Mangalampalli BalamuraliKrishna
-
లివింగ్ లెజెండ్ అన్నవరపు రామస్వామి
తొంభై ఆరేళ్ల వ్యక్తి బతికి ఉండడాన్ని మీరు ఎన్ని సార్లు ... ఎన్ని చోట్ల చూసారు ? ఒకటో రెండో సార్లు .... కదా ? ఒక వేళా బతికి ఉన్నా వారి ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది ? మందగించిన కంటి చూపు ... వినికిడి ... జ్ఞాపక శక్తి ! మంచం నుంచి లేవలేని స్థితి . అవునా ? తొంభైఆరేళ్ల లివింగ్ లెజెండ్ ను పరిచయం చేస్తా .... రండి . ..... శంకరాభరణం సినిమా చూసారు కదా ? తెలుగువాడన్నాక చూడకుండా ఎలా ఉంటారులెండి! శంకర శాస్త్రి ! తెలుగువాడి గుండెల్లో పాగా వేసాడు కదా . నిజజీవిత ప్రేరణ లేకుండా అంతటి పాత్ర ను మలచడం సాధ్యమా ? ఆ శంకర శాస్త్రి పాత్ర నిజ జీవితం లో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు . తలపాగా .. ఆహార్యం .. నిబద్దత .. క్రమశిక్షణ సంగీతం ... . అన్నీ .. అన్నీ . 1883 అంటే నూట నలభై ఏళ్ళ క్రితం పుట్టారు . సంగీత మహాగురువు . త్యాగరాజ స్వామి .. శిష్యుల్లో నాలుగో తరానికి చెందిన వారు పంతులు గారు . విజయవాడ అలంకార థియేటర్ సెంటర్ లో ఆయన విగ్రహం ఉంది. పంతులు గారు ఎంతో మంది సంగీత కారుల్ని తయారు చేసారు . ఆయన శిష్యుల్లో అందరికీ బాగా తెలిసిన వారు లెజెండ్ మంగళం పల్లి బాలమురళి కృష్ణ . రామకృష్ణయ్య పంతులు శిస్యుల్లో బాల మురళి కంటే సీనియర్ అయిన వ్యక్తే మనం చెప్పుకొంటున్న హీరో ఆ హీరో పేరు అన్నవరపు రామస్వామి . పుట్టింది 1926 . అంటే తొంబై ఆరేళ్ళ క్రితం . దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయ్యింది కదా . దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆయన 21 ఏళ్ళ యువకుడు . వామ్మో .. అప్పుడెప్పుడో పుట్టిన వ్యక్తి ఇంకా బతికున్నారా ? అని మీరు ఆశ్చర్య పోతున్నారా ? బతికుండమేంటి ? పాపం ప్రతిహతమగు కాక . చేతిలో కనీసం కర్ర లేదు . నాకంటే వేగం గా నడుస్తారు . మెట్లెక్కుతారు . కంటిచూపు పర్ఫెక్ట్ . వినికిడి పర్ఫెక్ట్ . జ్ఞాపక శక్తి సూపర్ . చాదస్తం లేదు సరి కదా .. చిలిపితనం ఎక్కువ. బాల మురళి సంగీత ప్రపంచం లో లెజెండ్ . ఆయనకు భారత రత్న రాలేదంటే అది తెలుగువాడి దౌర్బాగ్యం . బాలమురళి పాడిన త్యాగరాజ పంచరత్న కీర్తనలు యూట్యూబ్ లో చూడండి . ఆయనకు వయోలిన్ సహకారాన్ని అందిస్తున్న ఆయన సీనియర్ రామస్వామి కనిపిస్తారు . అదీ అన్నవరపు రామస్వామి గారి స్థాయి . అలాంటి వ్యక్తిని పరిచయం చెయ్యాల్సి రావడం ఇబ్బందికరం కాకపోతే ఇంకేంటి ? కాంట్రవర్సీ, సెన్సెషనల్ లాంటి విషయాల పట్ల ఉన్న ఆసక్తి , ఇంకా మన ముందే బతికి ఉన్న లెజెండ్స్ పట్ల ఉండదు . ఇదే మన సమాజ దౌర్బాగ్యం . అదే మన పతనావస్థ. మొన్న ఒక జర్నలిస్ట్ వాట్సాప్ గ్రూప్ లో ఒక బ్రేకింగ్ వార్త. అన్నమయ్య కీర్తన వివాదం తెలిసిందే కదా . దాని పై ఓ కరాటే మహిళ అభిప్రాయం అట .. అదీ ఆ బ్రేకింగ్ న్యూస్ . ఆ వివాదమే ఒక శుద్ధ దండగమారి వివాదం . పోనీ దానిపై అభిప్రాయం చెప్పాలంటే ఎవరు చెప్పాలి ? సంగీతం లో ఉద్దండులు