తొంభై ఆరేళ్ల వ్యక్తి బతికి ఉండడాన్ని మీరు ఎన్ని సార్లు ... ఎన్ని చోట్ల చూసారు ?
ఒకటో రెండో సార్లు .... కదా ?
ఒక వేళా బతికి ఉన్నా వారి ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది ?
మందగించిన కంటి చూపు ... వినికిడి ... జ్ఞాపక శక్తి ! మంచం నుంచి లేవలేని స్థితి . అవునా ?
తొంభైఆరేళ్ల లివింగ్ లెజెండ్ ను పరిచయం చేస్తా .... రండి . .....
శంకరాభరణం సినిమా చూసారు కదా ? తెలుగువాడన్నాక చూడకుండా ఎలా ఉంటారులెండి!
శంకర శాస్త్రి ! తెలుగువాడి గుండెల్లో పాగా వేసాడు కదా . నిజజీవిత ప్రేరణ లేకుండా అంతటి పాత్ర ను మలచడం సాధ్యమా ?
ఆ శంకర శాస్త్రి పాత్ర నిజ జీవితం లో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు . తలపాగా .. ఆహార్యం .. నిబద్దత .. క్రమశిక్షణ సంగీతం ... . అన్నీ .. అన్నీ . 1883 అంటే నూట నలభై ఏళ్ళ క్రితం పుట్టారు . సంగీత మహాగురువు . త్యాగరాజ స్వామి .. శిష్యుల్లో నాలుగో తరానికి చెందిన వారు పంతులు గారు . విజయవాడ అలంకార థియేటర్ సెంటర్ లో ఆయన విగ్రహం ఉంది.
పంతులు గారు ఎంతో మంది సంగీత కారుల్ని తయారు చేసారు . ఆయన శిష్యుల్లో అందరికీ బాగా తెలిసిన వారు లెజెండ్ మంగళం పల్లి బాలమురళి కృష్ణ . రామకృష్ణయ్య పంతులు శిస్యుల్లో బాల మురళి కంటే సీనియర్ అయిన వ్యక్తే మనం చెప్పుకొంటున్న హీరో
ఆ హీరో పేరు అన్నవరపు రామస్వామి . పుట్టింది 1926 . అంటే తొంబై ఆరేళ్ళ క్రితం . దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయ్యింది కదా . దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆయన 21 ఏళ్ళ యువకుడు .
వామ్మో .. అప్పుడెప్పుడో పుట్టిన వ్యక్తి ఇంకా బతికున్నారా ? అని మీరు ఆశ్చర్య పోతున్నారా ?
బతికుండమేంటి ? పాపం ప్రతిహతమగు కాక . చేతిలో కనీసం కర్ర లేదు . నాకంటే వేగం గా నడుస్తారు . మెట్లెక్కుతారు . కంటిచూపు పర్ఫెక్ట్ . వినికిడి పర్ఫెక్ట్ . జ్ఞాపక శక్తి సూపర్ . చాదస్తం లేదు సరి కదా .. చిలిపితనం ఎక్కువ.
బాల మురళి సంగీత ప్రపంచం లో లెజెండ్ . ఆయనకు భారత రత్న రాలేదంటే అది తెలుగువాడి దౌర్బాగ్యం . బాలమురళి పాడిన త్యాగరాజ పంచరత్న కీర్తనలు యూట్యూబ్ లో చూడండి . ఆయనకు వయోలిన్ సహకారాన్ని అందిస్తున్న ఆయన సీనియర్ రామస్వామి కనిపిస్తారు .
అదీ అన్నవరపు రామస్వామి గారి స్థాయి . అలాంటి వ్యక్తిని పరిచయం చెయ్యాల్సి రావడం ఇబ్బందికరం కాకపోతే ఇంకేంటి ? కాంట్రవర్సీ, సెన్సెషనల్ లాంటి విషయాల పట్ల ఉన్న ఆసక్తి , ఇంకా మన ముందే బతికి ఉన్న లెజెండ్స్ పట్ల ఉండదు . ఇదే మన సమాజ దౌర్బాగ్యం . అదే మన పతనావస్థ.
మొన్న ఒక జర్నలిస్ట్ వాట్సాప్ గ్రూప్ లో ఒక బ్రేకింగ్ వార్త. అన్నమయ్య కీర్తన వివాదం తెలిసిందే కదా . దాని పై ఓ కరాటే మహిళ అభిప్రాయం అట .. అదీ ఆ బ్రేకింగ్ న్యూస్ . ఆ వివాదమే ఒక శుద్ధ దండగమారి వివాదం . పోనీ దానిపై అభిప్రాయం చెప్పాలంటే ఎవరు చెప్పాలి ? సంగీతం లో ఉద్దండులు చెప్పాలి . కదా? . వ్యక్తిగా ఎవరి అభిప్రాయం ఆమెకుండవచ్చు . తప్పులేదు . నాకు ఒళ్ళు మండిపోయింది . ఏందయ్యా ఇది? అని అడుగుదామని కొన్నా. "ఎవరండీ ఈమె?" అని అడిగా . నా వ్యంగ్యం ఆ గ్రూప్ లో ఎవరికీ అర్థం కాలేదు .
రామాయణం లో పిడకల వేట లాగా ఇది ఎందుకు చెప్పానంటే ఇదీ మన స్థితి .. మన ఆలోచన విధానం .. మన మీడియా ధోరణి .... అని చెప్పడానికి . తిరిగి అన్నవరపు రామస్వామి గారి విషయానికి వచ్చేదాము .
బాలమురళి గారి సంగీత కచ్చేరి ఎనిమిదేళ్ల క్రితం నా పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతి లో ఏర్పాటు చేశా .అప్పుడే తొలిసారి నాకు అన్నవరపు రామస్వామి గారితో పరిచయ భాగ్యం కలిగింది . అటుపై విజయవాడ లో మా స్కూల్ ప్రారంభించినప్పుడు తిరిగి బాల మురళి కచేరి ఏర్పాటు చేశా . తన చిన్ననాటి ఊరు విజయవాడ లో బాలమురళి చివరి కచేరి అదే . విజయవాడ లో మా స్కూల్ ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించింది బాలమురళి గారే. అటుపై మా స్కూల్ లో విద్యార్థులకు తొలిపాఠం గా సంగీతాన్ని నేర్పింది ఆయనే. ఆయనే వెంట అన్నవరపు రామస్వామి గారు .
అటుపై విజయవాడ పోరంకి లో మా స్కూల్ లో నూతన భవనాన్ని ప్రారంభించింది రామ స్వామి గారే { అప్పటికి బాల మురళి కచేరిని దేవతలు స్వర్గం లో ఏర్పాటు చేసుకొన్నారు } .
నేను సంగీతకారుడిని కాను . సంగీతం లో ఓనమాలు .. కాదు... కాదు .. సరిగమలు కూడా రాదు . మరి వీరి తో సంబంధాలేంటి ? ఇంగువ మూట గట్టిన బట్టకే వాసన అంటుకొంటుందట . అలాంటిది సుగంధ చందనం మూట గట్టిన బట్టకు ? నాకు శాస్త్రీయ సంగీతమంటే అందునా త్యాగయ్య సంగీతమంటే ప్రాణం . అదే బాలమురళి లాంటి లెజెండ్ ను కలిసే అవకాశమిచ్చింది . అదే నాదసుధార్ణవ పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారిని కలిసే అవకాశం , ఆయన విగ్రహాన్ని ఆయన చేతుల మీదుగానే గన్నవరం లోని మా స్కూల్ లో ఏర్పాటు చేసే అవకాశాన్నిచ్చింది .
తొంబై ఆరేళ్ళ లివింగ్ లెజెండ్ అన్నవరపు రామస్వామి మహా చిలిపి . ఇరవై ఏళ్ళ కుర్రాడిలో వుండే చిలిపితనం ఆయనలో ఉంది . మొన్న ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మెడలో పూలదండ వేసాం. అటు పై నేను మాట్లాడుతుంటే.. ఉన్నట్టుండి తన మెడలోని పూలదండ నాకు వేసేసారు .
గన్నవరం లో మా స్కూల్ ప్రాంగణం లో ఆయన విగ్రహం .. దాన్ని ఆయనే ప్రారంభించడం .. ఆ కార్యక్రమం లో పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి మనువడు సుధాకర్ త్యాగయ్య కీర్తన తో ప్రారంభించడం .. అంత ఒక కలలాగుంది. ఆహా.. ఇంతకంటే ఏమి కావాలి ?
విగ్రవిష్కరణ సందర్భంగా సుమారు నలబై నిముషాలు ఎండలో నిలుచున్నారు అన్నవరపు గారు . ఇప్పటికీ ఆల్ ఇండియా రేడియో లో వయోలిన్ తో కచేరి చేస్తారు . సంగీతమే నా ఆరోగ్య రహస్యం అంటారాయన .
నేను కూడా అంటా .. కర్నాటిక్ సంగీతం ఈజ్ ది సీక్రెట్ అఫ్ మై ఎనర్జీ .
- అమర్నాద్ వాసిరెడ్డి
ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు
Comments
Please login to add a commentAdd a comment