జేఎస్ నాగప్ప తరపున ప్రచారానికి వచ్చిన వాజ్‌పేయికి స్వాగతం పలుకుతున్న దృశ్యం (ఫైల్)
కర్నూలు(హాస్పిటల్): రాజకీయ భీష్ముడు, భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గురువారం మరణించడంతో ఆయనతో ఉన్న జ్ఞాపకాలు జిల్లా నేతలు ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన నాయకులు అప్పటి సంఘటనలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుని ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని, సేవలను, అభివృద్ధిని కొనియాడారు. బీజేపీ అగ్రనేతగా ఆయన కర్నూలు జిల్లాకు నాలుగుసార్లు వచ్చారు. 1969లో జేఎస్ నాగప్ప జనసంఘ్ అభ్యర్థిగా కర్నూలు పార్లమెంట్ స్థానానికి పోటీచేయగా.. ఆయన తరపున ప్రచారానికి వచ్చారు. అలాగే 1973లోనూ జనసంఘ్ పార్టీ తరపున ఆయన జిల్లాలో పర్యటించారు. జనతా ప్రభుత్వం పడిపోయిన తర్వాత మరోసారి కర్నూలు నగరంలోని మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత 1989–90 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కర్నూలు, నంద్యాలలో బీజేపీ అభ్యర్థులు కపిలేశ్వరయ్య(కర్నూలు), ఎస్‌పీవై రెడ్డి(నంద్యాల) తరపున ఆయన ప్రచారం చేశారు. ఎంతో మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వాజ్‌పేయి గురించి ఆయనతో సన్నిహితంగా మెలిగిన పలువురు బీజేపీ నాయకుల మనోభావాలు ఇలా..
కమలాలతో నివాళి
నంద్యాల విద్య: భారత మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి మృతికి నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ తన సూక్ష్మచిత్రాల ద్వారా చిత్రనివాళులర్పించారు. ఆయన కేవలం రెండు గంటల వ్యవధిలో వాజ్‌పేయి చిత్రపటాన్ని 620 కమలాలతో చిత్రించి నివాళులర్పించారు.
కారులోనే వచ్చారు
1991లో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సమయంలో నేను బీజేపీ అభ్యర్థిగా ఉన్నాను. నంద్యాల నుంచి ఎస్‌పీవై రెడ్డి పోటీలో ఉన్నారు. ఉదయం 10 గంటలకు మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సభకు రావాల్సి ఉండగా భారీ వర్షాలు పడటంతో విమానంలో రావడానికి కుదరలేదు. దీంతో కారులో సాయంత్రం 5.30 గంటలకు వచ్చారు. ఆయన భోజనం కూడా చేయకుండా మీటింగ్‌కు వచ్చారు. ఆ తర్వాత నంద్యాల వెళ్లాము. ఆ మీటింగ్ పూర్తయ్యే సరికి రాత్రి 11 గంటలకు అయ్యింది. అప్పుడు మధ్యాహ్నం కూడా భోజనం చేయకపోవడంతో ఆకలిగా ఉందని చెప్పారు. చేపట్టిన పని కోసం ఏ విధంగా శ్రమిస్తారనేది ఆ సంఘటన ద్వారా తెలుసుకున్నాను. భారతమాత దేశభక్తి కలిగిన వ్యక్తిని కోల్పోయింది. ఢిల్లీ నుంచి పాకిస్తాన్‌కు బస్సు ప్రయాణం చేసిన ఏకైక ప్రధాని ఆయనే. ముస్లింలకు హజ్ యాత్ర వెళ్లేందుకు 35 శాతం సబ్సిడీ ఇచ్చారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న లక్నో నుంచి ఆయన పలుమార్లు ఎన్నికయ్యారు. – కపిలేశ్వరయ్య, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
మాకు స్వయంగా భోజనం వడ్డించారు
1980లో గుంతకల్‌లో, 1981లో బళ్లారికి వచ్చిన సందర్భంగా వాజ్‌పేయిని నేను కలిశాను. ఆయన బాగోగులు చూసుకునేందుకు కర్నూలు నుంచి నన్ను బళ్లారికి పంపించారు. బళ్లారిలోనే నేను ఉండి ఆయనతో పాటు డోన్ వరకు రైలులో ప్రయాణించాను. ఆయన భోజనం చేసిన తర్వాత ప్లేటు కడిగేందుకు వెళ్లగా ఒప్పుకోలేదు. ఆయనే స్వయంగా ప్లేటు కడిగారు. ఆ తర్వాత ఆయన మాకూ స్వయంగా భోజనం వడ్డించారు. 1989–90 ఎన్నికల్లో కపిలేశ్వరయ్య కోసం ప్రచారానికి ఆయన వచ్చినప్పుడు కూడా కలిశాను. అప్పట్లో అలంపూర్ వద్ద ఆయన కోసం ప్రత్యేక హెలిప్యాడ్ ఏర్పాటు చేశాము. అయితే వర్షాలు అధికంగా ఉండటంతో పైలెట్ ఒప్పుకోకపోవడంతో ఆయన కారులోనే కర్నూలుకు వచ్చారు. – ఇ. మల్లికార్జున్‌రెడ్డి, ఏబీపీఎం సభ్యులు, ఏకలవ్యాన్
భుజం తట్టింది ఇప్పటికీ గుర్తే
వాజ్‌పేయితో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షులుగా ఉన్న మురళీమనోహర్ జోషి ఏక్తాయాత్ర చేపట్టి జమ్మూలోని వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లారు. ఆ సమయంలో వాజ్‌పేయిని కలిసేందుకు నేనూ వెళ్లాను. ఆలయం వద్ద ఆయనను కలిసి మాట్లాడాను. అంత పెద్ద నాయకుడైన ఆయన మాతో కొద్దిసేపు ముచ్చటించారు. నేను 8వ తరగతి చదువుతున్న సమయంలో కర్నూలు మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే ఓ కార్యక్రమానికి వాజ్‌పేయి వచ్చారు. ఆ సందర్భంగా మా తండ్రి కాళింగి పుల్లయ్యవర్మ సూచనతో నేను వాజ్‌పేయికి పూల దండ వేశాను. అప్పడు ఆయన నా భుజం తట్టారు. ఆ విషయం ఇంకా గుర్తుంది. – కాళింగి నరసింహవర్మ, బీజేపీ సీనియర్ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment