
కబాలి టైటిల్స్ పై వివాదం.. ఫిర్యాదు
సుల్తాన్‌బజార్(హైదరాబాద్): డివైడ్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం 'కబాలి'పై తొలిసారిగా వివాదం చెలరేగింది. సినిమా టైటిట్స్ లో రజనీకాంత్ పేరు ముందు పద్మవిభూషణ్ బిరుదును ఉంచడంపై తెలంగాణ రక్షణ వేదిక(టీఆర్ వి) మండిపడింది. శుక్రవారం హైదర్ గూడలోని న్యూస్ సర్వీస్ సిండికేట్(ఎన్ఎస్ఎస్)లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లేష్‌యాదవ్ మాట్లాడారు.
కబాలిలో హీరో పేరును 'పద్మవిభూషణ్' రజనీకాంత్ గా చూపారని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 18(1) ప్రకారం అలా చేయడం చట్టవిరుద్ధమని టీఆర్ వి అధ్యక్షుడు అన్నారు. నటీనటులు తమకు లభించిన పౌరపురస్కారాలను సినిమా టైటిళ్లలో ప్రదర్శించరాదంటూ గతంలో నటులుమోహన్ బాబు, బ్రహ్మానందంల కేసుల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులను ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు 'కబాలి' సినిమా సంబంధిత వ్యక్తులపై సెన్సార్ బోర్డు రిజినల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.