nirabya
-
చట్టాల్లో కాదు సమాజంలో మార్పు రావాలి
అత్యాచార ఘటనలపై విశ్రాంత లోకాయుక్త సంతోష్ హెగ్డే సాక్షి, బెంగళూరు : లోకం తెలియని పసిమొగ్గలపై అత్యాచారాల ఉదంతంపై విశ్రాంత లోకాయుక్త సంతోష్ హెగ్డే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలను నిరోధించాలంటే చట్టాల్లో మార్పు కాదని, సమాజంలో రావాలని అభిప్రాయపడ్డారు. మాజీ రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(ఆర్ అండ్ ఏడబ్ల్యూ) ఉద్యోగి ఆర్.కె.యాదవ్ రాసిన ‘మిషన్ ఆర్ అండ్ ఏడబ్ల్యూ’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని బుధవారమిక్కడి ప్రెస్‌క్లబ్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంతోష్ హెగ్డే మాట్లాడుతూ...ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన జరిగిన అనంతరం అత్యాచార ఘటనలకు సంబంధించిన చట్టాలను కఠినతరం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ వ్యక్తుల ఆలోచనా ధోరణిలో మార్పు లేకపోవడం వల్లే ఈ తరహా ఘటనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల చట్టాల్లో కాకుండా వ్యక్తుల్లో మార్పు వచ్చినపుడు మాత్రమే ఈ తరహా ఘటనలను నిరోధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇక జుడీషియరీలో రాజకీయ నేతల జోక్యం పెరుగుతుండడాన్ని ఆయన తీవ్రంగా తప్పు బట్టారు. జుడీషియరీ అంశాలను పరిశీలించేందుకు న్యాయరంగంలోని నిపుణులతోనే ఓ మండలిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత రక్షణ వ్యవస్థలో కీలకమైన ఆర్ అండ్ ఏడబ్ల్యూ విభాగంలో జరిగిన కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలను రచయిత ఆర్.కె.యాదవ్ తన ‘మిషన్ ఆర్ అండ్ ఏడబ్ల్యూ’ పుస్తకంలో పొందుపరిచినట్లు వివరించారు. అంతేకాక ఆర్ అండ్ ఏడబ్ల్యూ విభాగాన్ని కొంతమంది పాలకులు ఏలా దుర్వినియోగం చేశారనే అంశాలను కూడా ఈ పుస్తకంలో రాసినట్లు పేర్కొన్నారు. -
సామాజిక కళాచైతన్యం
గాజు బల్లపై గుప్పెడు ఇసుక పోసి చేతివేళ్లతో వేణుగోపాల్ చేసే చిత్రాలను చూస్తే కళ్లు తిప్పుకోలేం. మనసుని తాకుతూ మైమర పించే అతని శాండ్ ఆర్ట్ వెనకున్న రహస్యం ఆ కళకున్న ప్రత్యేకతఒక్కటే కాదు... సమాజాన్ని ఆలోచింపజేయాలన్న అతని దృఢ సంకల్పం కూడా. ఓ సాధారణ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని గడుపుతున్న వేణుగోపాల్ శాండ్ ఆర్ట్ కళాకారుడిగా గుర్తింపుపొందడం వెనక పెద్ద కథే ఉంది. ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన జరిగినపుడు వేణుగోపాల్ ఐదునిమిషాలపాటు తీసిన శాండ్ ఆర్ట్ వీడియోను చూసినవారంతా కంటనీరు పెట్టుకున్నారు. మనదేశంలో మహిళలకు ఉన్న రక్షణ గురించి ఆ వీడియో ద్వారా వేణుగోపాల్ సంధించిన ప్రశ్నలు హృదయాన్ని కదిలించాయి. గాజు బల్లపై ఉన్న ఇసుకలో ముందుగా రాసుకున్న స్టోరీ బోర్డుని యథాతథంగా చిత్రీకరించడంలో ఆరితేరిన వేణుగోపాల్ దీన్ని కేవలం కళగానే కాకుండా ఆదాయమార్గంగా కూడా మలుచుకున్నాడు. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌లో ఉండే వేణుగోపాల్ అతి సాధారణ కుటుంబం నుంచి పైకొచ్చాడు. తండ్రి యాదయ్య, తల్లి మల్లిక కష్టపడి తమ నలుగురు మగపిల్లల్నీ చదివించారు. ‘‘నేను నాలుగోవాణ్ణి. డిగ్రీ మధ్యలో మానేసి జెఎన్‌టియులో ‘అప్లయిడ్ విజువల్ కమ్యూనికేషన్’ కోర్సు చేశాను. ఆ తర్వాత ప్రైవేట్ ఆర్ట్ పబ్లికేషన్‌లో స్టోరీ బోర్డ్ ఆర్టిస్టుగా పనిచేశాను. తర్వాత ఓ ప్రైవేటు పాఠశాలలో ఆర్ట్ అండ్ డిజైనింగ్ టీచర్‌గా చేరాను. ఆ సమయంలో ఒకసారి శాండ్ ఆర్ట్‌కి సంబంధించిన వీడియోని చూశాను. అప్పటికే పెయింటింగ్‌లో పట్టున్న నాకు శాండ్ ఆర్ట్ నేర్చుకోవడం పెద్దగా కష్టం అనిపించలేదు. మొదట్లో సరదా కోసం సాధన చేశాను. ఒకరోజు మురళీధర్ ఆచార్య అనే వ్యవసాయ శాస్త్రవేత్తతో పరిచయం ఏర్పడింది. ఆయన నా శాండ్ ఆర్ట్‌ని చూసి చాలా ప్రోత్సహించారు. ‘‘వేలు, లక్షలు ఖర్చుపెడితేగాని ఓ క్రియేటివ్ వీడియో ప్రెజెంటేషన్ బయటికి రావడంలేదు. అదే శాండ్ ఆర్ట్‌తో అయితే చాలా సులువుగా వీక్షకులను ఆకట్టుకోవచ్చు’’ అని చెప్పారు. ‘‘నాకు మొదట్లో అర్థం కాలేదు. తర్వాత్తర్వాత శాండ్ఆర్ట్ని సమాజానికి చూపించడంలో ఉన్న ప్రత్యేకతను తెలుసుకున్నాను’’ అని చెప్పాడు వేణుగోపాల్. సామాజిక అంశాలపై... మొదట పూలు, చెట్లతో ప్రారంభించిన వేణుగోపాల్ మెల్లగా ఈ కళకు సామాజిక అంశాలను జోడించి ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఉమెన్డే, మదర్స్‌డే... ఇలా పలు సందర్భాల్లో ప్రత్యేకమైన కథను రాసుకుని దానికి తగ్గట్టుగా శాండ్ ఆర్ట్‌ని వేసి వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెట్టాడు. ‘‘ఉమెన్స్‌డే, మదర్స్‌డే... అనే కాదు. పండగలప్పుడు కూడా వాటి చరిత్రలను తెలుపుతూ శాండ్ ఆర్ట్ వీడియోలు చిత్రీకరించాను. కొన్ని పాఠశాలలో ప్రదర్శనలు కూడా ఇచ్చాను. కొన్ని నెలలపాటు ఇలాంటి ప్రదర్శనలు ఇస్తూ గడుపుతుండగా... ఒకరోజు మా గురువుగారు ప్రొఫెసర్ గంగాధర్గారు శాండ్ఆర్ట్ని కమర్షియల్‌గా కూడా ఉపయోగించవచ్చని చెప్పారు. మొదట నికాన్ కెమెరా వాళ్లకి ఒక వీడియో తయారుచేశాను. ఫొటోకి ఉన్న విలువను చెబుతూ ఇరవై ఫ్రేముల్లో నేనిచ్చిన ప్రదర్శన వాళ్లకి చాలా బాగా నచ్చింది. దీంతో పాటు ఐఎన్జి వైశ్యాబ్యాంక్, యారో పబ్లికేషన్స్, బెంగుళూరులోని వియ్వేర్ కంపెనీలకు శాండ్‌ఆర్ట్ ప్రజెంటేషన్లు తయారుచేశాను’’ అని చెప్పే వేణుగోపాల్ శాండ్ ఆర్ట్‌ల ప్రజెంటేషన్లు చూస్తున్నంతసేపు అందమైన దృశ్యాలే తప్ప అతని చేతివేళ్లు కనిపించవు. సరదా కోసం నేర్చుకున్న కళ... సొంతానికే కాక సమాజానికీ ఉపయోగపడేలా చేసుకోవడంలో వేణుగోపాల్ ఆదర్శమే! రకరకాల అంశాలపై... వీలైనంతవరకూ శాండ్ఆర్ట్తో సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలపై రకరకాల ప్రదర్శనలు ఇవ్వాలనేది నా లక్ష్యం. దీనికోసం నేను చాలా అంశాలపై కథలను తయారుచేసి పెట్టుకున్నాను. భ్రూణహత్యలు, బాల్యవివాహాలు, వరకట్నాలు, బాలకార్మికులు... ఇలా రకరకాల అంశాలపై కథలను సిద్ధం చేసుకున్నాను. ఇప్పటికే పర్యావరణంపై నేను చేసిన శాండ్ఆర్ట్లకు యూట్యూబ్‌లో చాలామంది అభిమానులు ఉన్నారు. ఇకముందు మరిన్ని విషయాలపై స్పందిస్తూ పాఠశాలలు, కళాశాలలు వేదికలుగా చేసుకుని ప్రదర్శనలు ఇవ్వాలనుకుంటున్నాను. - వేణుగోపాల్ -
ఆడపిల్లల రక్షణలో ఆప్తమిత్రులు
యువ ప్రతిభ ఆడపిల్లలను ఏడిపించే యువకుల్ని చూశాం. ప్రేమ అంటూ వెంటపడే కుర్రాళ్లని చూశాం. ర్యాగింగ్ అంటూ అల్లరి పెట్టే అబ్బాయిల్నీ చూశాం. కానీ పృథ్వీరాజ్ రామ్‌రాఖ్యానీ అలాంటివాడు కాదు. హైదరాబాద్‌లోని ‘ఐసీఎఫ్ఏఐ’ విద్యార్థి అయిన ఈ పద్దెనిమిదేళ్ల కుర్రాడు... ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన చెందాడు. వారి కోసం తనవంతుగా ఏదైనా చేయాలని ఆరాటపడ్డాడు. తన స్నేహితుడు అక్షయ్ రేతాతాతో కలిసి మహిళలకు మేలు చేసే ఓ చక్కని ఆవిష్కరణకు ఊపిరి పోశాడు. నిర్భయ ఉదంతం యావత్ దేశాన్నీ కుదిపేసింది. ఆ ఉదంతం పృథ్వీని కూడా కదిలించింది. ఆ తరువాత వరుసగా జరిగిన కొన్ని అత్యాచార ఉదంతాలు కూడా అతడి మనసును చలింపజేశాయి. సంఘటన జరిగిన ప్రతిసారీ అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటివి జరగడానికి వీల్లేదు అంటున్నారు. కానీ అలా జరగకుండా ఉండేందుకు మాత్రం ఎవరూ ఏమీ చేయడం లేదు. అది అతడిని ఎంతో బాధించింది. క్యాండిల్స్ వెలిగించడం వల్లనో, వీధుల్లో చేరి నినాదాలు చేయడం వల్లనో ఏదైనా ఉపయోగం ఉందా అని ఆలోచించాడు. తమ వంతుగా స్త్రీల సంరక్షణ కోసం ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు. అలా అతడి వేదనలోంచి, తన స్నేహితుడు అక్షయ్‌తో కలిసి చేసిన మేథో మథనంలోంచి పుట్టుకొచ్చిందే... నాగా చిల్లీస్ పెప్పర్ స్ప్రే. ఇప్పటికే మార్కెట్లో చాలా పెప్పర్ స్ప్రేలు ఉన్నాయి. కానీ వాటి ఖరీదు కాస్తంత ఎక్కువే. అందువల్లనే చాలామంది మహిళలు వాటిని కొనడం లేదనే విషయాన్ని గుర్తించారు ఈ స్నేహితులిద్దరూ. అందుకే తామే ఓ పెప్పర్ స్ప్రేని తయారుచేసి, తక్కువ రేటుకే మహిళలకు అందించాలనుకున్నారు. తమ పాకెట్‌మనీని పోగుచేస్తే పదకొండు వేలు అయ్యింది. ఫ్రెండ్సందరినీ అడిగి మరికొంత సొమ్ము కూడబెట్టారు. నాగాల్యాండ్‌లో దొరికే నాగా చిల్లీస్‌ని (ఇవి ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయలు) ఉపయోగించి శక్తిమంతమైన పెప్పర్ స్ప్రేని తయారుచేశారు. కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లి తమ స్ప్రే గురించి వివరించారు. దాన్ని దగ్గర ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను తెలిపారు. మార్కెట్లో ఐదు వందలు పలికే స్ప్రేని 199 రూపాయలకే అమ్మడం మొదలుపెట్టారు. వాళ్లు ప్రతి స్ప్రేమీద వేసుకున్న లాభం... కేవలం 50 రూపాయలు. అయితే ఈ లాభాన్ని కూడా తమకోసం వాడుకోవడం లేదు. పేద మహిళలకు అమ్మే స్ప్రేలలో ఈ మొత్తాన్ని తగ్గిస్తున్నారు. చాలామందికి వీరు కేవలం యాభై రూపాయలకే స్ప్రేను అమ్ముతున్నారు. ఇప్పటికి ఇలా ఓ రెండు వేల క్యాన్ల స్ప్రేలను అమ్మారు. ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చింది అని అడిగితే... ‘‘జరిగిన తరువాత బాధపడితే ఉపయోగం ఏముంది, అలాంటివి జరక్కుండా ఉండేందుకు ఏం చేయాలా అని ఆలోచించాం, అప్పుడే ఈ ఆలోచన వచ్చింది. మా ఆలోచన మంచి ఫలితాన్నే ఇచ్చింది’’ అంటాడు పృథ్వీ. అది నిజం. ‘సమాజం మారాలి’, ‘దురాగతాలు ఆగాలి’ అంటూ నినాదాలు చేస్తే ఫలితం ఉండదు. ఎవరు వచ్చి ఈ దుస్థితిని మారుస్తారా అని ఎదురుచూడటం వల్ల ఉపయోగం ఉండదు. మార్పును మనస్ఫూర్తిగా కోరుకుంటే మొదటి అడుగు మనమే వేయాలి. ఆ విషయాన్ని ఈ ఇద్దరూ నిరూపించారు!