
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఏరోస్పేస్ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత ఫ్రొఫెసర్ రొడ్డం నరసింహ (87) కన్నుమూశారు. మెదడులో రక్తస్రావం కావడంతో డిసెంబర్ 8న బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస తీసుకున్నారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. నేడు(డిసెంబర్15న) నరసింహ అంత్యక్రియలు నిర్వహించనున్నామని వారు తెలిపారు. మరోవైపు నరసింహ మరణంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. అత్యుత్తమ శాస్త్రవేత్త ప్రొఫెసర్ నరసింహ అనీ, భారతదేశ పురోగతి, సైన్స్ ఆవిష్కరణల శక్తిని పెంచేందుకు కృషి చేశారని మోదీ ట్వీట్ చేశారు.
కాగా జూలై 20, 1933న జన్మించిన నరసింహ ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా నరసింహ భారతదేశానికి ఎంతో సేవ చేశారు. ఇస్రో తేలికపాటి యుద్ద విమానాల నిర్మాణంలో ఆయన పాలుపంచుకున్నారు. 1962 నుండి 1999 వరకు ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐస్‌సీ) లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బోధించిన ఆయన 1984-1993 వరకు నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2000- 2014 వరకు బెంగళూరులోని జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (జెఎన్‌సిఎఎస్ఆర్)లో ఇంజనీరింగ్ మెకానిక్స్ యూనిట్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. అలాగే ప్రొఫెసర్ సతీశ్ ధావన్ మొదటి విద్యార్థి ఈయనే. నరసింహ భట్నాగర్ అవార్డుతో పాటు, 2013లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు. మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంతో కలిసి “డెవలప్‌మెంట్స్ ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ” అనే పుస్తకాన్ని రచించారు.
PM Narendra Modi condoles the demise of aerospace scientist Roddam Narasimha
— ANI (@ANI) December 15, 2020
"He was an outstanding scientist, passionate about leveraging the power of science and innovation for India’s progress," says PM https://t.co/sKGUVnTKmB