అమెరికాలో ‘బాలమురళి’ గానామృతం | Legend Mangalam Palli BalaMurali Krishna Birth Anniversary Celebrations In California By CiliconAndhra | Sakshi
Sakshi News home page

అమెరికాలో ‘బాలమురళి’ గానామృతం

Published Fri, Jul 9 2021 12:26 PM | Last Updated on Fri, Jul 9 2021 1:45 PM

Legend Mangalam Palli BalaMurali Krishna Birth Anniversary Celebrations In California By CiliconAndhra - Sakshi

కాలిఫోర్నియా: సిలికానాంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ "సంపద" ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో కర్ణాటక సంగీత సామ్రాట్ తెలుగువారు గర్వించదగిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 91వ జయంతి ఉత్సవాలు సిలికానాంధ్ర సంపద ఆధ్వర్యంలో  కన్నుల పండువగా జరిగాయి.  జులై 4న వర్చువల్‌గా నిర్వహించిన ఈ  కార్యక్రమానికి ఎంతోమంది కళాకారులు హాజరై బాల మురళి కృష్ణ గారితో తమకున్న అనుబంధాలని పంచుకున్నారు.    

స్వర నివాళి
ఈ కార్యక్రమంలో కేరళ నుంచి మంగళంపల్లి శిష్యులు ప్రిన్స్   రామ వర్మ,  హైదరాబాద్ నుంచి డీవీ మోహన కృష్ణ పాల్గొని గురువు గారితో వారికున్న అనుభవాలని పంచుకున్నారు.   ప్రముఖ మ్యూజికాలజిస్ట్ డాక్టర్ బి ఎం సుందరం, డాక్టర్ పప్పు వేణుగోపాలరావు, సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు చిత్రవీణ రవి కిరణ్, చిత్రవీణ నరసింహం, ప్రముఖ ఘటం కళాకారులు కార్తీక్, ప్రముఖ మృదంగ విద్వాంసులు పత్రి సతీష్ కుమార్ గారు మరియు సంగీత విద్వాంసులు శ్రీరాం పరశురాం గారు, మోదుమూడి సుధాకర్ గారు, వయోలిన్ కళాకారిణి పద్మ శంకర్ గారు, జీవీ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు  మంగళంపల్లి వారి కుటుంబ సభ్యులు అభిరామ్, డాక్టర్ మంగళంపల్లి వంశీ, కస్తూరి గోపాల రావు తదితరులు ఈ వేడుకల్లో భాగమయ్యారు. బాలమురళి గారి థిల్లానాలకు ప్రముఖ నాట్య గురువు ప్రియదర్శిని గోవింద్ శిష్యురాలు శ్వేత ప్రచండె అద్భుతమైన నాట్య ప్రదర్శన చేసి  వీక్షకులను అలరించారు.  బాలమురళి గారి శిష్యులు చిట్టమూరి కారుణ్య, చిన్మయిలు బాలమురళి గారి కీర్తనలు పాడి స్వర నివాళినర్పించారు.  

ఆకట్టుకున్న డాక్యుమెంటరీలు
సంపద ఉపాధ్యక్షుడు ఫణి మాధవ్ కస్తూరి నాయకత్వంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జీవన విశేషాల పై ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో రూపొందించిన డాక్యుమెంటరీలు వీక్షకులను మంత్రముగ్ధులను చేసాయి. దీనికి స్క్రిప్ట్ మరియు వాయిస్ ఓవర్ అందించిన డాక్టర్ మాలస్వామి (ఇంగ్లీష్), వాచస్పతి అంబడిపూడి మురళీకృష్ణ(తెలుగు)కు సంపద అధ్యక్షులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు   


 ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖుల ఏమన్నారంటే 
- ప్రఖ్యాత వాయులీనం విద్వాంసులు అన్నవరపు రామస్వామి గారు మాట్లాడుతూ ‘సంపద’ వారికి ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని ఆలోచన రావడం చాలా గొప్ప విషయమన్నారు.  సంగీతం లోనే కాకుండా లోనే కాకుండా వయోలిన్, వయోలా మరియు మృదంగం, కంజీర వంటి వాద్యాలలో బాలమురళి కృష్ణ  చక్కటి ప్రతిభను కనపరిచేవారు అని పేర్కొన్నారు.
- ప్రముఖ నాట్యాచార్యులు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ... భగవంతుడు సంగీత ప్రపంచానికి ఇచ్చిన అతి గొప్ప వరం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన రచించి స్వరపరిచిన హిందోళ తిల్లానాకు డాన్స్ చేసే అవకాశం తొలిసారిగా తనకు కలిగిందన్నారు. 
- బాలమురళి కృష్ణ గారి జీవించి ఉన్న సమయంలో తను జీవించడం గొప్ప అదృష్టంగా భావిస్తానని ప్రముఖ సంగీత విద్వాంసురాలు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ సుధ రఘునాథన్ అ‍న్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే సామెతకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ చిరునామ అన్నారు.  
- బాలమురళి కృష్ణ జయంతి సందర్భంగా సంపద ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ప్రముఖ వాయులీన విద్వాంసులు పద్మశ్రీ పురస్కార గ్రహీత అవసరాల కన్యాకుమారి అన్నారు.

‘సంపద’కు అభినందనలు
ఈ కార్యక్రమం మొత్తాన్ని సమన్వయపరిచి దిగ్విజయం చేయడానికి నాయకత్వం వహించిన సంపద అధ్యక్షులు దీనబాబు గారికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ వారి శిష్యులు, కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా సిలికానాంధ్ర వాగ్గేయకార విభాగం ఉపాద్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ళ, సృజన నాదెళ్ళ మరియు మమత కూచిభొట్ల బాలమురళి గారి అభిమానులందరికీ అభినందనలు తెలిపారు.  ఈ కార్యక్రమాన్ని youtube.com/sampadatv ద్వారా చూడవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement