
సాక్షి, న్యూఢిల్లీ : అటల్ బిహారి వాజ్‌పేయి ఎంత మృధు స్వభావో అంతటి చమత్కారి కూడా అంటుంటారు. వాజ్‌పేయి ప్రధానిగా వ్యవహరించిన సమయంలో ఆయన క్యాబినెట్ సహచరుడు అరుణ్ శౌరి తనకు ఎదురైన పలు అనుభవాలను పంచుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై విశ్లేషణకు పార్టీ నేతలు, మంత్రులతో వాజ్‌పేయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. గంభీరవాతావరణంలో సమావేశం ప్రారంభమైంది. నేతలు ఒక్కొక్కరే ఓటిమికి దారితీసిన పరిస్థితులను వివరించారు. భాగస్వామ్య పక్షం శివసేన బీజేపీ అవకాశాలను దెబ్బతీసిందని ఒక నేత అంటే. పార్టీకి వ్యతిరేకంగా ముస్లింలు ఏకమయ్యారని మరో నేత చెప్పుకొచ్చారు. మరో నేత పార్టీ యంత్రాంగం బలహీనపడిందని విశ్లేషించారు.
సమావేశంలో మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఓటమికి మరొకరిని బాధ్యుల్ని చేసి చేతులు దులుపుకునేలా వ్యవహరించారు. వారి అభిప్రాయాలను ఓపిగ్గా విన్న వాజ్‌పేయి ముఖంపై చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడటం మొదలుపెట్టారు. సమావేశ మందిరంలో అందరిలో ఉద్వేగ వాతావరణం నెలకొనగా ఒకే ఒక్క మాటతో వాజ్‌పేయి అక్కడి వాతావరణాన్ని తేలికపరిచారు.‘ పార్టీ ఓటమికి కొత్త కారణాలు ఏమీ లేవంటారు అంతేగా..అయితే టీ తాగుదాం పదండి’ అంటూ లేచారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనతో సన్నిహితంగా పనిచేసిన అరుణ్ శౌరి మాజీ ప్రధాని సామర్థ్యం, నైపుణ్యాలను కొనియాడారు. తన వద్ద పనిచేసే వారిలో అత్యుత్తమమైన పనితనాన్ని ఆయన రాబడతారని అరుణ్ శౌరి గుర్తుచేసుకున్నారు. ఇతరుల నుంచి మెరుగైన పనిరాబట్టడంలో వాజ్‌పేయి చతురత దాగుందని..మరికొందరు ఇతరుల నుంచి పేలవమైన సామర్థ్యం రాబడతారని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి చురకలు అంటించారు. అరుణ్ శౌరి గత కొంతకాలంగా మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.