‘చదువైనా.. సంగీతమైనా.. సముపార్జనకంటే నలుగురికి పంచడంలోనే సంతోషం ఉంది!’ అని నమ్ముతారు హబ్సిగూడకు చెందిన రాళ్లబండి ఆదిలక్ష్మి. అందుకే ఎనభై ఏళ్లు దాటిన తరువాత కూడా.. సప్తస్వరాలనూ నలుగురికి పంచుతూ అసలైన ఆనందాన్ని వెతుక్కుంటున్నారు.
ఈతరంతో పోటీ పడుతూ 2009లో జరిగిన లక్ష గళార్చనలో పాల్గొని గిన్నిస్ బుక్ రికార్డుల్లోనూ చోటు సంపాదించుకున్న ఆమె పరిచయం...
..:: మండల్‌రెడ్డి భూపాల్‌రెడ్డి, హబ్సిగూడ
గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టిన ఆదిలక్ష్మి ఆరో ఏటనే సంగీతం నేర్చుకున్నారు. సప్తస్వరాలపై ఉన్న మక్కువతో ఇతర విషయాల జోలికి వెళ్లకుండా ఇంటర్మీడియట్‌లోనూ మ్యూజిక్ కోర్సునే ఎంపిక చేసుకున్నారు. తనకిష్టమైన సంగీతం నుంచే డిగ్రీ పట్టా కూడా పొందారు. తరువాత పెళ్లి, పిల్లలు.. బాధ్యతలు. అయినా ఆమెలో ఉన్న సంగీత తృష్ణ నిలవనీయలేదు. అయితే ఏం చేయాలో స్పష్టత కూడా లేదు. అదే సమయంలో ఓసారి ఒడిశా నుంచి హైదరాబాద్‌కు రైలులో ప్రయాణిస్తుండగా గతంలో ఆమెకు సంగీతం నేర్పిన ప్రిన్సిపల్ రేవతి కనిపించారు. సంగీతంలో కొన్ని మెళకువలు చెప్పడమే కాదు.. ఎందుకు నేర్పించగూడదనే సలహా ఇచ్చారు.
ఆమె సలహాను పాటించిన ఆదిలక్ష్మి ఆదాయ మార్గంగా కాక.. తను నేర్చుకున్న సంగీతాన్ని నలుగురికీ పంచుతూ శారదా పుత్రికగా వెలుగుతున్నారు. ఇప్పటికే కొన్ని వందల మందికి ఉచిత శిక్షణ ఇచ్చారు. ఎంతోమందిని విద్వాంసులుగా తీర్చిదిద్దారు. ఆమె శిష్యులు సైతం సంగీతంలో శిక్షణ ఇస్తున్నారు. త్యాగరాయగాన సభ, ఆర్టీసీ కళాభవన్, తెలుగు లలితా కళాతోరణ, రవీంద్రభారతి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం... వేదిక ఏదైతేనేం సంగీత పోటీల్లో పాల్గొనేవారెందరో ఇప్పటికీ హబ్సిగూడలోని ఆమె నివాసానికి వచ్చి శిక్షణ తీసుకుంటుంటారు.
గిన్నిస్ బుక్ రికార్డు..
2009 మేలో సిలికానాంధ్ర, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా ఏర్పాటు చేసిన లక్ష గళార్చనలో ఆమె తన శిష్యులతో కలిసి భాగం పంచుకున్నారు. గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు ఆదిలక్ష్మి. ఈమె శిష్యులు దేశ, విదేశాల్లో సంగీత అధ్యాపకులుగా కొనసాగుతుండటం విశేషం. పిల్లలంతా విదేశాల్లో ఉన్నా తను మాత్రం... ఇండియానే కాదు ఇల్లునూ వదిలిపెట్టలేదు. ఈ 80 ఏళ్ల వయసులో... మూడేళ్ల నుంచి 70 ఏళ్ల వయసున్నవారి వరకు సంగీతంలో ఎందరికో శిక్షణ ఇస్తున్నారు.
సంగీతలక్ష్మి
Published Mon, Apr 27 2015 10:55 PM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM
Advertisement
Advertisement