సాక్షి, తెనాలి(గుంటూరు) : ‘శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తిగాన రసం ఫణిః’ సంగీతం విశిష్టతకు ఇంతకుమించి మరో మాట అవసరం లేదు. సంగీతం వేదస్వరూపిణి, పాపనాశని, దైవదర్శిని, ఆనందవర్ధని, మోక్షప్రదాయిని అని సంగీతకారులు ప్రణమిల్లుతారు. ఇంతటి ఉత్కృష్టమైన సంగీత కళాకారులకు నిలయం కృష్ణాతీరం. వారిలో విజయవాడకు చెందిన ‘నాద సుధార్ణవ’ అన్నవరపు రామస్వామి ప్రసిద్ధులు.
94 ఏళ్ల వయసులోనూ ప్రతిరోజూ సంగీత సాధన చేయటమే కాదు.. వాయులీన విద్యతో రసజ్ఞులను మైమరపింపజేస్తున్నారు. పట్టణానికి చెందిన సంగీత సంస్థ హేమాద్రి మ్యూజిక్ అకాడమి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రమ్‌లో సంగీతాభిమానులకు ఆ వాద్యగాన విందు లభించనుంది. ‘గాన విదూషి’ గద్దె వేంకట రామకుమారి చతుర్ధ వర్ధంతి సంగీత ఉత్సవంలో అన్నవరపు రామస్వామి శాస్త్రీయ వాయులీన వాద్య సంగీత కచేరీ జరగనుంది. వయొలిన్‌పై బీవీ దుర్గాభవాని, హేమాద్రి చంద్రకాంత్, మృదంగంపై పీఎస్ ఫల్గుణ్, ఘటంపై కేవీ రామకృష్ణ సహకారం అందిస్తారు.
సంగీత సాధనకు ఎన్నో కష్టాలు
వయొలిన్ లేని సంగీతం లేదంటే అతిశయోక్తి కాదు. వాయులీన విద్యలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును పొంది అనేక ప్రతిష్టాత్మక గౌరవాలను స్వీకరించిన అన్నవరపు రామస్వామిది సంగీత కుటుంబం. యుక్తవయసులో సంగీత సాధనకు ఎన్నో కష్టాలు అనుభవించారు. వారాలు చేసుకుంటూ గురుకుల పద్ధతిలో గురువు శుశ్రూష చేసుకుంటూ సంగీతాన్ని నేర్చారు. ఒకోసారి భోజనం కోసం ఆరోజు వంతు ఇంటికి వెళితే, తాళం వేసి వుండేదట! చేసేదిలేక నిట్టూర్చుకుంటూ నీరసంతో తిరిగొస్తూ దారిలోని చేతిపంపు నీరు కడుపునిండా తాగి, గురువు ఇంటికి చేరుకునేవారు. సంగీత విద్వాంసుడు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గర పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి సంగీత శిక్షణ పొందారు.
సప్తస్వరాలను పలికించటంలో..
బాలమురళీకృష్ణ గాత్రంలో కీర్తిప్రతిష్టలను పొందితే వాయులీనంలో సప్తస్వరాలను పలికించటంలో రామస్వామి గుర్తింపును పొందారు. కొత్త రాగాలను, కీర్తనలను రూపొందించి, తన నైపుణ్యంతో వాటికి ప్రాచుర్యాన్ని కల్పించారు. ‘వందన’ రాగంలో ‘కనకాంబరి’ అనే కీర్తన, ‘శ్రీదుర్గ’ అనే రాగంలో కనకదుర్గ అనే కీర్తలను కూడా ప్రదర్శించి వాయులీన కళలో ప్రత్యేకతను నిలుపుకున్నారు. సంగీత, సాహిత్యరంగంలో అప్పటికి తలపండినవారి అభినందనలు అందుకున్నారు. ఉన్నతశ్రేణి కళాకారుడిగా ఆకాశవాణి, దూరదర్శన్‌లో సంగీత కార్యక్రమాల రూపకల్పన చేశారు.
ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు డాక్టర్ బాలమురళీకృష్ణతో కలిసి యూకే, కెనడా, ఫ్రాన్స్, శ్రీలంక, సింగపూర్, మలేషియా, బెహ్రాన్, దుబాయ్, దోహా, మస్కట్ తదితర దేశాల్లో పర్యటించి, భారతీయ శాస్త్రీయ సంగీతకళ ఔన్నత్యాన్ని చాటారు. సంగీతసేవకు జీవితాన్ని, ఆస్తిని అర్పించిన తెనాలి న్యాయవాది, శ్రీసీతారామ గానసభ వ్యవస్థాపకుడు నారుమంచి సుబ్బారావు జీవించివున్నపుడు, దాదాపు ఆరు దశాబ్దాల క్రితం రామస్వామి తెనాలిలో తన వాయులీన విద్యను ప్రదర్శించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత హేమాద్రి మ్యూజిక్ అకాడమి, తెనాలిలో ఆ కళాప్రముఖుడి కచేరిని ఏర్పాటు చేయటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment