సామాజిక కళాచైతన్యం
గాజు బల్లపై గుప్పెడు ఇసుక పోసి చేతివేళ్లతో వేణుగోపాల్ చేసే చిత్రాలను చూస్తే కళ్లు తిప్పుకోలేం. మనసుని తాకుతూ మైమర పించే అతని శాండ్ ఆర్ట్ వెనకున్న రహస్యం ఆ కళకున్న ప్రత్యేకతఒక్కటే కాదు... సమాజాన్ని ఆలోచింపజేయాలన్న అతని దృఢ సంకల్పం కూడా. ఓ సాధారణ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని గడుపుతున్న వేణుగోపాల్ శాండ్ ఆర్ట్ కళాకారుడిగా గుర్తింపుపొందడం వెనక పెద్ద కథే ఉంది.
ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన జరిగినపుడు వేణుగోపాల్ ఐదునిమిషాలపాటు తీసిన శాండ్ ఆర్ట్ వీడియోను చూసినవారంతా కంటనీరు పెట్టుకున్నారు. మనదేశంలో మహిళలకు ఉన్న రక్షణ గురించి ఆ వీడియో ద్వారా వేణుగోపాల్ సంధించిన ప్రశ్నలు హృదయాన్ని కదిలించాయి. గాజు బల్లపై ఉన్న ఇసుకలో ముందుగా రాసుకున్న స్టోరీ బోర్డుని యథాతథంగా చిత్రీకరించడంలో ఆరితేరిన వేణుగోపాల్ దీన్ని కేవలం కళగానే కాకుండా ఆదాయమార్గంగా కూడా మలుచుకున్నాడు.
హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో ఉండే వేణుగోపాల్ అతి సాధారణ కుటుంబం నుంచి పైకొచ్చాడు. తండ్రి యాదయ్య, తల్లి మల్లిక కష్టపడి తమ నలుగురు మగపిల్లల్నీ చదివించారు. ‘‘నేను నాలుగోవాణ్ణి. డిగ్రీ మధ్యలో మానేసి జెఎన్‌టియులో ‘అప్లయిడ్ విజువల్ కమ్యూనికేషన్’ కోర్సు చేశాను. ఆ తర్వాత ప్రైవేట్ ఆర్ట్ పబ్లికేషన్‌లో స్టోరీ బోర్డ్ ఆర్టిస్టుగా పనిచేశాను. తర్వాత ఓ ప్రైవేటు పాఠశాలలో ఆర్ట్ అండ్ డిజైనింగ్ టీచర్‌గా చేరాను.
ఆ సమయంలో ఒకసారి శాండ్ ఆర్ట్‌కి సంబంధించిన వీడియోని చూశాను. అప్పటికే పెయింటింగ్‌లో పట్టున్న నాకు శాండ్ ఆర్ట్ నేర్చుకోవడం పెద్దగా కష్టం అనిపించలేదు. మొదట్లో సరదా కోసం సాధన చేశాను. ఒకరోజు మురళీధర్ ఆచార్య అనే వ్యవసాయ శాస్త్రవేత్తతో పరిచయం ఏర్పడింది. ఆయన నా శాండ్ ఆర్ట్‌ని చూసి చాలా ప్రోత్సహించారు. ‘‘వేలు, లక్షలు ఖర్చుపెడితేగాని ఓ క్రియేటివ్ వీడియో ప్రెజెంటేషన్ బయటికి రావడంలేదు. అదే శాండ్ ఆర్ట్‌తో అయితే చాలా సులువుగా వీక్షకులను ఆకట్టుకోవచ్చు’’ అని చెప్పారు. ‘‘నాకు మొదట్లో అర్థం కాలేదు. తర్వాత్తర్వాత శాండ్‌ఆర్ట్‌ని సమాజానికి చూపించడంలో ఉన్న ప్రత్యేకతను తెలుసుకున్నాను’’ అని చెప్పాడు వేణుగోపాల్.
సామాజిక అంశాలపై...
మొదట పూలు, చెట్లతో ప్రారంభించిన వేణుగోపాల్ మెల్లగా ఈ కళకు సామాజిక అంశాలను జోడించి ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఉమెన్‌డే, మదర్స్‌డే... ఇలా పలు సందర్భాల్లో ప్రత్యేకమైన కథను రాసుకుని దానికి తగ్గట్టుగా శాండ్ ఆర్ట్‌ని వేసి వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెట్టాడు. ‘‘ఉమెన్స్‌డే, మదర్స్‌డే... అనే కాదు. పండగలప్పుడు కూడా వాటి చరిత్రలను తెలుపుతూ శాండ్ ఆర్ట్ వీడియోలు చిత్రీకరించాను. కొన్ని పాఠశాలలో ప్రదర్శనలు కూడా ఇచ్చాను. కొన్ని నెలలపాటు ఇలాంటి ప్రదర్శనలు ఇస్తూ గడుపుతుండగా... ఒకరోజు మా గురువుగారు ప్రొఫెసర్ గంగాధర్‌గారు శాండ్‌ఆర్ట్‌ని కమర్షియల్‌గా కూడా ఉపయోగించవచ్చని చెప్పారు.
మొదట నికాన్ కెమెరా వాళ్లకి ఒక వీడియో తయారుచేశాను. ఫొటోకి ఉన్న విలువను చెబుతూ ఇరవై ఫ్రేముల్లో నేనిచ్చిన ప్రదర్శన వాళ్లకి చాలా బాగా నచ్చింది. దీంతో పాటు ఐఎన్‌జి వైశ్యాబ్యాంక్, యారో పబ్లికేషన్స్, బెంగుళూరులోని వియ్‌వేర్ కంపెనీలకు శాండ్‌ఆర్ట్ ప్రజెంటేషన్లు తయారుచేశాను’’ అని చెప్పే వేణుగోపాల్ శాండ్ ఆర్ట్‌ల ప్రజెంటేషన్లు చూస్తున్నంతసేపు అందమైన దృశ్యాలే తప్ప అతని చేతివేళ్లు కనిపించవు. సరదా కోసం నేర్చుకున్న కళ... సొంతానికే కాక సమాజానికీ ఉపయోగపడేలా చేసుకోవడంలో వేణుగోపాల్ ఆదర్శమే!
రకరకాల అంశాలపై...
వీలైనంతవరకూ శాండ్‌ఆర్ట్‌తో సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలపై రకరకాల ప్రదర్శనలు ఇవ్వాలనేది నా లక్ష్యం. దీనికోసం నేను చాలా అంశాలపై కథలను తయారుచేసి పెట్టుకున్నాను. భ్రూణహత్యలు, బాల్యవివాహాలు, వరకట్నాలు, బాలకార్మికులు... ఇలా రకరకాల అంశాలపై కథలను సిద్ధం చేసుకున్నాను. ఇప్పటికే పర్యావరణంపై నేను చేసిన శాండ్‌ఆర్ట్‌లకు యూట్యూబ్‌లో చాలామంది అభిమానులు ఉన్నారు. ఇకముందు మరిన్ని విషయాలపై స్పందిస్తూ పాఠశాలలు, కళాశాలలు వేదికలుగా చేసుకుని ప్రదర్శనలు ఇవ్వాలనుకుంటున్నాను.
- వేణుగోపాల్