Carnatic music
-
మన సంగీతానికి నీరాజనం!
మనిషి జీవితంలో ఓ అంత ర్భాగం సంగీతం. అన్ని సందర్భాల్లోనూ ఆయా భావాలను వ్యక్తం చేయడానికి సంగీతం ఒక వాహిక. అయితే ప్రపంచంలో అనేక రకాల సంగీత సంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో భారతీయ సంగీత సంప్రదాయాలకు చాలా విశిష్ట స్థానం ఉంది. భారతీయ సంగీతం రాగ ప్రధానమైనది అయితే పాశ్చాత్య సంగీతం స్వరమేళన ప్రధానం. భారతీయ సంగీతం గురించి వేదాల్లో ఒకటైన సామ వేదంలోనూ ప్రస్తావితమయ్యింది. భరతముని తన ‘నాట్యశాస్త్రం’ (క్రీ.పూ. 2వ శతాబ్దం నుండి క్రీ.శ. 2 వ శతాబ్దం)లో భారతీయ సంగీతం గురించి విపులంగా వివరించాడు. మధ్య ఆసియా నుండి వచ్చిన తుర్కీయులు, తాతార్లు, పర్షియన్లు, అఫ్గాన్లు పాలన చేస్తున్నప్పుడు భారతీయ సంగీతం ఉత్తర, దక్షిణ సంగీత సంప్రదాయాలుగా విడిపోయింది. ఉత్తర సంప్రదాయాన్ని ‘హిందుస్తానీ’ సంగీతమనీ, దక్షిణపు సంప్రదాయాన్ని∙‘కర్ణాటక’సంగీతం అనీ పిలవడం ప్రారంభమయింది. అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఆస్థానంలో పార్శీ దేశానికి చెందిన అమీర్ ఖుస్రూ ఉండేవాడు. ఇతడు పార్శీ సంగీతంలోని రాగ క్రమ పద్ధతిని భారతీయ సంగీతంతో మేళవించి ఒక కొత్త సంగీత సంప్రదాయాన్ని సృష్టించాడు. అదే ‘హిందుస్తానీ’ సంగీతం. హిందూస్తానీ సంగీతం ‘రాగ రాగిణుల’ చిత్ర కళా సంప్రదాయాన్ని కూడా సృష్టించింది. ఒక రాగాన్ని వినేప్పుడు కలిగే భావనావృత్తి కొన్ని దృశ్యరూపాలతో సంలగ్నమై ఉంటుంది. అటువంటి దృశ్యరూపాన్ని చిత్రరూపంలో పొందుపరచేందుకు ఉత్తర భారతంలో కృషి జరిగింది. ఆ కృషి ఫలితాలే రాగరాగిణి చిత్రాలు. హిందూస్తానీ సంప్రదాయంలో సూరదాసు, తులసీదాసు, మీరాబాయి, జయదేవుడు వంటివారు భక్తి సంగీతాన్ని సుసంపన్నం చేశారు. కొందరు గజల్స్ రూపంలో మధురభక్తిని సృష్టించారు. దక్షిణ భారతదేశంలో పేరు పొందిన భారతీయ సంగీతం కర్ణాటక సంగీతం. ‘కర్ణాటిక్’ అనే పదానికి సంస్కృత పదం అయిన ‘కర్ణేషు అతతి’ (చెవులకు ఇంపైన సంగీతం కనుక కర్ణాటక సంగీతం) మూలం అని కొందరి పరిశోధకుల అభిప్రాయం. ‘కరనాడు’ అంటే సముద్ర తీరం అనీ, మూడు వైపులా సముద్ర తీరం గల దక్షిణ భారతదేశంలో పుట్టిన సంగీతం కనుక దక్షిణ సంగీత సంప్రదాయానికి కర్ణాటక సంగీతం అనే పేరు వచ్చింది అనీ మరికొందరి అభిప్రాయం. కర్ణాటక సంగీత సంప్రదాయంలో హిందుస్తానీ సంప్రదాయంలాగా భక్తి, శృంగార రసాలకు ప్రాధా న్యం ఎక్కువగా ఉంటుంది. శృంగార రసం కొన్ని సందర్భాల్లో పరిణతి చెంది భక్తిగా రూపాంతరం చెందుతుంది. త్యాగయ్య, శ్యామశాస్త్రి, పురంధరరాసు, రామదాసు వంటి వాగ్గేయకారుల పదసాహిత్యం భక్తి కోవకి చెందినది. జావళీలు, ప్రత్యేకించి క్షేత్రయ్య పదాలు శృంగార రసానికి చెందినవి. కర్ణాటక సంగీతంలో ప్రధాన లక్షణంగా పరిగణించే రాగాన్ని పతంగుడు పేర్కొన్నాడు. రాగాల్లో కొన్ని రాగాలు ఉల్లాసాన్నీ, మరికొన్ని రాగాలు విషా దాన్నీ, కొన్ని కరుణ రసాన్నీ స్ఫురింపజేస్తాయి. ఈ విధంగా ఆ యా రాగాలు శ్రోతల హృదయంలో ఆయా అనుభూతులను కలిగించగలుగుతున్నాయి. కర్ణాటక సంగీతశాస్త్రంలో మరో ప్రాధాన్య లక్ష్యం ‘శ్రుతి’. ‘శ్రు’ (అంటే వినుట) అనే ధాతువు నుండి ‘శ్రుతి’ అనే పదం పుట్టింది. భారతీయ సంగీతానికి గమకాలు ఒక విశిష్టతను చేకూర్చాయి. గానానికి వీటిని మాల అలంకారాలుగా వర్ణింపవచ్చునని సంగీతవేత్తల అభిప్రాయం. కర్ణాటక సంగీత సంప్రదాయంలో తెలుగు భాష ప్రధాన పాత్ర పోషించింది. తెలుగు భాష మధురమైన భాష. ఈ భాష పదాలకూ, వ్యాకరణానికీ సరైన ప్రాధా న్యమిస్తూ శ్రావ్యమైన కూర్పులను అందిస్తుంది. అలాంటి కూర్పులు వాగ్గేయకారులచే స్వరపరచబడి పద్యం అందాన్ని మరింత పెంచాయి. అందుకనే కాబోలు ఆనాటి తొలి సంకీర్తనాచార్యుడు అన్నమయ్య మొదలుకొని రామదాసు, క్షేత్రయ్య; సంగీత మూర్తి త్రయంలోని త్యాగయ్య, శ్యామశాస్త్రి, తమిళులైన పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, ముత్తయ్య భాగవతార్; కన్నడ దేశానికి చెందిన మైసూర్ వాసుదేవాచారి ఇత్యాది వాగ్గేయకారులు తెలుగు భాషనే ఎంచుకొని, తమ రచనలు సాగించారు. అంతటి విశిష్టమైనది మన తెలుగు భాష. అందుకనే తెలుగు రాష్ట్రాల పునర్విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో మొట్ట మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి ‘కృష్ణ వేణి సంగీత నీరాజనం’ అనే సంగీతోత్సవాన్ని ఈ డిసెంబరు 10 నుండి 12 వరకు విజయ వాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో, అలాగే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, కృష్ణానది దుర్గా ఘాట్ల వద్ద ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ నిర్వహిస్తోంది. ఈ సంగీతోత్సవం ముఖ్య ఉద్దేశ్యం మన అద్భుతమైన సంగీత సంప్రదాయాలను పరిరక్షించడం... తద్వారా హరికథ, నామ సంకీర్తన సంప్రదాయాలపై దృష్టిని పునరుద్ధరించే ప్రయత్నం చేయడం; తెలుగు భాష గొప్పతనాన్నీ, వారసత్వాన్నీ వెలుగులోకి తీసుకు రావడం. ఈ ఉత్సవం సంగీత కళాశాలల విద్యా ర్థులకూ, విశ్వ విద్యాలయాల విద్యార్థులకూ నేర్చుకోవ డానికీ, వారి ప్రతిభను ప్రదర్శించ డానికీ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఆర్. మల్లికార్జున రావు వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు -
Vijayalakshmy Subramaniam: సరిగమలే ఔషధాలు
ఆమె సంగీత విద్వాంసురాలు. అంతేకాదు... వైద్యరంగంలో ప్రొఫెసర్. వృత్తిని ప్రవృత్తిని మేళవించారామె. సరిగమలు వైద్యానికి ఔషధాలయ్యాయి. రాగాలు ఆరోగ్యాన్నిచ్చే టానిక్లవుతున్నాయి. తీయని కృతులు షుగర్ లెవెల్స్ తగ్గిస్తున్నాయి. సంగీత లయ బీపీకి గిలిగింత పెడుతోంది. ప్రొఫెసర్ విజయలక్ష్మి సుబ్రహ్మణ్యమ్... కర్ణాటక సంగీతంలో రాగాల మీద పరిశోధన చేశారు. ఆ రాగాలు డిప్రెషన్‌ను దూరం చేయడానికి ఏ విధంగా దోహదం చేస్తాయనే విషయాలను శాస్త్రబద్ధం చేశారు. సంగీతం అనారోగ్యాన్ని మాయం చేస్తుందనడానికి ప్రత్యక్ష నిదర్శనం తానేనని కూడా చెబుతారామె. ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ప్రమాదానికి గురై చక్రాల కుర్చీలో గడిపిన సమయంలో సంగీత సాధన ద్వారా వేగంగా సాంత్వన పొందిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు. డాక్టర్‌గా తన వృత్తిని సంగీతం పట్ల మక్కువతో మేళవించి రాగాలతో చేస్తున్న వైద్యం గురించిన వివరాలను సాక్షితో పంచుకున్నారు. ► తంజావూరు సరస్వతి మహల్ ‘‘నేను పుట్టింది బెంగళూరు, కర్నాటకలో స్థిరపడిన తమిళ కుటుంబం మాది. నాలో సంగీతాభిలాష ఎలా మొదలైందని చెప్పడం కష్టమే. ఎందుకంటే మా ఇల్లే ఒక సంగీత నిలయం. నానమ్మ గాత్రసాధనతోపాటు వయొలిన్ సాధన కూడా చేసేవారు. అమ్మ ఉద్యోగపరంగా సైన్స్ టీచర్, కానీ ఆమె కూడా సంగీతంలో నిష్ణాతురాలు. మా నాన్న శిక్షణ పొందలేదనే కానీ సంగీతపరిజ్ఞానం బాగా ఉండేది. అలా నాకు మా ఇంటి గోడలే సరిగమలు నేర్పించాయి. నాన్న ఉద్యోగరీత్యా దేశంలో అనేకచోట్ల పెరిగాను. గుజరాత్, బరోడాలో ఉన్నప్పుడు సంగీతంతోపాటు భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. సంగీతం నాకు ధారణ శక్తికి బాగా ఉపకరించింది. దాంతో చదువులోనూ ముందుండేదాన్ని. ఎంబీబీఎస్‌లో సీటు వచ్చిన తర్వాత నా చదువు, అభిరుచి రెండు వేర్వేరు ప్రపంచాలయ్యాయి. రెండింటినీ వేరుగా చూడడం నాకు సాధ్యపడలేదు. నాకు తెలియకుండానే కలగలిపి చూడడం మొదలైంది. సంగీతాన్ని ఒక కళగా సాధన చేయడంతో సరిపెట్టకుండా ఒక శాస్త్రంగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. నాదయోగ, రాగచికిత్సల గురించి అప్పుడు తెలిసింది. తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీలో సంగీతంతో వైద్యవిధానాల గురించి గ్రంథాలున్నాయి. మెడిసిన్‌తోపాటు మ్యూజిక్‌ని కూడా విపరీతంగా చదివాను. రాష్ట్రంలో మూడవ ర్యాంకుతో కర్ణాటక సంగీతంలో కోర్సు పూర్తి చేశాను. మన దగ్గరున్న పురాతన రాతిశాసనాలతోపాటు విదేశాల్లో ఉన్న మ్యూజిక్ థెరపీలను తెలుసుకున్నాను. వైద్యానికీ– సంగీతానికీ మధ్య ఉన్న, మనం మరిచిపోయిన బంధాన్ని పునఃప్రతిష్ఠ చేయాలనే ఆకాంక్ష కలిగింది. ► మతిమరపు దూరం మ్యూజిక్ థెరపీ అనగానే అందరూ ఇక మందులు మానేయవచ్చని అపోహపడుతుంటారు. అలాగే మందులు కొనసాగించాల్సినప్పుడు ఇక మ్యూజిక్‌తో సాధించే ప్రయోజనం ఏముంది అని తేలిగ్గా తీసేస్తుంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే... మా దగ్గరకు వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ మూడు వందలకు పైగా డయాబెటిస్తో ఇన్సులిన్ తీసుకునేవాడు. మ్యూజిక్ థెరపీతో ఇన్సులిన్ అవసరం లేకుండా మందులు సరిపోయే దశకు తీసుకురాగలిగాం. నత్తితో ఇబ్బంది పడే పిల్లలు అనర్గళంగా మాట్లాడేటట్లు చేసింది సంగీతం. రెండు రోజులకోసారి డయాలసిస్ చేసుకుంటూ కిడ్నీ దాత కోసం ఎదురు చూస్తున్న పేషెంట్‌కి ఉపశమనం దొరికింది. ఇక నరాలు, నాడీ సంబంధ సమస్యలను నయం చేసి చూపిస్తున్నాం. ప్రతి పేషెంట్‌నీ వాళ్ల ఆహారవిహారాలు, ఇతర ఆరోగ్య సమస్యల ఆధారంగా విశ్లేషించి ప్రతి ఒక్కరికీ వారికి మాత్రమే ఉపకరించే సంగీత విధానాన్ని సూచిస్తాం. కొంతమంది కోసం ప్రత్యేకంగా పాటలు రాసి కంపోజ్ చేసి ఇస్తాం. పేషెంట్ ఇష్టాలు, మత విశ్వాసాల ఆధారంగా మ్యూజిక్ థెరపీని డిజైన్ చేస్తున్నాం. అయితే దీనికి ప్రత్యామ్నాయ వైద్యవిధానం అర్హత ఉన్నప్పటికీ ఇంకా ధృవీకరణ రాలేదు. కాంప్లిమెంటరీ మెడిసిన్గానే ఆచరణలో పెడుతున్నాం. వార్ధక్యం కారణంగా అల్జైమర్స్, డిమెన్షియాతో బాధపడుతున్న వాళ్లకు మ్యూజిక్ థెరపీతో అద్భుతాలు సాధించామనే చెప్పాలి. ఓ పెద్దాయన అయితే... భార్య పేరు కూడా మర్చిపోయాడు. నేను స్వయంగా పాట పాడుతూ ఆయన ప్రతిస్పందించే తీరును గమనిస్తున్నాను. ఆశ్చర్యంగా పాటలో తన భార్య పేరు రాగానే చిన్న పిల్లవాడిలాగ ‘యశోదా’ అంటూ పెద్దగా అరిచాడు. మా పరిశోధనాంశాల ఆధారంగా మ్యూజిక్ థెరపీని శాస్త్రబద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను’’ అని చెప్పారు ప్రొఫెసర్ విజయలక్ష్మి. ఇదీ ఆమె మొదలు పెట్టిన ‘ఇల్నెస్ టూ వెల్నెస్ ’ జర్నీ. సరిగమలతో రాగాల వైద్యం త్వరలోనే అందరికీ అందుబాటులోకి రావాలని ఆకాంక్షిద్దాం. రాగాల చికిత్స సంగీతం ఆరోగ్యప్రదాయినిగా అందరికీ అందుబాటులోకి తేవాలనే ఆకాంక్షలున్న వాళ్లందరం ఇండియన్ మ్యూజిక్ థెరపీ అసోసియేషన్ (ఐఎమ్‌టీఏ)గా సంఘటితమయ్యాం. ఇలాంటి సమూహాలు ఇంకా ఉన్నాయి. కానీ మనదేశంలో మ్యూజిక్ థెరపీ శాస్త్రబద్ధంగా, ఒక వ్యవస్థీకృతమైన అధీకృత సంస్థ ఏదీ లేదు. ఆ లోపాన్ని భర్తీ చేయడానికి ఇటీవల మంగళూరులో మా ఎనెపోయా మెడికల్ యూనివర్సిటీలో ఆన్లైన్ కోర్సు ప్రారంభించాం. ఇది డాక్టర్ల కోసం మాత్రమేకాదు, వైద్యరంగంలో పని చేసే అందరూ ఈ కోర్సు చేయవచ్చు. ఇక నా ప్రయత్నంలో స్పెషల్ చిల్డ్రన్‌కి మ్యూజిక్ థెరపీ కోర్సు, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కిడ్నీ ఫెయిలయ్యి డయాలసిస్‌తో రోజులు గడుపుతున్న పేషెంట్లకు మెరుగైన ఫలితాన్ని చూశాను. – ప్రొ‘‘ విజయలక్ష్మి సుబ్రమణ్యమ్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఓటోరైనోలారింగాలజీ, ఎనెపోయా మెడికల్ కాలేజ్, మంగళూరు, కర్ణాటక – జనరల్ సెక్రటరీ, ఐఎమ్‌టీఏ – వాకా మంజులారెడ్డి. -
స్వరాల పుస్తకం
అది బెంగళూరు నగరం జయనగర్... నిత్యం సప్తస్వరాలు పలికే ఓ రాగాలయం... ఆ గాననిలయం గాయని శైలజాపంతులు నివాసం. కిత్తూరు రాణి చెన్నమ్మ పురస్కారం... ప్రసిద్ధగాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు... లెక్కకు మించిన సత్కారాలు... కన్నడనాట తెలుగు గాయనికి అందుతున్న గౌరవం. గాత్రసేవలో తరిస్తున్న స్వరాల పుస్తకం ఆమె. ఆమె సంగీత ప్రస్థానం... ఆమె మాటల్లోనే... ‘‘మా ఇంటికి వచ్చిన వాళ్లు ‘ఇంట్లో సప్తస్వరాలతోపాటు త్రిమూర్తులు కూడా వెలిశారు’ అనీ, ‘ఇల్లు దశావతారాలకు ప్రతిబింబంగా ఉంది’ అనీ జోకులేసేవారు. ముగ్గురు అబ్బాయిలు. ఏడుగురు అమ్మాయిల్లో నేను చిన్నదాన్ని. నాకు మా మేనత్త పోలికలతోపాటు ఆమె స్వరం కూడా వచ్చిందని గుర్తు చేసుకునే వారు నాన్న. స్కూల్లో ప్రార్థనాగీతాలు, బృందగానాలు ఇష్టంగా పాడేదాన్ని. నా ఆసక్తిని గమనించిన నాన్న నాకు, చిన్నక్క రమాదేవికి సంగీతంలో శిక్షణ ఇప్పించడానికి తనవంతుగా మంచి ప్రయత్నమే చేశారు. మా ఊరు చిత్తూరు జిల్లా బీరంగి కొత్తకోట. బెంగళూరు నుంచి మాస్టారు వారాంతాల్లో మా ఊరికి వచ్చి సంగీతం నేర్పించే ఏర్పాటు చేశారు. వెంకటేశ్ భాగవతార్ మాస్టారు ప్రతివారం రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి పాఠాలు చెప్పేవారు. కానీ ఎక్కువ కాలం కొనసాగడం కష్టమైంది. తొలుత ఏకలవ్య శిష్యరికం నేను ప్రఖ్యాత గాయని ఎమ్ ఎల్ వసంతకుమారి శిష్యురాలిని, ఏడేళ్లు ఆమె దగ్గరే ఉండి శుశ్రూష చేసి చదువుకుంటూ సంగీతం నేర్చుకున్నాను. ఆడపిల్లలు ఇంటి ఆవరణ దాటడానికి కూడా ఇష్టపడని సంప్రదాయ కుటుంబం మాది. అలాంటి రోజుల్లో అన్నయ్య నరేంద్రరావు చొరవ తీసుకుని నాన్నని ఒప్పిస్తూ ఒక్కో అడుగూ ముందుకు వేయించాడు. అక్క, నేను ఎమ్ఎల్ వసంతకుమారి గారికి ఏకలవ్య శిష్యులం. ఇంట్లో రోజూ ఆమె పాటల క్యాసెట్ పెట్టుకుని సంగీత సాధన చేసేవాళ్లం. అలాంటిది ఆ గాయని ఓ రోజు రిషివ్యాలీ స్కూల్‌కి వస్తున్నట్లు సమాచారం తెలిసి అన్నయ్య మమ్మల్ని తీసుకువెళ్లి ఆమెను చూపించాడు. అప్పుడు ఆమె దగ్గర సంగీతం నేర్చుకోగలననే ఆలోచన నా ఊహకు కూడా అందలేదు. దేవుడు సంకల్పించినట్లుగా ఆమె ఓ రోజు వైద్యం కోసం మా మేనమామ క్లినిక్‌కి వచ్చారు. అప్పుడు మా మామ ఆమెను రిక్వెస్ట్ చేయడం, ఆమె వెంటనే రిషి వ్యాలీ స్కూల్లో చేర్పించమని చెప్పడం జరిగిపోయాయి. చేరడం వరకు సులువుగానే జరిగింది. కానీ అక్కడికి వెళ్లి రావడం చాలా కష్టమయ్యేది. వారాంతాల్లో క్లాసులు. మా ఊరి నుంచి ‘అంగళ్లు’ అనే ఊరి వరకు బస్‌లో వెళ్లి, అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు నడిచి రిషివ్యాలీ చేరేవాళ్లం. ఆ స్కూల్లో తెలుగు మాస్టారు రామచంద్రరావు గారు మా దూరపుబంధువు. వారింట్లో ఉండి సంగీతం నేర్చుకోవడం, సోమవారం ఉదయాన్నే బయలుదేరి మా ఊరికి రావడం. ధర్మవరం కాలేజ్‌లో ఇంటర్ చదువు... ఈ దశలో చదువు సరిగ్గా సాగలేదు. ఇదిలా ఉండగా అక్కకు పెళ్లయి బెంగుళూరుకు వెళ్లిపోయింది. ఇక నాది ఒంటరి పోరాటమే అయింది. ఇంట్లో వాళ్లు చదువు లేదా సంగీతం ఏదో ఒకటి మానిపించాలనే ఆలోచనలోకి వచ్చేశారు. అప్పుడు నేను ‘ప్రైవేట్‌గా చదువుకుంటూ సంగీతం నేర్చుకుంటాను’ అని మొండిగా పట్టుపట్టాను. అలా మా గురువుగారు వసంతకుమారి గారింటికి చేరాను. ఏడేళ్లు అక్కడే ఉండి గురు శుశ్రూష చేశాను. ఆమె శిష్యరికంలో సంగీత సాధన చేస్తూ ఆమె జతతో కచేరీల్లో పాల్గొంటూ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో పీజీ చేశాను. వరుడి కోసం వేట మా అన్న మద్దతు అక్కడితో ఆగిపోలేదు. నాకు వరుడిని వెతికే పనిని ఒక యజ్ఞంలా చేశాడు. నా పెళ్లి నాటికి నాన్న లేరు, బాధ్యతంతా అన్నయ్య దే. సంగీతం విలువ తెలిసిన కుటుంబం అయితేనే నా సాధన కొనసాగుతుందనే ఉద్దేశ్యంతో సంగీతం వచ్చిన వరుడి కోసం గాలించాడు. అలా... బెంగళూరులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో మృదంగవాద్యకారుడికిచ్చి పెళ్లి చేశారు. మా వారు రఘుపంతులుకి సొంత వ్యాపారం ఉంది. కానీ సంగీతం పట్ల ఆయనకు అపారమైన ఇష్టం, గౌరవం. అలా పెద్ద సంగీత కుటుంబంలోకి కోడలిగా వెళ్లాను. అన్నిరకాల సౌకర్యాలూ ఉన్నప్పటికీ ముగ్గురు పిల్లల పెంపకంతో నాకు సంగీత కచేరీలకు పదేళ్లు విరామం వచ్చేసింది. అప్పుడు మావారు పిల్లల పనులకు సహాయకులను నియమించుకుని సంగీత సాధనకు వెసులుబాటు చేసుకోమని సూచించారు. రాగాల పరిశోధన సంగీతం ఆహ్లాదకారకం మాత్రమే కాదు, దివ్యమైన ఔషధం కూడా. ఇది నిరూపణ అయిన వాస్తవమే, కానీ ఏ రాగంతో ఏ అనారోగ్యం నుంచి సాంత్వన కలుగుతుందోనని స్వయంగా శోధించి తెలుసుకున్నాను. బీపీ, డయాబెటిస్, ఒత్తిడి, ఊపిరితిత్తుల సమస్యల నుంచి చక్కటి ఉపశమనం లభిస్తుంది. నేచర్ క్యాంపులు పెట్టి ప్రకృతి ఒడిలో రాగాలాపన చేస్తాం. మెంటల్ హెల్త్ విభాగానికి మానసిక సమస్యలకు సాంత్వన కలిగించే మ్యూజిక్ థెరపీ ప్రాజెక్టు సిద్ధం చేసిచ్చాను. ప్రఖ్యాత వాగ్గేయకారుడు పురందరదాసు చెప్పినట్లు సంగీతజ్ఞానం ప్రతి ఇంట్లో ఉండాలనేదే నా ఆకాంక్ష. సంగీతం అనే ఔషధసేవనం చేసే వాళ్లకు అనేక అనారోగ్యాలు దూరంగా ఉంటాయి. లెక్కకు మించిన అవార్డులు అందుకున్నప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు అందుకోవడంతో నా జన్మధన్యం అయింది. సంగీతం కోసం ఇంకా ఇంకా సేవ చేయాల్సిన బాధ్యత కూడా పెరిగింది. గురుకులాన్ని ప్రారంభించాలనేది తదుపరి లక్ష్యం. నేను మొదలుపెడితే మరొకరు అందిపుచ్చుకుని కొనసాగిస్తారు’’ అన్నారు శైలజాపంతులు. సరిగమల గ్రాఫ్ సంగీతంలో జూనియర్, సీనియర్ విద్వత్తు కోర్సు చేశాను. సంగీత సాధన కోసమే ఇంట్లో ఒక గదిని కేటాయించుకుని చాలా తీవ్రంగా సాధన చేసి గ్రాఫో టెక్నాలజీకి రూపకల్పన చేశాను. నాకు డాక్టరేట్ వచ్చింది ఈ సర్వీస్‌కే. సంగీతం నేర్చుకునే వారికి సులువుగా ఉండే విధానం అది. నా మనుమరాలు నాలుగేళ్ల ‘పూర్వి’ కూడా గ్రాఫ్ చూస్తూ పాడేస్తుంది. గ్రాఫో టెక్నాలజీతో సంగీత పాఠాల పుస్తకాలు రాయడం మొదలుపెట్టాను. సంగీతం కోసం తీవ్రంగా పనిచేయాలనే నిర్ణయానికి వచ్చి 2001లో ... అత్తమామల పేర్లు, తిరుమల బాలాజీ పేరు వచ్చేటట్లు శ్రీవెంకట్ మ్యూజిక్ అకాడమీ స్థాపించాను. ఒక్క స్టూడెంట్‌తో మొదలైన అకాడమీలో ఇప్పుడు మూడు వందలకు పైగా విద్యార్థులు సంగీత సాధన చేస్తున్నారు. వాళ్లకు నేర్పించడం కోసం రోజుకు ఐదారు గంటల సేపు నేను కూడా పాడతాను. – డాక్టర్ శైలజాపంతులు, ప్రసిద్ధగాయని, బెంగళూరు – వాకా మంజులారెడ్డి ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్ -
అమెరికాలో ‘బాలమురళి’ గానామృతం
కాలిఫోర్నియా: సిలికానాంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ "సంపద" ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో కర్ణాటక సంగీత సామ్రాట్ తెలుగువారు గర్వించదగిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 91వ జయంతి ఉత్సవాలు సిలికానాంధ్ర సంపద ఆధ్వర్యంలో కన్నుల పండువగా జరిగాయి. జులై 4న వర్చువల్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది కళాకారులు హాజరై బాల మురళి కృష్ణ గారితో తమకున్న అనుబంధాలని పంచుకున్నారు. స్వర నివాళి ఈ కార్యక్రమంలో కేరళ నుంచి మంగళంపల్లి శిష్యులు ప్రిన్స్ రామ వర్మ, హైదరాబాద్ నుంచి డీవీ మోహన కృష్ణ పాల్గొని గురువు గారితో వారికున్న అనుభవాలని పంచుకున్నారు. ప్రముఖ మ్యూజికాలజిస్ట్ డాక్టర్ బి ఎం సుందరం, డాక్టర్ పప్పు వేణుగోపాలరావు, సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు చిత్రవీణ రవి కిరణ్, చిత్రవీణ నరసింహం, ప్రముఖ ఘటం కళాకారులు కార్తీక్, ప్రముఖ మృదంగ విద్వాంసులు పత్రి సతీష్ కుమార్ గారు మరియు సంగీత విద్వాంసులు శ్రీరాం పరశురాం గారు, మోదుమూడి సుధాకర్ గారు, వయోలిన్ కళాకారిణి పద్మ శంకర్ గారు, జీవీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు మంగళంపల్లి వారి కుటుంబ సభ్యులు అభిరామ్, డాక్టర్ మంగళంపల్లి వంశీ, కస్తూరి గోపాల రావు తదితరులు ఈ వేడుకల్లో భాగమయ్యారు. బాలమురళి గారి థిల్లానాలకు ప్రముఖ నాట్య గురువు ప్రియదర్శిని గోవింద్ శిష్యురాలు శ్వేత ప్రచండె అద్భుతమైన నాట్య ప్రదర్శన చేసి వీక్షకులను అలరించారు. బాలమురళి గారి శిష్యులు చిట్టమూరి కారుణ్య, చిన్మయిలు బాలమురళి గారి కీర్తనలు పాడి స్వర నివాళినర్పించారు. ఆకట్టుకున్న డాక్యుమెంటరీలు సంపద ఉపాధ్యక్షుడు ఫణి మాధవ్ కస్తూరి నాయకత్వంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జీవన విశేషాల పై ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో రూపొందించిన డాక్యుమెంటరీలు వీక్షకులను మంత్రముగ్ధులను చేసాయి. దీనికి స్క్రిప్ట్ మరియు వాయిస్ ఓవర్ అందించిన డాక్టర్ మాలస్వామి (ఇంగ్లీష్), వాచస్పతి అంబడిపూడి మురళీకృష్ణ(తెలుగు)కు సంపద అధ్యక్షులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖుల ఏమన్నారంటే - ప్రఖ్యాత వాయులీనం విద్వాంసులు అన్నవరపు రామస్వామి గారు మాట్లాడుతూ ‘సంపద’ వారికి ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని ఆలోచన రావడం చాలా గొప్ప విషయమన్నారు. సంగీతం లోనే కాకుండా లోనే కాకుండా వయోలిన్, వయోలా మరియు మృదంగం, కంజీర వంటి వాద్యాలలో బాలమురళి కృష్ణ చక్కటి ప్రతిభను కనపరిచేవారు అని పేర్కొన్నారు. - ప్రముఖ నాట్యాచార్యులు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ... భగవంతుడు సంగీత ప్రపంచానికి ఇచ్చిన అతి గొప్ప వరం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన రచించి స్వరపరిచిన హిందోళ తిల్లానాకు డాన్స్ చేసే అవకాశం తొలిసారిగా తనకు కలిగిందన్నారు. - బాలమురళి కృష్ణ గారి జీవించి ఉన్న సమయంలో తను జీవించడం గొప్ప అదృష్టంగా భావిస్తానని ప్రముఖ సంగీత విద్వాంసురాలు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ సుధ రఘునాథన్ అన్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే సామెతకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ చిరునామ అన్నారు. - బాలమురళి కృష్ణ జయంతి సందర్భంగా సంపద ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ప్రముఖ వాయులీన విద్వాంసులు పద్మశ్రీ పురస్కార గ్రహీత అవసరాల కన్యాకుమారి అన్నారు. ‘సంపద’కు అభినందనలు ఈ కార్యక్రమం మొత్తాన్ని సమన్వయపరిచి దిగ్విజయం చేయడానికి నాయకత్వం వహించిన సంపద అధ్యక్షులు దీనబాబు గారికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ వారి శిష్యులు, కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా సిలికానాంధ్ర వాగ్గేయకార విభాగం ఉపాద్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ళ, సృజన నాదెళ్ళ మరియు మమత కూచిభొట్ల బాలమురళి గారి అభిమానులందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని youtube.com/sampadatv ద్వారా చూడవచ్చు. -
ఆ రంగాలను కుదిపేస్తోన్న ‘మీటూ’
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీటూ’ ఉద్యమం ఇప్పుడు కర్ణాటక సంగీతం, భరత నాట్య రంగాలను కూడా కుదిపేస్తోంది. అసభ్యంగా తడమడం నుంచి బలవంతంగా ముద్దు పెట్టుకోవడం, లైంగికంగా లొంగతీసుకోవడం వరకు పురుష పుంగవుల నుంచి అనుభవాలను ఎదుర్కొన్న వందల మంది కళాకారిణులు తమకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలను బాహ్య ప్రపంచానికి వెల్లడించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ ఉద్యమంలో బాధితులంతా కలిసికట్టుగా ముందుకు రావాలంటూ దాదాపు 200 మంది కళాకారిణులు సంతకాలతో కూడిన ఓ ప్రకటనను కూడా మీడియాకు విడుదల చేశారు. ‘ఇటు కర్ణాటక సంగీతం, అటు భరత నాట్యంలోనూ మహిళలు, ముఖ్యంగా యువతులకు, టీనేజర్లకు విద్యను నేర్పేటప్పుడు గురువులు అసభ్యంగా తాకడం సర్వ సాధారణం. ఆధునిక ప్రపంచంలో సినిమా తారల స్థాయికి ఎదగాలంటే ఇలాంటి, అలాంటి భంగమల్లో నృత్యం చేయాలంటూ అసభ్య భంగిమలు పెట్టించేందుకు ప్రయత్నించడం, అసభ్యంగా తాకడం కూడా మామూలే. మాస్టారు! దూరంగా ఉండి భంగిమల్ని చూపించమంటే...నృత్యం మీద దృష్టిని కేంద్రీకరించండంటూ మరీ గట్టిగా హత్తుకుంటారు. సంగీత మాస్టార్లు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. వారికి పడక సుఖం అందించకపోతే కర్ణాటక సంగీతంలో కరీర్‌ను దెబ్బతీస్తున్నారు. దెబ్బతీస్తామని హెచ్చరిస్తున్నారు. మహిళా కళాకారుల ముందే బూతు జోకులు వేయడం, వేసుకోవడం, వెకిలి చేష్టలు చేయడం వారికి అలవాటు. ఇక విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఒకే చోట విడిది చేస్తాం కనుక, మహిళల ముందే వారు కంప్యూటర్లలో, టీవీల్లో నీలి చిత్రాలు చూస్తారు. ఆడ, మగ పడుకోవడం, పడక సుఖాన్ని పంచుకోవడం చాలా సహజమైన విషయం అన్నట్లుగా మాట్లాడుతారు, కవ్వించేందుకు ప్రయత్నిస్తారు. నెత్తిన విభూతి బొట్టు, సిల్క్ పంచకట్టు మాటన తమ అసభ్య ప్రవర్తను దాచేందుకు గురువులు ప్రయత్నిస్తారు. తోటి మగ కళాకారుల నుంచి కూడా మాకు లైంగిక వేధింపులు ఉన్నాయి. అయితే అవి గురువుల స్థాయిలో లేవు. ఈ రెండు రంగాల్లో పురుషులది, అగ్రవర్ణాలదే ఆధిపత్యం కనుక వారి ఆగడాలకు అంతులేకుండా పోతోంది’ అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని సంగీత, భరత నాట్య రంగాలకు చెందిన పలువురు కళాకారిణులు వాపోయారు. వారు అకాశరామన్న ఖాతాల ద్వారా ఇప్పటికే ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల్లో తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఇంకా షేర్ చేసుకుంటున్నారు. ఈ రంగాల్లో కూడా ‘మీటూ’ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ఓ సాంస్కృతిక సంస్థ ‘ఏక్ పుత్లీ రేతి కీ’ ఈ నెల 21వ తేదీన, ఆదివారం చెన్నైలో ‘బహిరంగ విచారణ–సంప్రతింపులు’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆత్మవంచనా ప్రపంచాలే! శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ భరత నాట్యం రెండూ కూడా భారత్‌లో భయంకరమైన ఆత్మవంచనా ప్రపంచాలని ఓ సంగీత విద్వాంసుడి చేతుల్లో ఏడేళ్ల క్రితం లైంగిక దాడికి గురైన పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని మరో కళాకారిణి ఆరోపించారు. నుదుట విభూతి, సిల్కు పంచె, భక్తి మాటున దాగిన రాక్షసులు వీరని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ‘సైబర్ సెక్స్ నీకు ఇష్టమా ? అంటూ శిష్యురాళ్లను అడిగిన గురువులను కూడా చూశానని ఆమె చెప్పారు. తన కళ్ల ముందు తోటి కళాకారుడితో పడుకోవాలంటూ తన గురువు బలవంతం చేస్తున్నాడంటూ, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందంటూ ఓ విద్యార్థిని ఏడుస్తూ వచ్చి తనను గట్టిగా వాటేసుకోవడం తనకు తెలుసునని ఆ కళాకారుణి చెప్పారు. ఇదంతా బహిరంగ రహస్యమే! భారత శాస్త్రీయ కళా రంగాల్లో లైంగిక వేధింపులనేవి బహిరంగ రహస్యమేనని ప్రముఖ కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు, కాలమిస్టు టీఎం కృష్ణ వ్యాఖ్యానించారు. ఇలాంటి సంఘటనల గురించి ఎప్పటి నుంచో గుసగుసలు, కబుర్లు వింటున్నాం. వీటి పట్ల నాతో సహా పలువురు కళాకారులు మౌనం పాటిస్తూ వచ్చాం. ఈ గొడవలు, సంబంధాలు వాటంతటవే సాధారణం కావాలని, సర్దుకుపోవాలని ఆశించామని ఆయన చెప్పారు. పైగా జరిగినదానికి తాము మహిళలనే దూషించామని కూడా ఆయన చెప్పారు. ఈ విషయంలో మహిళల పక్షాన నిలబడలేక పోయినందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు. ముందుగా మనం చేయాల్సిందిల్లా సంగీత విద్వాంసులను, గురువులను దైవ స్వరూపులుగా చూడడం, భావించడాన్ని మానుకోవాలని ఆయన అన్నారు. ఈ రంగాల్లో పురుషాధిక్యం, అగ్రవర్ణాల ఆదిపత్యం కొనసాగుతుండడం వల్ల అధికారం, అహంకారంతో కూడా ఈ లైంగిక దాడులు జరుగుతున్నాయని గాయకురాలు సుధా రఘునాథన్ అభిప్రాయపడ్డారు. ముందునుంచే తెలుసు: సింగర్ జయశ్రీ కర్ణాటక సంగీత రంగంలో లైంగిక దాడి, అనుచిత ప్రవర్తన ఉందనే విషయం ముందు నుంచే కర్ణాటక కమ్యూనిటీకి తెలుసని గాయకురాలు బాంబే జయశ్రీ చెప్పారు. కళాకారులుగా మేమంతా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్న వాళ్లమేనని అన్నారు. ‘మనమంతా వీటి గురించి మాట్లాడాలి. అందుకు స్పష్టత, ధైర్యం ఉండాలని కోరుకుంటున్నాను. ఉందనే భావిస్తున్నాను. ఇందులో మన గురించే ఆలోచించరాదు. అందరి గురించి ఆలోచించాలి. ఆలోచించి అడుగేయాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది’ అని ఆమె వ్యాఖ్యానించారు. -
సాయిదత్త పీఠంలో వీనులవిందుగా కర్నాటక సంగీతం
సౌత్ ప్లెన్ఫీల్డ్ (న్యూజెర్సీ) : అమెరికాలో భారతీయ ఆధ్యాత్మిక పరిమళాలు పంచుతున్న న్యూజెర్సీ సాయిదత్త పీఠం కర్నాటక సంగీత కచేరి ఏర్పాటు చేసింది. ఆధ్యాత్మిక సంగీతాన్ని పంచేందుకు ప్రముఖ కర్నాటక సంగీత ప్రావీణ్యులను సాయిదత్త పీఠానికి ఆహ్వానించింది. గాయనీ గుమ్మలూరి శారదా సుబ్రమణియన్, వయోలిన్ విద్వాంసులు శ్వేతా నరసింహాన్, మృదంగ విద్వాంసులు శబరినంద రామచంద్రన్ చేసిన సంగీత కచేరి ఆధ్యాత్మిక సంగీత ప్రియులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. సిద్ధి వినాయకం, మోక్షం గలదా, శ్రీ వరలక్ష్మి సామజవరగమన, వందేశంభూం ఉమాపతి, భో.. శంభో, గోవింద బోలో, గోపాల బోలో వంటీ గీతాలు, శ్లోకాలతో పాటు సాయిభజనతో సాయి దత్త పీఠం మారుమ్రోగిపోయింది. కర్నాటక సంగీతంలో చక్కటి భక్తి సంగీత కచేరీని నిర్వహించిన శారదా సుబ్రమణియన్, శ్వేతానరసింహాన్, శబరినంద రామచంద్రన్‌లను సాయిదత్త పీఠం ప్రత్యేకంగా అభినందించింది. ఇదే సంగీత కార్యక్రమంలో స్వరరాగ సుధ కళా అకాడమీకి చెందిన ఉష, మణి ఆకెళ్లలకు స్వర సుధ కళా ప్రపూర్ణ పురస్కారాన్ని సాయిదత్తపీఠం ప్రదానం చేసింది. -
కూచిపూడితో టీచింగ్
కర్ణాటక సంగీతం మొదలు కూచిపూడి, భరతనాట్యం, కథక్, టెంపుల్‌డాన్స్ నేర్చుకుంది అచ్యుత మానస. నేర్చుకున్న కళను అద్భుతంగా అభినయించి అటు గురువుల ఆశీస్సులను, ఇటు ఆహుతుల ప్రశంసలనూ అందుకుంటోంది. ఇంకోవైపు అకడమిక్స్‌లోనూ చురుకుగానే ఉంది. ఇంజనీరింగ్ పూర్తిచేసి ఎమ్ఎన్సీలో ఉద్యోగమూ సంపాదించుకుంది. తన తండ్రి రవిచంద్ర (డిఐజీ)లాగే సివిల్స్ జాయిన్ అవ్వాలన్నది ఆమె ధ్యేయం. ఆ అభ్యాసమూ మొదలుపెట్టింది. 2010 వరకు ఇంకో ఆలోచనేదీ లేకుండా తన లక్ష్యసాధన దిశగా ప్రయాణం సాగింది. ఆ తర్వాత... ఆగస్ట్ 15, 2010. అప్పుడు మానస వాళ్ల నాన్న ఉద్యోగరీత్యా గుంటూరులో ఉన్నారు. పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు తల్లి,తండ్రీ సహా తనూ హాజరైంది. స్టేట్‌హోమ్‌లోని పిల్లలు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన వందేమాతరం పాటమీద డాన్స్ చేశారు. మానస మనసు చివుక్కుమంది. తర్వాత ఒక ఈవెంట్లో క్లాసికల్ డాన్స్ అని ‘చంద్రముఖి’ సినిమాలోని పాట మీద చేశారు. ‘పిల్లలు కదా ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. అదే క్లాసికల్ డాన్స్ అంటే నమ్ముతారు వాళ్లకేం తెలుసు’ అని అప్పటికైతే సరిపెట్టుకుంది కానీ మనసొప్పలేదు. ఆ పిల్లలకు శాస్త్రీయ నృత్యం నేర్పించాలనే తపన మొదలైంది. స్టేట్‌హోమ్‌కి వెళ్లింది. పిల్లలను పరిచయం చేసుకుంది. అసలు క్లాసికల్ డాన్స్ ఎలా ఉంటుందో చెప్పింది.. చేసిచూపించింది. జనవరి 26కల్లా వందేమాతరం పాటమీద కూచిపూడి నేర్పించింది. ప్రదర్శన ఇప్పించింది. ‘డాన్స్ అనగానే సినిమా పాటలమీద చేస్తాం’ అనే పిల్లల మైండ్‌సెట్‌ను మార్చేసింది. వాళ్లకోసం ఇంకేదో చేయాలనుకునేలోపే వాళ్ల నాన్నకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. హైదరాబాద్‌లో.. గుంటూరు స్టేట్ హోమ్ ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడి స్టేట్‌హోమ్ పిల్లలకూ డాన్స్, సంగీతం నేర్పించాలనుకుంది మానస. కథలు, పాటలతో మొదలుపెట్టి మెల్లగా అడుగుల్లోకి వచ్చింది. ‘కూచిపూడి మై లైఫ్’ అనే పేరుతో ఆ పిల్లలకు శాస్త్రీయ నృత్యం నేర్పిస్తూ శాస్త్రీయ కళల పట్ల అవగాహన కలిగిస్తోంది. ‘‘చదువు, జ్ఞానం రెండూ వేర్వేరని నా ఉద్దేశం. చదువు ఎవరైనా నేర్పిస్తారు. జ్ఞానం కళల వల్ల అబ్బుతుంది. బతకడానికి కావల్సిన ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఈ పిల్లలకు అవి చాలా అవసరం. ఈ లోకంలో తమకెవరూ లేరని, తమనెవరూ చూడరనే ఆత్మన్యూనతలోంచి లోకం తమ దృష్టిని వీరిపై మరల్చుకునే స్థితికి రావడానికి ఈ కళ వీళ్లకు ఒక సాధనంగా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. మొదట్లో ఈ పిల్లలు నాతో చాలా రూడ్‌గా ఉండేవారు. వాళ్లలో ఒక రకమైన కసి కనిపించేది. వీళ్లను డీల్ చేయగలనా? అనుకున్నాను. కానీ తర్వాత్తర్వాత నాకు మంచి స్నేహితులైపోయారు. ఈ పిల్లలతో గడిపినంత సేపు అలౌకిక ఆనందంలో ఉంటాను. ఓ గుడిలో దొరికే ప్రశాంత కనిపిస్తుంది’ అంటుంది అచ్యుత మానస. అయిదేళ్ల ప్రాయం నుంచే... అయిదేళ్ల వయసున్నప్పటి నుంచే కర్ణాటక సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టింది మానస. కాస్త ఊహ తెలిసేటప్పటికి తనకు కావల్సింది ఇది కాదు డాన్స్ అనుకుంది. ఆ మాటే అమ్మతో చెపితే.. ఎన్నాళ్లు నేర్చుకుంటుందిలే.. అని డాన్స్‌లో చేర్పించింది అమ్మ. అలా కాజా వెంకట సుబ్రహ్మణ్యం దగ్గర కూచిపూడి, డాక్టర్ దేవేంద్ర పిళై దగ్గర భరతనాట్యం, పండిట్ అంజుబాబు దగ్గర కథక్, ఓలేటి రంగమణి దగ్గర టెంపుల్‌డాన్స్ నేర్చుకుంది అచ్యుత మానస. డివీడి.. మానస గురువు అయిన కాజా వెంకట సుబ్రహ్మణ్యం నృత్యదర్శకత్వంలో ‘కూచిపూడి నృత్యాభినయ వేదిక .. నాట్యం మోక్షమార్గం’ పేరుతో చిత్రించిన డీవీడీని త్వరలోనే విడుదల చేయబోతోంది మానస. ఈ వేడుక ఆరంభవేళ కాజా వెంటక సుబ్రహ్మణ్యం కొరియోగ్రఫీలో స్టేట్‌హోమ్ పిల్లలతో నాట్యప్రదర్శన ఇప్పించబోతోంది. ‘లెర్నింగ్.. షేరింగ్.. డిస్కస్’ ఇది అచ్యుత మానస పాటించే జీవనసూత్రం. ఇదే సూత్రాన్ని స్టేట్‌హోమ్ పిల్లలకూ నేర్పించే గురుతర బాధ్యతను నిర్వర్తిస్తోంది! నిజమైన కళాసేవ చేస్తోంది! - సరస్వతి రమ -
సుకూన్ సంగమ్
Music gives a soul to the universe, wings to the mind, flight to the imagination and life to everything...అంటారు సంగీత ప్రియులు! ఇలాంటి రసజ్ఞుల సమూహమే ‘సుకూన్’ గ్రూప్! సికింద్రాబాద్.. ఓల్డ్ బోయిన్పల్లి వేదికగా సాగుతున్న ఈ రాగాలాపన గురించి చిన్న పరిచయం.. - సరస్వతి రమ సుకూన్ అంటే హిందీలో ప్రశాంతత! మధురమైన గీతాల ఆలాపనతో సంగీత ప్రియులకు అలాంటి ప్రశాంతతను పంచడానికి పుట్టిందే ఈ సుకూన్ గ్రూప్ కూడా! హిందీ ఓల్డ్ మెలోడీస్‌ని అంతే ఇంపుగా వినిపిస్తున్న దీనికి ఆసక్తికరమైన కథే ఉంది. అధికారికంగా ఈ గ్రూప్ ఏర్పడి ఐదేళ్లయినా మనుగడలో ఉన్నది మాత్రం దాదాపు ఇరవైఏళ్ల నుంచి. సుకూన్ స్వరం సవరించుకున్న వైనం.. ఎస్వీ రంగన్ అనే చార్టెడ్ అకౌంటెంట్‌కి సంగీతం అంటే ప్రాణం. వాళ్లమ్మ జయలక్ష్మి సంతానం శాస్త్రీయ సంగీతగాయని (కర్ణాటక సంగీతం). ఎమ్మెస్ సుబ్బులక్ష్మి సమకాలీనురాలే కాదు ఆమెతో వేదికనూ పంచుకున్న భాగ్యవంతురాలు కూడా! అలా తల్లి గాత్రం వింటూ కళ్లు తెరిచిన రంగన్ సహజంగానే సంగీతప్రియుడుగా మారారు. తర్వాత ప్రొఫెషనల్ సింగర్‌గానూ మారారు. ఏఆర్ రెహమాన్, కీరవాణి, ఓపీ నయ్యర్లాంటి సంగీత దిగ్గజాల నిర్దేశకత్వంలోనూ పాడారు. హిందీ ఓల్డ్ మెలోడీస్ అంటే చెవికోసుకుంటారు. ఆయన భార్య పద్మారంగన్ ఓ ఎంఎన్సీ బ్యాంక్‌లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్. ఆమే మంచి శ్రోత. వారానికోసారి వీళ్లింట్లో సంగీతాభిరుచి ఉన్న వీళ్ల స్నేహితులంతా సమావేశమయ్యేవారు. ఇలా కొన్నాళ్లు సాగాక.. మనందరం ఓ గ్రూప్‌గా ఏర్పడితే బావుంటుందనే ఆలోచనను లేవనెత్తారు బి.రామ్‌గోపాల్ అనే ఆర్కిటెక్ట్. దీన్ని సమర్థించారు వాళ్లావిడ జయశ్రీ. మిగతావాళ్లంతా కూడా మొగ్గుచూపారు. ఏ పేరు పెట్టాలనుకునేలోపే ‘ఈ పాత మధురాలను సుకూన్‌గా ఆస్వాదిస్తున్నాం కదా! మన గ్రూప్‌కీ సుకూన్ అని పెట్టుకుంటే బాగుంటుంద’ని ఏకగ్రీవంగా నిర్ణయించేశారు. అలా సుకూన్ ఆలాపన మొదలైంది. థీమ్ ప్రోగ్రామ్స్ ఓ పది జంటలతో మొదలైన ఈ గ్రూప్‌లో ఇప్పుడు యాభై జంటలు సభ్యులుగా ఉన్నారు. దాదాపు అందరూ నలభై ఏళ్లు పైబడిన వారే. కారణం.. వీళ్లంతా 1950, 60, 70లనాటి ఆపాతమధురాలను ఇష్టపడేవాళ్లే. సుకూన్ ట్యాగ్ లైన్ కూడా ప్యూర్ మెలోడీ. అయితే ఈ ఓల్డ్మెలోడీస్ని ఇష్టపడే యూత్ కూడా జాయిన్ అవ్వచ్చు ఇందులో. అలా మక్కువున్న పాతికేళ్ల కుర్రాళ్లు కొంతమంది కూడా ఈ సుకూన్‌లో స్వరాలు పంచుకుంటున్నారు. ఆక్యుపంక్చర్ రంగంలో ప్రముఖులైన మిస్టర్ అలెక్ అండ్ మిసెస్ అల్కాసౌధాని, సూర్య మసాలా యజమాని మిస్టర్ రాజీవ్మోదీ అండ్ మిసెస్ నవనీత్మోదీలాంటి వాళ్లంతా ఇందులో సభ్యులే. ఉద్యోగుల దగ్గర్నుంచి డాక్టర్లు, కళాకారులు, క్రీడాకారులు, వ్యాపారులు ఇలా పాటలంటే ప్రాణమున్న అందరూ ఇందులో ఉన్నారు. ప్రతి మూడు నెలలకొకసారి ప్రోగ్రామ్ చేస్తారు. సభ్యులంతా పాడరు. రంగన్తోపాటు పాడాలని ఉత్సాహమున్న ఒకరిద్దరు పాడుతారు. ప్రతి ప్రోగ్రామ్‌కి ఓ థీమ్‌ను నిశ్చయిస్తారు. ఒకసారి రొమాంటిక్ సాంగ్స్‌ని థీమ్ ఎంచుకుంటే ఒకసారి మనసు మీద రాసిన పాటలను థీమ్ ఎంచుకుంటారు. థీమ్‌కి తగిన వస్త్రధారణతో వస్తారు ఆహూతులంతా. జనవరిలో జరిగే ప్రోగ్రామ్‌కు బ్లాక్ అండ్ వైట్ సినిమాల పాటలను థీమ్‌గా ఎంచుకున్నారు. చక్కటి పాటలకు తోడు కమ్మని విందూ ఈ కచేరి విశేషం. పరిచయాలను ఉపయోగించుకునే వేదిక కాదు సుకూన్ గ్యాదరింగ్స్ చాలా ప్రత్యేకమైనవి. అంతే క్రమశిక్షణతో ఉంటాయి. ఈ ప్రోగ్రామ్‌కి వచ్చి పిచ్చాపాటీ మాట్లాడుకోరు. బిజినెస్ వ్యవహారాలు చూసుకోరు. మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్ ప్రశ్నలే ఉండవ్. పాటలు వినడానికి మాత్రమే వస్తారు కాబట్టి ఆ పాటలను మనసావాచా ఆస్వాదిస్తారు. ఆ నాలుగైదు గంటలు వాళ్లకు ఆ పాటలే ప్రపంచం. మిగిలిన లోకంతో లింక్ ఉండదు. దీనికి ఎంత క్రేజ్ అంటే ప్రోగ్రామ్ క్యాలెండర్‌ను బట్టే మిగిలిన వాళ్లు తమ షెడ్యూల్‌ను నిర్ణయించుకుంటారు. ‘రోజువారీ బిజీలైఫ్ నుంచి సుకూన్ కచేరీలు మాకు మంచి రిలీఫ్. ఆ మూడు నెలలుపడ్డ శ్రమ, టెన్షన్ ఈ మెలోడీస్‌తో దూరమవుతాయి. ఆ ఐదు గంటలు నిజంగానే ఎంతో ప్రశాంతతనిస్తుంది ‘సుకూన్’. తెల్లవారి పనికి కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది’ అంటారు ఆర్కిటెక్ట్ రామ్‌గోపాల్. ‘సాధారణంగా ఈ ప్రోగ్రామ్‌కి చిన్నపిల్లలను అనుమతించం. పిల్లలు బోర్ ఫీలవుతారని. కానీ మా రెండేళ్ల మనుమరాలికి మాత్రం ప్రత్యేక ఆహ్వానం ఉంది. ఆ ఐదు గంటలు పాప ఎంత శ్రద్ధగా పాటలు వింటుందంటే తర్వాత వచ్చీరాని మాటలతో ఆ పాటలను హమ్ చేస్తుంది కూడా. అంతిష్టం మా మనువరాలికి ఈ ప్రోగ్రామ్ అంటే’ అంటారు జయశ్రీ. ‘ఓ ప్రోగ్రామ్ అయిపోగానే ఇంకో ప్రోగ్రామ్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తుంటారంతా. మరీ మూడు నెల్లకోసారి అంటే లేట్ అవుతోంది నెలకోసారే పెట్టుకుందాం అంటున్నారు మా సభ్యులు. దాన్ని పరిశీలిస్తున్నాం’ అని చెప్పారు పద్మారంగన్. ‘సుకూన్ పుణ్యమాని ఎస్డీ బర్మన్, ఆర్డీ బర్మన్, కిషోర్దా పాటలను మళ్లీ మళ్లీ వినే అవకాశం కలుగుతోంది. రియల్లీ ఎంజాయింగ్ లాట్’ అంటారు ప్రముఖ వ్యాపారవేత్త జె.బాబూరావు (కేంద్ర మాజీమంత్రి ముత్యాల్రావు కొడుకు). ‘కొత్త హోరులో పాత స్వరం వినిపించకుండా పోతోంది. వాటిని సజీవంగా ఉంచుకునే లక్ష్యంతోనే ఏర్పడింది ఈ సుకూన్’ అంటారు రంగన్. కొసమెరుపు రంగన్,, పద్మారంగన్ దంపతుల కొడుకు విష్ణు కూడా సుకూన్ సభ్యుడు. తండ్రిలాగే మంచి గాయకుడు. ఇప్పుడు అమెరికాలో ఎమ్మెస్ చదువుతున్నాడు. అక్కడా సుకూన్ గ్రూప్ మొదలుపెట్టి పాత పాటల తియ్యదనాన్ని శ్రోతలకు పంచుతున్నాడు. -
వయొలిన్ విద్వాంసులు ఇవటూరి కన్నుమూత
విశాఖ : ప్రముఖ వయొలిన్ విద్వాంసులు ఇవటూరి విజయేశ్వరరావు (76) కన్నుమూశారు. విశాఖలోని ఆయన స్వగృహంలో శనివారం ఉదయం ఇవటూరి స్వర్గస్తులైనారు. ఇవటూరి విజయేశ్వరరావు 1938, మే 29న విశాఖలో జన్మించారు. చూపు లేకపోయినా, ఎందరికో సంగీత పాఠాలు నేర్పి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నంలో సంగీత విద్వాంసులను తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇవటూరి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2011లో ప్రతిభా రాజీవ్ పురస్కారంతో సన్మానించింది. ప్రముఖ వయొలిన్ విద్వాంసులు స్వర్గీయ ద్వారం వెంకటస్వామి నాయుడు ప్రియశిష్యుల్లో ఇవటూరి విజయేశ్వరరావు ఒకరు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. -
సామాన్యుల దరికి సంగీతం
స్ఫూర్తి ఈమధ్య చెన్నైలో అద్భుతమైన కర్ణాటక సంగీతకచేరి ఒకటి జరిగింది. చెన్నైలోని మున్సిపల్ స్కూళ్ళలో చదివే పేద పిల్లల సంగీత కచ్చేరి అది. ఆ పిల్లలను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతుంటే అనిల్ శ్రీవాస్తవన్ కళ్లు ఒకింత గర్వంగా మెరిసాయి. ఎవరీయన? పియానిస్ట్‌గా చేయి తిరిగిన చెన్నైవాసి అనిల్ శ్రీవాస్తవన్ అమెరికాలో చదువుకున్నారు. నిజానికి ఆయన మనసంతా సంగీతమే. మూడు సంవత్సరాల వయసులో పియానో ప్రేమలో పడిన శ్రీవాస్తవన్ దాన్ని వాయించడంలో మెలకువలు నేర్చుకున్నాడు. స్కూల్లో అతనికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది పియానో. సంగీతమే శ్వాస అనుకున్న శ్రీవాస్తవన్ పదిహేడు సంవత్సరాల వయసులో సంగీతానికి దూరం కావాల్సి వచ్చింది. నాన్న అనారోగ్యంతో ఇంటిని ఆర్థికసమస్యలు చుట్టుముట్టాయి. ‘‘కుటుంబ పరిస్థితి చూస్తున్నావు కదా...పియానో మీద కాదు చదువు మీద దృష్టి పెట్టు’’ అని చెప్పింది అమ్మ. దీంతో తన సంగీత స్వప్నాలను వెనకకుర్చీలో కూర్చో పెట్టక తప్పింది కాదు. ఎకనామిక్స్‌లో మంచి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా ముంబయిలో పనిచేశాడు. కొంత కాలం తరువాత యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో యంబిఏ చేశాడు. జీవన ప్రయాణంలో పరుగులు పెడుతూనే ఉన్నాడు. అయితే తన జీవితంలో సంగీతం లేదని గుర్తుకొచ్చినప్పుడల్లా బాధగా ఉంది. టర్నింగ్ పాయింట్1 ఒకసారి సెలవులకు ఇండియాకు వచ్చినప్పుడు మాండోలిన్ శ్రీనివాస్, రాజేష్‌లను కలుసుకున్నాడు. వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు తనలోని సంగీతాన్ని ఎవరో తట్టిలేపినట్లు అనిపించింది. అలా మళ్లీ సంగీతానికి దగ్గరయ్యాడు. రాజేష్‌తో కలిసి ‘ఇన్ టు ది లైట్’ ఆల్బమ్ చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది తన జీవితానికి టర్నింగ్ పాయింట్. కొలంబియాలో పీహెచ్‌డి చేస్తున్నప్పుడు ఎక్కువ సమయం మ్యూజిక్ డిపార్ట్మెంట్లోనే గడిపేవాడు. అక్కడ కొత్త విషయాలు తెలుసుకునేవాడు. ఒకానొక రోజు ‘‘సంగీతం కోసం పిహెచ్డి వదిలేస్తున్నాను’’ అని అమ్మకు మెసేజ్ పెట్టాడు. స్కూల్లో తన కంటే జూనియర్ గురుచరణ్‌ను ఒకానొక సందర్భంలో కలుసుకోవడం కూడా శ్రీవాస్తవన్ త్వరగా సంగీతం వైపు రావడానికి కారణమైంది. గురుచరణ్‌కు కూడా సంగీతం అంటే ప్రాణం. అతనితో కలిసి చేసిన ‘మదిరాక్షి’ అనే ఆల్బమ్‌కు మంచి స్పందన లభించింది. ‘‘ఆల్బమ్‌కు వచ్చిన స్పందన పద్నాలుగు సంవత్సరాల బాధను మాయం చేసింది’’ అంటాడు శ్రీవాస్తవన్. ఎందరో ప్రముఖులతో కలిసి ఆల్బమ్‌లు రూపొందించిన శ్రీవాస్తవ త్వరలో ‘కీ టు ఇండియా’ అనే ఆల్బమ్‌ను విడుదల చేయనున్నాడు. టర్నింగ్ పాయింట్2 పిల్లలంటే ఇష్టపడే శ్రీవాస్తవన్... వాళ్లతో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాడు. అలా ఒకసారి తిరువరూర్లో ప్రభుత్వపాఠశాల విద్యార్థులతో మాట్లాడుతున్న క్రమంలో సంగీతానికి సంబంధించిన ప్రాథమిక విషయాలు వారిని అడిగాడు. అప్పుడు ఆయనకు అర్థమయ్యిందేమిటంటే, పిల్లలకు సినిమా జ్ఞానం తప్ప సంగీతజ్ఞానం బొత్తిగా లేదని. ఇది శ్రీవాస్తవన్ను బాధకు గురి చేసింది. ‘పాఠశాలలో సంగీతానికి ప్రాధాన్యత లేదు’ ‘సంగీత పట్టభద్రులకు ఉద్యోగాలు లేవు’ బాధగా అనుకున్నాడు తనలో తాను. సంగీతాన్ని, సంస్కృతిని పిల్లలకు చేరువ చేయాలనే ఆలోచనతో ఇరవై రెండు లక్షల రూపాయలతో ‘రాప్సోడీ మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ’ని స్థాపించాడు. గవర్నమెంట్ స్కూళ్లకు వెళ్లి మ్యూజిక్‌ను ఒక సబ్జెక్ట్‌గా చేర్చి, దానికి సంబంధించిన విద్యావిధానానికి రూపకల్పన చేస్తుంది రాప్సోడీ. రాప్సోడీ నుంచి ఉపాధ్యాయులు ప్రభుత్వపాఠశాలలకు వెళ్లి సంగీత పాఠాలు బోధిస్తుంటారు. ‘మ్యూజిక్ అండ్ ది మైండ్’ పేరుతో డా.సుధా రాజాతో కలిసి పాఠ్యప్రణాళికను రూపొందించాడు శ్రీవాస్తవన్. ‘‘గణితం, భూగోళశాస్త్రం, చరిత్ర, సైన్స్‌లాగే సంగీతాన్ని కూడా ఒక సబ్జెక్ట్‌గా పరిగణించాలి’’ అనేది ఆయన కోరిక. విశేషం ఏమిటంటే సైన్స్ పాఠాలను పాటలుగా రూపొందించి పిల్లలతో పాడిస్తున్నారు. దీంతో సంగీతం వచ్చినట్లు ఉంటుంది, సబ్జెక్ట్ వచ్చినట్లూ ఉంటుంది. ఆర్థికసమస్యల వల్ల సంగీతం నేర్చుకోవడం అనేది ఒకప్పుడు పేదపిల్లలకు కష్టమైన పని కావచ్చు. కాని శ్రీవాస్తవన్ కృషి వల్ల ఇప్పుడు సంగీతం అనేది పేదపిల్లలను వెదుక్కుంటూ మరీ వస్తుంది. దేశవ్యాప్తంగా పేద విద్యార్థులకు సంగీతాన్ని చేరవేయాలనేది శ్రీవాస్తవన్ కల. ఆ దిశగా ఆయన అభినందన పూర్వకమైన ప్రయత్నం చేస్తున్నారు. -
దాచుకో నీ పాదాలకు తగ...