చెప్పాలి . కదా? . వ్యక్తిగా ఎవరి అభిప్రాయం ఆమెకుండవచ్చు . తప్పులేదు . నాకు ఒళ్ళు మండిపోయింది . ఏందయ్యా ఇది? అని అడుగుదామని కొన్నా. "ఎవరండీ ఈమె?" అని అడిగా . నా వ్యంగ్యం ఆ గ్రూప్ లో ఎవరికీ అర్థం కాలేదు . రామాయణం లో పిడకల వేట లాగా ఇది ఎందుకు చెప్పానంటే ఇదీ మన స్థితి .. మన ఆలోచన విధానం .. మన మీడియా ధోరణి .... అని చెప్పడానికి . తిరిగి అన్నవరపు రామస్వామి గారి విషయానికి వచ్చేదాము . బాలమురళి గారి సంగీత కచ్చేరి ఎనిమిదేళ్ల క్రితం నా పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతి లో ఏర్పాటు చేశా .అప్పుడే తొలిసారి నాకు అన్నవరపు రామస్వామి గారితో పరిచయ భాగ్యం కలిగింది . అటుపై విజయవాడ లో మా స్కూల్ ప్రారంభించినప్పుడు తిరిగి బాల మురళి కచేరి ఏర్పాటు చేశా . తన చిన్ననాటి ఊరు విజయవాడ లో బాలమురళి చివరి కచేరి అదే . విజయవాడ లో మా స్కూల్ ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించింది బాలమురళి గారే. అటుపై మా స్కూల్ లో విద్యార్థులకు తొలిపాఠం గా సంగీతాన్ని నేర్పింది ఆయనే. ఆయనే వెంట అన్నవరపు రామస్వామి గారు . అటుపై విజయవాడ పోరంకి లో మా స్కూల్ లో నూతన భవనాన్ని ప్రారంభించింది రామ స్వామి గారే { అప్పటికి బాల మురళి కచేరిని దేవతలు స్వర్గం లో ఏర్పాటు చేసుకొన్నారు } . నేను సంగీతకారుడిని కాను . సంగీతం లో ఓనమాలు .. కాదు... కాదు .. సరిగమలు కూడా రాదు . మరి వీరి తో సంబంధాలేంటి ? ఇంగువ మూట గట్టిన బట్టకే వాసన అంటుకొంటుందట . అలాంటిది సుగంధ చందనం మూట గట్టిన బట్టకు ? నాకు శాస్త్రీయ సంగీతమంటే అందునా త్యాగయ్య సంగీతమంటే ప్రాణం . అదే బాలమురళి లాంటి లెజెండ్ ను కలిసే అవకాశమిచ్చింది . అదే నాదసుధార్ణవ పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారిని కలిసే అవకాశం , ఆయన విగ్రహాన్ని ఆయన చేతుల మీదుగానే గన్నవరం లోని మా స్కూల్ లో ఏర్పాటు చేసే అవకాశాన్నిచ్చింది . తొంబై ఆరేళ్ళ లివింగ్ లెజెండ్ అన్నవరపు రామస్వామి మహా చిలిపి . ఇరవై ఏళ్ళ కుర్రాడిలో వుండే చిలిపితనం ఆయనలో ఉంది . మొన్న ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మెడలో పూలదండ వేసాం. అటు పై నేను మాట్లాడుతుంటే.. ఉన్నట్టుండి తన మెడలోని పూలదండ నాకు వేసేసారు . గన్నవరం లో మా స్కూల్ ప్రాంగణం లో ఆయన విగ్రహం .. దాన్ని ఆయనే ప్రారంభించడం .. ఆ కార్యక్రమం లో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి మనువడు సుధాకర్ త్యాగయ్య కీర్తన తో ప్రారంభించడం .. అంత ఒక కలలాగుంది. ఆహా.. ఇంతకంటే ఏమి కావాలి ? విగ్రవిష్కరణ సందర్భంగా సుమారు నలబై నిముషాలు ఎండలో నిలుచున్నారు అన్నవరపు గారు . ఇప్పటికీ ఆల్ ఇండియా రేడియో లో వయోలిన్ తో కచేరి చేస్తారు . సంగీతమే నా ఆరోగ్య రహస్యం అంటారాయన . నేను కూడా అంటా .. కర్నాటిక్ సంగీతం ఈజ్ ది సీక్రెట్ అఫ్ మై ఎనర్జీ . - అమర్నాద్ వాసిరెడ్డి ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
అమెరికాలో ‘బాలమురళి’ గానామృతం
కాలిఫోర్నియా: సిలికానాంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ "సంపద" ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలో కర్ణాటక సంగీత సామ్రాట్ తెలుగువారు గర్వించదగిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 91వ జయంతి ఉత్సవాలు సిలికానాంధ్ర సంపద ఆధ్వర్యంలో కన్నుల పండువగా జరిగాయి. జులై 4న వర్చువల్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది కళాకారులు హాజరై బాల మురళి కృష్ణ గారితో తమకున్న అనుబంధాలని పంచుకున్నారు. స్వర నివాళి ఈ కార్యక్రమంలో కేరళ నుంచి మంగళంపల్లి శిష్యులు ప్రిన్స్ రామ వర్మ, హైదరాబాద్ నుంచి డీవీ మోహన కృష్ణ పాల్గొని గురువు గారితో వారికున్న అనుభవాలని పంచుకున్నారు. ప్రముఖ మ్యూజికాలజిస్ట్ డాక్టర్ బి ఎం సుందరం, డాక్టర్ పప్పు వేణుగోపాలరావు, సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు చిత్రవీణ రవి కిరణ్, చిత్రవీణ నరసింహం, ప్రముఖ ఘటం కళాకారులు కార్తీక్, ప్రముఖ మృదంగ విద్వాంసులు పత్రి సతీష్ కుమార్ గారు మరియు సంగీత విద్వాంసులు శ్రీరాం పరశురాం గారు, మోదుమూడి సుధాకర్ గారు, వయోలిన్ కళాకారిణి పద్మ శంకర్ గారు, జీవీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు మంగళంపల్లి వారి కుటుంబ సభ్యులు అభిరామ్, డాక్టర్ మంగళంపల్లి వంశీ, కస్తూరి గోపాల రావు తదితరులు ఈ వేడుకల్లో భాగమయ్యారు. బాలమురళి గారి థిల్లానాలకు ప్రముఖ నాట్య గురువు ప్రియదర్శిని గోవింద్ శిష్యురాలు శ్వేత ప్రచండె అద్భుతమైన నాట్య ప్రదర్శన చేసి వీక్షకులను అలరించారు. బాలమురళి గారి శిష్యులు చిట్టమూరి కారుణ్య, చిన్మయిలు బాలమురళి గారి కీర్తనలు పాడి స్వర నివాళినర్పించారు. ఆకట్టుకున్న డాక్యుమెంటరీలు సంపద ఉపాధ్యక్షుడు ఫణి మాధవ్ కస్తూరి నాయకత్వంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జీవన విశేషాల పై ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో రూపొందించిన డాక్యుమెంటరీలు వీక్షకులను మంత్రముగ్ధులను చేసాయి. దీనికి స్క్రిప్ట్ మరియు వాయిస్ ఓవర్ అందించిన డాక్టర్ మాలస్వామి (ఇంగ్లీష్), వాచస్పతి అంబడిపూడి మురళీకృష్ణ(తెలుగు)కు సంపద అధ్యక్షులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖుల ఏమన్నారంటే - ప్రఖ్యాత వాయులీనం విద్వాంసులు అన్నవరపు రామస్వామి గారు మాట్లాడుతూ ‘సంపద’ వారికి ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని ఆలోచన రావడం చాలా గొప్ప విషయమన్నారు. సంగీతం లోనే కాకుండా లోనే కాకుండా వయోలిన్, వయోలా మరియు మృదంగం, కంజీర వంటి వాద్యాలలో బాలమురళి కృష్ణ చక్కటి ప్రతిభను కనపరిచేవారు అని పేర్కొన్నారు. - ప్రముఖ నాట్యాచార్యులు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ... భగవంతుడు సంగీత ప్రపంచానికి ఇచ్చిన అతి గొప్ప వరం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన రచించి స్వరపరిచిన హిందోళ తిల్లానాకు డాన్స్ చేసే అవకాశం తొలిసారిగా తనకు కలిగిందన్నారు. - బాలమురళి కృష్ణ గారి జీవించి ఉన్న సమయంలో తను జీవించడం గొప్ప అదృష్టంగా భావిస్తానని ప్రముఖ సంగీత విద్వాంసురాలు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ సుధ రఘునాథన్ అన్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే సామెతకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ చిరునామ అన్నారు. - బాలమురళి కృష్ణ జయంతి సందర్భంగా సంపద ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ప్రముఖ వాయులీన విద్వాంసులు పద్మశ్రీ పురస్కార గ్రహీత అవసరాల కన్యాకుమారి అన్నారు. ‘సంపద’కు అభినందనలు ఈ కార్యక్రమం మొత్తాన్ని సమన్వయపరిచి దిగ్విజయం చేయడానికి నాయకత్వం వహించిన సంపద అధ్యక్షులు దీనబాబు గారికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ వారి శిష్యులు, కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా సిలికానాంధ్ర వాగ్గేయకార విభాగం ఉపాద్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ళ, సృజన నాదెళ్ళ మరియు మమత కూచిభొట్ల బాలమురళి గారి అభిమానులందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని youtube.com/sampadatv ద్వారా చూడవచ్చు. -
ఆ వాయులీనం.. శ్రోతలకు పరవశం!
సాక్షి, తెనాలి(గుంటూరు) : ‘శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తిగాన రసం ఫణిః’ సంగీతం విశిష్టతకు ఇంతకుమించి మరో మాట అవసరం లేదు. సంగీతం వేదస్వరూపిణి, పాపనాశని, దైవదర్శిని, ఆనందవర్ధని, మోక్షప్రదాయిని అని సంగీతకారులు ప్రణమిల్లుతారు. ఇంతటి ఉత్కృష్టమైన సంగీత కళాకారులకు నిలయం కృష్ణాతీరం. వారిలో విజయవాడకు చెందిన ‘నాద సుధార్ణవ’ అన్నవరపు రామస్వామి ప్రసిద్ధులు. 94 ఏళ్ల వయసులోనూ ప్రతిరోజూ సంగీత సాధన చేయటమే కాదు.. వాయులీన విద్యతో రసజ్ఞులను మైమరపింపజేస్తున్నారు. పట్టణానికి చెందిన సంగీత సంస్థ హేమాద్రి మ్యూజిక్ అకాడమి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రమ్‌లో సంగీతాభిమానులకు ఆ వాద్యగాన విందు లభించనుంది. ‘గాన విదూషి’ గద్దె వేంకట రామకుమారి చతుర్ధ వర్ధంతి సంగీత ఉత్సవంలో అన్నవరపు రామస్వామి శాస్త్రీయ వాయులీన వాద్య సంగీత కచేరీ జరగనుంది. వయొలిన్‌పై బీవీ దుర్గాభవాని, హేమాద్రి చంద్రకాంత్, మృదంగంపై పీఎస్ ఫల్గుణ్, ఘటంపై కేవీ రామకృష్ణ సహకారం అందిస్తారు. సంగీత సాధనకు ఎన్నో కష్టాలు వయొలిన్ లేని సంగీతం లేదంటే అతిశయోక్తి కాదు. వాయులీన విద్యలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొంది అనేక ప్రతిష్టాత్మక గౌరవాలను స్వీకరించిన అన్నవరపు రామస్వామిది సంగీత కుటుంబం. యుక్తవయసులో సంగీత సాధనకు ఎన్నో కష్టాలు అనుభవించారు. వారాలు చేసుకుంటూ గురుకుల పద్ధతిలో గురువు శుశ్రూష చేసుకుంటూ సంగీతాన్ని నేర్చారు. ఒకోసారి భోజనం కోసం ఆరోజు వంతు ఇంటికి వెళితే, తాళం వేసి వుండేదట! చేసేదిలేక నిట్టూర్చుకుంటూ నీరసంతో తిరిగొస్తూ దారిలోని చేతిపంపు నీరు కడుపునిండా తాగి, గురువు ఇంటికి చేరుకునేవారు. సంగీత