తిరుమల ఆలయంలో వాజ్‌పేయికి ప్రసాదాలు అందజేస్తున్న అర్చకులు(ఫైల్)
రాజకీయాల్లో మెరిసిన భారత రత్నం అటల్ బిహారీ వాజపేయి. పార్లమెంటరీ విలువలకు నిలు వెత్తు నిదర్శనం ఈ నిష్కళంక రాజనీతిజ్ఞుడు. ఒక్క ఓటుతో ప్రధాని పదవి పోతుందని తెలిసినా నీతిమాలిన చర్యలకు పాల్పడని గొప్ప ఆదర్శవాది. ప్రతిభ ఆధారంగా వరించి వచ్చిన పదవులకు వన్నెలద్దిన మహనీయుడు. భారత పార్లమెంటరీ చరిత్ర పుటల్లో తనదైన ముద్రవేసుకున్న మహానుభావుడు. గురువారం ఆయన దివంగతులయ్యారని తెలియగానే జిల్లా ప్రజానీకం శోకతప్త హృదయాలతో నివాళులర్పించింది. ఆయనకు జిల్లాకున్న అనుబంధాన్ని నెమరువేసుకుంది.
సాక్షి, తిరుపతి: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి తిరుమల వాసులకు చిరకాలం గుర్తుండే నాయకుడు. తాగునీటికి ఇబ్బందులు పడుతున్న సమయంలో కళ్యాణీ డ్యాం నుంచి నీటి పంపింగ్ వ్యవస్థను ప్రారంభించిన ప్రధాని అని తిరుమల వాసులు చెప్పుకుంటున్నారు. ఆయన మరణంతో తిరుమల వాసులు సంతాపం తెలియజేశారు. 1997–98 మధ్య కాలంలో తిరుమలలో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడింది. ఆ సమయంలో అప్పటి టీటీడీ ఈఓ ఐవీ సుబ్బారావు నీటి సమస్య తీర్చేం దుకు అధికారులతో సమావేశమయ్యారు. తిరుపతి సమీపంలోని కళ్యాణీ డ్యాం నుంచి నీటిని తిరుమలకు తీసుకురావాలని నిర్ణయించారు. 1999 నవంబర్ 18న కళ్యాణీ డ్యాం నుంచి తిరుమలకు నీటిని పంపింగ్ చేయటానికి భూమిపూజ చేశారు. పంపిం గ్ పనులను 61 రోజుల్లో పూర్తి చేశారు. 2000లో తిరుమలకు వచ్చిన అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నీటి పంపింగ్ వ్యవస్థను ప్రారంభించా రు. దానికి కళ్యాణి గంగ అని నామకరణం చేశారు. ఆ సందర్భంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు అప్పటి టీటీడీ తొలి స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ రాంబాబు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు 1999, ఆ తర్వాత 2003లో ప్రధాన మంత్రి హోదాలో తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ప్రధాన మంత్రి హోదాలో తిరుపతి దూరదర్శన్ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. 1981లో బీజేపీ జాతీయ పార్టీ అ«ధ్యక్షుని హోదాలో అటల్ బీహార్ వాజ్‌పేయి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఎన్నికల ప్రచార సభలో వాజ్‌పేయి..
ప్రధాని కాకముందు నుంచే వాజ్‌పేయి జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. 1981లో బీజేపీ తిరుపతి కోనేటి కట్ట వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. 1994లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తంబళ్లపల్లె, మదనపల్లె, వాయల్పాడు, పీలేరు, తిరుపతిలో పర్యటించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
జిల్లా వ్యాప్తంగా సంతాప సభలు..
వాజ్‌పేయి మృతి పట్ల జిల్లాలోని బీజేపీ నాయకులు సంతాప సభలు నిర్వహించి ఆయన సేవలను కొనియాడారు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మదనపల్లెలో చల్లపల్లి నరసింహారెడ్డి వాజ్‌పేయితో ఉన్న అనుబంధం గురించి ప్రస్తావించారు. 1980లో తాను పార్టీలో చేరిన సమయంలో వాజ్‌పేయిని కలిసినట్లు తెలిపారు. ఆయన పలుకరింపు ఎప్పటికీ మరచిపోలేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment