మంగళంపల్లికి అనుబంధం ‘అనంత’ం
– జిల్లాలో బాలమురళీ పేరిట ఆడిటోరియం
– కళాకారులు సంతాపం
అనంతపురం కల్చరల్ : సంగీత సామ్రాజ్యంలో తెలుగువారి కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన శాస్త్రీయ సంగీత ఉత్తుంగ తరంగం మంగళంపల్లి బాల మురళీకృష్ణతో 'అనంత'కు ప్రత్యేక అనుబంధం ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నగరంలో ఆయన పేరిట ప్రత్యేక ఆడిటోరియం నిర్మించారు. ఇదే మాటను మంగళంపల్లి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రత్యేకంగా ప్రస్తావించేవారు. 1959లో తొలిసారి ‘అనంత’కు విచ్చేసి త్యాగరాయ సంగీత సభలో కచేరీ నిర్వహించిన మంగళంపల్లి ఆ తర్వాత 1960, 66, 70, 74లో అనంత వాసులను తనదైన సంగీతం తరంగాలతో ముంచెత్తారు.
1986లో ఆయన పేరిట ‘అనంత’లో నిర్మాణమైన భవనానికి స్వయంగా భూమి పూజ చేశారు. 2006 నవంబరు 12న సుందరంగా నిర్మాణమైన డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆడిటోరియాన్ని మాజీ డీజీపీ రొద్దం ప్రభాకరరావు ప్రారంభించారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన బాలమురళీకృష్ణ మరోసారి సంగీత కచేరీతో అనంత వాసులను మైమరిపించారు. అలాగే 2008లో త్యాగరాజ సంగీత సభ స్వర్ణోత్సవాలు జరుగుతున్న వేళ కూడా ఆయన విశిష్ట అతిథిగా అనంతకు విచ్చేసి స్థానిక కళాకారులను ఘనంగా సన్మానించారు. బాలమురళీకృష్ణతో అనంతకున్న మరో అనుబంధం స్వయంగా తన కూతురిని జిల్లావాసికిచ్చి వివాహం చేశారు. జిల్లావాసులకు, ముఖ్యంగా త్యాగరాజ సంగీత సభకు ఆయనతోడి ప్రత్యేకమైన బంధముండేది. మంగళంపల్లితో తనకున్న అనుబంధాన్ని ఇలా గుర్తు చేసుకున్నారు.
సంగీత ప్రపంచం మంగళం పల్లి ...త్యాగరాజ సంగీత సభ వ్యవస్థాపకులు జ్ఞానేశ్వరరావు ఉత్తార్కర్
'ప్రపంచం గర్వించదగిన సంగీత సామ్రాట్టు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఆయన సంగీతంలో ఓలలాడని వ్యక్తి ఉండరంటే అతిశయోక్తి లేదు. 1958లో ఆయన పుట్టపర్తి వచ్చినపుడు ఎవరో నా గురించి చెప్పగా ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఆయన పాటలన్నింటిని నేను మళ్లీ పాడి వినిపించేవాన్ని. ఆయన పేరిట జిల్లా కేంద్రంలో ఓ ఆడిటోరియం నిర్మించాలన్న ఆలోచన సంగీతాన్ని ఓ మలుపు తిప్పిందనే చెప్పాలి. ఆ ఆడిటోరియంలో అంతర్జాతీయ స్థాయి సంగీత విద్వాంసులెందరో కచేరీ చేసి మంగళంపల్లికి స్వర నీరాజనాలర్పించారు.
స్వర సామ్రాట్టుకు ‘అనంత’ అశ్రునివాళి :
శాస్త్రీయ సంగీతానికి, తెలుగు నేలకు తనదైన ప్రతిభా విశేషాలను అపార కీర్తినార్జించిపెట్టిన డా.మంగళంపల్లి మురళీకృష్ణ ఇక లేరన్న వార్త వినగానే ‘అనంత’ కళాలోకం శోక సముద్రంలో మునిగిపోయింది. సంగీత, సాహితీ, కళా సంస్థలు వేర్వేరు ప్రకటనల ద్వారా ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికాయి. సంగీత విద్వాంసులు వీరాస్వామి, నృత్యకళానిలయం సంధ్యామూర్తి, పట్నం శివప్రసాద్, తెలుగు భాషా వికాస ఉద్యమ నేతలు డా.జాగర్లపూడి శ్యామసుందరశాస్త్రి, హరిశ్చంద్రరామ మంగళంపల్లికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అలాగే లలితకళాపరిషత్తు కార్యదర్శి నారాయణస్వామి, డా.ఉమర్ ఆలీషా సాహితీ పీఠం అధ్యక్షుడు రియాజుద్దీన్ తదితరులు మంగళంపల్లి లేని లోటు తీరనిదని కొనియాడారు.