
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి
తండ్రిలాంటి వ్యక్తిని కోల్పోయా!
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతితో ప్రధాని మోదీ విచారంలో మునిగిపోయారు. గొప్ప రాజనీతిజ్ఞుడైన వాజ్‌పేయి మృతితో దేశ రాజకీయాల్లో ఓ శకం ముగిసిందని ఆయన పేర్కొన్నారు. తండ్రిలాంటి వ్యక్తిని కోల్పోవడం వ్యక్తిగతంగా తనకు, దేశానికి ‘పూడ్చుకోలేని లోటు’అని మోదీ వెల్లడించారు. వాజ్‌పేయి దేశం కోసమే జీవితాన్ని పణంగా పెట్టి దశాబ్దాల తరపడి అలుపెరగకుండా దేశ సేవలో తరించారన్నారు. 21వ శతాబ్దంలో భారత్ సుసంపన్న దేశంగా ఎదిగేందుకు జరుగుతున్న కృషిలో వాజ్‌పేయి వేసిన బలమైన పునాదులను దేశం ఎన్నటికీ మరవబోదన్నారు. గురువారం రాత్రి విడుదల చేసిన వీడియో సందేశంలో.. ‘అటల్‌జీ మనల్ని వదలి వెళ్లడం నాకు వ్యక్తిగతంగా తీరనిలోటు. ఆయన దీర్ఘదృష్టితో వివిధ రంగాల్లో రూపొందించిన విధివిధానాలు, భారతదేశం మూలమూలన ఉన్న ప్రజల జీవితాలను స్పృశించాయి. వాజ్‌పేయితో నాకు లెక్కలేనన్ని జ్ఞాపకాలున్నాయి. నాలాంటి ప్రతి కార్యకర్తకు ఆయనే స్ఫూర్తి. జన్‌సంఘ్‌ను, బీజేపీని బలోపేతం చేయడంలో తీవ్రంగా శ్రమించారు.
సంఘటన్, శాసన్ (పాలన) గురించిన చాలా అంశాలను ఆయన నాకు బోధించారు. ఆయన్ను కలిసిన ప్రతిసారీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ప్రేమను కురిపించారు. నేడు మా స్ఫూర్తిని, అటల్ రత్నాన్ని కోల్పోయాం. అటల్‌జీ వ్యక్తిత్వాన్ని మాటల్లో వర్ణించలేం. ఆయన లేని లోటును ఏం చేసినా పూడ్చలేం. ఆయన దేశం గురించే ఎప్పుడూ ఆలోచించే గొప్ప రచయిత. ఆయన పదునైన వ్యాఖ్యలు, అద్భుతమైన చమత్కారాన్ని ఎన్నటికీ మరువలేను. బీజేపీ నేడు ఈ స్థితికి చేరుకోవడంలో వాజ్‌పేయి పాత్ర అత్యంత కీలకం. దేశం మూలమూలన తిరిగారు. దీని కారణంగానే నేడు పార్టీ ఓ బలమైన శక్తిగా ఎదగగలిగింది. వాజ్‌పేయి కుటుంబసభ్యులకు, దేశవ్యాప్తంగా, కోట్లాది కార్యకర్తలకు మహనీయుడి మరణం నుంచి త్వరగా కోలుకునే శక్తిని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’అని పేర్కొన్నారు.
కేంద్ర కేబినెట్ సంతాపం
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మృతికి కేంద్ర కేబినెట్ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమై సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రివర్గ సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రముఖ నేతలు మరణించినప్పుడు కేంద్ర కేబినెట్ సమావేశమై సంతాపం తెలపడం రివాజు. దివంగత నేతకు గౌరవ సూచకంగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 16 నుంచి 22 వరకూ ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఈ ఏడు రోజులు జాతీయ జెండాను అవనతం చేయాలని కేంద్ర హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం ఒకపూట సెలవుదినం ప్రకటించారు.
గొప్ప రాజనీతిజ్ఞుడు: పాక్
ఇస్లామాబాద్ : మాజీ ప్రధాని వాజ్‌పేయిని గొప్ప రాజనీతిజ్ఞుడిగా కొనియాడుతూ పాకిస్తాన్ నివాళులర్పించింది. వాజ్‌పేయి మరణవార్త తెలుసుకుని ఎంతో విచారిస్తున్నామని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘వాజ్‌పేయి గొప్ప రాజనీతిజ్ఞుడు. భారత్–పాకిస్తాన్ సంబంధాల్లో మార్పు కోసం కృషిచేశారు. అలాగే దక్షిణాసియా కూటమి సార్క్‌కు కీలక మద్దతుదారుగా ఉండడమే కాకుండా ప్రాంతీయ సహకారం కోసం పాటుపడ్డారు’ అని పాక్ విదేశాంగ ప్రతినిధి సంతాప సందేశంలో పేర్కొన్నారు. వాజ్‌పేయి కుటుంబానికి, అలాగే భారత ప్రభుత్వం, ప్రజలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నామని ఆయన చెప్పారు.
దిగ్గజుడిని కోల్పోయాం
‘వాజ్‌పేయి మరణం అత్యంత విషాదకరం. ఆయన దేశంలోని నిజమైన రాజనీతిజ్ఞుడు. ఆ మృదు స్వభావ దిగ్గజుడిని మనమంతా కోల్పోయాం. అద్భుత నాయకత్వ లక్షణాలు, దూరదృష్టి, పరిణతి, వాక్పటిమల్లో ఆయనకు ఆయనే సాటి’
– రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
గొప్ప బిడ్డను కోల్పోయింది
‘ఒక శకం ముగిసింది. భారత్ గొప్ప బిడ్డను కోల్పోయింది. ఈ వార్త తీవ్ర విషాదం కలిగిస్తోంది. వాజ్‌పేయి ప్రతిపక్షంలో ఉంటే హేతుబద్ధంగా విమర్శించేవారు. అధికారంలో ఉన్నప్పుడు ఏకాభిప్రాయం కోసం శ్రమించేవారు. అసలైన ప్రజాస్వామ్య వాది ఆయన. ఆయనకు నా ప్రగాఢ సంతాపం’
– ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి
ఈ బాధ చెప్పేందుకు మాటలు లేవు: అడ్వాణీ
‘దేశ అత్యున్నత రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్‌పేయి మరణం వల్ల కలిగిన తీవ్ర బాధ, దుఃఖాన్ని వ్యక్తపరిచేందుకు నా వద్ద మాటలు లేవు. అటల్ జీ నాకు సీనియర్ మాత్రమే కాదు.. 65 ఏళ్లకు పైగా నా ఆత్మీయ నేస్తం. ఆరెస్సెస్ ప్రచారక్‌లుగా కలిసి పనిచేయడం నుంచి, భారతీయ జనసంఘ్ స్థాపనలోనూ, అలాగే ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో పుట్టిన ఆందోళన నుంచి 1980లో బీజేపీ ఆవిర్భావంలోనూ వాజ్‌పేయితో నాకు సుదీర్ఘంగా అనుబంధం ఉంది. కాంగ్రెసేతర సుస్థిర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మార్గదర్శిగా ఆయన గుర్తుండిపోతారు. ఆయన మంత్రి మండలిలో ఆరేళ్లపాటు ఉప ప్రధానిగా పనిచేయడం నాకు గర్వంగా ఉంది. సీనియర్‌గా నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారు. మార్గదర్శనం చేసేవారు. ఆకట్టుకునే నాయకత్వ లక్షణాలు, మంత్రముగ్ధులను చేసే ప్రసంగాలు, దేశభక్తి, అన్నింటికన్నా మిన్నగా కరుణ, వినయం వంటి మానవీయ విలువలు, సైద్ధాంతిక విభేదాలు ఉన్నా ప్రత్యర్థులపై గెలవడానికి అవసరమైన అద్భుత సామర్థ్యాలను కలిగి ఆయన నా ప్రజా జీవితంపై ప్రభావం చూపారు. అటల్‌జీని కోల్పోవడం చాలా బాధగా ఉంది’ –-ఎల్.కె.అడ్వాణీ, బీజేపీ సీనియర్ నేత
పార్టీని మర్రిచెట్టుగా మలిచారు
‘బీజేపీ అనే మొక్కను తన ధైర్యం, నిరంతర శ్రమతో అత్యంత జాగ్రత్తగా పెంచి మర్రిచెట్టుగా మలిచిన వ్యక్తి వాజ్‌పేయి. భారత రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారు. అధికారం ఉన్నది సేవ చేసేందుకేనని నమ్మి జాతీయ స్థాయిలో గొప్ప ప్రజాదరణ ఉన్న నాయకుడిగా ఎదిగారు. దేశ ప్రయోజనాలపై రాజీపడకుండా మచ్చలేని రాజకీయ జీవితం గడిపారు. అందుకే పార్టీలు, వర్గాలకతీతంగా అందరూ ఆయనను ప్రేమిస్తారు. ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు మా పార్టీ పని చేస్తుంది’
– అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు
చాలా బాధాకరం
‘అటల్‌జీ ఇక లేరని తెలియడం బాధాకరం. ఇంత త్వరగా ఆయనను కోల్పోతామని ఊహించలేదు. స్వాతంత్య్రం అనంతరం దేశంలోని అత్యున్నత నేతల్లో వాజ్‌పేయి ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర గొప్పది. 23 పార్టీల సంకీర్ణాన్ని ఆయన విజయవంతంగా నడిపారు. దేశంలో రవాణా సదుపాయాలు విప్లవాత్మకంగా మెరుగుపరిచిన ప్రధాని ఆయన. వ్యక్తిత్వ, వక్తృత్వ, కర్తృత్వ, మితృత్వ లక్షణాలన్నీ కలగలిపిన నేతృత్వగా భారత రత్న అటల్ జీ ఎప్పటికీ గుర్తుండిపోతారు’
– వెంకయ్య నాయుడు, ఉప రాష్ట్రపతి
ఆధునిక భారతంలో ఉద్దండ నేత
వాజ్‌పేయి దత్తపుత్రిక నమితా కౌల్ భట్టాచార్యకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఓ లేఖ రాస్తూ సంతాపం తెలిపారు. ‘వాజ్‌పేయి గొప్ప దేశభక్తుడు. ఆధునిక భారతంలో జీవితం మొత్తం ప్రజా సేవలో గడిపిన ఉద్దండ నాయకుడు. ప్రధానిగా, పార్లమెంటు సభ్యుడిగానూ అద్భుతంగా పనిచేశారు. ఆకట్టుకునేలా రచనలు చేసిన కవి, గొప్ప వక్త. పార్టీలకతీతంగా నాయకులు, అన్ని వర్గాల ప్రజలు ఆయనను గౌరవించారు. ప్రేమించారు. దేశీయంగా, అంతర్జాతీయంగా తన సామర్థ్యాలను నిరూపించుకుని, ఇతర దేశాలతో భారత సంబంధాలను గణనీయంగా మెరుగుపరిచిన గొప్ప రాజనీతిజ్ఞుడు వాజ్‌పేయి. ఆయన మరణం నన్ను తీవ్రంగా బాధిస్తోంది’
– మాజీ ప్రధాని మన్మోహన్
గొప్ప మానవతావాది: నరసింహన్
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతి పట్ల తెలంగాణ, ఏపీ గవర్నర్ నరసింహన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. వాజ్‌పేయి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వాజ్‌పేయి గొప్ప మానవతావాది, రాజనీతిజ్ఞుడు, పాలనాదక్షుడు, కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు. వాజ్‌పేయి మృతి దేశానికి పెద్ద లోటు అన్నారు. ప్రజాస్వామిక విలువలను కాపాడటంలో వాజ్‌పేయి ఆదర్శనీయుడని అన్నారు.
విలువలతో కూడిన రాజకీయాలు నడిపారు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశా రు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, మాజీ ప్రధానిగా విలువలతో కూడిన రాజకీయాలను నడిపి దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన వాజ్‌పేయి మృతి తీరని లోటు అని సీఎం అన్నారు. ఉదారవాది, మానవతావాది, కవి, సిద్ధాంతకర్త, మంచి వక్త, నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసిన అటల్‌జీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
రాజకీయ భీష్ముడు: చంద్రబాబు
‘వాజ్‌పేయి మృతితో దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని, రాజకీయ భీష్ముడిని కోల్పోయింది. నమ్మిన సూత్రాలను నిజ జీవితంలో ఆచరించి చూపిన వ్యక్తి ఆయన. ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఎంపీగా బహుముఖ పాత్ర పోషించారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించడంలో నేనే చొరవ తీసుకుని వాజ్‌పేయితో మాట్లాడాను. ఏపీ అభివృద్ధికి ఆయన తోడ్పాటు అందించారు. ఆయన పరిపాలన, రాజకీయ అనుభవాలతో వాజ్‌పేయి శకం భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోతుంది’
గొప్ప నేతను కోల్పోయాం: వైఎస్ జగన్
‘భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి మృతిచెందారన్న వార్త ఎంతగానో బాధించింది. అటల్‌జీ మరణంతో మన దేశ రాజకీయాల్లో ఓ గొప్ప శకం ముగిసినట్టయింది. విభేదించే రాజకీయ పార్టీల వారికి కూడా ఆమోదయోగ్యుడిగా, అద్భుతమైన–ఆకట్టుకునే వక్తగా, కవిగా, రాజకీ య విలువలు, మర్యాదల పరంగా శిఖర సమానుడిగా, విదేశీ దౌత్య దురంధరుడిగా వాజ్‌పేయి అందరి మన్ననలూ పొందారు. దేశానికి ఆయన చేసిన సేవలు, రాజకీయాల్లో ఆయన నెలకొల్పిన విలువలు కలకాలం గుర్తుంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’.
వాజ్‌పేయి నాయకులకు మార్గదర్శి: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ : సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, మేధావి, మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం ఈ దేశానికి తీరని లోటు అని, గొప్ప రాజకీయ మేధావిగా, సౌమ్యునిగా వాజ్‌పేయి రాజకీయ నాయకులకు స్ఫూర్తి, మార్గదర్శి అని ఆయన గురువారం ఓ ప్రకటనలో కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.
ప్రకటనకు ముందే యడ్యూరప్ప నివాళి
సాక్షి బెంగళూరు : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి మరణంపై అధికారిక ప్రకటన రాకముందే బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తన ట్విటర్ ఖాతాలో నివాళి అర్పించడం చర్చనీయాంశమైంది. గురువారం సాయంత్రం 05.05 గంటలకు వాజ్‌పేయి మరణవార్త వెలువడింది. యడ్యూరప్ప అరగంట ముందే ట్విట్టర్‌లో శ్రద్ధాంజలి ప్రకటనను పోస్ట్ చేయడం విశేషం. ‘నాకు ఎంతో ప్రేరణ ఇచ్చిన మాజీ ప్రధాని వాజ్‌పేయి ఇకలేరన్న వార్తతో నా మనసు ఎంతో భారమైంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’అని పేర్కొన్నారు. వాజ్‌పేయి మరణంపై అధికారికంగా ప్రకటన వెలువడక ముందే సామాజిక మాధ్యమాల్లో చాలా మంది నెటిజన్లు సంతాపం వ్యక్తం చేశారు. యడ్డి కూడా ఇలాగే చేశారా?, లేక ఆయన మరణ సమాచారం ముందే తెలిసిందా? అనేది తేలాల్సి ఉంది.
కోట్లాది మంది ప్రేమిస్తారు
‘భారత్ గొప్ప వ్యక్తిని కోల్పోయింది. కోట్లాది మంది వాజ్‌పేయిని ప్రేమిస్తారు. గౌరవిస్తారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా సానుభూతి. ఆయన మరణం మనకందరికీ తీరని లోటు’
– కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
సత్సంబంధాలు నెరిపారు
‘ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కంటే ఎంతో భిన్నంగా వాజ్‌పేయి పనిచేశారు. సిద్ధాంతాల పరంగా, రాజకీయంగా విభేదాలు ఉన్నా, వ్యక్తిగతంగా ఆయనకు అందరితో సత్సంబంధాలు ఉండేవి. అది ఈ రోజుల్లో లేదు. అందుకే వాజ్‌పేయి అంటే అందరికీ ఆమోదయోగ్యుడు.’
–సీతారాం ఏచూరి, సీపీఎం
తీరని లోటు
‘వాజ్‌పేయితో కలిసి మేం పనిచేశాం. ఆయన ప్రభుత్వానికి బయటినుంచి మద్దతిచ్చాం. వాజ్‌పేయి అందరితో కలిసి పనిచేశారు. అది ఆయన వ్యక్తిత్వం. భాగస్వామ్య పక్షంలోనే కాకుండా, విపక్షాల్లోని సభ్యులనూ అన్ని విషయాలపై అభిప్రాయాలు కోరి నిర్ణయాలు తీసుకునేవారు. ఆయన మృతి తీరని లోటు’
– మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి.
ఆమోదయోగ్య నాయకుడు
‘అందరికీ ఆమోదయోగ్యమైన, నిర్ణయాత్మక నాయకుడు వాజ్‌పేయి. తన ఆలోచనలు, సత్ప్రవర్తనతో భారతీయ సాంస్కృతిక విలువలను ఆయన తన జీవన విధానంలో ఇముడ్చుకున్నారు’
– ఆరెస్సెస్
తీవ్ర విషాదంలో ఉన్నాం
‘వాజ్‌పేయి మరణం భారత్‌కు తీరని లోటు. తీవ్ర విషాదంలో ఉన్నాం’
–ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
ఆయన రాజకీయం ఆచరణీయం
‘భారత్‌ను అణుశక్తి దేశంగా ఆవిష్కరించడంలో ఆయన చూపిన వజ్రసంకల్పం దేశానికి రక్షణ కవచంగా మారింది. విలువలతో కూడిన ఆయన రాజకీయం ఈ నాటి నేతలకు సర్వదా ఆచరణీయం. ఆయన ఈ దేశంలో జన్మించడం మన అదృష్టం. ప్రధానిగా ఆయన సాధించిన విజయాలు ఎల్లప్పుడూ కీర్తించదగినవి’
– జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
Comments
Please login to add a commentAdd a comment