జీవితమే కృష్ణ సంగీతము.. | Music in the life | Sakshi
Sakshi News home page

జీవితమే కృష్ణ సంగీతము..

Published Sun, Oct 5 2014 10:34 PM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM

జీవితమే  కృష్ణ సంగీతము..

జీవితమే కృష్ణ సంగీతము..

మెరిసే తారలకు.. కురిసే వెన్నెలకు పరిచయాలుంటాయా ? ఆ నైజమే వాటి ఉనికి! కర్ణాటక సంగీత విద్వాంసుడు,  వాగ్గేయకారుడు, రాగస్రష్ట.. పద్మవిభూషణ్.. మంగళంపల్లి బాలమురళీకృష్ణదీ అదే నైజం !  పాటే ఆయన పరిమళం..  రాగాలే ఆయన అస్తిత్వం.. ఒక్క మాటలో  చెప్పాలంటే సంగీతం ఆయనకు సర్వస్వం. ఆదివారం.. అమీర్‌పేట్ ధరమ్‌కరమ్ రోడ్డులో  ‘ధీ ఆర్ట్‌స్పేస్’ అనే ఆర్ట్‌గ్యాలరీని ప్రారంభించడానికి ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా  సిటీప్లస్‌తో బాలమురళీకృష్ణ చిట్‌చాట్ ఇది..
 
 కళలకు కాణాచి హైదరాబాద్. ఈ నగరంతో నా అనుబంధం నిన్నమొన్నటిది కాదు. నా చిన్నతనం నుంచీ ఉంది. హైదరాబాద్‌తోనే కాదు ఇక్కడి సంగీతంతోనూ ఎనలేని అనుబంధం నాది. బోలెడు జ్ఞాపకాలూ ఉన్నాయి. ఇక్కడ నా మొట్టమొదటి కచేరీ అవగానే నన్ను ఆస్ధాన విద్వాంసుడిగా చేశారు. ఇదిగో ఇప్పుడు ఇలా ఈ ఆర్ట్‌గ్యాలరీని నేను ప్రారంభించడం కూడా హైదరాబాద్ నాకిస్తున్న చక్కటి జ్ఞాపకమే. ఇలాంటివి బోలెడున్నాయి. ఏ ఒక్కటని చెప్పను?

జగమంతా సంగీతమే!

సంగీతం అంటే కేవలం సరిగమపదనిసలే కావు. మన జీవితమే సంగీతం. మన మాటల్లో శ్రుతి ఉంటుంది. నడకలో లయ ఉంటుంది. ఇలా ఫలానాది సంగీతం... ఫలానాది కాదు అని చెప్పలేం. విశ్వమంతా సంగీతమే. అన్నిట్లో సంగీతం ఉంటుంది. దేన్నుంచీ దీన్ని విడదీయలేం. అలాగే ఇది శాస్త్రీయ సంగీతం.. ఇది కాదు అని కూడా చెప్పలేం. జానపద... సినిమా సంగీతాలన్నీ కూడా శాస్త్రీయమే. అందుచేత సంగీతాన్ని ఓ సబ్జెక్ట్‌గా తీసుకోకూడదు. సినిమాకు ఎలా కావాలో అలా ఉంటేనే బాగుంటుంది. సినిమాలో త్యాగరాజ సంగీతాన్ని పెట్టలేం... కచేరీలో సినిమా పాటలను పాడలేం. ఎక్కడ ఏది కావాలో అదుండాలి.  వివరాలు అనవసరం.
 
ఉదాహరణకు .. ‘అర్థంకాదూ..’ అని దీర్ఘంగా పలికితే ఆ మాట ఒక రకంగా ఉంటుంది, ‘అర్థం కాదు’ అని కాస్త కటువుగా అంటే ఒక
 రకంగా ఉంటుంది.. ‘అర్థం కా... దు’ అని అంటే ఇంకోరకంగా ఉంటుంది. అందుకే శ్రుతిలయలు ఉన్నదంతా  సంగీతమే! చెవికి ఇంపుగా ఉన్న ప్రతిదీ కర్ణాటక సంగీతమే!

 సంగీతమే దివ్యౌషధం

ఎంతోమంది ఎన్నో సమస్యలతో నా దగ్గరకు వచ్చారు.. వస్తున్నారు. కొందరికి నేను మ్యూజిక్ థెరపీ
 ఇస్తున్నాను అని చెప్పి మరీ చేస్తున్నాను. ఇంకొందరికి వాళ్లకు తెలియకుండానే చేసేస్తున్నాను నాకు నమ్మకం కలగడానికి. వాళ్ల సమస్యలు తగ్గాక మ్యూజిక్ థెరపీ తీసుకున్నామని తెలుసుకుంటున్నారు . ఏమైనా నా మ్యూజిక్ థెరపీ ప్రయోగం బాగా సక్సెస్ అయింది. ప్రాణం పోయే సమయంలో  నా దగ్గరకు వచ్చి బాగా అయిపోయిన వాళ్లూ ఉన్నారు. సంగీతం.. అన్నిటికీ దివ్యౌషధం.  ఒత్తిడి.. మానసిక వ్యాకులత వీటన్నిటికీ ఇది అద్భుత ఔషధం!

తెలంగాణ ఆస్థాన విద్వాంసుడిగా..

ఈ ప్రభుత్వం ఆహ్వానిస్తే సంతోషంగా ఒప్పుకుంటాను. నేనూ తెలగాణ్యుడినే.  ఇక్కడి శ్రోతలు మంచి మంచి పాటలు వినాలి. పెద్దపెద్ద కళాకారులను పిలిచి కచేరీలు పెట్టించాలి. ఆ గాయకులకు చక్కటి గౌరవాన్ని అందించాలనే ఆశిస్తున్నాను. సర్వరోగ నివారిణి సంగీతం. ఆ సంగీతంలో మానసికోల్లాసాన్ని పొంది.. వచ్చిన శక్తితో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి. తక్కువ కాలంలోనే ఈ రాష్ట్రం ఉన్నత స్థానంలో ఉండాలని.. ఉంటుందనీ కోరుకుంటున్నాను.
 
నవ కళావేదిక


కళాజగతిలో హైదరాబాద్‌ది అద్భుతమైన స్థానం! దానికి మరిన్ని వన్నెలద్దడానికి ధీ ఆర్ట్ స్పేస్ పేరుతో ఆదివారం సరికొత్త గ్యాలరీ
 ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి  బాలమురళీకృష్ణ హాజరయ్యారు. విజువల్ ఆర్ట్‌పై చర్చావేదికలు, లెక్చర్స్, ఫిల్మ్ స్క్రీనింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని గ్యాలరీ నిర్వాహకురాలు భార్గవి గుండాల తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఫైన్ ఆర్ట్స్‌లో పీజీ పూర్తి చేసిన భార్గవి.. ఈ గ్యాలరీని విజువల్ ఆర్ట్స్‌కి రిసోర్స్ సెంటర్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. ‘ధీ ఆర్ట్‌స్పేస్’ తొలి ప్రదర్శనలో కొలువుదీరిన కేరళకు చెందిన కేపీ ప్రసాద్, వెస్ట్‌బెంగాల్‌కు చెందిన కుందన్ మండల్, అసోం కళాకారుడు రాకేశ్ రాయ్‌చౌదరి.. కుంచెల నుంచి  జాలువారిన అద్భుత కళాఖండాలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement