= పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన
= వారం రోజుల్లోనే పార్టీలో 30 వేల మంది చేరిక
= జనలోక్‌పాల్ కోసం బెంగళూరు ప్రజలు చాలా శ్రమించారు
= ఇక్కడి వారు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారు
= సంతోష్ హెగ్డే మా పార్టీలో చేరక పోవడం లోటే
= గ్రామీణ సమస్యలపై కూడా పోరాటాలు చేస్తాం
= లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తాం..ఈ రాష్ర్టంపై చాలా ఆశలున్నాయి
= నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోలు
= ఆప్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ యోగీంద్ర
సాక్షి, బెంగళూరు: ఢిల్లీ ఎన్నికల్లో అనుకోని రీతిలో విజయం సాధించిన అమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చందాల రూపంలో ఆర్థిక సాయం అందించిన నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉందని ఆ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ యోగీంద్ర యాదవ్ వెల్లడించారు. రాష్ర్టంలో ‘ఆప్’ స్థితిగతులను సమీక్షించేందుకు గురువారం ఆయన నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆప్ రాష్ట్రశాఖ ఇన్‌చార్జ్ సిద్ధార్థ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. కేవలం వారం రోజుల్లోనే పార్టీ రాష్ట్ర శాఖలో 30 వేల మంది సభ్యులు చేరారని వెల్లడించారు.
ఢిల్లీ, బెంగళూరులకు అనేక విషయాల్లో సారూప్యత ఉందని వివరించారు. జనలోక్‌పాల్ కోసం ఢిల్లీ వీధుల్లో యువత ఎంతగా శ్రమించిందో.. అదే విధంగా బెంగళూరు వాసులూ ఆ బిల్లు ఆమోదం కోసం అనేక పోరాటాలు చేశారని కితాబిచ్చారు. ఇక బెంగళూరులోనూ ఢిల్లీలోగా వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన ప్రజలు నివాసముంటున్నారని, వీరంతా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. అంతేకాక కర్ణాటక వాసులు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ వైపు మొగ్గు చూపితే.. లోక్‌సభ ఎన్నికల్లో మరో పార్టీ వైపు మొగ్గు చూపుతారని తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల విషయంలో తాము కర్ణాటకపై ఎక్కువ ఆశలు పెట్టుకోవడానికి ఇదీ ఓ కారణమని వివరించారు. ఇక జనలోక్‌పాల్ బిల్లు ఆమోదం కోసం పోరాడిన మాజీ లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే తమ పార్టీలో చేరకపోవడం తమకు లోటుగానే కనిపిస్తోందని అన్నారు. తమ పార్టీలో చేరాల్సిందిగా తాము సంతోష్‌హెగ్డేను సంప్రదించినపుడు తనకు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని ఆయన చెప్పారని వెల్లడించారు.
కేవలం మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా.. గ్రామీణ స్థాయి నుంచి కూడా తమ పార్టీ పోరాటం సాగిస్తుందని స్పష్టం చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్ని స్థానాల నుంచి పోటీ చేస్తామనే విషయాన్ని తాము ఇప్పుడే వెల్లడించలేనని తెలిపారు. ఢిల్లీలో ఒక్కో నియోజకవర్గంలోని సమస్యలకు అనుగుణంగా మేనిఫెస్టోలు రూపొందించినట్లే.. కర్ణాటకలోనూ నియోజకవర్గాల సమస్యలను దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టోలను రూపొందిస్తామని వెల్లడించారు.
‘ఆప్’కు ఆర్ధిక సాయంలో బెంగళూరే ఫస్ట్
Published Fri, Dec 20 2013 4:42 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement