PadmaVibhushan
-
ప్రముఖ శాస్త్రవేత్త కన్నుమూత, ప్రధాని సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఏరోస్పేస్ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఫ్రొఫెసర్ రొడ్డం నరసింహ (87) కన్నుమూశారు. మెదడులో రక్తస్రావం కావడంతో డిసెంబర్ 8న బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస తీసుకున్నారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. నేడు(డిసెంబర్15న) నరసింహ అంత్యక్రియలు నిర్వహించనున్నామని వారు తెలిపారు. మరోవైపు నరసింహ మరణంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. అత్యుత్తమ శాస్త్రవేత్త ప్రొఫెసర్ నరసింహ అనీ, భారతదేశ పురోగతి, సైన్స్ ఆవిష్కరణల శక్తిని పెంచేందుకు కృషి చేశారని మోదీ ట్వీట్ చేశారు. కాగా జూలై 20, 1933న జన్మించిన నరసింహ ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా నరసింహ భారతదేశానికి ఎంతో సేవ చేశారు. ఇస్రో తేలికపాటి యుద్ద విమానాల నిర్మాణంలో ఆయన పాలుపంచుకున్నారు. 1962 నుండి 1999 వరకు ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐస్‌సీ) లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బోధించిన ఆయన 1984-1993 వరకు నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2000- 2014 వరకు బెంగళూరులోని జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (జెఎన్సిఎఎస్ఆర్)లో ఇంజనీరింగ్ మెకానిక్స్ యూనిట్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. అలాగే ప్రొఫెసర్ సతీశ్ ధావన్ మొదటి విద్యార్థి ఈయనే. నరసింహ భట్నాగర్ అవార్డుతో పాటు, 2013లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు. మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంతో కలిసి “డెవలప్మెంట్స్ ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ” అనే పుస్తకాన్ని రచించారు. PM Narendra Modi condoles the demise of aerospace scientist Roddam Narasimha "He was an outstanding scientist, passionate about leveraging the power of science and innovation for India’s progress," says PM https://t.co/sKGUVnTKmB — ANI (@ANI) December 15, 2020 -
తండ్రిలాంటి వ్యక్తిని కోల్పోయా!
-
గోంగూర అన్నా...ఆవకాయ అన్నా ఎంతో మక్కువ
రైలుపేట(గుంటూరు): భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(93) మృతి పట్ల గుంటూరు జిల్లాకు చెందిన బీజేపీ నేతలు పలువురు సంతాపం తెలియజేశారు. వాజ్‌పేయితో తమకున్న అనుబంధాలను నెమరువేసుకున్నారు. రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న గుంటూరు జిల్లా కు 15 సార్లు వచ్చిన వాజ్‌పేయి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జనసంఘ్ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు సైతం గుంటూరులోనే జరిగింది. అనేకమార్లు రాజకీయ తీర్మానాలు గుంటూరు వేదికగా తీసుకున్నారు. అఖిల భారత జనసంఘం జాతీయ అధ్యక్షుడిగా, ఎంపీగా పనిచేస్తున్న కాలంలో 1968లో గుంటూరు జిన్నాటవర్ సెంటర్లో వీరసావర్కర్ రోడ్డును వాజ్‌పేయి ప్రారంభించారు. జిన్నాటవర్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ఈ రోడ్డును నిర్మించారు. మున్సిపల్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా పనిచేస్తున్న చేబ్రోలు హనుమయ్య కాంగ్రెస్‌పార్టీలో ఉన్నప్పటికీ వాజ్‌పేయితో ఈ రోడ్డును ప్రారంభింపచేశారు. చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వద్ద ఆయనకు పౌరసన్మానం కూడా చేశారు. తదుపరి జనసంఘ్ నగర అధ్యక్షుడు వనమా పూర్ణచంద్రరావు 1983లో గుంటూరు తూర్పు ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో ఆయనకు మద్దతుగా వాజ్‌పేయి గుంటూరులో ఎన్నికల ప్రచారం చేశారు. తన గెలుపుకోసం ప్రచారం చేసిన వాజ్‌పేయి లేరనే మాటను జీర్ణించుకోలేక పోతున్నామని వనమా ఆవేదనగా అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నలబోతు వెంకట్రావు, నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెలవర్తిపాటి పాండురంగవిఠల్, జిల్లా కార్యదర్శి పునుగుళ్ల రవిశంకర్, ఉపాధ్యక్షులు సత్యన్నారాయణ వాజ్‌పేయి మృతికి సంతాపం తెలిపి, ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. వాజ్‌పేయి మృతిపై వైఎస్సార్ సీపీ నేతల దిగ్బ్రాంతి పట్నంబజారు(గుంటూరు): భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహరీ వాజ్‌పేయి మృతి చెందటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుంటూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాజ్‌పేయి మృతి భారతదేశానికి, దేశ రాజకీయాలకు తీరని లోటని పార్టీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ, సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆతుకూరి ఆంజనేయులు, కిలారి రోశయ్య, పార్టీ నేత పాదర్తి రమేష్‌గాంధీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంగడి శ్రీనివాసరావు, అనుబంధ విభాగాల అధ్యక్షులు షేక్ జిలాని, బూరెల దుర్గాప్రసాద్, ఆళ్ళ పూర్ణచంద్రరావు, సాయిబాబుతో పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబంలో జన్మించి దేశంలో అత్యున్నత పదవులు చేపట్టిన గొప్ప వ్యక్తి వాజ్‌పేయి అని కీర్తించారు. కేంద్రంలో ఐదేళ్ల పాటు కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని నడిపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టి, ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించారని పేర్కొన్నారు. వాజ్‌పేయి మృతికి ఎమ్మెల్యే ఆర్కే సంతాపం మంగళగిరిటౌన్: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతిపట్ల మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. నిజాయితీపరుడైన రాజకీయ వేత్తను కోల్పోయామని, విలువలతో కూడిన రాజకీయాలను నడిపి భారతదేశానికే కాకుండా, ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన వాజపేయి మృతి దేశానికి తీరని లోటని అన్నారు. మా కుటుంబంతో ఎంతో అనుబంధం వాజ్‌పేయి జనసంఘ్ జాతీయ అ«ధ్యక్షుడిగా పనిచేస్తున్న సమయంలో మా తండ్రి జూపూడి యజ్ఙనారాయణ జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. తల్లి హైమావతమ్మతో పాటు నేను కూడా జన్‌సంఘ్‌లో పనిచేశాం. ఈ నేపథ్యంలో సుమారు 15 సార్లు వాజ్‌పేయి గుంటూరులోని మా ఇంటికి వచ్చి బసచేశారు. పలుమార్లు ఆయన గుంటూరు నుంచి ఇతర ప్రాంతాలకు సభలకు వెళ్లే సమయంలో నేనే స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వాజ్‌పేయిను తీసుకెళ్లాను. ఎన్నో విషయాలను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. కారులో వెళ్తున్న సమయంలో రోడ్డు అంతా గుంతల మయంగా ఉండి డ్రైవింగ్ ఇబ్బందిగా ఉండటాన్ని గమనించిన వాజ్‌పేయి ప్రభుత్వమే రోడ్ల నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని భావించారు. అందుకే ఆయన ప్రధాని అవగానే నాలుగులైన్ల జాతీయ రహదారులను వేయించి రవాణా రంగం అభివృద్ధి చేశారు. గుంటూరు గోంగూర అంటే ఆయనకు ఎంతో ఇష్టం. మా ఇంటికి వచ్చినప్పుడు గోంగూరను అడిగి వడ్డించమనేవారు. అవకాయపచ్చడి సైతం ఎంతో ఇష్టంగా తినేవారు. ఆయన ప్రధాని అయ్యాక కూడా అదే పిలుపు, అదే ఆప్యాయత చూపించారు. ప్రధాని అయ్యాక ఢిల్లీకి వెళ్లిన సమయంలో మమ్ముల్ని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. ఆయన మృతిని మా కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. –బీజేపీ సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజు తెనాలిలో వాజ్‌పేయి జ్ఞాపకాలు తెనాలి: భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి కన్నుమూశారన్న సమాచారం బీజేపీ అభిమానులనే కాదు, పట్టణానికి చెందిన పలువురు నాటి తరం పెద్దల మనసుల్లో విచారం నింపింది. అఖిల భారత జనసంఘ పార్టీ, బీజేపీ పార్టీ అధ్యక్షుడి హోదాలోనూ రెండు పర్యాయాలు ఆయన తెనాలిని సందర్శించారు. అప్పట్లో జిల్లా కేంద్రం కూడా కాని తెనాలి పట్టణానికి రావటానికి, జిల్లాలో ఆయా పార్టీలకు మూలస్తంభం వంటి ప్రముఖుడు దివంగత తమిరిశ రామాచార్యులు ఆహ్వానం ప్రధాన కారణం. ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆకర్షితుడై జనసంఘ్ పార్టీ, తర్వాత బీజేపీలోనూ జీవితాంతం కొనసాగిన రాజకీయనేత టి.రామాచార్యులు, తెనాలిలో ఆయా పార్టీల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలే కాదు, పార్టీ నిర్దేశించిన అనేక కార్యక్రమాల నిర్వహణలో చొరవ చూపారు. ఆయన ఆహ్వానంపైనే జనసంఘ సమావేశంలో పాల్గొనేందుకు 1971లో వాజ్‌పేయి అఖిల భారత జనసంఘ అధ్యక్షుని హోదాలో తొలిసారిగా తెనాలికి వచ్చారు. స్వరాజ్ టాకీస్‌లో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. 1980 ఏప్రిల్ 6వ తేదీన ఢిల్లీలో వాజ్‌పేయి అధ్యక్షతన జరిగిన సమావేశంలోనే నూతన పార్టీ ఏర్పాటుకు నిర్ణయం జరిగి, భారతీయ జనతా పార్టీ అవిర్భవించింది. తెనాలి నుంచి ఆ సమావేశానికి టి.రామాచార్యులు హాజరై వాజ్‌పేయిని అభినందించారు. ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ శాఖ ఏర్పాటైంది. జిల్లా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన టి.రామాచార్యులు ఆహ్వానంపై మరోసారి వాజ్‌పేయి తెనాలికి వచ్చారు. తెనాలి మార్కెట్ సెంటర్లో జరిగిన సభలో వాజ్‌పేయితో అప్పటి ఎమ్మెల్సీ జూపూడి యజ్ఞనారాయణ, బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు డీఎస్పీ రెడ్డి, జానా కృష్ణమూర్తి వేదికపై ఉన్నారు. మాచర్లతో ఎనలేని అనుబంధం మాచర్లరూరల్: మాజీ ప్రధాని వాజ్‌పేయికి మాచర్ల నియోజకవర్గంతో ఎంతో అనుబంధం ఉంది. ఈయన 1983లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కర్పూరపు కోటయ్య తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోదండ రామాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. -
ఢిల్లీ ఛోడ్ దో : మోదీకి వాజ్‌పేయి ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ : భరత మాత ముద్దుబిడ్డ, బీజేపీ పెద్ద దిక్కు అటల్ బిహారీ వాజ్‌పేయి(93) దివికెగిశారు. వాజ్‌పేయి ఇక లేరని వార్తను యావత్ భారత్ దేశం తట్టుకోలేకపోతుంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అయితే అటల్జీ మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. వాజ్‌పేయి లేకపోవడం ఒక యుగాంతంలా ఉంది అని కన్నీరు పెట్టుకున్నారు. వాజ్‌పేయికి, ప్రధాని నరేంద్ర మోదీ అవినాభావ సంబంధం ఉంది. మోదీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వాజ్‌పేయితో మంచి సంబంధాలు కొనసాగేవి. 1995, 1998లలో జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా మోదీ పోషించిన పాత్రను వాజ్‌పేయి ఎంతో అభినందించారు. 1998 ఎన్నికల సమయంలో హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలన్నీ మోదీనే తన భుజంపై వేసుకున్నారు. ఆ సమయంలోనే గుజరాత్‌కు కూడా మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో మోదీ ఢిల్లీలోనే ఉన్నారు. కానీ అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. 1995, 1998 ఎన్నికల్లో మోదీ వ్యూహాల రూపకల్పనపై వాజ్‌పేయి ఎంతో ఇంప్రెస్ అయ్యారట. ఆ తర్వాత రెండు మూడేళ్లకు గుజరాత్ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ ఆరోగ్యం క్షీణించడం, అడ్మినిస్ట్రేషన్ కుదుపులకు లోనుకావడం జరిగింది. ఇక 2001 రిపబ్లిక్ డే రోజునే గుజరాత్‌ను పెను భూకంపం కబళించింది. ఈ పర్యావరణ విపత్తులో 15వేల మంది నుంచి 20 వేల మంది వరకు మరణించారు. ఆ సమయంలో ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాజ్‌పేయి నుంచి మోదీకి పిలుపు అందింది. వెంటనే వచ్చిన 7 రేస్ కోర్స్ రోడ్డు(ప్రస్తుతం 7, లోక్ కల్యాణ్ మార్గ్)లో ఉన్న తన అధికారిక నివాసంలో తనను కలవాల్సిందిగా వాజ్‌పేయి మోదీని ఆదేశించారు. వాజ్‌పేయి ఆదేశాల మేరకు, మోదీ వెళ్లి ఆయన్ను కలిశారు. ‘వెంటనే నీవు ఢిల్లీ వదిలి వెళ్లాలి. ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందే’ అన్నారట. వాజ్‌పేయి మాటలకు ఏమైందోనని తీవ్ర షాకింగ్‌కు గురైన మోదీ, ఎక్కడికి వెళ్లాలి అని అడిగారట? కేవలం ఒక్క పదంలోనే వాజ్‌పేయి సమాధానం కూడా చెప్పారు. గుజరాత్ అని. కొన్ని రోజుల అనంతరం 2001 అక్టోబర్ 7న కేశుభాయ్ పటేల్ స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత నాలుగు నెలలకు అంటే 2002 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నుంచి గోద్రా రైలులో వస్తున్న కర్ సేవకులకు, దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో 59 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తదనంతరం గుజరాత్లో పెద్ద ఎత్తున్న మతహింస కాండ జరిగింది. ఆ అల్లర్లలో అధికారిక లెక్కల ప్రకారం 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులూ మరణించినట్టు తెలిసింది. కానీ వాస్తవానికి 2,000 కు పైగా మరణించి ఉంటారని అంచనా. ఈ అల్లర్ల సమయంలో మోదీకి, వాజ్‌పేయి ఒక్కటే సూచించారట. ఎట్టిపరిస్థితుల్లో ‘రాజధర్మా’న్ని వదలొద్దని. రాజధర్మం అంటే అధికారంలో ఉన్న వాళ్లు ఎగువ, దిగువ కులాల మధ్య వ్యత్యాసం చూపరాదని సమాజంలోని అన్ని మతాల ప్రజల పట్ల సమాదరణ కలిగి ఉండాలని స్పష్టంచేశారట. ఈ అల్లర్లు మోదీ ఇమేజ్ను ఏ మాత్రం దెబ్బతీయలేదు. 2002 గుజరాత్ అల్లర్లపై రాజకీయంగా ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ.. సమర్థంగా తన అధికారాన్ని నిలబెట్టుకున్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి, మంచి ఉత్తమమైన పరిపాలన కార్యశీలిగా పేరు తెచ్చుకున్నారు. 2007, 2012 ఎన్నికల్లో గుజరాత్లో మోదీనే ఘన విజయం సాధించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ వేవ్, 2014 గుజరాత్ ఎన్నికల్లో కూడా సఫలమై, ఎన్డీయే తరుఫున భారత్ ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. -
రాజకీయ భీష్ముడి జ్ఞాపకాలు
కర్నూలు(హాస్పిటల్): రాజకీయ భీష్ముడు, భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గురువారం మరణించడంతో ఆయనతో ఉన్న జ్ఞాపకాలు జిల్లా నేతలు ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన నాయకులు అప్పటి సంఘటనలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుని ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని, సేవలను, అభివృద్ధిని కొనియాడారు. బీజేపీ అగ్రనేతగా ఆయన కర్నూలు జిల్లాకు నాలుగుసార్లు వచ్చారు. 1969లో జేఎస్ నాగప్ప జనసంఘ్ అభ్యర్థిగా కర్నూలు పార్లమెంట్ స్థానానికి పోటీచేయగా.. ఆయన తరపున ప్రచారానికి వచ్చారు. అలాగే 1973లోనూ జనసంఘ్ పార్టీ తరపున ఆయన జిల్లాలో పర్యటించారు. జనతా ప్రభుత్వం పడిపోయిన తర్వాత మరోసారి కర్నూలు నగరంలోని మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత 1989–90 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కర్నూలు, నంద్యాలలో బీజేపీ అభ్యర్థులు కపిలేశ్వరయ్య(కర్నూలు), ఎస్పీవై రెడ్డి(నంద్యాల) తరపున ఆయన ప్రచారం చేశారు. ఎంతో మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వాజ్‌పేయి గురించి ఆయనతో సన్నిహితంగా మెలిగిన పలువురు బీజేపీ నాయకుల మనోభావాలు ఇలా.. కమలాలతో నివాళి నంద్యాల విద్య: భారత మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి మృతికి నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ తన సూక్ష్మచిత్రాల ద్వారా చిత్రనివాళులర్పించారు. ఆయన కేవలం రెండు గంటల వ్యవధిలో వాజ్‌పేయి చిత్రపటాన్ని 620 కమలాలతో చిత్రించి నివాళులర్పించారు. కారులోనే వచ్చారు 1991లో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సమయంలో నేను బీజేపీ అభ్యర్థిగా ఉన్నాను. నంద్యాల నుంచి ఎస్పీవై రెడ్డి పోటీలో ఉన్నారు. ఉదయం 10 గంటలకు మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సభకు రావాల్సి ఉండగా భారీ వర్షాలు పడటంతో విమానంలో రావడానికి కుదరలేదు. దీంతో కారులో సాయంత్రం 5.30 గంటలకు వచ్చారు. ఆయన భోజనం కూడా చేయకుండా మీటింగ్‌కు వచ్చారు. ఆ తర్వాత నంద్యాల వెళ్లాము. ఆ మీటింగ్ పూర్తయ్యే సరికి రాత్రి 11 గంటలకు అయ్యింది. అప్పుడు మధ్యాహ్నం కూడా భోజనం చేయకపోవడంతో ఆకలిగా ఉందని చెప్పారు. చేపట్టిన పని కోసం ఏ విధంగా శ్రమిస్తారనేది ఆ సంఘటన ద్వారా తెలుసుకున్నాను. భారతమాత దేశభక్తి కలిగిన వ్యక్తిని కోల్పోయింది. ఢిల్లీ నుంచి పాకిస్తాన్‌కు బస్సు ప్రయాణం చేసిన ఏకైక ప్రధాని ఆయనే. ముస్లింలకు హజ్ యాత్ర వెళ్లేందుకు 35 శాతం సబ్సిడీ ఇచ్చారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న లక్నో నుంచి ఆయన పలుమార్లు ఎన్నికయ్యారు. – కపిలేశ్వరయ్య, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాకు స్వయంగా భోజనం వడ్డించారు 1980లో గుంతకల్‌లో, 1981లో బళ్లారికి వచ్చిన సందర్భంగా వాజ్‌పేయిని నేను కలిశాను. ఆయన బాగోగులు చూసుకునేందుకు కర్నూలు నుంచి నన్ను బళ్లారికి పంపించారు. బళ్లారిలోనే నేను ఉండి ఆయనతో పాటు డోన్ వరకు రైలులో ప్రయాణించాను. ఆయన భోజనం చేసిన తర్వాత ప్లేటు కడిగేందుకు వెళ్లగా ఒప్పుకోలేదు. ఆయనే స్వయంగా ప్లేటు కడిగారు. ఆ తర్వాత ఆయన మాకూ స్వయంగా భోజనం వడ్డించారు. 1989–90 ఎన్నికల్లో కపిలేశ్వరయ్య కోసం ప్రచారానికి ఆయన వచ్చినప్పుడు కూడా కలిశాను. అప్పట్లో అలంపూర్ వద్ద ఆయన కోసం ప్రత్యేక హెలిప్యాడ్ ఏర్పాటు చేశాము. అయితే వర్షాలు అధికంగా ఉండటంతో పైలెట్ ఒప్పుకోకపోవడంతో ఆయన కారులోనే కర్నూలుకు వచ్చారు. – ఇ. మల్లికార్జున్‌రెడ్డి, ఏబీపీఎం సభ్యులు, ఏకలవ్యాన్ భుజం తట్టింది ఇప్పటికీ గుర్తే వాజ్‌పేయితో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఉన్న మురళీమనోహర్ జోషి ఏక్తాయాత్ర చేపట్టి జమ్మూలోని వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లారు. ఆ సమయంలో వాజ్‌పేయిని కలిసేందుకు నేనూ వెళ్లాను. ఆలయం వద్ద ఆయనను కలిసి మాట్లాడాను. అంత పెద్ద నాయకుడైన ఆయన మాతో కొద్దిసేపు ముచ్చటించారు. నేను 8వ తరగతి చదువుతున్న సమయంలో కర్నూలు మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే ఓ కార్యక్రమానికి వాజ్‌పేయి వచ్చారు. ఆ సందర్భంగా మా తండ్రి కాళింగి పుల్లయ్యవర్మ సూచనతో నేను వాజ్‌పేయికి పూల దండ వేశాను. అప్పడు ఆయన నా భుజం తట్టారు. ఆ విషయం ఇంకా గుర్తుంది. – కాళింగి నరసింహవర్మ, బీజేపీ సీనియర్ నాయకులు -
స్వర్ణ చతుర్భుజి ఎంత బాగుందో..
జ్ఞాపకం :తన కలల రహదారి ‘స్వర్ణ చతుర్భుజి’పై ప్రయాణించడం మంచి అనుభూతిని మిగిల్చిందని అటల్ బిహారీ వాజ్‌పేయి వ్యాఖ్యానించారు. ‘ఈ రోడ్డు ఎంత బాగుందో’ అని మురిసిపోయారు. ప్రధాని హోదాలో 2004 సంవత్సరంలో ఆయన నెల్లూరు నగరానికి వచ్చారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. నెల్లూరు వంటకాలను వాజ్‌పేయి రుచి చూశారు. సాయంత్రం జరిగిన బహిరంగ సభ అనంతరం ఆయన హెలికాప్టర్లో చెన్నైకి వెళ్లాల్సి ఉంది. కానీ సభ ముగిసే సరికి చీకటి పడింది. హెలికాప్టర్ ద్వారా ప్రయాణించేందుకు భద్రతా అధికారులు అంగీకరించలేదు. దీంతో ఆయన రహదారి మీదుగా చెన్నైకు బయలుదేరారు. హెలికాప్టర్లో కాకుండా రహదారి మీదుగా వెళ్లాల్సి ఉంటుందని వాజ్‌పేయికి వెంకయ్యనాయుడుతోపాటు అధికారులు చెప్పినపుడు ఆయన ఎంతో çసంతోషాన్ని వ్యక్తం చేశారు. తన కలకల రహదారైన స్వర్ణ చతుర్భుజి మీదుగా ప్రయాణించడం తనకు మంచి అనుభూతిని కలిగించిందని చెన్నైకి వెళ్లిన తరువాత అటల్ వ్యాఖ్యానించారు. దేశంలోని నాలుగు మెట్రో నగరాలను కలుపుతూ నాలుగు వరుసల రహదారి నిర్మాణం వాజ్‌పేయి చేపట్టి పూర్తి చేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ముంబయి నుంచి కోల్‌కతా వరకు అనుసంధానం చేస్తూ జాతీయ రహదారి(నాలుగు లేన్లు) నిర్మించారు. అందులో భాగంగా జిల్లాలో 190 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. గురువారం ఆయన ఈ లోకాన్ని వీడిపోయారు. జిల్లాతో ఆయనకు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. ఐదుసార్లు జిల్లాకు వచ్చి వెళ్లారు. ఆయన జ్ఞాపకాలను జిల్లావాసులు గుర్తుచేసుకుంటున్నారు. మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం అందరికీ ఆదర్శం అని, ఆయన మృతి దేశానికి తీరని లోటని జిల్లాకు చెందిన పలువురు నాయకులు, ప్రజాపతినిధులు పార్టీలకు అతీతంగా పేర్కొన్నారు. వాజ్‌పేయికి నెల్లూరు జిల్లాతో ఉన్న అనుబంధంపై ప్రత్యేక కథనం నెల్లూరు(బారకాసు):జనసంఘ్ పార్టీని స్థాపించిన తరువాత పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించే ప్రక్రియలో భాగంగా 1977లో ఆయన నెల్లూరుకు వచ్చారు. అప్పుడు పార్టీ నేతలతో ఆయన ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. కార్యకర్తలందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి అనుమానాలను నివృత్తి చేశారు. నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసంఘ్ తరపున అన్నదాత మాధవ రావు విజయం సాధించి పార్టీకి ఒక గుర్తింపును తీసుకొచ్చారు. ఆ తరువాత జనతా పార్టీలో జనసంఘ్ విలీనమైన తరువాత అందులో నుంచి బయటకు వచ్చేసి 1980లో బీజేపీని ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటైన మొదటి సంవత్సరంలో నగరంలోని పురమందిరం(టౌన్‌హాల్)లో జరిగిన బీజేపీ బహిరంగ సభకు హాజరయ్యారు. 1983లో ఆయన ఉదయగిరిలో ఆ పార్టీ తరపున అసెంబ్లీకి పోటీ చేసిన ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుకు మద§ద్దతుగా ప్రచారం చేసేందుకు వచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ తరపున ఇందిరాగాంధీ కూడా జిల్లాకు వచ్చారు. అప్పట్లో ఆయన ప్రసంగాలు అందరినీ ఆకట్టుకునేవి. హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడినా.. కొద్దిపాటి భాషా పరిజ్ఞానం ఉన్నవారికి కూడా సులభంగా అర్థమయ్యేది. ప్రసంగంలో ఆయన ఉపయోగించే కవితలు, చమత్కారాలు ఎంతగానో ఆకట్టుకునేవి. అంతేగాక విమర్శలు చేసేటప్పుడు కూడా ఎంతో సంస్కారవంతమైన పదాలను ఉపయోగించి తన హుందాతనాన్ని నిలుపుకునే వారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దువ్వూరు రాధాకృష్ణారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు. అందులో పాల్గొన్న వాజ్‌పేయి కాంగ్రెస్, టీడీపీపై చేసిన విమర్శలను కూడా ప్రజలను ఆసక్తిగా వినడం గమనార్హం. వీఆర్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో కూడా వాజ్‌పేయి పాల్గొన్నారు. రాజకీయాల్లో విలువలకు అధికంగా ప్రాధాన్యం ఇచ్చే వాజ్ పేయి సభలకు పార్టీలకు అతీతంగా ప్రజలు హాజరయ్యేవారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే కమ్యూనిస్టులు కూడా ఆయన సభలకు హాజరై ఆయన ప్రసంగాలు విని ఆనందించేవారు. 2004లో భారత ప్రధానిగా ఆయన నెల్లూరు నగరానికి వచ్చారు. అప్పట్లో ఏసీ సుబ్బారెడ్ది స్టేడియంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పా ల్గొన్నారు. ఆ రోజున వాజ్ పేయికి మోకాలు నొప్పి అధికం కావడంతో ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన గంటన్నర పాటు విశ్రాంతి తీసుకున్నారు. వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అతిథి గృహానికి పిలిపించుకుని వారితో ముచ్చటించారు. వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్‌ను రాజకీయాలలోకి రావాలని కూడా ఆయన ఆహ్వనించారు. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కు చెందిన షార్ కేంద్రాన్ని కూడా ఆయన సందర్శించారు. 2003లో షార్ కేంద్రానికి ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త సతీష్ ధావన్ పేరును పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పేరును ప్రధానిగా వాజ్‌పేయి పెట్టారు. షార్ ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో ఆవిష్కరించారు. షార్ కేంద్రాన్ని చూస్తే తనలో నూతనోత్సాహం వస్తుందని పలుమార్లు ఆయన శాస్త్రవేత్తలకు తన మనసులోని మాటను తెలిపారు. సతీష్ దవన్ స్పేస్ సెంటర్ నామకరణం చేసింది వాజ్‌పేయి సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధవన్స్పేస్సెంటర్ (షార్) కేంద్రంతో మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి విడదీయరాని అనుబంధాన్ని పెంచుకున్నారు. ఆయన 1999 నుంచి 2004 దాకా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1999 మే 26న షార్‌లో నిర్వహించిన పీఎస్ఎల్వీ సీ2 ప్రయోగానికి విచ్చేశారు. ఆ ప్రయోగంలో సముద్రాల మీద ఆధ్యయనం చేసేందుకు ఐఆర్ఎస్–పీ4 (ఓషన్‌శాట్)తో పాటు కిట్‌శాట్–3, ఉత్తరకొరియాకు చెందిన డీఎల్ఆర్ మైక్రోశాటిలైట్స్, జర్మనీ టబ్‌శాట్ అనే ఐదు ఉపగ్రహాలను రోదసీలోకి పంపించారు. ఈ ప్రయోగాన్ని తిలకించేందుకు వాజ్‌పాయి ప్రధాని హోదాలో విచ్చేశారు. అప్పటిదాకా అందరు ప్రధానులు మిషన కంట్రోల్ సెంటర్ నుంచి ప్రయోగాన్ని తిలకించేవారు. అలాంటింది ప్రయోగాన్ని దగ్గరగా తిలకించాలని కోరడంతో ఆయన కోసం ప్రయోగవేదికకు సుమారు ఐదు కిలోమీటర్లు దూరంలో ఒక కూడలిలో అప్పట్లో సుమారు రూ.5 లక్షలు వెచ్చించి ప్రత్యేకంగా ఒక షెడ్డు వేశారు. దీనికి త్రీడీ గ్లాసులు కూడా ఏర్పాటు చేశారు. ఆ త్రీడీ గ్లాసుల్లో నుంచి ప్రయోగాన్ని మొదటి దశలో మండే దగ్గర నుంచి ఆయన ప్రత్యక్షంగా తిలకించారు. ప్రయోగాన్ని తిలకించిన తరువాత మిషన్ కంట్రోల్ సెంటర్‌కు విచ్చేసి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత 2004లో షార్ కేంద్రానికి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌గా పేరు మార్పుచేసినపుడు వాజ్‌పేయి చేతులు మీదుగా ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా ఆవిష్కరించారు. ఆయన షార్కు విచ్చేసినపుడు అప్పటి ఇస్రో చైర్మన్ కస్తూరిరంగన్, అప్పటికి షార్ డైరెక్టర్ వసంత్ ఘనంగా స్వాగతం పలికారు. వాజ్‌పేయి మరణం తీరనిలోటు నెల్లూరు(బారకాసు):మాజీ ప్రధాని వాజ్‌పేయి మరణం బీజేపీ శ్రేణులకు తీరని బాధ కలిగిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిడతల రమేష్ తెలిపారు. ఆయన మరణానికి తాము సంతాపాన్ని ప్రకటిస్తున్నామన్నారు. రోడ్లు, నదులు అనుసంధానం, ప్రోక్రాన్ అణుపరీక్షలతో దేశాన్ని అభివృద్ధి పథంలో వాజ్‌పేయి తీసుకెళ్లారన్నారు. ఆయనకు నెల్లూరుజిల్లాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటే ఆవేదన కలుగుతుందన్నారు. వాజ్‌పేయి మృతికి మేకపాటి సంతాపం నెల్లూరు(సెంట్రల్): మాజీ ప్రధాని, భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న అటల్ బిహారీ వాజ్‌పేయి మృతిపై నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యతరగతి కుటుంబం లో జన్మించి, అత్యున్నత శిఖరాలను చేరిన ఆయన జీవితం దేశానికే గర్వకారణం అని తెలిపారు. దేశంలోని ప్రధాన నగరాలను కలు పుతూ రహదారులను నిర్మించిన గొప్ప దార్శనికుడని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ప్రధానిగా ఉండి కూడా ఏ మాత్రం ఎవరినీ ఇబ్బందులకు గురిచేయకుండా ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రధానంగా కార్గిల్ యుద్ధంలోనూ , ప్రోక్రాన్–2 అణుపరీక్షల నిర్వహణలోనూ ఆయన స్థిర చిత్తంగా వ్యవహరించారని పేర్కొన్నారు. 1999లో ఆయన ప్రభుత్వం ఒకే ఒక ఓటుతో విశ్వాసం కోల్పోయిన ఘటన ఆయనకు ప్రజాస్వామ్యం పట్ల ఉన్న నిబద్ధతకు తార్కాణం తెలిపారు. పదవిని తృణపాయంగా విడిచిపెట్టి భావి తరాలకు ప్రజాస్వామ్య విలువలను తెలియజేశారని రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. చిరంజీవి యువతకు అభినందనలు నెల్లూరు(బృందావనం):గుజరాత్లో 2001సంవత్సరం జనవరిలో జరిగిన భూకంపం కారణంగా బాధితులైన వారిని ఆదుకున్న అఖిలభారత చిరంజీవి యువతను అప్పటి భారత ప్ర«ధాని అటల్‌బిహారీవాజ్‌పేయి అభినందించారని యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెల్లూరుకు చెందిన చిరంజీవి అభిమాని కొట్టే వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం రాత్రి విలేకరులకు తెలిపారు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో భూకంప బాధితులను అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షుడు ఆర్.స్వామినాయుడు ఆధ్వర్యంలో ఉభయ తెలుగురాష్ట్రాలకు చెందిన చిరంజీవి యువత నాయకులు సురేష్(కర్నూలు), బషీర్(ఒంగోలు), ఆనందరాజు(హైదరాబాద్), రవీంద్రబాబు(గుంటూరు) తదితరులతో కలసి రెండునెలలకు పైగా కచ్‌ప్రాంతంలో విశేష సేవలందించామన్నారు. ఈ విషయాన్ని స్వయంగా తామంతా అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయిని ఆయన కార్యాలయంలో కలసి తమ సేవలను వివరించామన్నారు. అలాగే తాము అఖిలభారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో సేకరించిన రూ.3లక్షల చెక్కును అందజేశామని కొట్టే వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన తాముచేసిన సేవలను గుర్తించి ఎంతో ప్రశంసించారని, అలాగే అభిమానులుగా స్వయంగా వచ్చి సేవలందించడంపట్ల, నటుడిగా ఉన్న చిరంజీవికి అభినందనలు తెలిపారన్నారు. -
తిరుమదిలో వాజ్‌పేయి
రాజకీయాల్లో మెరిసిన భారత రత్నం అటల్ బిహారీ వాజపేయి. పార్లమెంటరీ విలువలకు నిలు వెత్తు నిదర్శనం ఈ నిష్కళంక రాజనీతిజ్ఞుడు. ఒక్క ఓటుతో ప్రధాని పదవి పోతుందని తెలిసినా నీతిమాలిన చర్యలకు పాల్పడని గొప్ప ఆదర్శవాది. ప్రతిభ ఆధారంగా వరించి వచ్చిన పదవులకు వన్నెలద్దిన మహనీయుడు. భారత పార్లమెంటరీ చరిత్ర పుటల్లో తనదైన ముద్రవేసుకున్న మహానుభావుడు. గురువారం ఆయన దివంగతులయ్యారని తెలియగానే జిల్లా ప్రజానీకం శోకతప్త హృదయాలతో నివాళులర్పించింది. ఆయనకు జిల్లాకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంది. సాక్షి, తిరుపతి: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తిరుమల వాసులకు చిరకాలం గుర్తుండే నాయకుడు. తాగునీటికి ఇబ్బందులు పడుతున్న సమయంలో కళ్యాణీ డ్యాం నుంచి నీటి పంపింగ్ వ్యవస్థను ప్రారంభించిన ప్రధాని అని తిరుమల వాసులు చెప్పుకుంటున్నారు. ఆయన మరణంతో తిరుమల వాసులు సంతాపం తెలియజేశారు. 1997–98 మధ్య కాలంలో తిరుమలలో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. ఆ సమయంలో అప్పటి టీటీడీ ఈఓ ఐవీ సుబ్బారావు నీటి సమస్య తీర్చేం దుకు అధికారులతో సమావేశమయ్యారు. తిరుపతి సమీపంలోని కళ్యాణీ డ్యాం నుంచి నీటిని తిరుమలకు తీసుకురావాలని నిర్ణయించారు. 1999 నవంబర్ 18న కళ్యాణీ డ్యాం నుంచి తిరుమలకు నీటిని పంపింగ్ చేయటానికి భూమిపూజ చేశారు. పంపిం గ్ పనులను 61 రోజుల్లో పూర్తి చేశారు. 2000లో తిరుమలకు వచ్చిన అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నీటి పంపింగ్ వ్యవస్థను ప్రారంభించా రు. దానికి కళ్యాణి గంగ అని నామకరణం చేశారు. ఆ సందర్భంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు అప్పటి టీటీడీ తొలి స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ రాంబాబు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు 1999, ఆ తర్వాత 2003లో ప్రధాన మంత్రి హోదాలో తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రధాన మంత్రి హోదాలో తిరుపతి దూరదర్శన్ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. 1981లో బీజేపీ జాతీయ పార్టీ అ«ధ్యక్షుని హోదాలో అటల్ బీహార్ వాజ్‌పేయి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నికల ప్రచార సభలో వాజ్‌పేయి.. ప్రధాని కాకముందు నుంచే వాజ్‌పేయి జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. 1981లో బీజేపీ తిరుపతి కోనేటి కట్ట వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. 1994లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తంబళ్లపల్లె, మదనపల్లె, వాయల్పాడు, పీలేరు, తిరుపతిలో పర్యటించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా సంతాప సభలు.. వాజ్‌పేయి మృతి పట్ల జిల్లాలోని బీజేపీ నాయకులు సంతాప సభలు నిర్వహించి ఆయన సేవలను కొనియాడారు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మదనపల్లెలో చల్లపల్లి నరసింహారెడ్డి వాజ్‌పేయితో ఉన్న అనుబంధం గురించి ప్రస్తావించారు. 1980లో తాను పార్టీలో చేరిన సమయంలో వాజ్‌పేయిని కలిసినట్లు తెలిపారు. ఆయన పలుకరింపు ఎప్పటికీ మరచిపోలేనన్నారు. -
కరుణపైనే ఆయనకు మక్కువ
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలో నామమాత్రంగా ఉన్న భారతీయ జనతా పార్టీకి జవసత్వాలు కల్పించి అధికారంలోకి వచ్చేలా బలోపేతం చేసిన ఆ పార్టీ నేతల్లో ప్రథముడు అటల్ బిహారీ వాజ్‌పేయి అని చెప్పక తప్పదు. అయితే అంతటి మహానేత జీవితంలో చారిత్రాత్మక చేదు అనుభవాన్ని తమిళనాడు మిగిల్చింది. 1996లో అటల్ ప్రభుత్వం తొలిసారిగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చినా తగిన మెజార్టీ లేకపోవడంతో ప్రధాని పదవికి వాజ్‌పేయి రాజీనామా చేశారు. ఎన్డీఏలో లేని కొన్ని ఇతర పార్టీల వారు వాజ్‌పేయ్‌కి లోపాయికారితనంగా మద్దతుపలుకుతామన్నా అయన అంగీకరించలేదు. ఎంపీలను కొనుగోలు చేయడం వంటి నీతిబాహ్యమైన పనులకు పాల్పడడం తనకు నచ్చదు. అందుకే మెజార్టీ లేదని ఒప్పుకుంటూ రాజీనామా చేస్తున్నానని వాజ్‌పేయ్ నిజాయితీగా తప్పుకున్నారు. ఇంద్రకుమార్ గుజ్రాల్ ప్రభుత్వం కూలిపోయిన తరువాత 1998–99లో వచ్చిన మద్యంతర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి రాగా వాజ్‌పేయి ప్రధాని అయ్యారు. ఆనాటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే మద్దతు పలికింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే కూటమి తమిళనాడులో 39కి గానూ 30 సీట్లు గెలుచుకుని జాతీయస్థాయిలో ప్రాముఖ్యతను పొందింది. అన్నాడీఎంకే కీలకపాత్ర పోషించగా అప్పటి ఎన్నికల్లో ఎన్డీఏకి 255 సీట్లు దక్కగా 37.5 శాతం మెజార్టీతో అత్యధిక శాతం సీట్లు కలిగిన కూటమిగా కేంద్రంలో వాజ్‌పేయ్ నేతృత్వంలో ప్రభుత్వం అవతరించింది. కేంద్రంపై తనకు పూర్తి పట్టు ఉండడంతో జయ కొన్ని కోర్కెలను వాజ్‌పేయ్ ముందుంచింది. తనపై ఉన్న అన్ని అవినీతి కేసులను ఎత్తివేయాలని, రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని జయ కోరారు. ఇందుకు వాజ్‌పేయ్ ప్రభుత్వం నిరాకరించడం జయకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఎన్డీఏ ప్రభుత్వ బలపరీక్ష సమయంలో జయ తన చేతిలో ఉన్న ఒకే ఒక ఓటును వ్యతిరేకంగా వేయడం ద్వారా 13 నెలల వాజ్‌పేయ్ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. ఈ రకంగా వాజ్‌పేయ్‌కి తమిళనాడుతో శాశ్వతమైన చేదు అనుభవమే మిగిలింది. తమిళనాడుతో తరగని అనుబంధం: ♦ 1983–84 మధ్యకాలంలో బీజేపీ నేతగా వాజ్‌పేయ్ తొలిసారి తమిళనాడులో కాలుమోపి కోయంబత్తూరుకు వచ్చారు. ♦ 1995లో ఎండీఎంకే మహానాడుకు వాజ్‌పేయ్ హాజరయ్యారు. ♦ 1995లో మదురైకి, 1997లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ప్రధాని హోదాలో తిరుచ్చిరాపల్లికి వచ్చారు. ♦ రెండోసారి ప్రధాని అయినపుడు 1999లో శ్రీలంక ఈలం తమిళుల రక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలపై అప్పటి తమిళనాడుముఖ్యమంత్రి కరుణానిధితో పలుమార్లు మాట్లాడారు. ♦ 2001లో తిరుచ్చిరాపల్లి పర్యటనలో వాజ్పేయితోపాటూ వైగో, డాక్టర్ రాందాస్, కాంగ్రెస్ నేత కుమారమంగళంతోపాటూ ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ కూడా ఉండడం చెరిగిపోని చరిత్ర. ♦ కావేరి జలవివాదంపై 2002–03 మధ్య కాలంలో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అగ్రనేత శ్రీకృష్ణ, తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వంతో చర్చలు జరిపారు. ♦ 2004 ఏప్రిల్‌లో రోడ్డు మార్గంలో నెల్లూరుకు వెళ్లేందుకు చెన్నై ఎయిర్‌పోర్టులో దిగిన ప్రధాని వాజ్‌పేయ్‌కి ముఖ్యమంత్రి జయలలిత స్వాగతం పలకడం ద్వారా స్నేహాన్ని పెంచుకున్నారు. ♦ తమిళనాడులోని అందరు నేతల కంటే కరుణానిధి అంటే వాజ్‌పేయ్‌కి ఎంతో ప్రేమాభినాలు కనబరిచేవారు. -
బీజేపీ కార్యాలయంలో అటల్జీ పార్థివదేహం..
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి పార్ధివ దేహాన్ని ఆయన నివాసం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. పార్టీ కార్యాలయంలో దివంగత నేత భౌతిక కాయానికి పెద్దసంఖ్యలో తరలివచ్చిన పార్టీ నేతలు నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు బీజేపీ కార్యాలయంలో దివంగత నేతకు తుది నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 1 గంట వరకూ కడసారి దర్శనం చేసుకునేందుకు ప్రజలను అనుమతిస్తారు. ప్రియతమ నేతకు వీడ్కోలు పలికేందుకు బాధాతప్త హృదయాలతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పార్టీలకతీతంగా జనం పెద్దసంఖ్యలో దేశ రాజధానికి తరలివచ్చారు. ఇక మధ్యాహ్నం నాలుగు గంటలకు దివంగత నేత అంతిమ యాత్ర ప్రారంభమవనుంది. రాష్ర్టీయ స్మృతి స్ధల్లో వాజ్‌పేయి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లాల్ బహుదూర్ శాస్ర్తి విజయ్ ఘాట్, నెహ్రూ మెమోరియల్ శాంతి వన్ల మధ్య స్మృతి స్థల్లో అంత్యక్రియలు జరగనున్నాయి. -
మహాశిఖరానికి నివాళులు అర్పించేందుకు..
ఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులు అర్పించేందుకు పార్టీలకు అతీతంగా నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. కృష్ణ మీనన్ మార్గ్‌లోని నివాసంలో వాజ్‌పేయిని కడసారి చూసేందుకు జనం పోటెత్తారు. ఈ క్రమంలోనే వాజ్‌పేయి స్మృతులను గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయి పార్ధివ దేహానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్‌లు లు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వాజ్‌పేయి మృతి దేశానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఆయన అందరితో బాగుంటూ, గొప్ప మానవతావాదిగా ఉండేవారన్నారు. కేరళ, తమిళనాడు గవర్నర్లు సదాశివం, భన్వరీలాల్ పురోహిత్‌లతో పాటు వైఎస్సార్సీపీ నేతల విజయసాయి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, వరప్రసాద్‌లు వాజ్‌పేయి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. బాలీవుడ్ ప్రముఖులు జావేద్ అక్తర్, షబానా అజ్మీలు వాజ్‌పేయికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. -
అటల్ జీ.. ఓ జ్ఞాపకం
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆయన ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారు. శత్రు దేశంలో సైతంఅభిమానులను సంపాదించుకున్న గొప్ప దార్శనికుడిగా మాజీ ప్రధాని అటల్ బిహారివాజ్‌పేయి గుర్తింపు పొందారు. అంతటి గొప్పనేత గురువారం సాయంత్రం మృతి చెందారు. అటల్ మరణంతో నగరం కన్నీటి పర్యంతమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా,ప్రధానమంత్రిగా వివిధ సందర్భాల్లో వాజ్‌పేయి గ్రేటర్లో పలుమార్లు పర్యటించారు.ఇక్కడితో ఆయనకున్న అనుభవాలు, బంధాలను సిటీ నేతలు ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సాక్షి,సిటీబ్యూరో, మేడ్చల్/బంజారాహిల్స్/నాగోలు: మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌బిహారీ వాజ్‌పేయి ఇక లేరనే వార్త నగర వాసుల్లో విషాదాన్ని నింపింది. ఆయన మృతితో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులను తీవ్రంగా కలచివేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా వివిధ సందర్భాల్లో వాజ్‌పేయి గ్రేటర్లో పలుమార్లు పర్యటించారు. ప్రధానిగా ఉన్న సమయంలో నగరంలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన చేతులమీదుగానే ప్రారంభించారు. ఈ సందర్భంగా అటల్జీతో గడిపిన ఆత్మీయ క్షణాల్ని పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు. ముందస్తు ఎన్నికల ప్రకటన.. 2004 లోక్‌సభకు జరిగిన ముందస్తు ఎన్నికల నిర్ణయం ట్యాంక్‌బండ్ సమీపంలోని మారియట్ హోటల్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీసుకున్నదే కావటం విశేషం. ముషీరాబాద్ నియోజకవర్గంలో వాజ్‌పేయి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. గతంలో ఆయన రెండుసార్లు ఈ నియోజకవర్గంలో పర్యటించారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే లక్ష్మణ్ తదితర నేతలు వాజ్‌పేయితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మాదాపూర్‌లోని సైబర్ టవర్‌ను 1998 నవంబర్ 22న ప్రధాని హోదాలో ఆయన ప్రారంభించారు. 1994లో మేడ్చల్ పట్టణానికి వాజ్‌పేయి వచ్చారు. ఐఎస్బీ ప్రారంభోత్సవానికి.. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ బిజినెస్ (ఐఎస్బీ)ను 2001 డిసెంబర్ 2న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. 1989లో నిజాం కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొనేందుకు రైలులో వచ్చిన ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో దిగి కొంత సేపు ఈ ప్రాంత బీజేపీ నాయకులతో ముచ్చటించారు. పలువురు నేతల సంతాపం ఉగ్రవాదంపై అంతర్జాతీయ యూత్ కన్ఫరెన్స్‌ను ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో 2003లో నిర్వహించిన సమావేశంలో ప్రధాని హోదాలో అటల్ బీహారీ వాజ్‌పేయి పాల్గొన్నారు. వాజ్‌పేయితో తన స్ఫూర్తిదాయక అనుబంధం ఉందని ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి అన్నారు. సంస్కరణలకు జీవం పోసిన మహోన్నత వ్యక్తి వాజ్‌పేయి అని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. వాజ్‌పేయి మృతి పట్ల రాష్ట్ర మంత్రి పద్మారావు సంతాపం వ్యక్తం చేశారు. అప్పటి యువమోర్చా నాయకుడు స్వామిగౌడ్, బీజేపీ ఓబీసీ సెల్ కార్యదర్శి కటకం నర్సింగ్‌రావులు వాజ్‌పేయితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయి మృతికి సంతాపం సాక్షి, సిటీబ్యూరో: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గొప్ప కవి, సాహితీవేత్త మహోన్నతుడని తెలుగు టీవీ రచయితల సంఘం అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్ అన్నారు. గురువారం రవీంద్రభారతి సమావేశ మందిరంలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కవి సమయం, భారత్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో శ్రీమాన్ వానమామలై వరదాచార్యుల 106వ జయంతి, స్మారక పురస్కార ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది పెద్దలు కనిపించని లోకానికి వెళ్లారని, అయినా వారు అందించిన పరిమళాలు ఇప్పటికి ఉన్నాయని తెలిపారు. తెలుగు చరిత్రలో వానమామలై వరదాచార్యులది సుస్థిర స్థానమన్నారు. ఈ సందర్భంగా భారత్ భాషా భూషణ్ డాక్టర్ తిరునగరికి స్మారక పురస్కార ప్రదానం చేశారు. సభలో ప్రారంభంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ మృతికి సంతాపం ప్రకటించారు. కార్యక్రమంలో కవి సమయం నిర్వాహకులు తాళ్లపల్లి మురళీధరగౌడ్, సీనియర్ జర్నలిస్టు ఉడయవర్లు, దాశరథి పురస్కార గ్రహీత డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీలకు చేయూతనిచ్చారు.. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా బలపడడానికి మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఎంతో సేవ చేశారని బీజేపీ మైనార్టీ మోర్చా అధికార ప్రతినిధి ఫీరాసత్అలీ బాక్రీ పేర్కొన్నారు. గురువారం వాజ్‌పేయి చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం చీరాగ్అలీలైన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. 1977– 79లో వాజ్‌పాయి విదేశాంగ వ్యవహారాల మంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ నగరంలో పాస్‌పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పొషించారని కొనియాడారు. 1996లో ధూల్‌పేట్‌కు.. అబిడ్స్: 1996లో ధూల్‌పేట్‌ను అటల్ బిహారీ వాజ్‌పేయి సందర్శించారు. ధూల్‌పేట మినీ స్టేడియంలో బీజేపీ నాయకులు లక్ష్మణ్‌సింగ్ జెమేదార్ నిర్వహించిన అటల్ కేసరి కుస్తీ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కుస్తీ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. నిర్వాహకులు వాజ్‌పేయిని ఘనంగా సత్కరించి మార్వాడీ టోపీ, తల్వార్‌ను బహూకరించారు. -
అయితే టీ తాగుదాం పదండి..
సాక్షి, న్యూఢిల్లీ : అటల్ బిహారి వాజ్‌పేయి ఎంత మృధు స్వభావో అంతటి చమత్కారి కూడా అంటుంటారు. వాజ్‌పేయి ప్రధానిగా వ్యవహరించిన సమయంలో ఆయన క్యాబినెట్ సహచరుడు అరుణ్ శౌరి తనకు ఎదురైన పలు అనుభవాలను పంచుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై విశ్లేషణకు పార్టీ నేతలు, మంత్రులతో వాజ్‌పేయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. గంభీరవాతావరణంలో సమావేశం ప్రారంభమైంది. నేతలు ఒక్కొక్కరే ఓటిమికి దారితీసిన పరిస్థితులను వివరించారు. భాగస్వామ్య పక్షం శివసేన బీజేపీ అవకాశాలను దెబ్బతీసిందని ఒక నేత అంటే. పార్టీకి వ్యతిరేకంగా ముస్లింలు ఏకమయ్యారని మరో నేత చెప్పుకొచ్చారు. మరో నేత పార్టీ యంత్రాంగం బలహీనపడిందని విశ్లేషించారు. సమావేశంలో మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఓటమికి మరొకరిని బాధ్యుల్ని చేసి చేతులు దులుపుకునేలా వ్యవహరించారు. వారి అభిప్రాయాలను ఓపిగ్గా విన్న వాజ్‌పేయి ముఖంపై చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడటం మొదలుపెట్టారు. సమావేశ మందిరంలో అందరిలో ఉద్వేగ వాతావరణం నెలకొనగా ఒకే ఒక్క మాటతో వాజ్‌పేయి అక్కడి వాతావరణాన్ని తేలికపరిచారు.‘ పార్టీ ఓటమికి కొత్త కారణాలు ఏమీ లేవంటారు అంతేగా..అయితే టీ తాగుదాం పదండి’ అంటూ లేచారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనతో సన్నిహితంగా పనిచేసిన అరుణ్ శౌరి మాజీ ప్రధాని సామర్థ్యం, నైపుణ్యాలను కొనియాడారు. తన వద్ద పనిచేసే వారిలో అత్యుత్తమమైన పనితనాన్ని ఆయన రాబడతారని అరుణ్ శౌరి గుర్తుచేసుకున్నారు. ఇతరుల నుంచి మెరుగైన పనిరాబట్టడంలో వాజ్‌పేయి చతురత దాగుందని..మరికొందరు ఇతరుల నుంచి పేలవమైన సామర్థ్యం రాబడతారని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి చురకలు అంటించారు. అరుణ్ శౌరి గత కొంతకాలంగా మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. -
హైటెక్ సిటీ ప్రారంభించింది ఆయనే!
సాక్షి, హైదరాబాద్ : దేశసేవ కోసమే జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి.. భరతమాత ముద్దుబిడ్డ.. మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన అటల్ బిహారీ వాజ్‌పేయి గురువారం సాయంత్రం అనంత లోకాలకు వెళ్లిపోయారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆయన విలువల కోసమే పోరాడిన యోధుడతను. వాజ్‌పేయికి అన్ని రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల నేతలు, ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగేవి. దేశ ప్రధానిగా వాజ్‌పేయికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో ప్రత్యేక అనుబంధం ఉండేది. ప్రధానిగా హోదాలో ఆయన నాలుగు సార్లు హైదరాబాద్ సందర్శించారు. నగరానికి ఐటీ హబ్‌గా ఉన్న హైటెక్ సిటీ(సైబర్ టవర్స్)ని 1998లో వాజ్‌పేయినే ప్రారంభించారు. ప్రతిష్ఠాత్మక ఈ సిటీ ప్రారంభోత్సవానికి వాజ్‌పేయి ముఖ్యఅతిథిగా రావడం ఎంతో గర్వకారణం. హైటెక్ సిటీనే మన హైదరాబాద్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ఐటీ సౌకర్యం. హైటెక్ సిటీ మైక్రోసాఫ్ట్, జీఈ, ఒరాకిల్ వంటి అంతర్జాతీయ ఐటీ కంపెనీలకు మెట్టునిల్లుగా ఉంటుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా(1980-86) కొనసాగిన సమయంలో వాజ్‌పేయి టాక్సీలో వచ్చి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు. కర్ణాటకకు వెళుతూ ఆయన బేగంపేట విమానాశ్రయంలో ఆగారు. ఆ సమయంలో హెగ్డేవార్ శతజయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న విషయాన్ని తెలుసుకుని నేరుగా టాక్సీ తీసుకుని, ఆ ఉత్సవానికి వచ్చారు. ఎన్నికల సమయంలో, ఎమర్జెన్సీ కాలంలో, ప్రధాన మంత్రిగా నగరంలో జరిగిన పలు బహిరంగ సమావేశాలకు వాజ్‌పేయి హాజరయ్యారని బీజేపీ నేతలు గుర్తు చేసుకున్నారు. పేదలకు నివాస యోగ్యం కల్పించేందుకు ఏర్పాటుచేసిన పథకం వాంబే స్కీమ్(వాల్మికి అంబేద్కర్ ఆవాస్ యోజన)ను ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే లాంచ్ చేశారు. ఆ పథకాన్ని లాంచ్ చేసిన అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు కూడా ఆయనే శంకుస్థాపన చేశారు. అంతేకాక 2000 జూన్‌లో హైదరాబాద్‌లోని ప్రముఖ బసవతారక ఇండో-అమెరికన్ కేన్సర్ ఇన్స్టిట్యూట్, రీసెర్చి సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరై వాజ్‌పేయి తన అభిమానాన్ని చాటుకున్నారు. 2004లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా వాజ్‌పేయి హాజరయ్యారు. అంతకుముందు 1984లో వాజ్‌పేయి రెండుసార్లు హైదరాబాద్ వచ్చారు. అదీ ఎన్టీఆర్‌కు మద్దతుగా. తన ప్రభుత్వాన్ని పడగొట్టినందుకు నిరసనగా ఎన్టీఆర్ అప్పట్లో నిరసనకు దిగగా, వాజ్‌పేయి అండగా నిలిచారు. ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కాగా.. ప్రమాణస్వీకారానికి వాజ్‌పేయి హాజరయ్యారు. హైదరాబాద్‌తో పాటు, ఏపీలోని గుంటూరు నగరాన్ని కూడా వాజ్‌పేయి పలుసార్లు సందర్శించారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన పలు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. వాజ్‌పేయి జన్ సంఘ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, గుంటూరుకు చెందిన అడ్వకేట్ జూపూడి యజ్ఞ నారాయణ జన్ సంఘ్‌కు ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో నారాయణ కుటుంబ సభ్యులకు, వాజ్‌పేయి మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఎప్పుడూ గుంటూరు వచ్చినా.. నారాయణ ఇంటికి వెళ్లేవారు. నారాయణ ఎంఎల్ఏగా పోటీచేసినప్పుడు, వాజ్‌పేయి ఆయన మద్దతుగా పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఇలా పలువురు బీజేపీ నాయకులకు మద్దతుగా వాజ్‌పేయి ప్రచారాల్లో పాల్గొనేవారు కూడా. గుంటూరులో జిన్నా టవర్ నుంచి బీఆర్ స్టేడియంకు వెళ్లే వీరసవకార్ రోడ్డును వాజ్‌పేయినే ప్రారంభించారు. -
వాజ్‌పేయి మృతి : సెలవు ప్రకటించిన రాష్ట్రాలివే..
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మృతికి సంతాపసూచకంగా శుక్రవారం పలు రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి. తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో గురువారం వాజ్‌పేయి తుదిశ్వాస విడవడంతో కేంద్ర ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించడంతో కొన్ని రాష్ట్రాలు సైతం ఈనెల 16 నుంచి 22 వరకూ సంతాపదినాలను ప్రకటించాయి. ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు శుక్రవారం విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించాయి. కర్నాటక ప్రభుత్వం కూడా నేడు సెలవు ప్రకటించింది. వరద సహాయక కార్యక్రమాలు మాత్రం యథావిథిగా కొనసాగుతాయని పేర్కొంది. తెలంగాణ, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్, బిహార్, యూపీ, కర్ణాటక, జార్ఖండ్, ఒడిషా, తమిళనాడు, అసోం, గోవా వంటి 14 రాష్ట్రాలు సెలవు ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హాఫ్ డే సెలవును ప్రకటించింది. -
వాజ్‌పేయీ.. విశాఖ నిను మరువదోయి
దేశం గర్వించే నేత..భాష పులకించిన కవి..దాయాదిదేశానికి సవాల్‌తో పాటుస్నేహాన్ని స్వాగతించిన ధీరోదాత్త ప్రధాని..ఆయన వ్యక్తిత్వం ఓ పాఠం..ఆయన ప్రసంగం.. విలువైన పుస్తకం.. ఆయన నిర్ణయం.. దేశంలో మార్పునకు చిహ్నం..ఆయన రాజనీతి.. ఎందరికో దిక్సూచిఆయన మరణం.. ముగిసిన ఓ రాజకీయ శకంవ్యక్తిత్వానికి నిలువుటద్దంగా, నిస్వార్థ రాజకీయాలకు సరైన నిర్వచనంగా.. మానవతా విలువలకు అసలైన చిరునామాగా వెలుగొందిన వాజ్‌పేయి అస్తమించారన్న విషయం జీర్ణించుకోలేనిది. ఆర్ఎస్ఎస్ భావజాలంతో, నీతి నిజాయితీలే అసలైన సిద్ధాంతాలుగా జీవించారు. విలువలన్నీ ఒకటైతే.. అతనే వాజ్‌పేయి అని ప్రతిపక్ష నేతలు సైతం ప్రశంసించడం అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. ఆయన మరణవార్త విన్న విశాఖ విలపించింది. ఆయనతో పంచుకున్న జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటోంది. సాక్షి, విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి విశాఖతో మధురానుబంధం ఉంది. విశాఖపై ఆయన ప్రత్యేక అభిమానం ఉండటంతో రావడానికి ఆసక్తి చూపేవారు. విశాఖకు జాతీయ స్థాయిలో ఖ్యాతిని తెచ్చిపెట్టిన స్టీల్‌ప్లాంట్, విశాఖ పోర్టు, ఆంధ్ర విశ్వవిద్యాలయాల అభివృద్ధి, మనుగడకు ఆయన ఎంతో కృషి చేశారు. వాజ్‌పేయి ప్రధాని హోదాతో పాటు వివిధ హోదాల్లో పలుసార్లు వైజాగ్ వచ్చారు. ఇక్కడ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు రూ.1300 కోట్ల మూలనిధి : వాజ్‌పేయి 1998లో ప్రధానిగా ఉన్న సమయంలో స్టీల్‌ప్లాంట్‌కు రూ. 1300కోట్ల మూలనిధి ఇచ్చి ఆదుకున్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ, విశాఖ పోర్టుకు కనెక్టివిటీ రో డ్లు, నేవీ ఎస్టాబ్లిష్‌మెంట్‌ని అప్‌గ్రేడ్, యూనివర్సిటీల పటిష్టతలో భాగంగా ఏయూలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభా గాల స్థాపన వంటి వాటికి కృషి చేశారు. విశాఖ బీచ్‌లో వాకింగ్ : వాజ్‌పేయికి విశాఖ బీచ్ అంటే ఎంతో ఇష్టం. ఆయన ప్రధాని కాకముందు వరకు వైజాగ్ వచ్చినప్పుడల్లా తోటి నాయకులతో బీచ్‌కు Ððవెళ్లేవారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసేవారు. వాకింగ్‌కు వీలు కాని పరిస్థితుల్లో కారులో సాగరతీరంలో షికారుకు వెళ్తామనేవారు. ఆయన అభీష్టం మేరకు కారులో బీచ్ తిప్పేవారు. సాగరతీరం, ప్రకృతి అందాలను చూసి వాజ్‌పేయి ఎంతో మురిసిపోయేవారని ఆయనతో సన్నిహితంగా గడిపిన పీవీ చలపతిరావు ‘సాక్షి’తో చెప్పారు. ఆయన మృతికి బీజేపీ శ్రేణులు సంతాపం తెలిపాయి. విశాఖలో గుండెపోటు.. కేజీహెచ్‌లో చికిత్స అటల్ బిహారీ వాజ్‌పేయికి విశాఖతో ప్రాణ సంబంధమైన అనుబంధం కూడా ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుని హోదాలో విశాఖ వచ్చినప్పుడు (దాదాపు 35 ఏళ్ల క్రితం) ఆయనకు స్వల్పంగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు పీవీ చలపతిరావు హుటాహుటిన కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. కార్డియాలజీ చీఫ్ డాక్టర్ సిన్హా ఆయనకు తక్షణ వైద్యం అందించారు. సోదరిగా పిలిచే చలపతిరావు సతీమణి అనూరాధ ఆస్పత్రిలో వాజ్‌పేయికి సపర్యలు చేశారు. రెండ్రోజుల విశ్రాంతి అనంతరం వాజ్‌పేయి ఢిల్లీ పయనమయ్యారు. అప్పట్నుంచి విశాఖ అంటే వాజ్‌పేయికి మరింత అభిమానం పెరిగింది. ఒకే రూమ్‌లో ఉండే అరుదైన అవకాశం దక్కింది వాజ్‌పేయితో అత్యంత సన్నిహితంగా మెలిగాను. ఆయన లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. వాజ్‌పేయి తొలిసారి 1961లో విశాఖలో పర్యటించారు.ఆ ఏర్పాట్లు నేనే చేశాను. ప్రధాని హోదాలోనూ చాలా సార్లు పర్యటించారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు విజయోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చారు. గెలుపునకు కారణమైన ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఆయన అభినందించడం ఎవ్వరూ మర్చిపోలేని జ్ఞాపకం. అనకాపల్లి, శ్రీకాకుళం, విశాఖపట్నం ..ఇలా చాలా సార్లు సభలకు వాజ్‌పేయి హాజరయ్యారు. ఆయనకు విశాఖ చాలా ఇష్టం. ఆయన ఓసారి పుట్టిన రోజు వేడుకల్ని కూడా ఇక్కడ చేసుకున్నారు. శ్రీకాకుళం ఉప ఎన్నికలు జరిగినప్పుడు ప్రచారానికి వాజ్‌పేయ్ కుశభావ్ ఠాక్రే కలిసి వచ్చారు. శ్రీకాకుళంలోని అతిథి గృహంలో ఒక గదిలో ఠాక్రే, మరో గదిలో వాజ్‌పేయి విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో ఆయనతో కలిసి ఒకే రూమ్‌లో ఉండే అరుదైన అవకాశం లభించినందుకు చాలా గర్వంగా అనిపించింది. – పీవీ చలపతిరావు, బీజేపీ సీనియర్ నేత ఆయన ప్రసంగం కోసం సభకు వెళ్లాను వాజ్‌పేయి ప్రసంగమంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన సభకు వాజ్‌పేయి హాజరయ్యారు. అప్పుటికి నేను రాజకీయాల్లోకి ఇంకా రాలే దు. కేవలం ఆయన ప్రసంగం వినాలని వచ్చి సభ ముగిసేవరకూ ఉన్నాను. ఆయనంటే అంత అభిమానం నాకు. ఉభయసభలకు 12 సార్లు పార్లమెంట్‌కు వెళ్లడం సామాన్యమైన విషయం కాదు. 1999లో ఒక్క ఓటు తక్కువ వచ్చి ప్రధాని పదవిని 13 నెలల్లోనే కోల్పోయారు. ఆ ఒక్క ఓటు ఉంటే ఐదేళ్లు పాలించేవారు. అయినా.. డబ్బులిచ్చి, ప్రలోభపెట్టి ఎంపీల్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నాలేవీ చెయ్యలేదు. అదే ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. హైవే విస్తరణ ప్లాన్‌లో మధురవాడ క్రికెట్ మైదానం కొంత రోడ్డులో కలిసిపోయింది. విషయం తెలిసి అప్పటిæ మేయర్ డీవీ సుబ్బారావుతో కలిసి ప్రధాని వాజ్‌పేయికి రిప్రజెంటేషన్ పంపించాం. ఆయన స్పందించి, ప్లాన్ మార్చడంతో.. ఇప్పుడా మైదానం అంతర్జాతీయ క్రికెట్‌కు వేదికైంది. – విష్ణుకుమార్ రాజు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విశాఖతో మధురానుబంధం ♦ వాజ్‌పేయి తొలిసారి ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించడానికి ముందు 1977లో ఆయన జన్‌సంఘ్ పార్టీ నాయకుని హోదాలో విశాఖలో అడుగుపెట్టారు. ♦ 1980లో బీజేపీ ఏర్పాటయ్యాక ఆయన 1982లో విశాఖ వచ్చారు. ♦ 1981లో జరిగిన ఎన్నికలలో విశాఖ మున్సిపాలిటీలో 50 వార్డులకు గాను బీజేపీ 25వార్డులలో విజయభేరి మోగించింది. ఫలితంగా విశాఖ తొలి మేయర్‌గా ఎన్ఎస్ఎన్ రెడ్డి ఎన్నికయ్యారు. వాజ్‌పేయి అప్పట్లో బీజేపీ మేయర్ ఎన్నికల విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు వన్‌టౌన్‌లోని ప్రస్తుత జీవీఎంసీ స్టేడియం ఉన్న స్థలంలో పౌరసన్మానం చేశారు. ♦ 1983లో మరోసారి విశాఖ వచ్చారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ తరపున ప్రచారం చేశారు. ♦ 1997లో విశాఖ మేయర్ ఎన్నికల సమయంలో విశాఖ వచ్చారు. ఎన్నికల ప్రచారం చేసి వెళ్లారు. ♦ వాజ్‌పేయికి 1988లో షíష్టిపూర్తి సందర్భంగా ఏయూ కాన్వొకేష¯Œన్ హాలులో ఘన సన్మానం చేశారు. వాజ్‌పేయి 1993లో భారత్ పరిక్రమ్ యాత్ర సందర్భంగా విశాఖ వచ్చారు. అప్పటి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ప్రస్తుత అధికార ప్రతినిధి పృథ్వారాజ్ ఆయనను కలుసుకున్నారు. ♦ 1998 సార్వత్రిక ఎన్నికల సమయంలో డీవీ సుబ్బారావు విశాఖ ఎంపీగా, పీవీ చలపతిరావు అనకాపల్లి ఎంపీగా బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేశారు. వీరిద్దరి తరపునా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ♦ 2004 ఎన్నికల సమయంలో కె. హరిబాబు వన్‌టౌన్ ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎంవీవీఎస్ మూర్తి పోటీ చేశారు. అప్పట్లో టీడీపీ–బీజేపీ పొత్తు కారణంగా ఇరు పార్టీల అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేశారు. -
వాజ్‌పేయి మరణంపై ప్రముఖుల స్పందనలు
తండ్రిలాంటి వ్యక్తిని కోల్పోయా! న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతితో ప్రధాని మోదీ విచారంలో మునిగిపోయారు. గొప్ప రాజనీతిజ్ఞుడైన వాజ్‌పేయి మృతితో దేశ రాజకీయాల్లో ఓ శకం ముగిసిందని ఆయన పేర్కొన్నారు. తండ్రిలాంటి వ్యక్తిని కోల్పోవడం వ్యక్తిగతంగా తనకు, దేశానికి ‘పూడ్చుకోలేని లోటు’అని మోదీ వెల్లడించారు. వాజ్‌పేయి దేశం కోసమే జీవితాన్ని పణంగా పెట్టి దశాబ్దాల తరపడి అలుపెరగకుండా దేశ సేవలో తరించారన్నారు. 21వ శతాబ్దంలో భారత్ సుసంపన్న దేశంగా ఎదిగేందుకు జరుగుతున్న కృషిలో వాజ్‌పేయి వేసిన బలమైన పునాదులను దేశం ఎన్నటికీ మరవబోదన్నారు. గురువారం రాత్రి విడుదల చేసిన వీడియో సందేశంలో.. ‘అటల్జీ మనల్ని వదలి వెళ్లడం నాకు వ్యక్తిగతంగా తీరనిలోటు. ఆయన దీర్ఘదృష్టితో వివిధ రంగాల్లో రూపొందించిన విధివిధానాలు, భారతదేశం మూలమూలన ఉన్న ప్రజల జీవితాలను స్పృశించాయి. వాజ్‌పేయితో నాకు లెక్కలేనన్ని జ్ఞాపకాలున్నాయి. నాలాంటి ప్రతి కార్యకర్తకు ఆయనే స్ఫూర్తి. జన్‌సంఘ్‌ను, బీజేపీని బలోపేతం చేయడంలో తీవ్రంగా శ్రమించారు. సంఘటన్, శాసన్ (పాలన) గురించిన చాలా అంశాలను ఆయన నాకు బోధించారు. ఆయన్ను కలిసిన ప్రతిసారీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ప్రేమను కురిపించారు. నేడు మా స్ఫూర్తిని, అటల్ రత్నాన్ని కోల్పోయాం. అటల్జీ వ్యక్తిత్వాన్ని మాటల్లో వర్ణించలేం. ఆయన లేని లోటును ఏం చేసినా పూడ్చలేం. ఆయన దేశం గురించే ఎప్పుడూ ఆలోచించే గొప్ప రచయిత. ఆయన పదునైన వ్యాఖ్యలు, అద్భుతమైన చమత్కారాన్ని ఎన్నటికీ మరువలేను. బీజేపీ నేడు ఈ స్థితికి చేరుకోవడంలో వాజ్‌పేయి పాత్ర అత్యంత కీలకం. దేశం మూలమూలన తిరిగారు. దీని కారణంగానే నేడు పార్టీ ఓ బలమైన శక్తిగా ఎదగగలిగింది. వాజ్‌పేయి కుటుంబసభ్యులకు, దేశవ్యాప్తంగా, కోట్లాది కార్యకర్తలకు మహనీయుడి మరణం నుంచి త్వరగా కోలుకునే శక్తిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’అని పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ సంతాపం న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మృతికి కేంద్ర కేబినెట్ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమై సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రివర్గ సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ నేతలు మరణించినప్పుడు కేంద్ర కేబినెట్ సమావేశమై సంతాపం తెలపడం రివాజు. దివంగత నేతకు గౌరవ సూచకంగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 16 నుంచి 22 వరకూ ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఈ ఏడు రోజులు జాతీయ జెండాను అవనతం చేయాలని కేంద్ర హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం ఒకపూట సెలవుదినం ప్రకటించారు. గొప్ప రాజనీతిజ్ఞుడు: పాక్ ఇస్లామాబాద్ : మాజీ ప్రధాని వాజ్‌పేయిని గొప్ప రాజనీతిజ్ఞుడిగా కొనియాడుతూ పాకిస్తాన్ నివాళులర్పించింది. వాజ్‌పేయి మరణవార్త తెలుసుకుని ఎంతో విచారిస్తున్నామని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘వాజ్‌పేయి గొప్ప రాజనీతిజ్ఞుడు. భారత్–పాకిస్తాన్ సంబంధాల్లో మార్పు కోసం కృషిచేశారు. అలాగే దక్షిణాసియా కూటమి సార్క్‌కు కీలక మద్దతుదారుగా ఉండడమే కాకుండా ప్రాంతీయ సహకారం కోసం పాటుపడ్డారు’ అని పాక్ విదేశాంగ ప్రతినిధి సంతాప సందేశంలో పేర్కొన్నారు. వాజ్‌పేయి కుటుంబానికి, అలాగే భారత ప్రభుత్వం, ప్రజలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నామని ఆయన చెప్పారు. దిగ్గజుడిని కోల్పోయాం ‘వాజ్‌పేయి మరణం అత్యంత విషాదకరం. ఆయన దేశంలోని నిజమైన రాజనీతిజ్ఞుడు. ఆ మృదు స్వభావ దిగ్గజుడిని మనమంతా కోల్పోయాం. అద్భుత నాయకత్వ లక్షణాలు, దూరదృష్టి, పరిణతి, వాక్పటిమల్లో ఆయనకు ఆయనే సాటి’ – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గొప్ప బిడ్డను కోల్పోయింది ‘ఒక శకం ముగిసింది. భారత్ గొప్ప బిడ్డను కోల్పోయింది. ఈ వార్త తీవ్ర విషాదం కలిగిస్తోంది. వాజ్‌పేయి ప్రతిపక్షంలో ఉంటే హేతుబద్ధంగా విమర్శించేవారు. అధికారంలో ఉన్నప్పుడు ఏకాభిప్రాయం కోసం శ్రమించేవారు. అసలైన ప్రజాస్వామ్య వాది ఆయన. ఆయనకు నా ప్రగాఢ సంతాపం’ – ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి ఈ బాధ చెప్పేందుకు మాటలు లేవు: అడ్వాణీ ‘దేశ అత్యున్నత రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్‌పేయి మరణం వల్ల కలిగిన తీవ్ర బాధ, దుఃఖాన్ని వ్యక్తపరిచేందుకు నా వద్ద మాటలు లేవు. అటల్ జీ నాకు సీనియర్ మాత్రమే కాదు.. 65 ఏళ్లకు పైగా నా ఆత్మీయ నేస్తం. ఆరెస్సెస్ ప్రచారక్‌లుగా కలిసి పనిచేయడం నుంచి, భారతీయ జనసంఘ్ స్థాపనలోనూ, అలాగే ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో పుట్టిన ఆందోళన నుంచి 1980లో బీజేపీ ఆవిర్భావంలోనూ వాజ్‌పేయితో నాకు సుదీర్ఘంగా అనుబంధం ఉంది. కాంగ్రెసేతర సుస్థిర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్గదర్శిగా ఆయన గుర్తుండిపోతారు. ఆయన మంత్రి మండలిలో ఆరేళ్లపాటు ఉప ప్రధానిగా పనిచేయడం నాకు గర్వంగా ఉంది. సీనియర్‌గా నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారు. మార్గదర్శనం చేసేవారు. ఆకట్టుకునే నాయకత్వ లక్షణాలు, మంత్రముగ్ధులను చేసే ప్రసంగాలు, దేశభక్తి, అన్నింటికన్నా మిన్నగా కరుణ, వినయం వంటి మానవీయ విలువలు, సైద్ధాంతిక విభేదాలు ఉన్నా ప్రత్యర్థులపై గెలవడానికి అవసరమైన అద్భుత సామర్థ్యాలను కలిగి ఆయన నా ప్రజా జీవితంపై ప్రభావం చూపారు. అటల్‌జీని కోల్పోవడం చాలా బాధగా ఉంది’ –-ఎల్.కె.అడ్వాణీ, బీజేపీ సీనియర్ నేత పార్టీని మర్రిచెట్టుగా మలిచారు ‘బీజేపీ అనే మొక్కను తన ధైర్యం, నిరంతర శ్రమతో అత్యంత జాగ్రత్తగా పెంచి మర్రిచెట్టుగా మలిచిన వ్యక్తి వాజ్‌పేయి. భారత రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారు. అధికారం ఉన్నది సేవ చేసేందుకేనని నమ్మి జాతీయ స్థాయిలో గొప్ప ప్రజాదరణ ఉన్న నాయకుడిగా ఎదిగారు. దేశ ప్రయోజనాలపై రాజీపడకుండా మచ్చలేని రాజకీయ జీవితం గడిపారు. అందుకే పార్టీలు, వర్గాలకతీతంగా అందరూ ఆయనను ప్రేమిస్తారు. ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు మా పార్టీ పని చేస్తుంది’ – అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు చాలా బాధాకరం ‘అటల్జీ ఇక లేరని తెలియడం బాధాకరం. ఇంత త్వరగా ఆయనను కోల్పోతామని ఊహించలేదు. స్వాతంత్య్రం అనంతరం దేశంలోని అత్యున్నత నేతల్లో వాజ్‌పేయి ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర గొప్పది. 23 పార్టీల సంకీర్ణాన్ని ఆయన విజయవంతంగా నడిపారు. దేశంలో రవాణా సదుపాయాలు విప్లవాత్మకంగా మెరుగుపరిచిన ప్రధాని ఆయన. వ్యక్తిత్వ, వక్తృత్వ, కర్తృత్వ, మితృత్వ లక్షణాలన్నీ కలగలిపిన నేతృత్వగా భారత రత్న అటల్ జీ ఎప్పటికీ గుర్తుండిపోతారు’ – వెంకయ్య నాయుడు, ఉప రాష్ట్రపతి ఆధునిక భారతంలో ఉద్దండ నేత వాజ్‌పేయి దత్తపుత్రిక నమితా కౌల్ భట్టాచార్యకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఓ లేఖ రాస్తూ సంతాపం తెలిపారు. ‘వాజ్‌పేయి గొప్ప దేశభక్తుడు. ఆధునిక భారతంలో జీవితం మొత్తం ప్రజా సేవలో గడిపిన ఉద్దండ నాయకుడు. ప్రధానిగా, పార్లమెంటు సభ్యుడిగానూ అద్భుతంగా పనిచేశారు. ఆకట్టుకునేలా రచనలు చేసిన కవి, గొప్ప వక్త. పార్టీలకతీతంగా నాయకులు, అన్ని వర్గాల ప్రజలు ఆయనను గౌరవించారు. ప్రేమించారు. దేశీయంగా, అంతర్జాతీయంగా తన సామర్థ్యాలను నిరూపించుకుని, ఇతర దేశాలతో భారత సంబంధాలను గణనీయంగా మెరుగుపరిచిన గొప్ప రాజనీతిజ్ఞుడు వాజ్‌పేయి. ఆయన మరణం నన్ను తీవ్రంగా బాధిస్తోంది’ – మాజీ ప్రధాని మన్మోహన్ గొప్ప మానవతావాది: నరసింహన్ సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతి పట్ల తెలంగాణ, ఏపీ గవర్నర్ నరసింహన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. వాజ్‌పేయి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వాజ్‌పేయి గొప్ప మానవతావాది, రాజనీతిజ్ఞుడు, పాలనాదక్షుడు, కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు. వాజ్‌పేయి మృతి దేశానికి పెద్ద లోటు అన్నారు. ప్రజాస్వామిక విలువలను కాపాడటంలో వాజ్‌పేయి ఆదర్శనీయుడని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు నడిపారు: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశా రు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, మాజీ ప్రధానిగా విలువలతో కూడిన రాజకీయాలను నడిపి దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన వాజ్‌పేయి మృతి తీరని లోటు అని సీఎం అన్నారు. ఉదారవాది, మానవతావాది, కవి, సిద్ధాంతకర్త, మంచి వక్త, నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసిన అటల్జీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రాజకీయ భీష్ముడు: చంద్రబాబు ‘వాజ్‌పేయి మృతితో దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని, రాజకీయ భీష్ముడిని కోల్పోయింది. నమ్మిన సూత్రాలను నిజ జీవితంలో ఆచరించి చూపిన వ్యక్తి ఆయన. ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఎంపీగా బహుముఖ పాత్ర పోషించారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించడంలో నేనే చొరవ తీసుకుని వాజ్‌పేయితో మాట్లాడాను. ఏపీ అభివృద్ధికి ఆయన తోడ్పాటు అందించారు. ఆయన పరిపాలన, రాజకీయ అనుభవాలతో వాజ్‌పేయి శకం భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోతుంది’ గొప్ప నేతను కోల్పోయాం: వైఎస్ జగన్ ‘భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి మృతిచెందారన్న వార్త ఎంతగానో బాధించింది. అటల్జీ మరణంతో మన దేశ రాజకీయాల్లో ఓ గొప్ప శకం ముగిసినట్టయింది. విభేదించే రాజకీయ పార్టీల వారికి కూడా ఆమోదయోగ్యుడిగా, అద్భుతమైన–ఆకట్టుకునే వక్తగా, కవిగా, రాజకీ య విలువలు, మర్యాదల పరంగా శిఖర సమానుడిగా, విదేశీ దౌత్య దురంధరుడిగా వాజ్‌పేయి అందరి మన్ననలూ పొందారు. దేశానికి ఆయన చేసిన సేవలు, రాజకీయాల్లో ఆయన నెలకొల్పిన విలువలు కలకాలం గుర్తుంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’. వాజ్‌పేయి నాయకులకు మార్గదర్శి: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్ : సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, మేధావి, మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం ఈ దేశానికి తీరని లోటు అని, గొప్ప రాజకీయ మేధావిగా, సౌమ్యునిగా వాజ్‌పేయి రాజకీయ నాయకులకు స్ఫూర్తి, మార్గదర్శి అని ఆయన గురువారం ఓ ప్రకటనలో కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రకటనకు ముందే యడ్యూరప్ప నివాళి సాక్షి బెంగళూరు : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మరణంపై అధికారిక ప్రకటన రాకముందే బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తన ట్విటర్ ఖాతాలో నివాళి అర్పించడం చర్చనీయాంశమైంది. గురువారం సాయంత్రం 05.05 గంటలకు వాజ్‌పేయి మరణవార్త వెలువడింది. యడ్యూరప్ప అరగంట ముందే ట్విట్టర్లో శ్రద్ధాంజలి ప్రకటనను పోస్ట్ చేయడం విశేషం. ‘నాకు ఎంతో ప్రేరణ ఇచ్చిన మాజీ ప్రధాని వాజ్‌పేయి ఇకలేరన్న వార్తతో నా మనసు ఎంతో భారమైంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’అని పేర్కొన్నారు. వాజ్‌పేయి మరణంపై అధికారికంగా ప్రకటన వెలువడక ముందే సామాజిక మాధ్యమాల్లో చాలా మంది నెటిజన్లు సంతాపం వ్యక్తం చేశారు. యడ్డి కూడా ఇలాగే చేశారా?, లేక ఆయన మరణ సమాచారం ముందే తెలిసిందా? అనేది తేలాల్సి ఉంది. కోట్లాది మంది ప్రేమిస్తారు ‘భారత్ గొప్ప వ్యక్తిని కోల్పోయింది. కోట్లాది మంది వాజ్‌పేయిని ప్రేమిస్తారు. గౌరవిస్తారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా సానుభూతి. ఆయన మరణం మనకందరికీ తీరని లోటు’ – కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సత్సంబంధాలు నెరిపారు ‘ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కంటే ఎంతో భిన్నంగా వాజ్‌పేయి పనిచేశారు. సిద్ధాంతాల పరంగా, రాజకీయంగా విభేదాలు ఉన్నా, వ్యక్తిగతంగా ఆయనకు అందరితో సత్సంబంధాలు ఉండేవి. అది ఈ రోజుల్లో లేదు. అందుకే వాజ్‌పేయి అంటే అందరికీ ఆమోదయోగ్యుడు.’ –సీతారాం ఏచూరి, సీపీఎం తీరని లోటు ‘వాజ్‌పేయితో కలిసి మేం పనిచేశాం. ఆయన ప్రభుత్వానికి బయటినుంచి మద్దతిచ్చాం. వాజ్‌పేయి అందరితో కలిసి పనిచేశారు. అది ఆయన వ్యక్తిత్వం. భాగస్వామ్య పక్షంలోనే కాకుండా, విపక్షాల్లోని సభ్యులనూ అన్ని విషయాలపై అభిప్రాయాలు కోరి నిర్ణయాలు తీసుకునేవారు. ఆయన మృతి తీరని లోటు’ – మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. ఆమోదయోగ్య నాయకుడు ‘అందరికీ ఆమోదయోగ్యమైన, నిర్ణయాత్మక నాయకుడు వాజ్‌పేయి. తన ఆలోచనలు, సత్ప్రవర్తనతో భారతీయ సాంస్కృతిక విలువలను ఆయన తన జీవన విధానంలో ఇముడ్చుకున్నారు’ – ఆరెస్సెస్ తీవ్ర విషాదంలో ఉన్నాం ‘వాజ్‌పేయి మరణం భారత్‌కు తీరని లోటు. తీవ్ర విషాదంలో ఉన్నాం’ –ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయన రాజకీయం ఆచరణీయం ‘భారత్‌ను అణుశక్తి దేశంగా ఆవిష్కరించడంలో ఆయన చూపిన వజ్రసంకల్పం దేశానికి రక్షణ కవచంగా మారింది. విలువలతో కూడిన ఆయన రాజకీయం ఈ నాటి నేతలకు సర్వదా ఆచరణీయం. ఆయన ఈ దేశంలో జన్మించడం మన అదృష్టం. ప్రధానిగా ఆయన సాధించిన విజయాలు ఎల్లప్పుడూ కీర్తించదగినవి’ – జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ -
ఒక శిఖరం ఒరిగింది
భారత రాజకీయాలున్నంతకాలం గుర్తుండిపోయే ఓ మహాశిఖరం ఒరిగింది. దేశ సేవకోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తిత్వం.. ఇక సెలవంటూ వెళ్లిపోయింది.. అద్భుతమైన వాక్పటిమ.. అందరినీ మెప్పించే చాతుర్యం మూగబోయింది. ‘హార్ నహీ మానూంగా’ అంటూ రాజకీయాల్లో ఉన్నంతవరకు విలువల కోసం పోరాడిన యోధుడు.. అందరి గుండెల్లో అజాతశత్రువుగా నిలిచిపోయాడు. దేశ ప్రగతికి కొత్త బాటలు వేసిన దార్శనికుడు అలిసిపోయానంటూ శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ‘మై గీత్ నహీ గాతాహూ’ అన్నా.. ‘మై గీత్ నయా గాతాహూ’ అన్నా.. హిందీ భాషలోని ప్రతిపదం ఆయన కలం, కవిత్వంలో ఆనంద నృత్యం చేశాయి. అధికారంలో లేకున్నాసరే ప్రపంచవేదికలపై భారతీయ వాణిని వినిపించిన దేశభక్తుడు ఆయన. పేరులో కఠినత్వం (అటల్) ఉన్నా.. ప్రేమ, ఆప్యాయతలను పంచడంలో ఆయన తర్వాతే ఎవరైనా. అటువంటి ఆ మహామనీషి మృత్యువుని కౌగిలించుకుని అనంతలోకాలకు వెళ్లిపోయారు. న్యూఢిల్లీ : కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిచెప్పిన రాజకీయ శిఖరంకుప్పకూలింది. మహనీయుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (93) ఇకలేరు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి గురువారం సాయంత్రం 05.05 గంటలకు తుదిశ్వాస విడిచారు. దేశ రాజకీయాల్లో సంకీర్ణ రాజకీయాలతో కొత్త ఒరవడిని సృష్టించి.. నొప్పించక, తానొవ్వకనే దేశానికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకున్న మహానుభావుడు వాజ్‌పేయి. బ్రహ్మచారిగానే జీవితాన్ని ముగించిన ఆయన.. నమితా కౌల్ భట్టాచార్యను దత్తత తీసుకున్నారు. పేరులో అటల్ (కఠినత్వం) ఉన్నా అందరిపట్ల ప్రేమ చూపించిన మృదుస్వభావి. అజాత శత్రువుగా దేశ రాజకీయాల్లో ఆయన అజరామరంగా నిలిచిపోతారు. జూన్ 11నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వివిధ అనారోగ్య సమస్యలకు చికిత్స పొందుతూ గురువారం కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, బీజేపీ అగ్రనేత అడ్వాణీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా సహా పార్టీలకతీతంగా రాజకీయ ప్రముఖులు వాజ్‌పేయి మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణమీనన్ మార్గ్‌లోని వాజ్‌పేయి నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి కార్యకర్తల సందర్శనార్థం పార్థివదేహాన్ని తరలిస్తారు. అక్కడినుంచి మధ్యాహ్నం 1గంటకు అంతిమయాత్ర మొదలవుతుంది. సాయంత్రం 4 గంటలకు.. రాజ్‌ఘాట్ సమీపంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. మాజీ ప్రధాని మృతితో కేంద్రం ఏడురోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. భారత ప్రధాని పీఠంపై ఐదేళ్లు పూర్తిచేసిన తొలి కాంగ్రెసేతర వ్యక్తి.. సంకీర్ణ రాజకీయాలను ఎలా నడపాలో తెలిసిన మహనీయుడు. పదిసార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచిన వాజ్‌పేయి 2005లో రాజకీయాలనుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు. ఆయన 1924, డిసెంబర్ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ బడిపంతులు కుటుంబంలో జన్మించారు. ఆయన జన్మదినాన్ని కేంద్రం ‘సుపరిపాలన దినోత్సవం’గా అధికారికంగా నిర్వహిస్తోంది. తీర్చలేని లోటు గురువారం ఉదయం నుంచి ఎయిమ్స్‌కు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రులు, రాహుల్, పలువురు సీఎంలు వచ్చి వెళ్లారు. దీంతో ప్రజల్లో వాజ్‌పేయి ఆరోగ్యంపై మరింత ఆందోళన పెరిగింది. దేశవ్యాప్తంగా వాజ్‌పేయి తిరిగి కోలుకోవాలంటూ పూజలు, హోమాలు నిర్వహించారు. అటు వాజ్‌పేయి నివాసం వద్ద భద్రతను పెంచడం, బారికేడ్లను ఏర్పాటుచేయడంతో ఆయన ఆరోగ్యంపై మరింత ఉద్విగ్నత నెలకొంది. ఈ నేపథ్యంలో సాయంత్రం ఐదున్నర గంటలకు ఎయిమ్స్ మీడియా, ప్రొటోకాల్ విభాగం ‘మాజీ ప్రధాని ఇక లేర’నే ప్రకటన విడుదల చేసింది. ‘మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఇకలేరనే అత్యంత బాధాకరమైన వార్తను తెలియజేసేందుకు చింతిస్తున్నాం. 16 ఆగస్టు 2018 సాయంత్రం 05.05 గంటలకు ఆయన కన్నుమూశారు. జూన్ 11న ఎయిమ్స్‌లో చేరినప్పటినుంచి వైద్యుల సంరక్షణలో 9 వారాలుగా ఆయన కోలుకున్నారు. దురదృష్టవశాత్తూ 36 గంటలుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో లైఫ్ సపోర్ట్ సిస్టమ్ సాయంతో ఆయన్ను మళ్లీ కోలుకునేలా చేసేందుకు మా వైద్యులు తీవ్రంగా కృషిచేశారు. కానీ గొప్ప నాయకుడు మననుండి దూరమయ్యారు’ అని ఎయిమ్స్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఆసుపత్రికి ప్రముఖులు వాజ్‌పేయి ఆరోగ్యం క్షీణించిందన్న సమాచారంతో ప్రధాని సహా వివిధ పార్టీల నేతలు గురువారం ఉదయం నుంచే ఎయిమ్స్‌కు వరుసకట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆసుపత్రికి వచ్చి దాదాపు 45 నిమిషాల పాటు ఎయిమ్స్‌లోనే ఉన్నారు. బుధవారం రాత్రి మోదీ ఆసుపత్రికి వచ్చి వాజ్‌పేయి ఆరోగ్యం గురించి వాకబు చేసిన సంగతి తెలిసిందే. 24 గంటల్లోపే మోదీ రెండోసారి ఎయిమ్స్‌కు వచ్చారు. ‘21వ శతాబ్దంలో సుసంపన్న భారత నిర్మాణానికి పునాదులు వేసింది వాజ్‌పేయి నాయకత్వమే. ఆయన పట్టుదల, పోరాటం కారణంగానే బీజేపీ ఒక్కో ఇటుక పేర్చుకుంటూ నేడు ఈ స్థాయికి చేరింది’ అని మోదీ ట్వీట్ చేశారు. బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా గురువారం ఉదయమే రెండుసార్లు ఆసు పత్రికి వచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, జేపీ నడ్డా, రవిశంకర్ ప్రసాద్, జవదేకర్, విజయ్ గోయల్ సహా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా చాలాసేపు ఆసుపత్రిలోనే ఉన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్‌సింగ్‌లు కూడా ఆసుపత్రికెళ్లి వాజ్‌పేయి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఇంటి వద్ద ఏర్పాట్లతో ఆందోళన వాజ్‌పేయి ఆరోగ్యం పరిస్థితిపై గురువారం ఉదయం 11గంటలకు ఎయిమ్స్ బులెటిన్ విడుదల చేసిన తర్వాత.. సాయంత్రం వరకు ఎలాంటి ప్రకటన లేకపోవడంతో.. అందరిలో ఆందోళన నెలకొంది. ఈలోపే సాయంత్రం నుంచి కృష్ణ మీనన్ మార్ ్గలోని వాజ్‌పేయి నివాసం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించి భద్రతా ఏర్పాట్లు ఏర్పాటుచేశారు. దీంతో ఆందోళన రెట్టింపైంది. ఎయిమ్స్ ప్రకటనతో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. ప్రముఖుల నివాళి ‘భారతీయులందరూ ఐకమత్యంగా, శాంతి సహనాలతో ఉండాలని అభిలషించిన వాజ్‌పేయి ఇక లేరనే విషయం బాధాకరం. ఇది నాకు వ్యక్తిగతంగా పూడ్చుకోలేని లోటు’ అని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. ప్రజలు తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు వీలు కల్పిస్తామని వెల్లడించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ సహా వివిధ రంగాల ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఏడ్రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించడంతో.. గురువారం నుంచి ఏడ్రోజులపాటు (16 నుంచి 22 వరకు) దేశవ్యాప్తంగా జాతీయ జెండాలను అవనతం చేయనున్నారు. అన్నిదేశాల్లోని దౌత్యకార్యాలయాల్లోనూ శుక్రవారం జాతీయ జెండాలను అవనతం చేస్తారు. న్యుమోనియా, అవయవాల వైఫల్యం న్యూఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్‌పేయి దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. ఆయన మృతికి న్యుమోనియా, వివిధ అవయవాల వైఫల్యమే ప్రధాన కారణమని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. బుధవారం రాత్రి నుంచీ ఈసీఎమ్వో (ఎక్స్ట్రాకార్పోరీల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్ – ఎక్మో) యంత్రంపైనే ఉన్నారని తెలిపారు. ‘న్యుమోనియా, మూత్రపిండాలు పనిచేయకపోవడం కారణంగా చివరిరోజుల్లో ఆయన చాలా ఇబ్బందిపడ్డారు’ అని సీనియర్ ఎయిమ్స్ వైద్యుడొకరు తెలిపారు. దీర్ఘకాలంగా గుండె, శ్వాసకోస సమస్యలతో బాధపడే వారికి శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ను తీసుకోవడం సాధ్యం కాదు. అలాంటి వారిని ఎక్మోపై ఉంచి శ్వాసతీసుకునేలా చేస్తారు. మూత్రనాళ ఇన్ఫెక్షన్, యూరిన్ ఔట్పుట్ తక్కువగా ఉండటం, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన్ను జూన్ 11న ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత ఆయనకు డయాలసిస్ చేసిన వైద్యులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. చాలాఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్న వాజ్‌పేయి.. 1984 నుంచి ఒకే కిడ్నీతో వెళ్లదీస్తున్నారు. 2009లో స్ట్రోక్ రావడంతో ఆయన గ్రహణ, స్పర్శ సామర్థ్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొంతకాలానికే ఆయన డిమెన్షియా (చిత్తవైకల్యం) బారిన పడ్డారు. వాజ్‌పేయి మృతిచెందిన వెంటనే అనాటమీ విభాగంలో ఎంబామింగ్ నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. -
కబాలి టైటిల్స్ పై వివాదం.. ఫిర్యాదు
సుల్తాన్‌బజార్(హైదరాబాద్): డివైడ్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం 'కబాలి'పై తొలిసారిగా వివాదం చెలరేగింది. సినిమా టైటిట్స్ లో రజనీకాంత్ పేరు ముందు పద్మవిభూషణ్ బిరుదును ఉంచడంపై తెలంగాణ రక్షణ వేదిక(టీఆర్ వి) మండిపడింది. శుక్రవారం హైదర్ గూడలోని న్యూస్ సర్వీస్ సిండికేట్(ఎన్ఎస్ఎస్)లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లేష్‌యాదవ్ మాట్లాడారు. కబాలిలో హీరో పేరును 'పద్మవిభూషణ్' రజనీకాంత్ గా చూపారని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 18(1) ప్రకారం అలా చేయడం చట్టవిరుద్ధమని టీఆర్ వి అధ్యక్షుడు అన్నారు. నటీనటులు తమకు లభించిన పౌరపురస్కారాలను సినిమా టైటిళ్లలో ప్రదర్శించరాదంటూ గతంలో నటులుమోహన్ బాబు, బ్రహ్మానందంల కేసుల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులను ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు 'కబాలి' సినిమా సంబంధిత వ్యక్తులపై సెన్సార్ బోర్డు రిజినల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. -
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం
-
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డుల జాబితాను శుక్రవారం ప్రకటించింది. వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన 148 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ, యోగా గారు బాబా రామ్‌దేవ్, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, పండిట్ రవిశంకర్‌లను కేంద్రం పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించనుంది. బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్‌తో పాటు మాజీ ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామిలకు పద్మభూషణ్ పురస్కారాలు లభించనున్నాయి. భారత హాకీ టీం కెప్టెన్ సర్దార్‌సింగ్, తెలుగు తేజం-స్టార్ షట్లర్ పీవీ సింధులు పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌లను కూడా కేంద్రం పద్మ పురస్కారాలతో సత్కరించనుంది. ఈ నెల 25న జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వీరికి పద్మ అవార్డులు ప్రదానం చేస్తారు. * ఎల్.కె.అద్వానీ, అమితాబ్, శ్రీశ్రీ రవిశంకర్, బాబా రాందేవ్లకు పద్మవిభూషణ్ * దిలీప్ కుమార్ ఎన్. గోపాలస్వామికి పద్మభూషణ్ * పి.వి.సింధు, సర్దార్ సింగ్‌లకు పద్మశ్రీ * ప్రకాశ్ సింగ్ బాదల్, రజనీకాంత్లకు పద్మ అవార్డులు -
జీవితమే కృష్ణ సంగీతము..
మెరిసే తారలకు.. కురిసే వెన్నెలకు పరిచయాలుంటాయా ? ఆ నైజమే వాటి ఉనికి! కర్ణాటక సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు, రాగస్రష్ట.. పద్మవిభూషణ్.. మంగళంపల్లి బాలమురళీకృష్ణదీ అదే నైజం ! పాటే ఆయన పరిమళం.. రాగాలే ఆయన అస్తిత్వం.. ఒక్క మాటలో చెప్పాలంటే సంగీతం ఆయనకు సర్వస్వం. ఆదివారం.. అమీర్‌పేట్ ధరమ్‌కరమ్ రోడ్డులో ‘ధీ ఆర్ట్స్పేస్’ అనే ఆర్ట్‌గ్యాలరీని ప్రారంభించడానికి ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో బాలమురళీకృష్ణ చిట్‌చాట్ ఇది.. కళలకు కాణాచి హైదరాబాద్. ఈ నగరంతో నా అనుబంధం నిన్నమొన్నటిది కాదు. నా చిన్నతనం నుంచీ ఉంది. హైదరాబాద్‌తోనే కాదు ఇక్కడి సంగీతంతోనూ ఎనలేని అనుబంధం నాది. బోలెడు జ్ఞాపకాలూ ఉన్నాయి. ఇక్కడ నా మొట్టమొదటి కచేరీ అవగానే నన్ను ఆస్ధాన విద్వాంసుడిగా చేశారు. ఇదిగో ఇప్పుడు ఇలా ఈ ఆర్ట్‌గ్యాలరీని నేను ప్రారంభించడం కూడా హైదరాబాద్ నాకిస్తున్న చక్కటి జ్ఞాపకమే. ఇలాంటివి బోలెడున్నాయి. ఏ ఒక్కటని చెప్పను? జగమంతా సంగీతమే! సంగీతం అంటే కేవలం సరిగమపదనిసలే కావు. మన జీవితమే సంగీతం. మన మాటల్లో శ్రుతి ఉంటుంది. నడకలో లయ ఉంటుంది. ఇలా ఫలానాది సంగీతం... ఫలానాది కాదు అని చెప్పలేం. విశ్వమంతా సంగీతమే. అన్నిట్లో సంగీతం ఉంటుంది. దేన్నుంచీ దీన్ని విడదీయలేం. అలాగే ఇది శాస్త్రీయ సంగీతం.. ఇది కాదు అని కూడా చెప్పలేం. జానపద... సినిమా సంగీతాలన్నీ కూడా శాస్త్రీయమే. అందుచేత సంగీతాన్ని ఓ సబ్జెక్ట్‌గా తీసుకోకూడదు. సినిమాకు ఎలా కావాలో అలా ఉంటేనే బాగుంటుంది. సినిమాలో త్యాగరాజ సంగీతాన్ని పెట్టలేం... కచేరీలో సినిమా పాటలను పాడలేం. ఎక్కడ ఏది కావాలో అదుండాలి. వివరాలు అనవసరం. ఉదాహరణకు .. ‘అర్థంకాదూ..’ అని దీర్ఘంగా పలికితే ఆ మాట ఒక రకంగా ఉంటుంది, ‘అర్థం కాదు’ అని కాస్త కటువుగా అంటే ఒక రకంగా ఉంటుంది.. ‘అర్థం కా... దు’ అని అంటే ఇంకోరకంగా ఉంటుంది. అందుకే శ్రుతిలయలు ఉన్నదంతా సంగీతమే! చెవికి ఇంపుగా ఉన్న ప్రతిదీ కర్ణాటక సంగీతమే! సంగీతమే దివ్యౌషధం ఎంతోమంది ఎన్నో సమస్యలతో నా దగ్గరకు వచ్చారు.. వస్తున్నారు. కొందరికి నేను మ్యూజిక్ థెరపీ ఇస్తున్నాను అని చెప్పి మరీ చేస్తున్నాను. ఇంకొందరికి వాళ్లకు తెలియకుండానే చేసేస్తున్నాను నాకు నమ్మకం కలగడానికి. వాళ్ల సమస్యలు తగ్గాక మ్యూజిక్ థెరపీ తీసుకున్నామని తెలుసుకుంటున్నారు . ఏమైనా నా మ్యూజిక్ థెరపీ ప్రయోగం బాగా సక్సెస్ అయింది. ప్రాణం పోయే సమయంలో నా దగ్గరకు వచ్చి బాగా అయిపోయిన వాళ్లూ ఉన్నారు. సంగీతం.. అన్నిటికీ దివ్యౌషధం. ఒత్తిడి.. మానసిక వ్యాకులత వీటన్నిటికీ ఇది అద్భుత ఔషధం! తెలంగాణ ఆస్థాన విద్వాంసుడిగా.. ఈ ప్రభుత్వం ఆహ్వానిస్తే సంతోషంగా ఒప్పుకుంటాను. నేనూ తెలగాణ్యుడినే. ఇక్కడి శ్రోతలు మంచి మంచి పాటలు వినాలి. పెద్దపెద్ద కళాకారులను పిలిచి కచేరీలు పెట్టించాలి. ఆ గాయకులకు చక్కటి గౌరవాన్ని అందించాలనే ఆశిస్తున్నాను. సర్వరోగ నివారిణి సంగీతం. ఆ సంగీతంలో మానసికోల్లాసాన్ని పొంది.. వచ్చిన శక్తితో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి. తక్కువ కాలంలోనే ఈ రాష్ట్రం ఉన్నత స్థానంలో ఉండాలని.. ఉంటుందనీ కోరుకుంటున్నాను. నవ కళావేదిక కళాజగతిలో హైదరాబాద్‌ది అద్భుతమైన స్థానం! దానికి మరిన్ని వన్నెలద్దడానికి ధీ ఆర్ట్ స్పేస్ పేరుతో ఆదివారం సరికొత్త గ్యాలరీ ప్రారంభమైంది. ఈ వేడుకకు ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ హాజరయ్యారు. విజువల్ ఆర్ట్‌పై చర్చావేదికలు, లెక్చర్స్, ఫిల్మ్ స్క్రీనింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని గ్యాలరీ నిర్వాహకురాలు భార్గవి గుండాల తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఫైన్ ఆర్ట్స్‌లో పీజీ పూర్తి చేసిన భార్గవి.. ఈ గ్యాలరీని విజువల్ ఆర్ట్స్‌కి రిసోర్స్ సెంటర్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. ‘ధీ ఆర్ట్స్పేస్’ తొలి ప్రదర్శనలో కొలువుదీరిన కేరళకు చెందిన కేపీ ప్రసాద్, వెస్ట్‌బెంగాల్‌కు చెందిన కుందన్ మండల్, అసోం కళాకారుడు రాకేశ్ రాయ్‌చౌదరి.. కుంచెల నుంచి జాలువారిన అద్భుత కళాఖండాలు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.