విద్వాంసుడు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గర పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి సంగీత శిక్షణ పొందారు. సప్తస్వరాలను పలికించటంలో.. బాలమురళీకృష్ణ గాత్రంలో కీర్తిప్రతిష్టలను పొందితే వాయులీనంలో సప్తస్వరాలను పలికించటంలో రామస్వామి గుర్తింపును పొందారు. కొత్త రాగాలను, కీర్తనలను రూపొందించి, తన నైపుణ్యంతో వాటికి ప్రాచుర్యాన్ని కల్పించారు. ‘వందన’ రాగంలో ‘కనకాంబరి’ అనే కీర్తన, ‘శ్రీదుర్గ’ అనే రాగంలో కనకదుర్గ అనే కీర్తలను కూడా ప్రదర్శించి వాయులీన కళలో ప్రత్యేకతను నిలుపుకున్నారు. సంగీత, సాహిత్యరంగంలో అప్పటికి తలపండినవారి అభినందనలు అందుకున్నారు. ఉన్నతశ్రేణి కళాకారుడిగా ఆకాశవాణి, దూరదర్శన్‌లో సంగీత కార్యక్రమాల రూపకల్పన చేశారు. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు డాక్టర్ బాలమురళీకృష్ణతో కలిసి యూకే, కెనడా, ఫ్రాన్స్, శ్రీలంక, సింగపూర్, మలేషియా, బెహ్రాన్, దుబాయ్, దోహా, మస్కట్ తదితర దేశాల్లో పర్యటించి, భారతీయ శాస్త్రీయ సంగీతకళ ఔన్నత్యాన్ని చాటారు. సంగీతసేవకు జీవితాన్ని, ఆస్తిని అర్పించిన తెనాలి న్యాయవాది, శ్రీసీతారామ గానసభ వ్యవస్థాపకుడు నారుమంచి సుబ్బారావు జీవించివున్నపుడు, దాదాపు ఆరు దశాబ్దాల క్రితం రామస్వామి తెనాలిలో తన వాయులీన విద్యను ప్రదర్శించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత హేమాద్రి మ్యూజిక్ అకాడమి, తెనాలిలో ఆ కళాప్రముఖుడి కచేరిని ఏర్పాటు చేయటం విశేషం. -
మంగళంపల్లికి అనుబంధం ‘అనంత’ం
– జిల్లాలో బాలమురళీ పేరిట ఆడిటోరియం – కళాకారులు సంతాపం అనంతపురం కల్చరల్ : సంగీత సామ్రాజ్యంలో తెలుగువారి కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన శాస్త్రీయ సంగీత ఉత్తుంగ తరంగం మంగళంపల్లి బాల మురళీకృష్ణతో 'అనంత'కు ప్రత్యేక అనుబంధం ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నగరంలో ఆయన పేరిట ప్రత్యేక ఆడిటోరియం నిర్మించారు. ఇదే మాటను మంగళంపల్లి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రత్యేకంగా ప్రస్తావించేవారు. 1959లో తొలిసారి ‘అనంత’కు విచ్చేసి త్యాగరాయ సంగీత సభలో కచేరీ నిర్వహించిన మంగళంపల్లి ఆ తర్వాత 1960, 66, 70, 74లో అనంత వాసులను తనదైన సంగీతం తరంగాలతో ముంచెత్తారు. 1986లో ఆయన పేరిట ‘అనంత’లో నిర్మాణమైన భవనానికి స్వయంగా భూమి పూజ చేశారు. 2006 నవంబరు 12న సుందరంగా నిర్మాణమైన డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆడిటోరియాన్ని మాజీ డీజీపీ రొద్దం ప్రభాకరరావు ప్రారంభించారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన బాలమురళీకృష్ణ మరోసారి సంగీత కచేరీతో అనంత వాసులను మైమరిపించారు. అలాగే 2008లో త్యాగరాజ సంగీత సభ స్వర్ణోత్సవాలు జరుగుతున్న వేళ కూడా ఆయన విశిష్ట అతిథిగా అనంతకు విచ్చేసి స్థానిక కళాకారులను ఘనంగా సన్మానించారు. బాలమురళీకృష్ణతో అనంతకున్న మరో అనుబంధం స్వయంగా తన కూతురిని జిల్లావాసికిచ్చి వివాహం చేశారు. జిల్లావాసులకు, ముఖ్యంగా త్యాగరాజ సంగీత సభకు ఆయనతోడి ప్రత్యేకమైన బంధముండేది. మంగళంపల్లితో తనకున్న అనుబంధాన్ని ఇలా గుర్తు చేసుకున్నారు. సంగీత ప్రపంచం మంగళం పల్లి ...త్యాగరాజ సంగీత సభ వ్యవస్థాపకులు జ్ఞానేశ్వరరావు ఉత్తార్కర్ 'ప్రపంచం గర్వించదగిన సంగీత సామ్రాట్టు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఆయన సంగీతంలో ఓలలాడని వ్యక్తి ఉండరంటే అతిశయోక్తి లేదు. 1958లో ఆయన పుట్టపర్తి వచ్చినపుడు ఎవరో నా గురించి చెప్పగా ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఆయన పాటలన్నింటిని నేను మళ్లీ పాడి వినిపించేవాన్ని. ఆయన పేరిట జిల్లా కేంద్రంలో ఓ ఆడిటోరియం నిర్మించాలన్న ఆలోచన సంగీతాన్ని ఓ మలుపు తిప్పిందనే చెప్పాలి. ఆ ఆడిటోరియంలో అంతర్జాతీయ స్థాయి సంగీత విద్వాంసులెందరో కచేరీ చేసి మంగళంపల్లికి స్వర నీరాజనాలర్పించారు. స్వర సామ్రాట్టుకు ‘అనంత’ అశ్రునివాళి : శాస్త్రీయ సంగీతానికి, తెలుగు నేలకు తనదైన ప్రతిభా విశేషాలను అపార కీర్తినార్జించిపెట్టిన డా.మంగళంపల్లి మురళీకృష్ణ ఇక లేరన్న వార్త వినగానే ‘అనంత’ కళాలోకం శోక సముద్రంలో మునిగిపోయింది. సంగీత, సాహితీ, కళా సంస్థలు వేర్వేరు ప్రకటనల ద్వారా ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికాయి. సంగీత విద్వాంసులు వీరాస్వామి, నృత్యకళానిలయం సంధ్యామూర్తి, పట్నం శివప్రసాద్, తెలుగు భాషా వికాస ఉద్యమ నేతలు డా.జాగర్లపూడి శ్యామసుందరశాస్త్రి, హరిశ్చంద్రరామ మంగళంపల్లికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అలాగే లలితకళాపరిషత్తు కార్యదర్శి నారాయణస్వామి, డా.ఉమర్ ఆలీషా సాహితీ పీఠం అధ్యక్షుడు రియాజుద్దీన్ తదితరులు మంగళంపల్లి లేని లోటు తీరనిదని కొనియాడారు. -
నగరంతో నాది సంగీత అనుబంధం
‘సాక్షి’తో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ హైదరాబాద్ : ‘నగరంతో నాది సంగీత అనుబంధం.. భాగ్యనగర వాసులు సంగీత ప్రియులు.. బాగా ఆదరిస్తారు’ అని హైదరాబాదుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. సంగీత సరస్వతి ముద్దుబిడ్డ అయిన మంగళంపల్లి సోమవారం రవీంద్రభారతిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో ముచ్చటించారు. మిగతా విషయాలతో కన్నా నాకు హైదరాబాద్‌తో నాకు సంగీత అనుబంధమే ఉంది. ఎప్పటినుంచో ఇక్కడి వస్తున్నా..ప్రజలు నా సంగీతాన్ని విని ఆనందిస్తున్నారు. నన్ను అభిమానిస్తున్నారు. యువత వెస్ట్రన్ సంగీతం విన్నా, ఆకర్షితులైనా, మరే సంగీతం వంటపట్టించుకున్నా అన్ని సంగీతాలు మనవే. మన సంగీతం నుంచి పుట్టినవే అన్నీ. అన్ని రాగాలు మనవే. వెస్ట్రన్ సంగీతం అలవాటు పడ్డ వారు కూడా మన పిల్లలే కదా. ఎటు తిరిగి ఎటుపోయినా మళ్లీ శాస్త్రీయ సంగీతం దగ్గర ఆగాల్సిందే. రోగాలు నయం చేసేందుకంటూ ప్రత్యేక పాటలు, సంగీతం అంటూ ఏమీలేవు.. సంగీతంతో కూడిన రాగాలు వింటూ ఉంటే రోగాలు వాటంతట అవే తగ్గిపోతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో శాస్త్రీయ సంగీగతం విన్నా, నేర్చుకున్నా మంచే జరుగుతుంది. సంగీతప్రియులు ఇన్ని సంవత్సరాలు నన్ను ఆదరించి ప్రేమించారు. బాగా చూసుకున్నారు.. ఈ ఆదరాభిమానాలు నేను ఉన్నన్నాళ్లు లభించాలని కోరుకుంటున్నాను. -
జూలై 6న పుట్టినరోజు జరుపు కుంటున్న ప్రముఖులు
ఈ రోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపు కుంటున్న ప్రముఖులు: దలైలామా (బౌద్ధ గురువు), మంగళంపల్లి బాలమురళీకృష్ణ (సంగీత విద్వాంసుడు) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 3. వీరు ఈ సంవత్సరమంతా సుఖ సంతోషాలతో, ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. ఎంతో విషయ పరిజ్ఞానాన్ని పొందుతారు. కార్యదక్షులుగా పేరుతెచ్చుకుంటారు. సద్గురువులు, సజ్జనుల సాంగత్యం వల్ల నాస్తికులు కూడా ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థికంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. రచయితలు, వక్తలు, సంగీత క ళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. న్యాయపరమైన లావాదేవీలు, కోర్టుకే సులు ఏమంత అనుకూలంగా ఉండవు. కొత్త కొత్త కోర్సులు చేయాలని కోరిక కలుగుతుంది. అర్ధంతరంగా ఆపేసిన చదువును కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక విషయాల్లో పడి సంసార జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించే ప్రమాదం ఉంది. లక్కీ నంబర్స్: 1,2,5,6; లక్కీ కలర్స్: పర్పుల్, గ్రే, ఎల్లో, క్రీమ్, వైట్; లక్కీ డేస్: సోమ, మంగళ, గురువారాలు; సూచనలు: కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపటం, గురుశ్లోకం చదవటం, దక్షిణామూర్తిని ఆరాధించటం, మతగురువులను, పెద్దలను గౌరవించటం, వృద్ధులను, అనాథలను ఆదుకోవడం. - రెహమాన్ దావూద్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ -
జీవితమే కృష్ణ సంగీతము..
మెరిసే తారలకు.. కురిసే వెన్నెలకు పరిచయాలుంటాయా ? ఆ నైజమే వాటి ఉనికి! కర్ణాటక సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు, రాగస్రష్ట.. పద్మవిభూషణ్.. మంగళంపల్లి బాలమురళీకృష్ణదీ అదే నైజం ! పాటే ఆయన పరిమళం.. రాగాలే ఆయన అస్తిత్వం.. ఒక్క మాటలో చెప్పాలంటే సంగీతం ఆయనకు సర్వస్వం. ఆదివారం.. అమీర్‌పేట్ ధరమ్‌కరమ్ రోడ్డులో ‘ధీ ఆర్ట్స్పేస్’ అనే ఆర్ట్‌గ్యాలరీని ప్రారంభించడానికి ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో బాలమురళీకృష్ణ చిట్‌చాట్ ఇది.. కళలకు కాణాచి హైదరాబాద్. ఈ నగరంతో నా అనుబంధం నిన్నమొన్నటిది కాదు. నా చిన్నతనం నుంచీ ఉంది. హైదరాబాద్‌తోనే కాదు ఇక్కడి సంగీతంతోనూ ఎనలేని అనుబంధం నాది. బోలెడు జ్ఞాపకాలూ ఉన్నాయి. ఇక్కడ నా మొట్టమొదటి కచేరీ అవగానే నన్ను ఆస్ధాన విద్వాంసుడిగా చేశారు. ఇదిగో ఇప్పుడు ఇలా ఈ ఆర్ట్‌గ్యాలరీని నేను ప్రారంభించడం కూడా హైదరాబాద్ నాకిస్తున్న చక్కటి జ్ఞాపకమే. ఇలాంటివి బోలెడున్నాయి. ఏ ఒక్కటని చెప్పను? జగమంతా సంగీతమే! సంగీతం అంటే కేవలం సరిగమపదనిసలే కావు. మన జీవితమే సంగీతం. మన మాటల్లో శ్రుతి ఉంటుంది. నడకలో లయ ఉంటుంది. ఇలా ఫలానాది సంగీతం... ఫలానాది కాదు అని చెప్పలేం. విశ్వమంతా సంగీతమే. అన్నిట్లో సంగీతం ఉంటుంది. దేన్నుంచీ దీన్ని విడదీయలేం. అలాగే ఇది శాస్త్రీయ సంగీతం.. ఇది కాదు అని కూడా చెప్పలేం. జానపద... సినిమా సంగీతాలన్నీ కూడా శాస్త్రీయమే. అందుచేత సంగీతాన్ని ఓ సబ్జెక్ట్‌గా తీసుకోకూడదు. సినిమాకు ఎలా కావాలో అలా ఉంటేనే బాగుంటుంది. సినిమాలో త్యాగరాజ సంగీతాన్ని పెట్టలేం... కచేరీలో సినిమా పాటలను పాడలేం. ఎక్కడ ఏది కావాలో అదుండాలి. వివరాలు అనవసరం. ఉదాహరణకు .. ‘అర్థంకాదూ..’ అని దీర్ఘంగా పలికితే ఆ మాట ఒక రకంగా ఉంటుంది, ‘అర్థం కాదు’ అని కాస్త కటువుగా అంటే ఒక రకంగా ఉంటుంది.. ‘అర్థం కా... దు’ అని అంటే ఇంకోరకంగా ఉంటుంది. అందుకే శ్రుతిలయలు ఉన్నదంతా సంగీతమే! చెవికి ఇంపుగా ఉన్న ప్రతిదీ కర్ణాటక సంగీతమే! సంగీతమే దివ్యౌషధం ఎంతోమంది ఎన్నో సమస్యలతో నా దగ్గరకు వచ్చారు.. వస్తున్నారు. కొందరికి నేను మ్యూజిక్ థెరపీ ఇస్తున్నాను అని చెప్పి మరీ చేస్తున్నాను. ఇంకొందరికి వాళ్లకు తెలియకుండానే చేసేస్తున్నాను నాకు నమ్మకం కలగడానికి. వాళ్ల సమస్యలు తగ్గాక మ్యూజిక్ థెరపీ తీసుకున్నామని తెలుసుకుంటున్నారు . ఏమైనా నా మ్యూజిక్ థెరపీ ప్రయోగం బాగా సక్సెస్ అయింది. ప్రాణం పోయే సమయంలో నా దగ్గరకు వచ్చి బాగా అయిపోయిన వాళ్లూ ఉన్నారు. సంగీతం.. అన్నిటికీ దివ్యౌషధం. ఒత్తిడి.. మానసిక వ్యాకులత వీటన్నిటికీ ఇది అద్భుత ఔషధం! తెలంగాణ ఆస్థాన విద్వాంసుడిగా.. ఈ ప్రభుత్వం ఆహ్వానిస్తే సంతోషంగా ఒప్పుకుంటాను. నేనూ తెలగాణ్యుడినే. ఇక్కడి శ్రోతలు మంచి మంచి పాటలు వినాలి. పెద్దపెద్ద కళాకారులను పిలిచి కచేరీలు పెట్టించాలి. ఆ గాయకులకు చక్కటి గౌరవాన్ని అందించాలనే ఆశిస్తున్నాను. సర్వరోగ నివారిణి సంగీతం. ఆ సంగీతంలో మానసికోల్లాసాన్ని పొంది.. వచ్చిన శక్తితో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి. తక్కువ కాలంలోనే ఈ రాష్ట్రం ఉన్నత స్థానంలో ఉండాలని.. ఉంటుందనీ కోరుకుంటున్నాను. నవ కళావేదిక కళాజగతిలో హైదరాబాద్‌ది అద్భుతమైన స్థానం! దానికి మరిన్ని వన్నెలద్దడానికి ధీ ఆర్ట్ స్పేస్ పేరుతో ఆదివారం సరికొత్త గ్యాలరీ ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ హాజరయ్యారు. విజువల్ ఆర్ట్‌పై చర్చావేదికలు, లెక్చర్స్, ఫిల్మ్ స్క్రీనింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని గ్యాలరీ నిర్వాహకురాలు భార్గవి గుండాల తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఫైన్ ఆర్ట్స్‌లో పీజీ పూర్తి చేసిన భార్గవి.. ఈ గ్యాలరీని విజువల్ ఆర్ట్స్‌కి రిసోర్స్ సెంటర్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. ‘ధీ ఆర్ట్స్పేస్’ తొలి ప్రదర్శనలో కొలువుదీరిన కేరళకు చెందిన కేపీ ప్రసాద్, వెస్ట్‌బెంగాల్‌కు చెందిన కుందన్ మండల్, అసోం కళాకారుడు రాకేశ్ రాయ్‌చౌదరి.. కుంచెల నుంచి జాలువారిన అద్భుత కళాఖండాలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.