(అన్నమయ్య భావనా వాహిని నేటి కి ముప్పై శరత్తులు పూర్తి చేసుకున్న సందర్భంగా...) ఆమె గళం అన్నమయ్య... ఆమె మన ం అన్నమయ్య... పాడితే అన్నమయ్య... పలికితే అన్నమయ్య... ఆమె ఉచ్ఛ్వాసనిశ్వాసాలు అన్నమయ్య... సర్వం అన్నమయ్య స్వరూపం... అన్నమయ్య గళార్చనలో తరిస్తున్న ఆమె శోభారాజ్. అన్నమయ్య పురం ప్రారంభించడానికి కార ణాలు... నేను నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర కర్ణాటక సంగీతంలో సూక్ష్మ విషయాలు తెలుసుకుంటున్నాను. ప్రపంచశాంతికి అవసరమైన అవగాహన ఆ సంకీర్తనల్లో ఉందని గ్రహించాను. అద్భుతమైన కవిత్వం, అందమైన భావన, ప్రౌఢమైన రచనల నుంచి జానపదాల వరకు రచించిన అన్నమాచార్య అంటే ఆరాధన, అనుబంధం ఏర్పడుతూ వచ్చింది. వారి విశాలభావాలు నాకు బాగా నచ్చాయి. అదే సమయంలో నేను సినిమా సంగీత పోటీలలో బహుమతులందుకున్నాను. పెద్ద్దల ప్రశంసలు పొందాను. వారంతా సినిమా పాటలు పాడమంటే, అదృష్ట పరీక్ష చేసుకుందామనుకున్నాను. సరిగ్గా ఆ సమయంలోనే అంటే 1976లో టీటీడీ నుంచి పిలుపు వచ్చింది... అన్నమాచార్య సంకీర్తనల మీద అధ్యయనం చేసి, వాటిని ప్రచారం చేయడానికి బాణీలు చేయమని, అందుకు స్కాలర్షిప్ ఇస్తామని. ఒక పక్క సినిమా పాటలు, మరోపక్క స్వామి పిలిచాడు. ఏం చేయాలా అనే ఈ సంకట పరిస్థితిలో... స్వామిసేవకే నా హృదయం మొగ్గు చూపించింది. ఎందరో కళాకారులున్నా భగవంతుడు ఈ అవకాశం నాకే ఇచ్చినట్లుగా అనిపించింది. ‘జీవితాంతం నీ సేవ చేసుకుంటాను’ అని ప్రమాణం చేశాను. ఆ తరవాత... ‘నాకు పాడే శక్తి ఉంది, రాసే శక్తి ఉంది, మాట్లాడే శక్తి కూడా ఉంది. స్వామీ నాతో సేవ చేయించుకో’ అన్నాను. అలా 1983 నవంబరు 30, నా పుట్టినరోజు నాడు అన్నమయ్య భావనా వాహిని ఆవిర్భవించింది. అద్దె స్థలం నుంచి... నా సేవలను గుర్తించి, 1998లో రాష్ట్ర ప్రభుత్వం మా సంస్థకు స్థలం కేటాయించింది. నేను సంపాదించిన ధనం, కొంత విరాళాలు కలిపి ఆడిటోరియం నిర్మించాను. ఈ హాల్ ప్రారంభించి పదకొండేళ్లయింది. అన్నమయ్య పేరు దివ్యత్వం, శాశ్వతం కావాలనే ధ్యేయంతో ఆ ప్రాంగణంలోనే అన్నమయ్య, వేంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాను. ప్రపంచంలో ఒకే గర్భంలో వీరిద్దరికీ నిర్మితమైన ప్రప్రథమ దేవాలయం. శిష్యుల గురించి... ఇక్కడ 1984 నుంచి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాను. ఇప్పటికి సుమారు 16000 మందికి శిక్షణ ఇచ్చాను. అన్నమయ్య సంకీర్తనల మీద పోటీలు నిర్వహిస్తున్నాను. యేటా అన్నమయ్య జయంతి, వర్థంతి సందర్భంగా చిక్కడపల్లి వేంకటేశ్వర ఆలయం నుంచి టాంక్బండ్ అన్నమయ్య విగ్రహం వరకు నగర సంకీర్తన చేస్తున్నాము. మరచిపోలేని సంఘటనలు... చంచల్‌గూడ సెంట్రల్ జైలులో 1997 నవంబరు 30న నా పుట్టినరోజు సందర్భంగా దాదాపు 1700 మంది ఖైదీల సమక్షంలో కేక్ కట్ చేసి, వారి సమక్షంలో సంకీర్తనలు చేయడం... దానికి వారినుంచి లభించిన అపూర్వ స్పందన. ఉపశమన సంకీర్తన కార్యక్రమం... ఒత్తిడిలో ఉన్నవారు, జీవితంలో అనుకోని సంఘటనలకు, దుఃఖానికి లోనైనవారి ఇళ్లలో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. సోషల్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక ఆయన హెర్నియా ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఎనిమా కోసం వాటర్ బదులుగా ఆసిడ్ ఎక్కించడంతో పేగులు దెబ్బతిన్నాయి. దాంతో ఆయన డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. అక్కడ ఉపశమన సంకీర్తన చేశాం. ‘‘మీరు పాడుతున్నంతసేపు మాకు స్వామివారు ఉన్న అనుభూతి కలిగింది’’ అని చెప్పారాయన. కొంతకాలం తర్వాత ఆయన మా ఇంటికి వచ్చి, నేను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను’’ అని చెప్పడం ఎంతో ఆనందం కలిగించింది. ఆ తర్వాత నుంచి నేను సంకీర్తనౌషధం పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. అభిరుచులు... నాకు ఎం.ఎస్ సుబ్బులక్ష్మిగారి భక్తిభావం, అంకిత భావం, సుశీల గారి ఉచ్చారణ, మాధుర్యం, లతామంగేష్కర్గారి వాయిస్ మాడ్యులేషన్, మెలడీ, బాలుగారి సంస్కారవంతమైన ప్రవర్తన, బాలమురళి వంటి వారి నిరంతర కృషి ఎంతో ఇష్టం. అన్నమయ్య కీర్తనలలో బాగా నచ్చినది... అన్నమయ్య చరమ దశలో రచించిన ‘‘దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివి... సంకీర్తనలో, ‘‘నా నాలుక నుండి నానా సంకీర్తనలు పూని నాచే నిన్ను పొగడించితివి’’ కీర్తన చాలా నచ్చింది. మీరు చేసిన మార్పులు... ‘అదిగో అల్లదిగో’ సంకీర్తనను జనసామాన్యంలోకి తీసుకువెళ్లడానికి మల్లిక్‌గారు పాడిన భౌళిరాగంలో బాణిని తీసుకుని, భావోద్దీపన కోసం ఎక్కడ ఎలా పలికితే బావుంటుందో అలా మార్చాను. అనుపల్లవితో కీర్తన ప్రారంభించే సంప్రదాయం మేరకు నేను ప్రారంభించిన ‘బ్రహ్మమొక్కటే’కీర్తన సాధించిన విజయాలు... అన్నమయ్య తపాలాబిళ్ల కోసం కృషిచేసి, 2004లో అన్నమయ్యపురంలో తపాలాబిళ్ల విడుదల చేశాను. దేశవిదేశాలలో కార్యక్రమాలద్వారా యువతను ప్రోత్సహిస్తున్నాను. ప్రస్తుతం దేవాలయ కుంభాభిషేకం కోసం ప్రయత్నిస్తున్నాను. -డా.పురాణపండ వైజయంతి