స్వరాల పుస్తకం | Dr Sailaja Panthulu has written and published various Books on Music | Sakshi
Sakshi News home page

స్వరాల పుస్తకం

Published Sun, Sep 25 2022 3:45 AM | Last Updated on Sun, Sep 25 2022 3:45 AM

Dr Sailaja Panthulu has written and published various Books on Music - Sakshi

ఎంఎస్‌ సుబ్బులక్ష్మి అవార్డు అందుకుంటున్న శైలజాపంతులు (ఫైల్‌ ఫొటో)

అది బెంగళూరు నగరం జయనగర్‌... నిత్యం సప్తస్వరాలు పలికే ఓ రాగాలయం... ఆ గాననిలయం గాయని శైలజాపంతులు నివాసం. కిత్తూరు రాణి చెన్నమ్మ పురస్కారం... ప్రసిద్ధగాయని ఎంఎస్‌ సుబ్బులక్ష్మి అవార్డు... లెక్కకు మించిన సత్కారాలు... కన్నడనాట తెలుగు గాయనికి అందుతున్న గౌరవం. గాత్రసేవలో తరిస్తున్న స్వరాల పుస్తకం ఆమె. ఆమె సంగీత ప్రస్థానం...  ఆమె మాటల్లోనే...

‘‘మా ఇంటికి వచ్చిన వాళ్లు ‘ఇంట్లో సప్తస్వరాలతోపాటు త్రిమూర్తులు కూడా వెలిశారు’ అనీ, ‘ఇల్లు దశావతారాలకు ప్రతిబింబంగా ఉంది’ అనీ జోకులేసేవారు. ముగ్గురు అబ్బాయిలు. ఏడుగురు అమ్మాయిల్లో నేను చిన్నదాన్ని. నాకు మా మేనత్త పోలికలతోపాటు ఆమె స్వరం కూడా వచ్చిందని గుర్తు చేసుకునే వారు నాన్న. స్కూల్లో ప్రార్థనాగీతాలు, బృందగానాలు ఇష్టంగా పాడేదాన్ని.

నా ఆసక్తిని గమనించిన నాన్న నాకు, చిన్నక్క రమాదేవికి సంగీతంలో శిక్షణ ఇప్పించడానికి తనవంతుగా మంచి ప్రయత్నమే చేశారు. మా ఊరు చిత్తూరు జిల్లా బీరంగి కొత్తకోట. బెంగళూరు నుంచి మాస్టారు వారాంతాల్లో మా ఊరికి వచ్చి సంగీతం నేర్పించే ఏర్పాటు చేశారు. వెంకటేశ్‌ భాగవతార్‌ మాస్టారు ప్రతివారం రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి పాఠాలు చెప్పేవారు. కానీ ఎక్కువ కాలం కొనసాగడం కష్టమైంది.

తొలుత ఏకలవ్య శిష్యరికం
నేను ప్రఖ్యాత గాయని ఎమ్‌ ఎల్‌ వసంతకుమారి శిష్యురాలిని, ఏడేళ్లు ఆమె దగ్గరే ఉండి శుశ్రూష చేసి చదువుకుంటూ సంగీతం నేర్చుకున్నాను. ఆడపిల్లలు ఇంటి ఆవరణ దాటడానికి కూడా ఇష్టపడని సంప్రదాయ కుటుంబం మాది. అలాంటి రోజుల్లో అన్నయ్య నరేంద్రరావు చొరవ తీసుకుని నాన్నని ఒప్పిస్తూ ఒక్కో అడుగూ ముందుకు వేయించాడు. అక్క, నేను ఎమ్‌ఎల్‌ వసంతకుమారి గారికి ఏకలవ్య శిష్యులం.

ఇంట్లో రోజూ ఆమె పాటల క్యాసెట్‌ పెట్టుకుని సంగీత సాధన చేసేవాళ్లం. అలాంటిది ఆ గాయని ఓ రోజు రిషివ్యాలీ స్కూల్‌కి వస్తున్నట్లు సమాచారం తెలిసి అన్నయ్య మమ్మల్ని తీసుకువెళ్లి ఆమెను చూపించాడు. అప్పుడు ఆమె దగ్గర సంగీతం నేర్చుకోగలననే ఆలోచన నా ఊహకు కూడా అందలేదు. దేవుడు సంకల్పించినట్లుగా ఆమె ఓ రోజు వైద్యం కోసం మా మేనమామ క్లినిక్‌కి వచ్చారు. అప్పుడు మా మామ ఆమెను రిక్వెస్ట్‌ చేయడం, ఆమె వెంటనే రిషి వ్యాలీ స్కూల్‌లో చేర్పించమని చెప్పడం జరిగిపోయాయి.

చేరడం వరకు సులువుగానే జరిగింది. కానీ అక్కడికి వెళ్లి రావడం చాలా కష్టమయ్యేది. వారాంతాల్లో క్లాసులు. మా ఊరి నుంచి ‘అంగళ్లు’ అనే ఊరి వరకు బస్‌లో వెళ్లి, అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు నడిచి రిషివ్యాలీ చేరేవాళ్లం. ఆ స్కూల్‌లో తెలుగు మాస్టారు రామచంద్రరావు గారు మా దూరపుబంధువు. వారింట్లో ఉండి సంగీతం నేర్చుకోవడం, సోమవారం ఉదయాన్నే బయలుదేరి మా ఊరికి రావడం. ధర్మవరం కాలేజ్‌లో ఇంటర్‌ చదువు... ఈ దశలో చదువు సరిగ్గా సాగలేదు.

ఇదిలా ఉండగా అక్కకు పెళ్లయి బెంగుళూరుకు వెళ్లిపోయింది. ఇక నాది ఒంటరి పోరాటమే అయింది. ఇంట్లో వాళ్లు చదువు లేదా సంగీతం ఏదో ఒకటి మానిపించాలనే ఆలోచనలోకి వచ్చేశారు. అప్పుడు నేను ‘ప్రైవేట్‌గా చదువుకుంటూ సంగీతం నేర్చుకుంటాను’ అని మొండిగా పట్టుపట్టాను. అలా మా గురువుగారు వసంతకుమారి గారింటికి చేరాను. ఏడేళ్లు అక్కడే ఉండి గురు శుశ్రూష చేశాను. ఆమె శిష్యరికంలో సంగీత సాధన చేస్తూ ఆమె జతతో కచేరీల్లో పాల్గొంటూ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో పీజీ చేశాను.

 వరుడి కోసం వేట
మా అన్న మద్దతు అక్కడితో ఆగిపోలేదు. నాకు వరుడిని వెతికే పనిని ఒక యజ్ఞంలా చేశాడు. నా పెళ్లి నాటికి నాన్న లేరు, బాధ్యతంతా అన్నయ్య దే. సంగీతం విలువ తెలిసిన కుటుంబం అయితేనే నా సాధన కొనసాగుతుందనే ఉద్దేశ్యంతో సంగీతం వచ్చిన వరుడి కోసం గాలించాడు. అలా... బెంగళూరులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో మృదంగవాద్యకారుడికిచ్చి పెళ్లి చేశారు.

మా వారు రఘుపంతులుకి సొంత వ్యాపారం ఉంది. కానీ సంగీతం పట్ల ఆయనకు అపారమైన ఇష్టం, గౌరవం. అలా పెద్ద సంగీత కుటుంబంలోకి కోడలిగా వెళ్లాను. అన్నిరకాల సౌకర్యాలూ ఉన్నప్పటికీ ముగ్గురు పిల్లల పెంపకంతో నాకు సంగీత కచేరీలకు పదేళ్లు విరామం వచ్చేసింది. అప్పుడు మావారు పిల్లల పనులకు సహాయకులను నియమించుకుని సంగీత సాధనకు వెసులుబాటు చేసుకోమని సూచించారు.

రాగాల పరిశోధన
సంగీతం ఆహ్లాదకారకం మాత్రమే కాదు, దివ్యమైన ఔషధం కూడా. ఇది నిరూపణ అయిన వాస్తవమే, కానీ ఏ రాగంతో ఏ అనారోగ్యం నుంచి సాంత్వన కలుగుతుందోనని స్వయంగా శోధించి తెలుసుకున్నాను. బీపీ, డయాబెటిస్, ఒత్తిడి, ఊపిరితిత్తుల సమస్యల నుంచి చక్కటి ఉపశమనం లభిస్తుంది. నేచర్‌ క్యాంపులు పెట్టి ప్రకృతి ఒడిలో రాగాలాపన చేస్తాం. మెంటల్‌ హెల్త్‌ విభాగానికి మానసిక సమస్యలకు సాంత్వన కలిగించే మ్యూజిక్‌ థెరపీ ప్రాజెక్టు సిద్ధం చేసిచ్చాను.

ప్రఖ్యాత వాగ్గేయకారుడు పురందరదాసు చెప్పినట్లు సంగీతజ్ఞానం ప్రతి ఇంట్లో ఉండాలనేదే నా ఆకాంక్ష. సంగీతం అనే ఔషధసేవనం చేసే వాళ్లకు అనేక అనారోగ్యాలు దూరంగా ఉంటాయి. లెక్కకు మించిన అవార్డులు అందుకున్నప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎంఎస్‌ సుబ్బులక్ష్మి అవార్డు అందుకోవడంతో నా జన్మధన్యం అయింది. సంగీతం కోసం ఇంకా ఇంకా సేవ చేయాల్సిన బాధ్యత కూడా పెరిగింది. గురుకులాన్ని ప్రారంభించాలనేది తదుపరి లక్ష్యం. నేను మొదలుపెడితే మరొకరు అందిపుచ్చుకుని కొనసాగిస్తారు’’ అన్నారు శైలజాపంతులు.

సరిగమల గ్రాఫ్‌
సంగీతంలో జూనియర్, సీనియర్‌ విద్వత్తు కోర్సు చేశాను. సంగీత సాధన కోసమే ఇంట్లో ఒక గదిని కేటాయించుకుని చాలా తీవ్రంగా సాధన చేసి గ్రాఫో టెక్నాలజీకి రూపకల్పన చేశాను. నాకు డాక్టరేట్‌ వచ్చింది ఈ సర్వీస్‌కే. సంగీతం నేర్చుకునే వారికి సులువుగా ఉండే విధానం అది. నా మనుమరాలు నాలుగేళ్ల ‘పూర్వి’ కూడా గ్రాఫ్‌ చూస్తూ పాడేస్తుంది. గ్రాఫో టెక్నాలజీతో సంగీత పాఠాల పుస్తకాలు రాయడం మొదలుపెట్టాను. సంగీతం కోసం తీవ్రంగా పనిచేయాలనే నిర్ణయానికి వచ్చి 2001లో ... అత్తమామల పేర్లు, తిరుమల బాలాజీ పేరు వచ్చేటట్లు శ్రీవెంకట్‌ మ్యూజిక్‌ అకాడమీ స్థాపించాను. ఒక్క స్టూడెంట్‌తో మొదలైన అకాడమీలో ఇప్పుడు మూడు వందలకు పైగా విద్యార్థులు సంగీత సాధన చేస్తున్నారు. వాళ్లకు నేర్పించడం కోసం రోజుకు ఐదారు గంటల సేపు నేను కూడా పాడతాను.  
– డాక్టర్‌ శైలజాపంతులు, ప్రసిద్ధగాయని, బెంగళూరు

– వాకా మంజులారెడ్డి
ఫొటోలు : మోర్ల అనిల్‌ కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement