రామ్‌నగర్ మహిళామోర్చ నాయకురాలు చంద్రకళ నివాసానికి వచ్చిన వాజ్‌పేయి (ఫైల్)
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆయన ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారు. శత్రు దేశంలో సైతంఅభిమానులను సంపాదించుకున్న గొప్ప దార్శనికుడిగా మాజీ ప్రధాని అటల్ బిహారివాజ్‌పేయి గుర్తింపు పొందారు. అంతటి గొప్పనేత గురువారం సాయంత్రం మృతి చెందారు. అటల్ మరణంతో నగరం కన్నీటి పర్యంతమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా,ప్రధానమంత్రిగా వివిధ సందర్భాల్లో వాజ్‌పేయి గ్రేటర్‌లో పలుమార్లు పర్యటించారు.ఇక్కడితో ఆయనకున్న అనుభవాలు, బంధాలను సిటీ నేతలు ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
సాక్షి,సిటీబ్యూరో, మేడ్చల్/బంజారాహిల్స్/నాగోలు: మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌బిహారీ వాజ్‌పేయి ఇక లేరనే వార్త నగర వాసుల్లో విషాదాన్ని నింపింది. ఆయన మృతితో బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులను తీవ్రంగా కలచివేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, ప్రధానమంత్రిగా వివిధ సందర్భాల్లో వాజ్‌పేయి గ్రేటర్‌లో పలుమార్లు పర్యటించారు. ప్రధానిగా ఉన్న సమయంలో నగరంలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన చేతులమీదుగానే ప్రారంభించారు. ఈ సందర్భంగా అటల్‌జీతో గడిపిన ఆత్మీయ క్షణాల్ని పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు.
ముందస్తు ఎన్నికల ప్రకటన..
2004 లోక్‌సభకు జరిగిన ముందస్తు ఎన్నికల నిర్ణయం ట్యాంక్‌బండ్ సమీపంలోని మారియట్ హోటల్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీసుకున్నదే కావటం విశేషం. ముషీరాబాద్ నియోజకవర్గంలో వాజ్‌పేయి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. గతంలో ఆయన రెండుసార్లు ఈ నియోజకవర్గంలో పర్యటించారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే లక్ష్మణ్ తదితర నేతలు వాజ్‌పేయితో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మాదాపూర్‌లోని సైబర్ టవర్‌ను 1998 నవంబర్ 22న ప్రధాని హోదాలో ఆయన ప్రారంభించారు. 1994లో మేడ్చల్ పట్టణానికి వాజ్‌పేయి వచ్చారు.
ఐఎస్‌బీ ప్రారంభోత్సవానికి..
గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ బిజినెస్ (ఐఎస్‌బీ)ను 2001 డిసెంబర్ 2న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. 1989లో నిజాం కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొనేందుకు రైలులో వచ్చిన ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో దిగి కొంత సేపు ఈ ప్రాంత బీజేపీ నాయకులతో ముచ్చటించారు.
పలువురు నేతల సంతాపం
ఉగ్రవాదంపై అంతర్జాతీయ యూత్ కన్ఫరెన్స్‌ను ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో 2003లో నిర్వహించిన సమావేశంలో ప్రధాని హోదాలో అటల్ బీహారీ వాజ్‌పేయి పాల్గొన్నారు. వాజ్‌పేయితో తన స్ఫూర్తిదాయక అనుబంధం ఉందని ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి అన్నారు. సంస్కరణలకు జీవం పోసిన మహోన్నత వ్యక్తి వాజ్‌పేయి అని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు.
వాజ్‌పేయి మృతి పట్ల రాష్ట్ర మంత్రి పద్మారావు సంతాపం వ్యక్తం చేశారు. అప్పటి యువమోర్చా నాయకుడు స్వామిగౌడ్, బీజేపీ ఓబీసీ సెల్ కార్యదర్శి కటకం నర్సింగ్‌రావులు వాజ్‌పేయితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
వాజ్‌పేయి మృతికి సంతాపం
సాక్షి, సిటీబ్యూరో: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గొప్ప కవి, సాహితీవేత్త మహోన్నతుడని తెలుగు టీవీ రచయితల సంఘం అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్ అన్నారు. గురువారం రవీంద్రభారతి సమావేశ మందిరంలో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కవి సమయం, భారత్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో శ్రీమాన్ వానమామలై వరదాచార్యుల 106వ జయంతి, స్మారక పురస్కార ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది పెద్దలు కనిపించని లోకానికి వెళ్లారని, అయినా వారు అందించిన పరిమళాలు ఇప్పటికి ఉన్నాయని తెలిపారు. తెలుగు చరిత్రలో వానమామలై వరదాచార్యులది సుస్థిర స్థానమన్నారు. ఈ సందర్భంగా భారత్ భాషా భూషణ్ డాక్టర్ తిరునగరికి స్మారక పురస్కార ప్రదానం చేశారు. సభలో ప్రారంభంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ మృతికి సంతాపం ప్రకటించారు. కార్యక్రమంలో కవి సమయం నిర్వాహకులు తాళ్లపల్లి మురళీధరగౌడ్, సీనియర్ జర్నలిస్టు ఉడయవర్లు, దాశరథి పురస్కార గ్రహీత డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య తదితరులు పాల్గొన్నారు.
ముస్లిం మైనారిటీలకు చేయూతనిచ్చారు..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు ఆర్థికంగా బలపడడానికి మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ఎంతో సేవ చేశారని బీజేపీ మైనార్టీ మోర్చా అధికార ప్రతినిధి ఫీరాసత్‌అలీ బాక్రీ పేర్కొన్నారు. గురువారం వాజ్‌పేయి చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం చీరాగ్‌అలీలైన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. 1977– 79లో వాజ్‌పాయి విదేశాంగ వ్యవహారాల మంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ నగరంలో పాస్‌పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పొషించారని కొనియాడారు.
1996లో ధూల్‌పేట్‌కు..
అబిడ్స్: 1996లో ధూల్‌పేట్‌ను అటల్ బిహారీ వాజ్‌పేయి సందర్శించారు. ధూల్‌పేట మినీ స్టేడియంలో బీజేపీ నాయకులు లక్ష్మణ్‌సింగ్ జెమేదార్ నిర్వహించిన అటల్ కేసరి కుస్తీ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కుస్తీ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. నిర్వాహకులు వాజ్‌పేయిని ఘనంగా సత్కరించి మార్వాడీ టోపీ, తల్వార్‌ను బహూకరించారు.
Comments
Please login to add a commentAdd a comment