ఒక శిఖరం ఒరిగింది | Former PM Atal Bihari Vajpayee Passes Away | Sakshi
Sakshi News home page

ఒక శిఖరం ఒరిగింది

Published Fri, Aug 17 2018 2:15 AM | Last Updated on Fri, Aug 17 2018 8:32 AM

Former PM Atal Bihari Vajpayee Passes Away - Sakshi

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి

భారత రాజకీయాలున్నంతకాలం గుర్తుండిపోయే 
ఓ మహాశిఖరం ఒరిగింది.
దేశ సేవకోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తిత్వం..
ఇక సెలవంటూ వెళ్లిపోయింది..
అద్భుతమైన వాక్పటిమ.. 
అందరినీ మెప్పించే చాతుర్యం మూగబోయింది.

‘హార్‌ నహీ మానూంగా’ అంటూ రాజకీయాల్లో ఉన్నంతవరకు విలువల కోసం పోరాడిన యోధుడు.. అందరి గుండెల్లో అజాతశత్రువుగా నిలిచిపోయాడు. దేశ ప్రగతికి కొత్త బాటలు వేసిన దార్శనికుడు అలిసిపోయానంటూ శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. ‘మై గీత్‌ నహీ గాతాహూ’ అన్నా.. ‘మై గీత్‌ నయా గాతాహూ’ అన్నా.. హిందీ భాషలోని ప్రతిపదం ఆయన కలం, కవిత్వంలో ఆనంద నృత్యం చేశాయి. అధికారంలో లేకున్నాసరే ప్రపంచవేదికలపై భారతీయ వాణిని వినిపించిన దేశభక్తుడు ఆయన. పేరులో కఠినత్వం (అటల్‌) ఉన్నా.. ప్రేమ, ఆప్యాయతలను పంచడంలో ఆయన తర్వాతే ఎవరైనా. అటువంటి ఆ మహామనీషి మృత్యువుని కౌగిలించుకుని అనంతలోకాలకు వెళ్లిపోయారు.

న్యూఢిల్లీ : కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిచెప్పిన రాజకీయ శిఖరంకుప్పకూలింది. మహనీయుడు, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి (93) ఇకలేరు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి గురువారం సాయంత్రం 05.05 గంటలకు తుదిశ్వాస విడిచారు. దేశ రాజకీయాల్లో సంకీర్ణ రాజకీయాలతో కొత్త ఒరవడిని సృష్టించి.. నొప్పించక, తానొవ్వకనే దేశానికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకున్న మహానుభావుడు వాజ్‌పేయి. బ్రహ్మచారిగానే జీవితాన్ని ముగించిన ఆయన.. నమితా కౌల్‌ భట్టాచార్యను దత్తత తీసుకున్నారు. పేరులో అటల్‌ (కఠినత్వం) ఉన్నా అందరిపట్ల ప్రేమ చూపించిన మృదుస్వభావి. అజాత శత్రువుగా దేశ రాజకీయాల్లో ఆయన అజరామరంగా నిలిచిపోతారు. జూన్‌ 11నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వివిధ అనారోగ్య సమస్యలకు చికిత్స పొందుతూ గురువారం కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, బీజేపీ అగ్రనేత అడ్వాణీ, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా సహా పార్టీలకతీతంగా రాజకీయ ప్రముఖులు వాజ్‌పేయి మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

కృష్ణమీనన్‌ మార్గ్‌లోని వాజ్‌పేయి నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి కార్యకర్తల సందర్శనార్థం పార్థివదేహాన్ని తరలిస్తారు. అక్కడినుంచి మధ్యాహ్నం 1గంటకు అంతిమయాత్ర మొదలవుతుంది. సాయంత్రం 4 గంటలకు.. రాజ్‌ఘాట్‌ సమీపంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. మాజీ ప్రధాని మృతితో కేంద్రం ఏడురోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. భారత ప్రధాని పీఠంపై ఐదేళ్లు పూర్తిచేసిన తొలి కాంగ్రెసేతర వ్యక్తి.. సంకీర్ణ రాజకీయాలను ఎలా నడపాలో తెలిసిన మహనీయుడు. పదిసార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచిన వాజ్‌పేయి 2005లో రాజకీయాలనుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నారు. ఆయన రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు. ఆయన 1924, డిసెంబర్‌ 25న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ బడిపంతులు కుటుంబంలో జన్మించారు. ఆయన జన్మదినాన్ని కేంద్రం ‘సుపరిపాలన దినోత్సవం’గా అధికారికంగా నిర్వహిస్తోంది.  

తీర్చలేని లోటు 
గురువారం ఉదయం నుంచి ఎయిమ్స్‌కు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా, కేంద్ర మంత్రులు, రాహుల్, పలువురు సీఎంలు వచ్చి వెళ్లారు. దీంతో ప్రజల్లో వాజ్‌పేయి ఆరోగ్యంపై మరింత ఆందోళన పెరిగింది. దేశవ్యాప్తంగా వాజ్‌పేయి తిరిగి కోలుకోవాలంటూ పూజలు, హోమాలు నిర్వహించారు. అటు వాజ్‌పేయి నివాసం వద్ద భద్రతను పెంచడం, బారికేడ్లను ఏర్పాటుచేయడంతో ఆయన ఆరోగ్యంపై మరింత ఉద్విగ్నత నెలకొంది. ఈ నేపథ్యంలో సాయంత్రం ఐదున్నర గంటలకు ఎయిమ్స్‌ మీడియా, ప్రొటోకాల్‌ విభాగం ‘మాజీ ప్రధాని ఇక లేర’నే ప్రకటన విడుదల చేసింది. ‘మాజీ ప్రధాని శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఇకలేరనే అత్యంత బాధాకరమైన వార్తను తెలియజేసేందుకు చింతిస్తున్నాం. 16 ఆగస్టు 2018 సాయంత్రం 05.05 గంటలకు ఆయన కన్నుమూశారు. జూన్‌ 11న ఎయిమ్స్‌లో చేరినప్పటినుంచి వైద్యుల సంరక్షణలో 9 వారాలుగా ఆయన కోలుకున్నారు. దురదృష్టవశాత్తూ 36 గంటలుగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ సాయంతో ఆయన్ను మళ్లీ కోలుకునేలా చేసేందుకు మా వైద్యులు తీవ్రంగా కృషిచేశారు. కానీ గొప్ప నాయకుడు మననుండి దూరమయ్యారు’ అని ఎయిమ్స్‌ ఆ ప్రకటనలో పేర్కొంది.  

ఆసుపత్రికి ప్రముఖులు 
వాజ్‌పేయి ఆరోగ్యం క్షీణించిందన్న సమాచారంతో ప్రధాని సహా వివిధ పార్టీల నేతలు గురువారం ఉదయం నుంచే ఎయిమ్స్‌కు వరుసకట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆసుపత్రికి వచ్చి దాదాపు 45 నిమిషాల పాటు ఎయిమ్స్‌లోనే ఉన్నారు. బుధవారం రాత్రి మోదీ ఆసుపత్రికి వచ్చి వాజ్‌పేయి ఆరోగ్యం గురించి వాకబు చేసిన సంగతి తెలిసిందే. 24 గంటల్లోపే మోదీ రెండోసారి ఎయిమ్స్‌కు వచ్చారు. ‘21వ శతాబ్దంలో సుసంపన్న భారత నిర్మాణానికి పునాదులు వేసింది వాజ్‌పేయి నాయకత్వమే. ఆయన పట్టుదల, పోరాటం కారణంగానే బీజేపీ ఒక్కో ఇటుక పేర్చుకుంటూ నేడు ఈ స్థాయికి చేరింది’ అని మోదీ ట్వీట్‌ చేశారు. బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా కూడా గురువారం ఉదయమే రెండుసార్లు ఆసు పత్రికి వచ్చారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, సుష్మా స్వరాజ్, జేపీ నడ్డా, రవిశంకర్‌ ప్రసాద్, జవదేకర్, విజయ్‌ గోయల్‌ సహా లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కూడా చాలాసేపు ఆసుపత్రిలోనే ఉన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, రమణ్‌సింగ్‌లు కూడా ఆసుపత్రికెళ్లి వాజ్‌పేయి ఆరోగ్యంపై వాకబు చేశారు.  

ఇంటి వద్ద ఏర్పాట్లతో ఆందోళన 
వాజ్‌పేయి ఆరోగ్యం పరిస్థితిపై గురువారం ఉదయం 11గంటలకు ఎయిమ్స్‌ బులెటిన్‌ విడుదల చేసిన తర్వాత.. సాయంత్రం వరకు ఎలాంటి ప్రకటన లేకపోవడంతో.. అందరిలో ఆందోళన నెలకొంది. ఈలోపే సాయంత్రం నుంచి కృష్ణ మీనన్‌ మార్‌ ్గలోని వాజ్‌పేయి నివాసం వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు విధించి భద్రతా ఏర్పాట్లు ఏర్పాటుచేశారు. దీంతో ఆందోళన రెట్టింపైంది. ఎయిమ్స్‌ ప్రకటనతో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. 

ప్రముఖుల నివాళి
‘భారతీయులందరూ ఐకమత్యంగా, శాంతి సహనాలతో ఉండాలని అభిలషించిన వాజ్‌పేయి ఇక లేరనే విషయం బాధాకరం. ఇది నాకు వ్యక్తిగతంగా పూడ్చుకోలేని లోటు’ అని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పేర్కొన్నారు. ప్రజలు తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు వీలు కల్పిస్తామని వెల్లడించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ సహా వివిధ రంగాల ప్రముఖులు నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఏడ్రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించడంతో.. గురువారం నుంచి ఏడ్రోజులపాటు (16 నుంచి 22 వరకు) దేశవ్యాప్తంగా జాతీయ జెండాలను అవనతం చేయనున్నారు. అన్నిదేశాల్లోని దౌత్యకార్యాలయాల్లోనూ శుక్రవారం జాతీయ జెండాలను అవనతం చేస్తారు. 

న్యుమోనియా, అవయవాల వైఫల్యం 
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని వాజ్‌పేయి దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. ఆయన మృతికి న్యుమోనియా, వివిధ అవయవాల వైఫల్యమే ప్రధాన కారణమని ఎయిమ్స్‌ వైద్యులు వెల్లడించారు. బుధవారం రాత్రి నుంచీ ఈసీఎమ్‌వో (ఎక్స్‌ట్రాకార్పోరీల్‌ మెంబ్రేన్‌ ఆక్సీజనేషన్‌ – ఎక్మో) యంత్రంపైనే ఉన్నారని తెలిపారు. ‘న్యుమోనియా, మూత్రపిండాలు పనిచేయకపోవడం కారణంగా చివరిరోజుల్లో ఆయన చాలా ఇబ్బందిపడ్డారు’ అని సీనియర్‌ ఎయిమ్స్‌ వైద్యుడొకరు తెలిపారు. దీర్ఘకాలంగా గుండె, శ్వాసకోస సమస్యలతో బాధపడే వారికి శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ను తీసుకోవడం సాధ్యం కాదు. అలాంటి వారిని ఎక్మోపై ఉంచి శ్వాసతీసుకునేలా చేస్తారు.

మూత్రనాళ ఇన్‌ఫెక్షన్, యూరిన్‌ ఔట్‌పుట్‌ తక్కువగా ఉండటం, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన్ను జూన్‌ 11న ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత ఆయనకు డయాలసిస్‌ చేసిన వైద్యులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. చాలాఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్న వాజ్‌పేయి.. 1984 నుంచి ఒకే కిడ్నీతో వెళ్లదీస్తున్నారు. 2009లో స్ట్రోక్‌ రావడంతో ఆయన గ్రహణ, స్పర్శ సామర్థ్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొంతకాలానికే ఆయన డిమెన్షియా (చిత్తవైకల్యం) బారిన పడ్డారు. వాజ్‌పేయి మృతిచెందిన వెంటనే అనాటమీ విభాగంలో ఎంబామింగ్‌ నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

వాజ్‌పేయి భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, వాజ్‌పేయి దత్తపుత్రిక నమితా కౌల్‌ భట్టాచార్య తదితరులు

2
2/3

నివాళులు అర్పిస్తున్న ఎల్‌కే అడ్వాణీ

3
3/3

శ్రద్ధాంజలి ఘటిస్తున్న సోనియా గాంధీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement