telugu singers
-
సింగర్ రమణ గోగుల 'గుండు' వెనక ఇంత స్టోరీ ఉందా?
సింగర్ రమణ గోగుల పేరు చెప్పగానే.. చాలా ఏళ్ల క్రితం తెలుగులోని అద్భుతమైన పాటలే గుర్తొస్తాయి. సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమ్ముడు, ప్రేమంటే ఇదేరా, బద్రి, జానీ, లక్ష్మీ, యోగి మూవీస్‌కి అదిరిపోయే సంగీతమందించారు. 2013 తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయిన ఈయన.. అమెరికాలో జాబ్ చేసుకుంటూ ఉండిపోయారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వెంకటేశ్ 'సంక్రాంతి వస్తున్నాం' మూవీలో 'గోదారి గట్టు మీద' పాటతో బ్లాక్ బస్టర్ రీఎంట్రీ ఇచ్చారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్)ఈ క్రమంలోనే రమణ గోగుల పేరు తెలుగు ఇండస్ట్రీలో మరోసారి మార్మోగిపోతోంది. తాజాగా ఈయన ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కెరీర్, వ్యక్తిగత విషయాలు, ఇండస్ట్రీకి దూరమవడం లాంటి చాలా విషయాలు మాట్లాడారు. ఇవన్నీ పక్కనబెడితే తనది ఒరిజినల్ గుండు కాదని, ఎప్పటికప్పుడు జుత్తుని గీసేస్తున్నానని చెప్పడం మాత్రం షాకింగ్‌గా అనిపించింది. అలా చేయడానికి గల కారణాన్ని కూడా బయటపెట్టారు.''జానీ' మూవీ చేస్తున్న టైంలో నా భార్య ప్రెగ్నెంట్. డాక్టర్స్ ఏమో డెలివరీ కష్టం అన్నారు. దాని గురించే ఆలోచిస్తూ ఆఫీస్‌లో డల్‌గా ఉంటే.. మా కీ బోర్డ్ ప్లేయర్ ఒకతను ఏంటి సార్ అలా ఉన్నారని నన్ను అడిగాడు. విషయమంతా చెప్పా. మీరేం ఆలోచించకుండా తిరుపతి వెళ్లి రండి సార్, అంతా సెట్ అయిపోద్ది అని చెప్పాడు. సరే అని వెళ్లి అక్కడే జుత్తుంతా దేవుడికి ఇచ్చేసి వచ్చా. తర్వాత నా భార్యకు నార్మల్ డెలివరీ అయింది. అప్పుడే డిసైడ్ అయ్యా. ఇక జీవితంలో నా జుత్తుని పెంచుకోకూడదని' అని రమణ గోగుల చెప్పారు.(ఇదీ చదవండి: చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదు: నాగవంశీ) -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ సింగర్స్
తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్న అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఈ వేడుక జరిగింది. ఇది ప్రేమ పెళ్లి అని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీళ్ల వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొత్తజంటకు తోటీ గాయనీగాయకులు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: అలాంటి పాటలు పాడొద్దు.. ప్రముఖ సింగర్‌కు తెలంగాణ అధికారుల నోటీసులు)'కేరాఫ్ కంచరపాలెం'లోని 'ఆశా పాశం', 'ఆర్ఎక్స్ 100'లోని 'పిల్లా రా' లాంటి పాటలతో అనురాగ్ కులకర్ణి బోలెడంత క్రేజ్ తెచ్చుకున్నాడు. అంతకుముందు సూపర్ సింగర్ 8వ సీజన్ విజేతగా నిలవడంతో ఇతడికి గుర్తింపు వచ్చింది. అలా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ప్రస్తుతం క్రేజీ సినిమాల్లో పాటలు పాడుతూ బిజీగా ఉన్నాడు.రమ్య బెహరా విషయానికొస్తే.. సూపర్ సింగర్ 4లో పాల్గొంది. ఈమెను కీరవాణి.. టాలీవుడ్‌కు పరిచయం చేశారు. బాహుబలి, టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమకథా చిత్రం, లౌక్యం, ఇస్మార్ట్ శంకర్, శతమానం భవతి తదితర సినిమాల్లో రమ్య పాడిన సాంగ్స్ మంచి హిట్స్ అయ్యాయి. ఇప్పుడు ఈమె తోటి సింగర్నే పెళ్లి చేసుకోవడంతో అందరూ సర్ప్రైజ్ అయ్యారు. రీసెంట్గా వీళ్లిద్దరూ కలిసి పాడిన పాట 'హే రంగులే'. ఇది ఎంతలా హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.(ఇదీ చదవండి: వివాహ వేడుకలో చిరంజీవి, అల్లు అర్జున్ దంపతులు) -
స్వరాల పుస్తకం
అది బెంగళూరు నగరం జయనగర్... నిత్యం సప్తస్వరాలు పలికే ఓ రాగాలయం... ఆ గాననిలయం గాయని శైలజాపంతులు నివాసం. కిత్తూరు రాణి చెన్నమ్మ పురస్కారం... ప్రసిద్ధగాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు... లెక్కకు మించిన సత్కారాలు... కన్నడనాట తెలుగు గాయనికి అందుతున్న గౌరవం. గాత్రసేవలో తరిస్తున్న స్వరాల పుస్తకం ఆమె. ఆమె సంగీత ప్రస్థానం... ఆమె మాటల్లోనే... ‘‘మా ఇంటికి వచ్చిన వాళ్లు ‘ఇంట్లో సప్తస్వరాలతోపాటు త్రిమూర్తులు కూడా వెలిశారు’ అనీ, ‘ఇల్లు దశావతారాలకు ప్రతిబింబంగా ఉంది’ అనీ జోకులేసేవారు. ముగ్గురు అబ్బాయిలు. ఏడుగురు అమ్మాయిల్లో నేను చిన్నదాన్ని. నాకు మా మేనత్త పోలికలతోపాటు ఆమె స్వరం కూడా వచ్చిందని గుర్తు చేసుకునే వారు నాన్న. స్కూల్లో ప్రార్థనాగీతాలు, బృందగానాలు ఇష్టంగా పాడేదాన్ని. నా ఆసక్తిని గమనించిన నాన్న నాకు, చిన్నక్క రమాదేవికి సంగీతంలో శిక్షణ ఇప్పించడానికి తనవంతుగా మంచి ప్రయత్నమే చేశారు. మా ఊరు చిత్తూరు జిల్లా బీరంగి కొత్తకోట. బెంగళూరు నుంచి మాస్టారు వారాంతాల్లో మా ఊరికి వచ్చి సంగీతం నేర్పించే ఏర్పాటు చేశారు. వెంకటేశ్ భాగవతార్ మాస్టారు ప్రతివారం రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి పాఠాలు చెప్పేవారు. కానీ ఎక్కువ కాలం కొనసాగడం కష్టమైంది. తొలుత ఏకలవ్య శిష్యరికం నేను ప్రఖ్యాత గాయని ఎమ్ ఎల్ వసంతకుమారి శిష్యురాలిని, ఏడేళ్లు ఆమె దగ్గరే