ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీటూ’ ఉద్యమం ఇప్పుడు కర్ణాటక సంగీతం, భరత నాట్య రంగాలను కూడా కుదిపేస్తోంది. అసభ్యంగా తడమడం నుంచి బలవంతంగా ముద్దు పెట్టుకోవడం, లైంగికంగా లొంగతీసుకోవడం వరకు పురుష పుంగవుల నుంచి అనుభవాలను ఎదుర్కొన్న వందల మంది కళాకారిణులు తమకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలను బాహ్య ప్రపంచానికి వెల్లడించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ ఉద్యమంలో బాధితులంతా కలిసికట్టుగా ముందుకు రావాలంటూ దాదాపు 200 మంది కళాకారిణులు సంతకాలతో కూడిన ఓ ప్రకటనను కూడా మీడియాకు విడుదల చేశారు.
‘ఇటు కర్ణాటక సంగీతం, అటు భరత నాట్యంలోనూ మహిళలు, ముఖ్యంగా యువతులకు, టీనేజర్లకు విద్యను నేర్పేటప్పుడు గురువులు అసభ్యంగా తాకడం సర్వ సాధారణం. ఆధునిక ప్రపంచంలో సినిమా తారల స్థాయికి ఎదగాలంటే ఇలాంటి, అలాంటి భంగమల్లో నృత్యం చేయాలంటూ అసభ్య భంగిమలు పెట్టించేందుకు ప్రయత్నించడం, అసభ్యంగా తాకడం కూడా మామూలే. మాస్టారు! దూరంగా ఉండి భంగిమల్ని చూపించమంటే...నృత్యం మీద దృష్టిని కేంద్రీకరించండంటూ మరీ గట్టిగా హత్తుకుంటారు. సంగీత మాస్టార్లు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. వారికి పడక సుఖం అందించకపోతే కర్ణాటక సంగీతంలో కరీర్‌ను దెబ్బతీస్తున్నారు. దెబ్బతీస్తామని హెచ్చరిస్తున్నారు.
మహిళా కళాకారుల ముందే బూతు జోకులు వేయడం, వేసుకోవడం, వెకిలి చేష్టలు చేయడం వారికి అలవాటు. ఇక విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఒకే చోట విడిది చేస్తాం కనుక, మహిళల ముందే వారు కంప్యూటర్లలో, టీవీల్లో నీలి చిత్రాలు చూస్తారు. ఆడ, మగ పడుకోవడం, పడక సుఖాన్ని పంచుకోవడం చాలా సహజమైన విషయం అన్నట్లుగా మాట్లాడుతారు, కవ్వించేందుకు ప్రయత్నిస్తారు. నెత్తిన విభూతి బొట్టు, సిల్క్ పంచకట్టు మాటన తమ అసభ్య ప్రవర్తను దాచేందుకు గురువులు ప్రయత్నిస్తారు. తోటి మగ కళాకారుల నుంచి కూడా మాకు లైంగిక వేధింపులు ఉన్నాయి. అయితే అవి గురువుల స్థాయిలో లేవు. ఈ రెండు రంగాల్లో పురుషులది, అగ్రవర్ణాలదే ఆధిపత్యం కనుక వారి ఆగడాలకు అంతులేకుండా పోతోంది’ అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని సంగీత, భరత నాట్య రంగాలకు చెందిన పలువురు కళాకారిణులు వాపోయారు.
వారు అకాశరామన్న ఖాతాల ద్వారా ఇప్పటికే ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల్లో తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఇంకా షేర్ చేసుకుంటున్నారు. ఈ రంగాల్లో కూడా ‘మీటూ’ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ఓ సాంస్కృతిక సంస్థ ‘ఏక్ పుత్లీ రేతి కీ’ ఈ నెల 21వ తేదీన, ఆదివారం చెన్నైలో ‘బహిరంగ విచారణ–సంప్రతింపులు’ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆత్మవంచనా ప్రపంచాలే! శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ భరత నాట్యం రెండూ కూడా భారత్‌లో భయంకరమైన ఆత్మవంచనా ప్రపంచాలని ఓ సంగీత విద్వాంసుడి చేతుల్లో ఏడేళ్ల క్రితం లైంగిక దాడికి గురైన పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని మరో కళాకారిణి ఆరోపించారు.
నుదుట విభూతి, సిల్కు పంచె, భక్తి మాటున దాగిన రాక్షసులు వీరని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ‘సైబర్ సెక్స్ నీకు ఇష్టమా ? అంటూ శిష్యురాళ్లను అడిగిన గురువులను కూడా చూశానని ఆమె చెప్పారు. తన కళ్ల ముందు తోటి కళాకారుడితో పడుకోవాలంటూ తన గురువు బలవంతం చేస్తున్నాడంటూ, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందంటూ ఓ విద్యార్థిని ఏడుస్తూ వచ్చి తనను గట్టిగా వాటేసుకోవడం తనకు తెలుసునని ఆ కళాకారుణి చెప్పారు.
ఇదంతా బహిరంగ రహస్యమే!
భారత శాస్త్రీయ కళా రంగాల్లో లైంగిక వేధింపులనేవి బహిరంగ రహస్యమేనని ప్రముఖ కర్ణాటక సంగీత గాత్ర విద్వాంసుడు, కాలమిస్టు టీఎం కృష్ణ వ్యాఖ్యానించారు. ఇలాంటి సంఘటనల గురించి ఎప్పటి నుంచో గుసగుసలు, కబుర్లు వింటున్నాం. వీటి పట్ల నాతో సహా పలువురు కళాకారులు మౌనం పాటిస్తూ వచ్చాం. ఈ గొడవలు, సంబంధాలు వాటంతటవే సాధారణం కావాలని, సర్దుకుపోవాలని ఆశించామని ఆయన చెప్పారు. పైగా జరిగినదానికి తాము మహిళలనే దూషించామని కూడా ఆయన చెప్పారు. ఈ విషయంలో మహిళల పక్షాన నిలబడలేక పోయినందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు. ముందుగా మనం చేయాల్సిందిల్లా సంగీత విద్వాంసులను, గురువులను దైవ స్వరూపులుగా చూడడం, భావించడాన్ని మానుకోవాలని ఆయన అన్నారు. ఈ రంగాల్లో పురుషాధిక్యం, అగ్రవర్ణాల ఆదిపత్యం కొనసాగుతుండడం వల్ల అధికారం, అహంకారంతో కూడా ఈ లైంగిక దాడులు జరుగుతున్నాయని గాయకురాలు సుధా రఘునాథన్ అభిప్రాయపడ్డారు.
ముందునుంచే తెలుసు: సింగర్ జయశ్రీ
కర్ణాటక సంగీత రంగంలో లైంగిక దాడి, అనుచిత ప్రవర్తన ఉందనే విషయం ముందు నుంచే కర్ణాటక కమ్యూనిటీకి తెలుసని గాయకురాలు బాంబే జయశ్రీ చెప్పారు. కళాకారులుగా మేమంతా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్న వాళ్లమేనని అన్నారు. ‘మనమంతా వీటి గురించి మాట్లాడాలి. అందుకు స్పష్టత, ధైర్యం ఉండాలని కోరుకుంటున్నాను. ఉందనే భావిస్తున్నాను. ఇందులో మన గురించే ఆలోచించరాదు. అందరి గురించి ఆలోచించాలి. ఆలోచించి అడుగేయాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది’ అని ఆమె వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment