సుకూన్ సంగమ్
Music gives a soul to the universe, wings to the mind, flight to the imagination and life to everything...అంటారు సంగీత ప్రియులు! ఇలాంటి రసజ్ఞుల సమూహమే ‘సుకూన్’ గ్రూప్! సికింద్రాబాద్.. ఓల్డ్ బోయిన్‌పల్లి వేదికగా సాగుతున్న ఈ రాగాలాపన గురించి చిన్న పరిచయం..
- సరస్వతి రమ
సుకూన్ అంటే హిందీలో ప్రశాంతత! మధురమైన గీతాల ఆలాపనతో సంగీత ప్రియులకు అలాంటి ప్రశాంతతను పంచడానికి పుట్టిందే ఈ సుకూన్ గ్రూప్ కూడా! హిందీ ఓల్డ్ మెలోడీస్‌ని అంతే ఇంపుగా వినిపిస్తున్న దీనికి ఆసక్తికరమైన కథే ఉంది. అధికారికంగా ఈ గ్రూప్ ఏర్పడి ఐదేళ్లయినా మనుగడలో ఉన్నది మాత్రం దాదాపు ఇరవైఏళ్ల నుంచి.
సుకూన్ స్వరం సవరించుకున్న వైనం..
ఎస్‌వీ రంగన్ అనే చార్టెడ్ అకౌంటెంట్‌కి సంగీతం అంటే ప్రాణం. వాళ్లమ్మ జయలక్ష్మి సంతానం శాస్త్రీయ సంగీతగాయని (కర్ణాటక సంగీతం). ఎమ్మెస్ సుబ్బులక్ష్మి సమకాలీనురాలే కాదు ఆమెతో వేదికనూ పంచుకున్న భాగ్యవంతురాలు కూడా! అలా తల్లి గాత్రం వింటూ కళ్లు తెరిచిన రంగన్ సహజంగానే సంగీతప్రియుడుగా మారారు. తర్వాత ప్రొఫెషనల్ సింగర్‌గానూ మారారు. ఏఆర్ రెహమాన్, కీరవాణి, ఓపీ నయ్యర్‌లాంటి సంగీత దిగ్గజాల నిర్దేశకత్వంలోనూ పాడారు.
హిందీ ఓల్డ్ మెలోడీస్ అంటే చెవికోసుకుంటారు. ఆయన భార్య పద్మారంగన్ ఓ ఎంఎన్‌సీ బ్యాంక్‌లో మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్. ఆమే మంచి శ్రోత. వారానికోసారి వీళ్లింట్లో సంగీతాభిరుచి ఉన్న వీళ్ల స్నేహితులంతా సమావేశమయ్యేవారు. ఇలా కొన్నాళ్లు సాగాక.. మనందరం ఓ గ్రూప్‌గా ఏర్పడితే బావుంటుందనే ఆలోచనను లేవనెత్తారు బి.రామ్‌గోపాల్ అనే ఆర్కిటెక్ట్. దీన్ని సమర్థించారు వాళ్లావిడ జయశ్రీ. మిగతావాళ్లంతా కూడా మొగ్గుచూపారు. ఏ పేరు పెట్టాలనుకునేలోపే ‘ఈ పాత మధురాలను సుకూన్‌గా ఆస్వాదిస్తున్నాం కదా! మన గ్రూప్‌కీ సుకూన్ అని పెట్టుకుంటే బాగుంటుంద’ని ఏకగ్రీవంగా నిర్ణయించేశారు. అలా సుకూన్ ఆలాపన మొదలైంది.
థీమ్ ప్రోగ్రామ్స్
ఓ పది జంటలతో మొదలైన ఈ గ్రూప్‌లో ఇప్పుడు యాభై జంటలు సభ్యులుగా ఉన్నారు. దాదాపు అందరూ నలభై ఏళ్లు పైబడిన వారే. కారణం.. వీళ్లంతా 1950, 60, 70లనాటి ఆపాతమధురాలను ఇష్టపడేవాళ్లే. సుకూన్ ట్యాగ్ లైన్ కూడా ప్యూర్ మెలోడీ. అయితే ఈ ఓల్డ్‌మెలోడీస్‌ని ఇష్టపడే యూత్ కూడా జాయిన్ అవ్వచ్చు ఇందులో. అలా మక్కువున్న పాతికేళ్ల కుర్రాళ్లు కొంతమంది కూడా ఈ సుకూన్‌లో స్వరాలు పంచుకుంటున్నారు. ఆక్యుపంక్చర్ రంగంలో ప్రముఖులైన మిస్టర్ అలెక్ అండ్ మిసెస్ అల్కాసౌధాని, సూర్య మసాలా యజమాని మిస్టర్ రాజీవ్‌మోదీ అండ్ మిసెస్ నవనీత్‌మోదీలాంటి వాళ్లంతా ఇందులో సభ్యులే.
ఉద్యోగుల దగ్గర్నుంచి డాక్టర్లు, కళాకారులు, క్రీడాకారులు, వ్యాపారులు ఇలా పాటలంటే ప్రాణమున్న అందరూ ఇందులో ఉన్నారు. ప్రతి మూడు నెలలకొకసారి ప్రోగ్రామ్ చేస్తారు. సభ్యులంతా పాడరు. రంగన్‌తోపాటు పాడాలని ఉత్సాహమున్న ఒకరిద్దరు పాడుతారు. ప్రతి ప్రోగ్రామ్‌కి ఓ థీమ్‌ను నిశ్చయిస్తారు. ఒకసారి రొమాంటిక్ సాంగ్స్‌ని థీమ్ ఎంచుకుంటే ఒకసారి మనసు మీద రాసిన పాటలను థీమ్ ఎంచుకుంటారు. థీమ్‌కి తగిన వస్త్రధారణతో వస్తారు ఆహూతులంతా. జనవరిలో జరిగే ప్రోగ్రామ్‌కు బ్లాక్ అండ్ వైట్ సినిమాల పాటలను థీమ్‌గా ఎంచుకున్నారు. చక్కటి పాటలకు తోడు కమ్మని విందూ ఈ కచేరి విశేషం.
పరిచయాలను ఉపయోగించుకునే వేదిక కాదు
సుకూన్ గ్యాదరింగ్స్ చాలా ప్రత్యేకమైనవి. అంతే క్రమశిక్షణతో ఉంటాయి. ఈ ప్రోగ్రామ్‌కి వచ్చి పిచ్చాపాటీ మాట్లాడుకోరు. బిజినెస్ వ్యవహారాలు చూసుకోరు. మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్ ప్రశ్నలే ఉండవ్. పాటలు వినడానికి మాత్రమే వస్తారు కాబట్టి ఆ పాటలను మనసావాచా ఆస్వాదిస్తారు. ఆ నాలుగైదు గంటలు వాళ్లకు ఆ పాటలే ప్రపంచం. మిగిలిన లోకంతో లింక్ ఉండదు. దీనికి ఎంత క్రేజ్ అంటే ప్రోగ్రామ్ క్యాలెండర్‌ను బట్టే మిగిలిన వాళ్లు తమ షెడ్యూల్‌ను నిర్ణయించుకుంటారు. ‘రోజువారీ బిజీలైఫ్ నుంచి సుకూన్ కచేరీలు మాకు మంచి రిలీఫ్. ఆ మూడు నెలలుపడ్డ శ్రమ, టెన్షన్ ఈ మెలోడీస్‌తో దూరమవుతాయి.
ఆ ఐదు గంటలు నిజంగానే ఎంతో ప్రశాంతతనిస్తుంది ‘సుకూన్’. తెల్లవారి పనికి కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది’ అంటారు ఆర్కిటెక్ట్ రామ్‌గోపాల్. ‘సాధారణంగా ఈ ప్రోగ్రామ్‌కి చిన్నపిల్లలను అనుమతించం. పిల్లలు బోర్ ఫీలవుతారని. కానీ మా రెండేళ్ల మనుమరాలికి మాత్రం ప్రత్యేక ఆహ్వానం ఉంది. ఆ ఐదు గంటలు పాప ఎంత శ్రద్ధగా పాటలు వింటుందంటే తర్వాత వచ్చీరాని మాటలతో ఆ పాటలను హమ్ చేస్తుంది కూడా. అంతిష్టం మా మనువరాలికి ఈ ప్రోగ్రామ్ అంటే’ అంటారు జయశ్రీ. ‘ఓ ప్రోగ్రామ్ అయిపోగానే ఇంకో ప్రోగ్రామ్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తుంటారంతా. మరీ మూడు నెల్లకోసారి అంటే లేట్ అవుతోంది నెలకోసారే పెట్టుకుందాం అంటున్నారు మా సభ్యులు. దాన్ని పరిశీలిస్తున్నాం’ అని చెప్పారు పద్మారంగన్.
‘సుకూన్ పుణ్యమాని ఎస్‌డీ బర్మన్, ఆర్‌డీ బర్మన్, కిషోర్‌దా పాటలను మళ్లీ మళ్లీ వినే అవకాశం కలుగుతోంది. రియల్లీ ఎంజాయింగ్ లాట్’ అంటారు ప్రముఖ వ్యాపారవేత్త జె.బాబూరావు (కేంద్ర మాజీమంత్రి ముత్యాల్‌రావు కొడుకు). ‘కొత్త హోరులో పాత స్వరం వినిపించకుండా పోతోంది. వాటిని సజీవంగా ఉంచుకునే లక్ష్యంతోనే ఏర్పడింది ఈ సుకూన్’ అంటారు రంగన్.
కొసమెరుపు
రంగన్,, పద్మారంగన్ దంపతుల కొడుకు విష్ణు కూడా సుకూన్ సభ్యుడు. తండ్రిలాగే మంచి గాయకుడు. ఇప్పుడు అమెరికాలో ఎమ్మెస్ చదువుతున్నాడు. అక్కడా సుకూన్ గ్రూప్ మొదలుపెట్టి పాత పాటల తియ్యదనాన్ని శ్రోతలకు పంచుతున్నాడు.