ఏ పార్టీకీ మద్దతివ్వను
- సంతోష్ హెగ్డే స్పష్టీకరణ
- నేను కోరుకునే అంశాలను ఏ పార్టీ ప్రస్తావించడం లేదు
- సమాజంలోని రుగ్మతలు రూపుమాపడానికి యత్నిస్తా
- అన్ని పార్టీల్లోనూ అవినీతిపరులు, నేరచరితులు
- హజారే ఆందోళనకు మద్దతు
- బాంగ్లాదేశీయుల వలసలతో మున్ముందు సమస్యలే
- ఈశాన్య రాష్ట్రాల్లో సుమారు 30 శాతం వారే
- దీనిపై కేంద్రం తీవ్రంగా స్పందించాలి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : దేశంలోని రాజకీయ పార్టీలు తాను కోరుకునే అంశాలను ప్రస్తావించడం లేదని, కనుక ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాను ఏ రాజకీయ పార్టీనీ సమర్థించబోనని విశ్రాంత లోకాయుక్త సంతోష్ హెగ్డే అన్నారు. నగరంలోని చిత్ర కళా పరిషత్‌లో వలస బాంగ్లాదేశీయులపై గురువారం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాలకు వెలుపల ఉంటూనే సమాజంలోనే రుగ్మతలను రూపుమాపడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.
అన్ని పార్టీల్లోనూ అవినీతిపరులున్నారని, అలాంటి వారికి పార్టీలు టికెట్లు కూడా ఇచ్చాయని ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఆందోళనకు మద్దతునిచ్చానని గుర్తు చేశారు. అయితే ఈ పోరాటం రాజకీయ పార్టీగా మారినప్పుడు, ‘ఆమ్ ఆద్మీ పార్టీ’కి మద్దతునివ్వలేదని చెప్పారు. ఆ పార్టీలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు తనకు ఇష్టం కాలేదన్నారు.
సాహితీవేత్తలు కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్న విషయాన్ని అడిగినప్పుడు, రాజకీయాల్లో ఆసక్తి ఉన్న వారు ఏ పార్టీలోనైనా చేరవచ్చని లేదా మద్దతు ఇవ్వవచ్చని అభిప్రాయపడ్డారు. సమాజంలో మార్పులు అవసరమని, ప్రజా సేవ చేసే వారు, ఉన్నతాశయాలు కలిగిన వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కాగా బంగ్లాదేశ్ నుంచి లక్షల మంది సరిహద్దుల గుండా మన దేశంలోకి ప్రవేశిస్తున్నారని చెబుతూ, మున్ముందు దీని వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశీయులు తమ సమస్యలను అక్కడి ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకోవాలే కానీ భారతదేశంపై పడకూడదని అన్నారు.