ఉండి శుశ్రూష చేసి చదువుకుంటూ సంగీతం నేర్చుకున్నాను. ఆడపిల్లలు ఇంటి ఆవరణ దాటడానికి కూడా ఇష్టపడని సంప్రదాయ కుటుంబం మాది. అలాంటి రోజుల్లో అన్నయ్య నరేంద్రరావు చొరవ తీసుకుని నాన్నని ఒప్పిస్తూ ఒక్కో అడుగూ ముందుకు వేయించాడు. అక్క, నేను ఎమ్ఎల్ వసంతకుమారి గారికి ఏకలవ్య శిష్యులం. ఇంట్లో రోజూ ఆమె పాటల క్యాసెట్ పెట్టుకుని సంగీత సాధన చేసేవాళ్లం. అలాంటిది ఆ గాయని ఓ రోజు రిషివ్యాలీ స్కూల్‌కి వస్తున్నట్లు సమాచారం తెలిసి అన్నయ్య మమ్మల్ని తీసుకువెళ్లి ఆమెను చూపించాడు. అప్పుడు ఆమె దగ్గర సంగీతం నేర్చుకోగలననే ఆలోచన నా ఊహకు కూడా అందలేదు. దేవుడు సంకల్పించినట్లుగా ఆమె ఓ రోజు వైద్యం కోసం మా మేనమామ క్లినిక్‌కి వచ్చారు. అప్పుడు మా మామ ఆమెను రిక్వెస్ట్ చేయడం, ఆమె వెంటనే రిషి వ్యాలీ స్కూల్లో చేర్పించమని చెప్పడం జరిగిపోయాయి. చేరడం వరకు సులువుగానే జరిగింది. కానీ అక్కడికి వెళ్లి రావడం చాలా కష్టమయ్యేది. వారాంతాల్లో క్లాసులు. మా ఊరి నుంచి ‘అంగళ్లు’ అనే ఊరి వరకు బస్‌లో వెళ్లి, అక్కడి నుంచి మూడు కిలోమీటర్లు నడిచి రిషివ్యాలీ చేరేవాళ్లం. ఆ స్కూల్లో తెలుగు మాస్టారు రామచంద్రరావు గారు మా దూరపుబంధువు. వారింట్లో ఉండి సంగీతం నేర్చుకోవడం, సోమవారం ఉదయాన్నే బయలుదేరి మా ఊరికి రావడం. ధర్మవరం కాలేజ్‌లో ఇంటర్ చదువు... ఈ దశలో చదువు సరిగ్గా సాగలేదు. ఇదిలా ఉండగా అక్కకు పెళ్లయి బెంగుళూరుకు వెళ్లిపోయింది. ఇక నాది ఒంటరి పోరాటమే అయింది. ఇంట్లో వాళ్లు చదువు లేదా సంగీతం ఏదో ఒకటి మానిపించాలనే ఆలోచనలోకి వచ్చేశారు. అప్పుడు నేను ‘ప్రైవేట్‌గా చదువుకుంటూ సంగీతం నేర్చుకుంటాను’ అని మొండిగా పట్టుపట్టాను. అలా మా గురువుగారు వసంతకుమారి గారింటికి చేరాను. ఏడేళ్లు అక్కడే ఉండి గురు శుశ్రూష చేశాను. ఆమె శిష్యరికంలో సంగీత సాధన చేస్తూ ఆమె జతతో కచేరీల్లో పాల్గొంటూ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో పీజీ చేశాను. వరుడి కోసం వేట మా అన్న మద్దతు అక్కడితో ఆగిపోలేదు. నాకు వరుడిని వెతికే పనిని ఒక యజ్ఞంలా చేశాడు. నా పెళ్లి నాటికి నాన్న లేరు, బాధ్యతంతా అన్నయ్య దే. సంగీతం విలువ తెలిసిన కుటుంబం అయితేనే నా సాధన కొనసాగుతుందనే ఉద్దేశ్యంతో సంగీతం వచ్చిన వరుడి కోసం గాలించాడు. అలా... బెంగళూరులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో మృదంగవాద్యకారుడికిచ్చి పెళ్లి చేశారు. మా వారు రఘుపంతులుకి సొంత వ్యాపారం ఉంది. కానీ సంగీతం పట్ల ఆయనకు అపారమైన ఇష్టం, గౌరవం. అలా పెద్ద సంగీత కుటుంబంలోకి కోడలిగా వెళ్లాను. అన్నిరకాల సౌకర్యాలూ ఉన్నప్పటికీ ముగ్గురు పిల్లల పెంపకంతో నాకు సంగీత కచేరీలకు పదేళ్లు విరామం వచ్చేసింది. అప్పుడు మావారు పిల్లల పనులకు సహాయకులను నియమించుకుని సంగీత సాధనకు వెసులుబాటు చేసుకోమని సూచించారు. రాగాల పరిశోధన సంగీతం ఆహ్లాదకారకం మాత్రమే కాదు, దివ్యమైన ఔషధం కూడా. ఇది నిరూపణ అయిన వాస్తవమే, కానీ ఏ రాగంతో ఏ అనారోగ్యం నుంచి సాంత్వన కలుగుతుందోనని స్వయంగా శోధించి తెలుసుకున్నాను. బీపీ, డయాబెటిస్, ఒత్తిడి, ఊపిరితిత్తుల సమస్యల నుంచి చక్కటి ఉపశమనం లభిస్తుంది. నేచర్ క్యాంపులు పెట్టి ప్రకృతి ఒడిలో రాగాలాపన చేస్తాం. మెంటల్ హెల్త్ విభాగానికి మానసిక సమస్యలకు సాంత్వన కలిగించే మ్యూజిక్ థెరపీ ప్రాజెక్టు సిద్ధం చేసిచ్చాను. ప్రఖ్యాత వాగ్గేయకారుడు పురందరదాసు చెప్పినట్లు సంగీతజ్ఞానం ప్రతి ఇంట్లో ఉండాలనేదే నా ఆకాంక్ష. సంగీతం అనే ఔషధసేవనం చేసే వాళ్లకు అనేక అనారోగ్యాలు దూరంగా ఉంటాయి. లెక్కకు మించిన అవార్డులు అందుకున్నప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు అందుకోవడంతో నా జన్మధన్యం అయింది. సంగీతం కోసం ఇంకా ఇంకా సేవ చేయాల్సిన బాధ్యత కూడా పెరిగింది. గురుకులాన్ని ప్రారంభించాలనేది తదుపరి లక్ష్యం. నేను మొదలుపెడితే మరొకరు అందిపుచ్చుకుని కొనసాగిస్తారు’’ అన్నారు శైలజాపంతులు. సరిగమల గ్రాఫ్ సంగీతంలో జూనియర్, సీనియర్ విద్వత్తు కోర్సు చేశాను. సంగీత సాధన కోసమే ఇంట్లో ఒక గదిని కేటాయించుకుని చాలా తీవ్రంగా సాధన చేసి గ్రాఫో టెక్నాలజీకి రూపకల్పన చేశాను. నాకు డాక్టరేట్ వచ్చింది ఈ సర్వీస్‌కే. సంగీతం నేర్చుకునే వారికి సులువుగా ఉండే విధానం అది. నా మనుమరాలు నాలుగేళ్ల ‘పూర్వి’ కూడా గ్రాఫ్ చూస్తూ పాడేస్తుంది. గ్రాఫో టెక్నాలజీతో సంగీత పాఠాల పుస్తకాలు రాయడం మొదలుపెట్టాను. సంగీతం కోసం తీవ్రంగా పనిచేయాలనే నిర్ణయానికి వచ్చి 2001లో ... అత్తమామల పేర్లు, తిరుమల బాలాజీ పేరు వచ్చేటట్లు శ్రీవెంకట్ మ్యూజిక్ అకాడమీ స్థాపించాను. ఒక్క స్టూడెంట్‌తో మొదలైన అకాడమీలో ఇప్పుడు మూడు వందలకు పైగా విద్యార్థులు సంగీత సాధన చేస్తున్నారు. వాళ్లకు నేర్పించడం కోసం రోజుకు ఐదారు గంటల సేపు నేను కూడా పాడతాను. – డాక్టర్ శైలజాపంతులు, ప్రసిద్ధగాయని, బెంగళూరు – వాకా మంజులారెడ్డి ఫొటోలు : మోర్ల అనిల్ కుమార్ -
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం
-
గీతాసారం...వ్యక్తిత్వ వికాస భాండాగారం...
మొన్నటిదాకా సినిమా పాటలతో ఊపిరిసలపకుండా ఉన్నారు... స్టేజ్, టీవీ షోలలో వ్యాఖ్యాతగా రాణించారు...ఘంటసాల గానానికి చిరునామా అయ్యారు... గాయకుడిగా తన గానానికి శాశ్వతత్వాన్ని చేకూర్చే బృహత్ యజ్ఞం ప్రారంభించారు. తెలుగు గాయకుడు ఘంటసాల ప్రారంభించిన యజ్ఞాన్ని తిరిగి తెలుగు గాయకుడే పూర్తిచేశారనిపించుకున్నారు. ఆ మహత్కార్యమే సంపూర్ణ భగవద్గీతా గానం. ఒక గాయకుడు ఒక ప్రామాణిక గ్రంథాన్ని స్వీయ సంగీతంలో, తాత్పర్యసహితంగా సంపూర్ణంగా గానం చేసి అత్యాధునిక సాంకేతిక విలువలతో రికార్డు చేయడం భారతదేశ సంగీత చరిత్రలో ఇదే ప్రథమం. గీతాసారాన్ని లక్షలాదిమంది ప్రజలలోకి తీసుకువెళ్లాలనే ఉన్నత లక్ష్యంతో పనిచేస్తున్న ఎల్వీ గంగాధరశాస్త్రితో కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ... గంగాధర శాస్త్రి పరిచయం విద్య: బి.ఎ, కర్ణాటక శాస్త్రీయ సంగీతం తల్లిదండ్రులు: శ్రీలక్ష్మి, కాశీ విశ్వనాథశర్మ భార్య: అర్చన పిల్లలు: విశ్వతేజ, కీర్తిప్రియ వృత్తి: 12 ఏళ్లు సినిమా జర్నలిస్టుగా పనిచేశారు. మొదటి సినిమా పాట: ‘నాన్నగారు’ సినిమాలో ‘చుక్కా...చుక్కా ఒకటై’ స్వస్థలం: కృష్ణా జిల్లా, అవనిగడ్డ కృష్ణుడు... బాల్యమంతా అల్లరి పనులు చేసి చిలిపి కృష్ణుడయ్యాడు. యవ్వనంలో గోపికలను అలరిం చాడు, యుద్ధసమయంలో పాండవులు గెలవడానికి సమన్యాయం పాటించలేదా అనిపించేలా చేశాడు. పలు సందర్భాల్లో సాధారణ మానవుడిగా అనిపించిన కృష్ణుడిని దేవుడిగా కొలవడాన్ని కొందరు సంశయిస్తారు. దీన్నెలా తీసుకోవాలి? అసలు కృష్ణతత్వం ఏమిటి? పసివానిగా ఉన్నప్పటి నుంచే అందరూ కృష్ణుడిని దేవుడిగా కొలిచారు. మన్నుతిన్నాడని నోరుతెరవమంటే నోటిలో 14 భువనభాండాలను చూపించాడు. తల్లి మొదలు అందరూ ఆయనలో పరమాత్ముణ్ణే చూశారు... ఒక్క కౌరవులు తప్ప! ధర్మచింతన చేసిన వారందరూ తమ జ్ఞానదృష్టితో చూడగలిగితే మానవుడిలో మాధవుడు కనిపిస్తాడు. లేదంటే కౌరవులకు కనిపించినట్టు మానవుడే కనిపిస్తాడు. మనకి ఆ జ్ఞానదృష్టి కావాలంటే భగవద్గీతను చదవాలి... అప్పుడే ఆయన పరమాత్ముడిగా కనిపిస్తాడు... అనిపిస్తాడు. భగవద్గీత పరిచయభాగ్యం మొదట మీకెలా కలిగింది? ‘సంస్కృతం నేర్చుకుంటే నాలిక తిరుగుతుంది. ఆ తర్వాత బతుకు తిరుగుతుంది’ అంటూ చిన్నతనంలో శ్లోకాలు, స్తోత్రాలు నేర్పించింది మా అమ్మ. బతుకు తిరగడమంటే అప్పట్లో నాకర్థం కాలేదు. కానీ భగవద్గీత రికార్డింగ్‌లో శ్లోకాలు తేలిగ్గా ఉచ్చరించగలుగుతున్నప్పుడు మా అమ్మ వేసిన పునాది విలువ ఏమిటో అర్థమయ్యింది. స్కూలు రోజుల్లో కాస్త ఖాళీ దొరికితే ఆకుల వేంకటరత్నారావు మాస్టారు భగవద్గీత శ్లోకాలూ, పాలపర్తి సుబ్బారావు మాస్టారు సంస్కృతమూ నేర్పించేవారు. హైదరాబాద్ వచ్చాక సినిమా జర్నలిస్ట్‌గా పనిచేశాను. అడపాదడపా సినిమా పాటలు పాడుతూ దేశ విదేశాల్లో కచేరీలు చేస్తూ చాలా బిజీగా ఉన్న సమయంలో ఒకసారి భారవిగారు సంపూర్ణ భగవద్గీత చేయమని సూచించారు. ‘భగవద్గీత’ సాగరంలోకి దూకాలనే నిర్ణయం తీసుకోడానికి సంవత్సరకాలం ఆలోచించాను. ఆ నిర్ణయం తీసుకున్నాక మిగతావన్నీ వదిలేసి ఆరేళ్లపాటు గీతాగాన తపస్సులో ఉండిపోయాను. ఘంటసాలగారు పాడిన ‘భగవద్గీత’ ఉండగా మళ్ళీ మీరెందుకు సాహసించారు? సంపూర్ణ భగవద్గీత చేయడమంటే వ్యయప్రయాసలతో కూడిన సాహసం. అదీగాక ఎదురుగా ఘంటసాల భగవద్గీత హెచ్చరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ‘భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలలో ఘంటసాలగారు 108 శ్లోకాలే పాడారు. మొత్తం 700 శ్లోకాలూ పాడి ఘంటసాలగారికీ, ఈ దేశానికీ, తెలుగుజాతికీ అంకితం చేయడంకంటే గాయకుడిగా మీ జన్మకి సార్థకత ఇంకేముంటుంది...ఆలోచించండి’ అని భారవిగారు అన్నప్పుడు పొంగిపోయి ‘నేను కరెక్టు’ అని అనుకోలేదు. శ్లోకాలు రికార్డు చేశాక అభిప్రాయం కోసం ఘంటసాలగారి సతీమణి సావిత్రిగారికి, అక్కినేని నాగేశ్వరరావుగారికి వినిపించాను. ఇద్దరూ ఒకటే మాటన్నారు... ‘ఘంటసాలగారి వయస్సు ఓ పదేళ్లు తగ్గించుకుని పాడినట్టుందని..’. ‘హమ్మయ్య పాసయ్యాను’ అనుకున్నాను. ఘంటసాలగారితో హెచ్‌ఎమ్‌వి సంస్థ 108 శ్లోకాలు తాత్పర్యసహితంగా, కొద్దిపాటి వాద్యాలతో, స్టీరియోలో రికార్డు చేసి 1974లో విడుదల చేసింది. ఆ స్ఫూర్తితో మొత్తం 700 శ్లోకాలను, తాత్పర్యసహితంగా, పూర్తి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, వింటున్నప్పుడు కళ్లకు దృశ్యం కనిపించేలా...అవసరమైన సౌండ్ ఎఫెక్ట్స్‌ని మేళవిస్తూ, ఇప్పటి తరాన్ని కూడా ఆకట్టుకునే విధంగా డిజిటల్ ఫార్మాట్లో రికార్డు చేశాం మీరు ఉద్యోగం చేస్తున్పప్పటి రోజులకీ, గీతా ప్రయాణంలో ఉన్న రోజులకీ వ్యత్యాసం కనిపిస్తుంటుందా? అది వ్యక్తుల కొలువులో ఉద్యోగం... ఇది పరమాత్ముని కొలువులో సద్యోగం! అది భుక్తి కోసం... ఇది ముక్తి కోసం. ‘మహత్కార్యాలు తృటిలో నెరవేరవు’ అన్నది సామెత. ‘ఇంకెంతకాలం చేస్తావు నాయనా’ అని వ్యంగ్యంగా అడిగిన వాళ్ళే థియేటర్‌కి వచ్చి విన్నాక ‘ఇంత బాగా చేయాలంటే అంత సమయం పడుతుంది మరి’ అనుకుంటూ వెళ్ళారు. దాదాపు 100 మంది పండితులు, వాద్యకళాకారులు, సాంకేతిక నిపుణులు, దాతలు... ఎందరో ఈ ప్రాజెక్టుకు సహకారం అందించారు. ఈ స్పీడు తరానికి ‘భగవద్గీత’ వినే టైమూ, ఆసక్తీ ఉందంటారా? జీవితం అంటే - పగలూ రాత్రీ తేడా లేకుండా, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదించడం అనుకునే నేటి యువతరానికి సరైన మార్గాన్ని సూచిస్తుంది భగవద్గీత. వయసుతోపాటు వచ్చే గౌరవం కంటే జ్ఞానంతో పాటు వచ్చే గౌరవం శాశ్వతమైనది. ఆ గౌరవం మనం చేసే పనుల ద్వారా ఎలా సంపాదించుకోవాలో భగవద్గీత చెబుతుంది. మనలో దాగిన ఆత్మశక్తిని మనకి చూపించి, మనల్ని మనం ఉద్ధరించుకునే శక్తినిస్తుంది గీత. బ్యాడ్‌లక్! ఇవ్వాళ ఒక సినిమా డివిడి 150 రూపాయలు పెట్టి కొంటున్నాం. అదే భగవద్గీత పుస్తకం మార్కెట్లో పది రూపాయలకు దొరుకుతుంది. అంటే తాత్కాలిక ఆనందం ఖరీదు.. శాశ్వతమైన జ్ఞానం చవకగా దొరుకుతోందన్నమాట. నిజమే మరి... జ్ఞానం చవగ్గా దొరక్కపోతే అందరికీ చేరదుకదా! జీవితం అంటే ఏమిటో, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్పే ‘భగవద్గీత’ లాంటి మేనేజ్మెంట్ గ్రంథం యువతరానికి అవసరం లేదంటారా! ‘భగవద్గీత’ ప్రాజెక్టు ఏ దశలో ఉంది, మీరు ఆశిస్తున్న ప్రయోజనం? 700 శ్లోకాల గీతాగానం ప్రాజెక్టు పూర్తయ్యింది. మొత్తం గీతాగానం వ్యవధి 12 గంటలు. 18 అధ్యాయాలని, 18 సీడీలుగా రూపొందించాం. ‘గీతాపారాయణం’ కూడా దీనికి అనుబంధంగా ఇటీవలే రికార్డు చేశాం. ఇక ప్రయోజనం అంటారా... ఫలితాన్ని ఆశించానంటే ‘గీత’ నాకు అర్థంకానట్టే. దేవుడు కోరికని బట్టి ఇవ్వడు. అర్హతని బట్టి ఇస్తాడు. ఈ సంకల్పబలంతోనే అన్నీ వదిలేసి సంపూర్ణ గీతాగానమే ధ్యేయంగా ఆరుసంవత్సరాలపాటు, పట్టుదలతో ‘గీత’ను పూర్తిచేయగలిగాను. జీవితమంటే లక్ష్యాన్ని చేరుకోవడం ఒక్కటే కాదు, ప్రయాణాన్ని ఆస్వాదించడం కూడా. పరమాత్ముడు నాతో చేయించిన ‘గీతాపారాయణం’ అద్భుతమైన అనుభూతుల సమ్మిశ్రమం. ఇంటింటా గీతాజ్యోతిని వెలిగించాలి... అప్పుడే భారతదేశం పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది. ఇదే నేనాశిస్తున్న ప్రయోజనం. ఒక గాయకుడు ఇంత పెద్ద ప్రాజెక్టుని తలపెట్టి పూర్తి చేయడం ఒక రికార్డేమో కదా! మీరంటున్నది ‘గిన్నిస్’ గురించేగా! మనం చేస్తున్నపని, చేరాలనుకుంటున్న రికార్డుకంటే చిన్నదైతే అప్పుడు రికార్డులు గొప్పవవుతాయి. నా దృష్టిలో భగవద్గీత విశిష్ట గ్రంథం - గిన్నిస్‌బుక్ విచిత్ర పుస్తకం. గ్రంథాన్ని తీసుకువెళ్ళి ఎవరైనా పుస్తకంలోకి ఎక్కిస్తారా! నా జీవితంలో భగవద్గీత ఒక ప్రాజెక్టు అనుకున్నాను. ఇది పూర్తయ్యే సమయానికి నాకు తెలీకుండా భగవద్గీతే జీవితమైపోయింది. వీలైనన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించి విడుదల చెయ్యడం నా తదుపరి కర్తవ్యం. వీలైనంత ప్రచారం కూడా అవసరం. ‘భగవద్గీత’ ద్వారా వ్యక్తిత్వాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో చెబుతూ ఇప్పటికే ఆంధ్రరాష్ర్టంలోని చాలా కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు మోటివేషన్ లెక్చర్స్ ఇస్తున్నాను. - డా.పురాణపండ వైజయంతి ‘‘ఐదువేల సంవత్సరాల క్రితం మతాలే ఆవిర్భవించని కాలంలో, శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని ప్రపంచంలోని మానవులందరికీ పంచిపెట్టిన జ్ఞాన భాండాగారమే గీత’’ ‘‘కస్తూరి మృగం తన నుంచే పరిమళం వస్తోందన్న విషయం తెలీక ముక్కుపుటాలు ఎగరేసుకుంటూ అడవంతా తిరుగుతూ ఉంటుందట! మనమూ అంతే. పక్కనే భగవద్గీతని వదిలేసి పొరుగు దేశాలనుంచి వచ్చే పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలను చదువుతుంటాం’’ ‘‘భగవద్గీత అంటే కర్తవ్యబోధ. దాన్ని చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టి వినిపిస్తే ఉపయోగమేమిటో అర్థం కాదు. ఇది ఉత్తమ జీవన విధానమార్గాన్ని వివరించే పాఠం. వ్యక్తిత్వ వికాస గ్రంథం. అంతేగానీ మరణానికి సంకేతం కాదు’’ ‘‘భగవద్గీత లెక్కల సబ్జెక్టులాంటిది. అర్థమైతే ఈజీయే’’ శ్రీకృష్ణుడి విశ్వరూపం చూస్తూ అర్జునుడు చెప్పిన శ్లోకాలలోని భావోద్వేగం గంగాధరశాస్త్రి గాత్రంలో అద్భుతంగా పలికింది. ఆ రాగ మాధుర్యం నన్ను తన్మయుణ్ణిచేసింది. -ఎ.పి.జె అబ్దుల్ కలాం, భారత మాజీ రాష్ర్టపతి గంగలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం అంటారు. ఇప్పుడు ఆ గంగాధరుడే సంపూర్ణ గీతాగాన గంగలో మనల్ని స్నానం చేయించి ఎంతో పుణ్యాన్నిచ్చారు. ఆయన పాడిన విశ్వరూపం వింటే భగవానుడి విశ్వరూపం కళ్ళముందు సాక్షాత్కరించినట్టనిపించింది. ఇంతగొప్ప అనుభూతినిచ్చిన గానాన్ని నేనింతవరకూ వినలేదు. - ఇ.ఎస్.ఎల్. నరసింహన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్