ఆడపిల్లల రక్షణలో ఆప్తమిత్రులు | Equal protection of the dear friends | Sakshi
Sakshi News home page

ఆడపిల్లల రక్షణలో ఆప్తమిత్రులు

Published Wed, Feb 19 2014 11:17 PM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM

ఆడపిల్లల రక్షణలో ఆప్తమిత్రులు

ఆడపిల్లల రక్షణలో ఆప్తమిత్రులు

యువ ప్రతిభ
 

ఆడపిల్లలను ఏడిపించే యువకుల్ని చూశాం. ప్రేమ అంటూ వెంటపడే కుర్రాళ్లని చూశాం. ర్యాగింగ్ అంటూ అల్లరి పెట్టే అబ్బాయిల్నీ చూశాం. కానీ  పృథ్వీరాజ్ రామ్‌రాఖ్యానీ అలాంటివాడు కాదు. హైదరాబాద్‌లోని ‘ఐసీఎఫ్‌ఏఐ’ విద్యార్థి అయిన ఈ పద్దెనిమిదేళ్ల కుర్రాడు... ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన చెందాడు. వారి కోసం తనవంతుగా ఏదైనా చేయాలని ఆరాటపడ్డాడు. తన స్నేహితుడు అక్షయ్ రేతాతాతో కలిసి మహిళలకు మేలు చేసే ఓ చక్కని ఆవిష్కరణకు ఊపిరి పోశాడు.
 
నిర్భయ ఉదంతం యావత్ దేశాన్నీ కుదిపేసింది. ఆ ఉదంతం పృథ్వీని కూడా కదిలించింది.  ఆ తరువాత వరుసగా జరిగిన కొన్ని అత్యాచార ఉదంతాలు కూడా అతడి మనసును చలింపజేశాయి. సంఘటన జరిగిన ప్రతిసారీ అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటివి జరగడానికి వీల్లేదు అంటున్నారు. కానీ అలా జరగకుండా ఉండేందుకు మాత్రం ఎవరూ ఏమీ చేయడం లేదు. అది అతడిని ఎంతో బాధించింది. క్యాండిల్స్ వెలిగించడం వల్లనో, వీధుల్లో చేరి నినాదాలు చేయడం వల్లనో ఏదైనా ఉపయోగం ఉందా అని ఆలోచించాడు. తమ వంతుగా స్త్రీల సంరక్షణ కోసం ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు. అలా అతడి వేదనలోంచి, తన స్నేహితుడు అక్షయ్‌తో కలిసి చేసిన మేథో మథనంలోంచి పుట్టుకొచ్చిందే... నాగా చిల్లీస్ పెప్పర్ స్ప్రే.
 
ఇప్పటికే మార్కెట్లో చాలా పెప్పర్ స్ప్రేలు ఉన్నాయి. కానీ వాటి ఖరీదు కాస్తంత ఎక్కువే. అందువల్లనే చాలామంది మహిళలు వాటిని కొనడం లేదనే విషయాన్ని గుర్తించారు ఈ స్నేహితులిద్దరూ. అందుకే తామే ఓ పెప్పర్ స్ప్రేని తయారుచేసి, తక్కువ రేటుకే మహిళలకు అందించాలనుకున్నారు. తమ పాకెట్‌మనీని పోగుచేస్తే పదకొండు వేలు అయ్యింది. ఫ్రెండ్సందరినీ అడిగి మరికొంత సొమ్ము కూడబెట్టారు. నాగాల్యాండ్‌లో దొరికే నాగా చిల్లీస్‌ని (ఇవి ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయలు) ఉపయోగించి శక్తిమంతమైన పెప్పర్ స్ప్రేని తయారుచేశారు.

కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లి తమ స్ప్రే గురించి వివరించారు. దాన్ని దగ్గర ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను తెలిపారు. మార్కెట్లో ఐదు వందలు పలికే  స్ప్రేని 199 రూపాయలకే అమ్మడం మొదలుపెట్టారు. వాళ్లు ప్రతి స్ప్రేమీద వేసుకున్న లాభం... కేవలం 50 రూపాయలు. అయితే ఈ లాభాన్ని కూడా తమకోసం వాడుకోవడం లేదు. పేద మహిళలకు అమ్మే స్ప్రేలలో ఈ మొత్తాన్ని తగ్గిస్తున్నారు. చాలామందికి వీరు కేవలం యాభై రూపాయలకే స్ప్రేను అమ్ముతున్నారు. ఇప్పటికి ఇలా ఓ రెండు వేల క్యాన్ల స్ప్రేలను అమ్మారు.
 
ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చింది అని అడిగితే... ‘‘జరిగిన తరువాత బాధపడితే ఉపయోగం ఏముంది, అలాంటివి జరక్కుండా ఉండేందుకు ఏం చేయాలా అని ఆలోచించాం, అప్పుడే ఈ ఆలోచన వచ్చింది. మా ఆలోచన మంచి ఫలితాన్నే ఇచ్చింది’’ అంటాడు పృథ్వీ. అది నిజం. ‘సమాజం మారాలి’, ‘దురాగతాలు ఆగాలి’ అంటూ నినాదాలు చేస్తే ఫలితం ఉండదు. ఎవరు వచ్చి ఈ దుస్థితిని మారుస్తారా అని ఎదురుచూడటం వల్ల ఉపయోగం ఉండదు. మార్పును మనస్ఫూర్తిగా కోరుకుంటే మొదటి అడుగు మనమే వేయాలి. ఆ విషయాన్ని ఈ ఇద్దరూ నిరూపించారు!
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement