త్యాగరాజ స్వామి నడయాడిన ఊరు తిరువయ్యారు
దేవునికి ఉత్సవాలు జరుగుతాయి. కాని ఒక వాగ్గేయకారునికి కూడా జరుగుతాయా? జరుగుతాయి. ఆ గౌరవం, వైభవం త్యాగరాజ స్వామికే దక్కింది. వేదిక తిరువయ్యారు. అవును. తమిళనాడులో తంజావూరుకు చేరువలోనున్న తిరువయ్యారులో ప్రతి ఏటా శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు వీనుల విందుగా కన్నుల పండువగా జరుగుతాయి. కావేరీ నది ఒడ్డున త్యాగరాజ స్వామివారి
సమాధి వద్ద జరిగే ఈ కార్యక్రమాల్లో దేశం నలుమూలలకు చెందిన సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు, సంగీత విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని, త్యాగరాజ కీర్తనలను గానం చేస్తారు. త్యాగరాజ పంచరత్న కీర్తనలను బృందగానం చేస్తారు.
కర్ణాటక సంగీత ప్రపంచంలో త్రిమూర్తులుగా ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, త్యాగరాజు ఖ్యాతిపొందారు. ఈ త్రిమూర్తులలో తెలుగువాడైన త్యాగరాజుకు మాత్రమే ఇంతటి అరుదైన గౌరవం దక్కడం విశేషం. త్యాగరాజ స్వామి 1847లో పుష్య బహుళ పంచమి నాడు తిరువయ్యారులో సమాధి పొందాడు. ఆయన అంత్యక్రియలు కావేరి నది ఒడ్డున జరిగాయి. సంవత్సరం తర్వాత ఆయన శిష్యులు వచ్చి ఆయనకు నివాళిగా ఆరాధనోత్సవాలు ప్రారంభించారు. 1921 వరకు రెండు బృందాలు ఈ కచ్చేరిలు నిర్వహించేవి. అయితే ప్రఖ్యాత నర్తకి, గాయని బెంగుళూరు నాగరత్నమ్మ ఇక్కడ త్యాగరాజస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించడమే గాక అంతవరకూ స్త్రీలకు ప్రవేశం లేని ఆ ఆరాధనోత్సవాలలో స్త్రీలు పాల్గొనాలనే ఉద్యమాన్ని ప్రారంభించింది. తనే స్వయంగా వేదిక కట్టి ఆరాధనోత్సవాల్లో కచ్చేరీలు ఇచ్చింది. అంతేకాదు శేషజీవితం అక్కడే గడుపుతూ తన ఆస్తి ఐశ్వర్యాలన్నీ త్యాగరాజ స్వామికే అంకితం చేసింది. ఈ పోటాపోటీ కొనసాగుతుండగా ఇది సరైనది కాదని 1940లో అందరూ కలిసి సమూహిక ఆరాధన చేసే ఏర్పాటు జరిగింది. అప్పటి నుంచి ఏటా ఆ తిథిని బట్టి ఐదు రోజుల పాటు ఆరాధనోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది జనవరి 24 నుంచి 28వ తేదీ వరకు ఈ ఆరాధనోత్సవాలు జరగనున్నాయి.
ఐదు నదుల ఊరు
ఐదు పవిత్ర నదుల మధ్య ఉన్న ఊరు కావడం వల్ల తిరువయ్యారుకు ఆ పేరు వచ్చింది. ఆ నదులు: అరిసిలారు, వెన్నారు, వెట్టారు, కుడమురుత్తియారు, కావేరియారు. తమిళంలో ‘తిరు’ అంటే పవిత్ర, ‘ఐ’ అంటే ఐదు, ‘ఆరు’ అంటే నది అని అర్థం. తంజావూరు నుంచి తిరువైయారుకు చేరుకోవాలంటే ఈ ఐదు నదుల మీద నిర్మించిన వంతెనలను దాటుకుంటూ రావాల్సిందే. కాని వాస్తవానికి ఇక్కడ ఆరునదులు ఉన్నాయని చెప్పాలి. సంగీతం ఆ ఆరోనది. త్యాగరాజస్వామి ఆ నదీపురుషుడు.
ప్రాచీన క్షేత్రం పంచనదీశ్వరాలయం
త్యాగరాజస్వామి సమాధి చెందిన ఊరు కావడం వల్లే కాక ప్రాచీన శైవక్షేత్రమైన పంచనదీశ్వరాలయం వల్ల కూడా తిరువయ్యారు ప్రసిద్ధి చెందింది. పంచ ప్రాకారాలతో 60 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సువిశాల ఆలయ ప్రాంగణంలో వివిధ కాలాల్లో చోళులు, పల్లవులు, పాండ్యులు తదితర రాజవంశాలకు చెందిన రాజులు నిర్మించిన మందిరాలు, వేయించిన శిలాశాసనాలు ఉన్నాయి. ఈ ఆలయ దక్షిణ భాగాన్ని దక్షిణ కైలాసం అని, ఉత్తర భాగాన్ని ఉత్తర కైలాసమని అంటారు. ఉత్తర కైలాస భాగాన్ని రాజరాజ చోళుని భార్య క్రీస్తుశకం పదో శతాబ్దంలో నిర్మించిందని చెబుతారు. ఆ సందర్భంగా ఆమె పలు దానాలు చేసినట్లు శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయంలోనే ‘ఆట్కొండర్’ (కాల సంహారమూర్తి) మందిరం, దాని ఎదుట ఆదిశంకరాచార్యులు నెలకొల్పిన హోమగుండం కనిపిస్తాయి. ఏటా ఇక్కడకు పెద్దసంఖ్యలో భక్తులు వస్తూనే ఉంటారు. కార్తీక మాసంలో, మహాశివరాత్రి వేడుకల్లో ఇక్కడ ఘనంగా పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయానికి చేరువలో ఉన్న చిన్న ఇంట్లోనే త్యాగరాజు తన సన్యాసాశ్రమ జీవితాన్ని గడిపారు.
భక్తి వినా సన్మార్గము కలదే...
‘సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే మనసా...’ అని మానవాళికి బోధించిన త్యాగరాజు తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువారూరులో 1767 మే 4వ తేదీన జన్మించారు. అసలు పేరు కాకర్ల త్యాగబ్రహ్మం అయినా భక్తులు, సంగీతాభిమానులు త్యాగరాజుగా, త్యాగయ్యగా పిలుచుకుంటారు. రామభక్తుడైన త్యాగరాజు పూర్వీకులు ప్రకాశం జిల్లాలోని కాకర్ల గ్రామానికి చెందిన వారు. బాల్యంలో సొంఠి వెంకటరమణయ్య వద్ద సరిగమలు నేర్చుకున్న త్యాగరాజు అనతి కాలంలోనే వాగ్గేయకారుడిగా ఎదిగారు. శిష్యుడి గురించి తంజావూరు రాజుకు సొంఠి వెంకట రమణయ్య సిఫారసు చేయగా, రాజు ఆయనను ఆహ్వానించారు. సభకు విచ్చేసిన త్యాగయ్యకు రాజు విలువైన కానుకలను సమర్పించి, ఆస్థాన పదవి అలంకరించమని కోరారు. అయితే, ‘నిధి చాల సుఖమా... రాముని సన్నిధి సుఖమా...’ అంటూ కోరి వచ్చిన సంపదను సైతం తృణప్రాయంగా తిరస్కరించి, రాముని సన్నిధినే పెన్నిధిగా ఎన్నుకున్న భాగవతోత్తముడు త్యాగయ్య. అందుకే, ఆయన అంటే నేటికీ సంగీత విద్వాంసులకు, సంగీతాభిమానులకు అంతటి భక్తి ప్రపత్తులు. త్యాగయ్య తన జీవితకాలంలో దాదాపు 24 వేలకు పైగా కీర్తనలను రచించి, స్వరపరచాడు. అయితే, ప్రస్తుతం దాదాపు ఏడువందల కీర్తనలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చరమకాలంలో సన్యాసం స్వీకరించిన త్యాగయ్య తన శేషజీవితాన్ని తిరువయ్యారులో గడిపారు. ఇక్కడే ఒక చిన్న ఇంటిలో ఉంటూ పలు అపురూప కీర్తనలను రచించి, స్వరబద్ధం చేశారు. ఇక్కడే ఆయన 1847 జనవరి 6న సమాధి చెందడంతో నాటి నుంచి ఇది కర్ణాటక సంగీతకారులందరికీ పుణ్యస్థలిగా మారింది.
- పన్యాల జగన్నాథ దాసు
తిరువయ్యారుకు వెళ్లాలంటే...
వైమానికమార్గం
తిరుచిరాపల్లిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. తిరువయ్యారుకు ఈ విమానాశ్రయం 71 కిలోమీటర్ల దూరం. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి ఈ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. తిరుచిరాపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది. తిరుచిరాపల్లి నుంచి తిరువయ్యారుకు రైలు/రోడ్డుమార్గాన చేరుకోవచ్చు.
రైలుమార్గం
తిరువయ్యారుకు సమీపంలోని తంజావూరులో రైల్వేస్టేషన్ ఉంది. త్రిచి, మదురై, కోయంబత్తూర్,నాగోర్ రైల్వే లైన్లు ఈ స్టేషన్కు అనుసంధానించి ఉన్నాయి. హైదరాబాద్ నుంచి నేరుగా తంజావూరుకు రైలు సదుపాయం ఉంది.
రోడ్డు మార్గం
హైదరాబాద్ నుంచి తంజావూరుకు బస్సు సదుపాయాలు కూడా ఉన్నాయి. తంజావూరు నుంచి తిరువయ్యారుకు 13 కిలోమీటర్ల దూరం. ఇక్కడ నుంచి బస్సు ద్వారా తిరువయ్యారుకు చేరుకోవచ్చు.