామశాస్త్రి, తమిళులైన పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, ముత్తయ్య భాగవతార్; కన్నడ దేశానికి చెందిన మైసూర్ వాసుదేవాచారి ఇత్యాది వాగ్గేయకారులు తెలుగు భాషనే ఎంచుకొని, తమ రచనలు సాగించారు. అంతటి విశిష్టమైనది మన తెలుగు భాష.
అందుకనే తెలుగు రాష్ట్రాల పునర్విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో మొట్ట మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ‘కృష్ణ వేణి సంగీత నీరాజనం’ అనే సంగీతోత్సవాన్ని ఈ డిసెంబరు 10 నుండి 12 వరకు విజయ వాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో, అలాగే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, కృష్ణానది దుర్గా ఘాట్‌ల వద్ద ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ నిర్వహిస్తోంది.
ఈ సంగీతోత్సవం ముఖ్య ఉద్దేశ్యం మన అద్భుతమైన సంగీత సంప్రదాయాలను పరిరక్షించడం... తద్వారా హరికథ, నామ సంకీర్తన సంప్రదాయాలపై దృష్టిని పునరుద్ధరించే ప్రయత్నం చేయడం; తెలుగు భాష గొప్పతనాన్నీ, వారసత్వాన్నీ వెలుగులోకి తీసుకు రావడం. ఈ ఉత్సవం సంగీత కళాశాలల విద్యా ర్థులకూ, విశ్వ విద్యాలయాల విద్యార్థులకూ నేర్చుకోవ డానికీ, వారి ప్రతిభను ప్రదర్శించ డానికీ ఒక వేదికగా ఉపయోగపడుతుంది.
ఆర్. మల్లికార్జున రావు
వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు
మన సంగీతానికి నీరాజనం!
Published Sun, Dec 10 2023 4:55 AM | Last Updated on Sun, Dec 10 2023 4:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment