‘కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు బిళ్ల...కావేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ. కుక్కపిల్ల, అగ్గిపుల్లల సంగతేమిటోగానీ వృథాగా పడి ఉన్న ఖాళీ సీసాలు మాత్రం తమ విలువ తెలుసుకోమన్నాయ్! మరి రెంజిని కళాహృదయం ఊరుకుంటుందా! ఎన్నెన్నో కళాకృతులను సృష్టించి పాత వస్తువులకు కొత్త శోభను తీసుకువచ్చింది.
తన అభిరుచిని వ్యాపారంగా మలిచి విజయం సాధించింది 35 సంవత్సరాల రెంజిని థామస్....దుబాయ్‌లో ఎం.బి.ఎ. ఫైనాన్స్ చదువుకున్న రెంజిని ఆ రంగంలో కాకుండా మీడియా ఫీల్డ్‌లో పనిచేసింది. 2015లో స్వరాష్ట్రం కేరళకు వచ్చిన రెంజినికి వివాహం అయింది. ‘9 టు 5’ షెడ్యూల్ బోర్ కొట్టడం వల్ల మళ్లీ ఉద్యోగం చేయాలనిపించలేదు. ఖాళీ సమయాన్ని తన ఇష్టమైన పెయింటింగ్‌తో గడిపేది.స్వస్థలం కొచ్చిలో తన పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆర్ట్ లవర్స్‌తో ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేసింది. భర్త కూడా ఆర్టిస్ట్ కావడం వల్ల ఇంటినిండా ఆర్ట్ ముచ్చట్లే!
బయటకు వెళ్లినప్పుడు రెంజినికి ఎక్కడ పడితే అక్కడ వృథాగా పడి ఉన్న గాజు సీసాలు కనిపించేవి. భర్త నిర్వహించే ‘సౌండ్ స్టూడియో’కు పాత సంగీత పరికరాలను కొనుగోలు చేయడానికి పాత వస్తువులు అమ్మే ఒక దుకాణానికి వెళ్లింది. అక్కడ వృథాగా పడి ఉన్న ఖాళీ సీసాలు కనిపించాయి. ఆ సమయంలో తనలోని కళాహృదయం నిద్రలేచింది! సీసాలతో పాటు పాత టైర్ రిమ్స్. బకెట్లు, గ్లాసులు.. మొదలైనవి సేకరించడం ప్రారంభించింది రెంజిని.
ఒక ఫైన్ మార్నింగ్ వాటితో ఆర్ట్ మొదలుపెట్టింది. వృథా వస్తువులతో కొన్ని హోమ్‌డేకర్ ఐటమ్స్ తయారుచేసి ఫ్రెండ్స్‌కు బహుమతిగా ఇచ్చింది.‘అద్భుతం’ అనడమేకాదు ‘వీటితో వ్యాపారం చేస్తే బాగుంటుంది’ అని సలహా ఇచ్చారు. వారి సలహాతో ఆన్–డిమాండ్ ఆర్డర్స్ కోసం డెకరేషన్ ఐటమ్స్ తయారీ మొదలుపెట్టింది. వివిధ రూపాల్లో ఆర్ట్ కోసం ఖర్చుపెట్టడం తప్ప ఆర్ట్ ద్వారా డబ్బు సంపాదించడం తనకు ఇదే తొలిసారి!
పర్యావరణం కోసం పనిచేస్తున్న ‘క్లైమెట్ కలెక్టివ్’ అనే స్వచ్ఛందసంస్థ మహిళా వ్యాపారుల కోసం ‘క్లైమెట్ ఛేంజింగ్ కాంపిటీషన్’ నిర్వహించింది. రెంజిని తయారుచేసిన కళాకృతులను చూసి ‘క్లైమెట్ కలెక్టివ్’ నిర్వాహకులు ప్రశంసించారు. మరిన్ని కళాకృతులు తయారు చేయాల్సిందిగా కోరారు. రెంజిని ఈ పోటీలో సెమీ–ఫైనల్స్ వరకు వెళ్లింది.
ఐఐఎం–బెంగళూరు స్టార్టప్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన రెంజిని అక్కడ ఎన్నో విషయాలు తెలుసుకుంది. అప్ సైకిల్డ్ ప్రాడక్ట్స్‌కు మంచి డిమాండ్ ఉన్న విషయం తనకు అర్థమైంది. ఈ ఉత్సాహంతో ‘వాపసీ’ పేరుతో ఆన్‌లైన్‌లో డెకరేషన్ స్టోర్ ప్రారంభించింది. ఇందులో గ్లాస్ బాటిల్స్, కొబ్బరి చిప్పలు, రకరకాల పాతవస్తువులతో తయారు చేసిన 21,000 హోమ్‌డెకరేషన్ ఐటమ్స్ కనువిందు చేస్తాయి. గ్లాస్ వర్క్ అనేది కత్తి మీద సాములాంటిది. బోలెడు ఓపిక ఉండాలి. చిన్న తప్పు దొర్లినా గ్లాస్ పాడై పోతుంది. తాను చేసిన తప్పులతోనే ఎన్నో పాఠాలు నేర్చుకుంది రెంజిని.
‘మొదట్లో నా వర్క్స్‌పై నాకు అంతగా ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. అయితే ఐఐఎం–బెంగళూరు పాఠాలతో నాపై నాకు ఆత్మవిశ్వాసం ఏర్పడింది’ అంటున్న రెంజిని థామస్ భవిష్యత్‌లో మరిన్ని పర్యావరణ హిత కళాకృతులను తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment