లలితం.. చైతన్యం | arts canbe used for social mobility | Sakshi
Sakshi News home page

లలితం.. చైతన్యం

Published Tue, Nov 25 2014 11:12 PM | Last Updated on Fri, Mar 22 2019 1:41 PM

లలితం.. చైతన్యం - Sakshi

లలితం.. చైతన్యం

పండితుడికి, పామరుడికి చేరవయ్యేది కళ. ఆ కళను ఓ సామాజిక చైతన్యం కోసం...ఓ మంచి సందేశం ఇచ్చి స్ఫూర్తి నింపడం కోసం ఉపయోగిస్తున్నారు చిత్రకారిణి లలితాదాస్.బంజారాహిల్స్‌లో ‘లలితం’ ఎన్జీవో స్థాపించి... తద్వారా అంధులు, చిన్నారులకు పెయింటింగ్ పాఠాలు నేర్పుతున్న ఆమె ప్రస్తుతం మరో ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ‘సిటీ ప్లస్’తో ముచ్చటించారు.
 
చిన్నప్పుడు అమ్మ ఎప్పుడూ కోప్పడుతూ ఉండేది... పిచ్చి గీతలు గీసే బదులు చదువుకోవచ్చుగా అని. మా ఊరు తిరుపతి. అక్కడ స్కూల్లో చదువుకునే రోజుల్లో సైన్స్ డయాగ్రమ్స్ కూడా టీచర్ నాతోనే వేయించేవారు. ఆ తరువాత ఓయూలో ఫ్యామిలీ మ్యారేజ్ కౌన్సెలింగ్ కోర్సు చేశా. అయినా ఆర్ట్‌ను వదల్లేదు. ఫ్యాబ్రిక్, ఆయిల్, గ్లాస్, ఆక్రిలిక్ వంటి విభిన్న మీడియమ్స్‌ల్లో బొమ్మలు వేయడం నేర్చుకున్నా. మిక్స్‌డ్ మీడియా వర్క్‌తో త్రీడీ పెయింటింగ్ కూడా చేశా.

దృశ్య కావ్యం...
ప్రతి పెయింటింగ్ చూడగానే ఫొటో కాపీని పోలి ఉండాలని లేదు. కళాకారుని మనసులో ఏ భావం ఉంటుందో అదే పెయింటింగ్‌లోనూ ప్రస్ఫుటిస్తుంది. అమ్మాయి బొమ్మ గీస్తే కాన్వాస్ మీద ఆమె శరీరంలానే ఉండాలన్న నియమమేదీ లేదు. చిత్రకళ అనేది దృశ్య కావ్యం. ప్రతి దృశ్యం ఒక భావాన్ని కలిగిస్తుంది. అందుకే మానవ జాతి పట్టించుకోని ప్రకృతి, అమ్మాయిలనే అంశంగా ఎంచుకున్నా. వీటి అవసరం చాటిచెప్పాలనే ఉద్దేశంతో అనేక పెయింటింగ్‌లు గీశా. హైదరాబాద్‌తో పాటు వివిధ నగరాల్లో సోలో ప్రదర్శనలు చేశా. ఇప్పుడు దేవుళ్ల ప్రత్యేకత తెలిపేలా పెయింటింగ్స్ వేస్తున్నా. త్వరలోనే వీటితో ప్రదర్శన ఏర్పాటు చేస్తా.

వాసనలతో రంగులు...
మనసుతో ఏ పని చేసినా విజయం తథ్యమన్న సిద్ధాంతాన్ని నమ్ముతా. అందుకే అంధ విద్యార్థులకు పెయింటింగ్ పాఠాలు నేర్పించగలుగుతున్నా. ఇందులో భాగంగా వారికి ప్రకృతిని పరిచయం చేశా. కళ్లకు గంతలు కట్టుకుని నాకు నేనే కొన్ని టెక్నిక్స్‌ను కనిపెట్టి ప్రాక్టీసు చేశా. ఎరుపులో రోజ్‌వాటర్, తెలుపులో మల్లె, పసుపులో నిమ్మ... అలా వాసనతో రంగు గుర్తించేలా చేశాను. బుడిపెల సాయంతో బొమ్మ గీయించి, ఆ బొమ్మ అర్థమయ్యేలా వారి చేతులు పట్టుకుని తడిమి చూపించగలిగా. ఆ తరువాత రంగులు. ఇలా వంద మంది అంధ బాలలతో చిత్రాలు వేయించగలిగా. ఇది నా జీవితంలో ఎంతో సంతోషాన్నిచ్చిన అంశం.

పేరెంట్స్ ప్రోత్సహించాలి...
ప్రతి పిల్లాడికి పెయింటింగ్, డ్యాన్స్, మ్యూజిక్... ఇలా వారికి నచ్చిన ఆర్ట్‌లో తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే సమాజహితంగా తయారవుతారు. ప్రొఫెషన్‌గా కాకుండా వారికి నచ్చిన తీరులానే శిక్షణ ఇప్పించాలి. ఇలా చేయడం వల్ల అన్ని అంశాల్లో పరిణతి కనబరుస్తారు. ఓపిక పెరుగుతుంది. మెదడు నిమిషానికి ఒక రకంగా ఆలోచించే విధానం మారుతుందనేదే నా అభిప్రాయం. ఇది అందరు పేరేంట్స్ గమనించగలిగితే చాలు.
 
వీఎస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement