చట్టాల్లో కాదు సమాజంలో మార్పు రావాలి
- అత్యాచార ఘటనలపై విశ్రాంత లోకాయుక్త సంతోష్ హెగ్డే
సాక్షి, బెంగళూరు : లోకం తెలియని పసిమొగ్గలపై అత్యాచారాల ఉదంతంపై విశ్రాంత లోకాయుక్త సంతోష్ హెగ్డే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా ఘటనలను నిరోధించాలంటే చట్టాల్లో మార్పు కాదని, సమాజంలో రావాలని అభిప్రాయపడ్డారు. మాజీ రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(ఆర్ అండ్ ఏడబ్ల్యూ) ఉద్యోగి ఆర్.కె.యాదవ్ రాసిన ‘మిషన్ ఆర్ అండ్ ఏడబ్ల్యూ’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని బుధవారమిక్కడి ప్రెస్‌క్లబ్ ఆవరణలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంతోష్ హెగ్డే మాట్లాడుతూ...ఢిల్లీలో ‘నిర్భయ’ ఘటన జరిగిన అనంతరం అత్యాచార ఘటనలకు సంబంధించిన చట్టాలను కఠినతరం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే చట్టాలు కఠినంగా ఉన్నప్పటికీ వ్యక్తుల ఆలోచనా ధోరణిలో మార్పు లేకపోవడం వల్లే ఈ తరహా ఘటనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల చట్టాల్లో కాకుండా వ్యక్తుల్లో మార్పు వచ్చినపుడు మాత్రమే ఈ తరహా ఘటనలను నిరోధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఇక జుడీషియరీలో రాజకీయ నేతల జోక్యం పెరుగుతుండడాన్ని ఆయన తీవ్రంగా తప్పు బట్టారు. జుడీషియరీ అంశాలను పరిశీలించేందుకు న్యాయరంగంలోని నిపుణులతోనే ఓ మండలిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత రక్షణ వ్యవస్థలో కీలకమైన ఆర్ అండ్ ఏడబ్ల్యూ విభాగంలో జరిగిన కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలను రచయిత ఆర్.కె.యాదవ్ తన ‘మిషన్ ఆర్ అండ్ ఏడబ్ల్యూ’ పుస్తకంలో పొందుపరిచినట్లు వివరించారు. అంతేకాక ఆర్ అండ్ ఏడబ్ల్యూ విభాగాన్ని కొంతమంది పాలకులు ఏలా దుర్వినియోగం చేశారనే అంశాలను కూడా ఈ పుస్తకంలో రాసినట్లు పేర్కొన్నారు.