గీతాసారం...వ్యక్తిత్వ వికాస భాండాగారం... | Bhagavatgita.. a personality development book | Sakshi
Sakshi News home page

గీతాసారం...వ్యక్తిత్వ వికాస భాండాగారం...

Published Wed, Aug 28 2013 1:39 AM | Last Updated on Sat, Aug 11 2018 8:29 PM

గీతాసారం...వ్యక్తిత్వ వికాస భాండాగారం... - Sakshi

గీతాసారం...వ్యక్తిత్వ వికాస భాండాగారం...

మొన్నటిదాకా సినిమా పాటలతో ఊపిరిసలపకుండా ఉన్నారు... స్టేజ్, టీవీ షోలలో వ్యాఖ్యాతగా రాణించారు...ఘంటసాల గానానికి చిరునామా అయ్యారు... గాయకుడిగా తన గానానికి శాశ్వతత్వాన్ని చేకూర్చే బృహత్ యజ్ఞం ప్రారంభించారు. తెలుగు గాయకుడు ఘంటసాల ప్రారంభించిన యజ్ఞాన్ని తిరిగి తెలుగు గాయకుడే పూర్తిచేశారనిపించుకున్నారు.
 ఆ మహత్కార్యమే సంపూర్ణ భగవద్గీతా గానం. ఒక గాయకుడు ఒక ప్రామాణిక గ్రంథాన్ని స్వీయ సంగీతంలో, తాత్పర్యసహితంగా సంపూర్ణంగా గానం చేసి అత్యాధునిక సాంకేతిక విలువలతో రికార్డు చేయడం భారతదేశ సంగీత చరిత్రలో ఇదే ప్రథమం. గీతాసారాన్ని లక్షలాదిమంది ప్రజలలోకి తీసుకువెళ్లాలనే ఉన్నత లక్ష్యంతో పనిచేస్తున్న ఎల్వీ గంగాధరశాస్త్రితో కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ...
 
 గంగాధర శాస్త్రి
 పరిచయం విద్య: బి.ఎ, కర్ణాటక శాస్త్రీయ సంగీతం
  తల్లిదండ్రులు: శ్రీలక్ష్మి, కాశీ విశ్వనాథశర్మ
 భార్య: అర్చన
 పిల్లలు: విశ్వతేజ, కీర్తిప్రియ
 వృత్తి: 12 ఏళ్లు సినిమా జర్నలిస్టుగా పనిచేశారు.
 మొదటి సినిమా పాట: ‘నాన్నగారు’ సినిమాలో ‘చుక్కా...చుక్కా ఒకటై’
 స్వస్థలం: కృష్ణా జిల్లా, అవనిగడ్డ
 
     కృష్ణుడు... బాల్యమంతా అల్లరి పనులు చేసి చిలిపి కృష్ణుడయ్యాడు. యవ్వనంలో గోపికలను అలరిం చాడు, యుద్ధసమయంలో పాండవులు గెలవడానికి సమన్యాయం పాటించలేదా అనిపించేలా చేశాడు. పలు సందర్భాల్లో సాధారణ మానవుడిగా అనిపించిన కృష్ణుడిని దేవుడిగా కొలవడాన్ని కొందరు సంశయిస్తారు. దీన్నెలా తీసుకోవాలి? అసలు కృష్ణతత్వం ఏమిటి?
 పసివానిగా ఉన్నప్పటి నుంచే అందరూ కృష్ణుడిని దేవుడిగా కొలిచారు. మన్నుతిన్నాడని నోరుతెరవమంటే నోటిలో 14 భువనభాండాలను చూపించాడు. తల్లి మొదలు అందరూ ఆయనలో పరమాత్ముణ్ణే చూశారు... ఒక్క కౌరవులు తప్ప! ధర్మచింతన చేసిన వారందరూ తమ జ్ఞానదృష్టితో చూడగలిగితే మానవుడిలో మాధవుడు కనిపిస్తాడు. లేదంటే కౌరవులకు కనిపించినట్టు మానవుడే కనిపిస్తాడు. మనకి ఆ జ్ఞానదృష్టి కావాలంటే భగవద్గీతను చదవాలి... అప్పుడే ఆయన పరమాత్ముడిగా కనిపిస్తాడు... అనిపిస్తాడు.  
 
     భగవద్గీత పరిచయభాగ్యం మొదట మీకెలా కలిగింది?
 ‘సంస్కృతం నేర్చుకుంటే నాలిక తిరుగుతుంది. ఆ తర్వాత బతుకు తిరుగుతుంది’ అంటూ చిన్నతనంలో శ్లోకాలు, స్తోత్రాలు నేర్పించింది మా అమ్మ. బతుకు తిరగడమంటే అప్పట్లో నాకర్థం కాలేదు. కానీ భగవద్గీత రికార్డింగ్‌లో శ్లోకాలు తేలిగ్గా ఉచ్చరించగలుగుతున్నప్పుడు మా అమ్మ వేసిన పునాది విలువ ఏమిటో అర్థమయ్యింది. స్కూలు రోజుల్లో కాస్త ఖాళీ దొరికితే ఆకుల వేంకటరత్నారావు మాస్టారు భగవద్గీత శ్లోకాలూ, పాలపర్తి సుబ్బారావు మాస్టారు సంస్కృతమూ నేర్పించేవారు. హైదరాబాద్ వచ్చాక సినిమా జర్నలిస్ట్‌గా పనిచేశాను. అడపాదడపా సినిమా పాటలు పాడుతూ దేశ విదేశాల్లో కచేరీలు చేస్తూ చాలా బిజీగా ఉన్న సమయంలో ఒకసారి  భారవిగారు సంపూర్ణ భగవద్గీత చేయమని సూచించారు. ‘భగవద్గీత’ సాగరంలోకి దూకాలనే నిర్ణయం తీసుకోడానికి సంవత్సరకాలం ఆలోచించాను. ఆ నిర్ణయం తీసుకున్నాక మిగతావన్నీ  వదిలేసి ఆరేళ్లపాటు గీతాగాన తపస్సులో ఉండిపోయాను.  
 
     ఘంటసాలగారు పాడిన ‘భగవద్గీత’ ఉండగా మళ్ళీ మీరెందుకు సాహసించారు?
 సంపూర్ణ భగవద్గీత చేయడమంటే వ్యయప్రయాసలతో కూడిన సాహసం. అదీగాక ఎదురుగా ఘంటసాల భగవద్గీత హెచ్చరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ‘భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలలో ఘంటసాలగారు 108 శ్లోకాలే పాడారు. మొత్తం 700 శ్లోకాలూ పాడి ఘంటసాలగారికీ, ఈ దేశానికీ, తెలుగుజాతికీ అంకితం చేయడంకంటే గాయకుడిగా మీ జన్మకి సార్థకత ఇంకేముంటుంది...ఆలోచించండి’ అని భారవిగారు అన్నప్పుడు పొంగిపోయి ‘నేను కరెక్టు’ అని అనుకోలేదు. శ్లోకాలు రికార్డు చేశాక అభిప్రాయం కోసం ఘంటసాలగారి సతీమణి సావిత్రిగారికి, అక్కినేని నాగేశ్వరరావుగారికి వినిపించాను. ఇద్దరూ ఒకటే మాటన్నారు... ‘ఘంటసాలగారి వయస్సు ఓ పదేళ్లు తగ్గించుకుని పాడినట్టుందని..’. ‘హమ్మయ్య పాసయ్యాను’ అనుకున్నాను.
 ఘంటసాలగారితో హెచ్‌ఎమ్‌వి సంస్థ 108 శ్లోకాలు తాత్పర్యసహితంగా, కొద్దిపాటి వాద్యాలతో, స్టీరియోలో రికార్డు చేసి 1974లో విడుదల చేసింది. ఆ స్ఫూర్తితో మొత్తం 700 శ్లోకాలను, తాత్పర్యసహితంగా, పూర్తి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, వింటున్నప్పుడు కళ్లకు దృశ్యం కనిపించేలా...అవసరమైన సౌండ్ ఎఫెక్ట్స్‌ని మేళవిస్తూ, ఇప్పటి తరాన్ని కూడా ఆకట్టుకునే విధంగా డిజిటల్ ఫార్మాట్‌లో రికార్డు చేశాం
 
      మీరు ఉద్యోగం చేస్తున్పప్పటి రోజులకీ, గీతా ప్రయాణంలో ఉన్న రోజులకీ వ్యత్యాసం కనిపిస్తుంటుందా?
 అది వ్యక్తుల కొలువులో ఉద్యోగం... ఇది పరమాత్ముని కొలువులో సద్యోగం! అది భుక్తి కోసం... ఇది ముక్తి కోసం. ‘మహత్కార్యాలు తృటిలో నెరవేరవు’ అన్నది సామెత. ‘ఇంకెంతకాలం చేస్తావు నాయనా’ అని వ్యంగ్యంగా అడిగిన వాళ్ళే థియేటర్‌కి వచ్చి విన్నాక ‘ఇంత బాగా చేయాలంటే అంత సమయం పడుతుంది మరి’ అనుకుంటూ వెళ్ళారు. దాదాపు 100 మంది పండితులు, వాద్యకళాకారులు, సాంకేతిక నిపుణులు, దాతలు... ఎందరో ఈ ప్రాజెక్టుకు సహకారం అందించారు.
     ఈ స్పీడు తరానికి ‘భగవద్గీత’ వినే టైమూ, ఆసక్తీ ఉందంటారా?
 జీవితం అంటే - పగలూ రాత్రీ తేడా లేకుండా, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదించడం అనుకునే నేటి యువతరానికి సరైన మార్గాన్ని సూచిస్తుంది భగవద్గీత. వయసుతోపాటు వచ్చే గౌరవం కంటే జ్ఞానంతో పాటు వచ్చే గౌరవం శాశ్వతమైనది. ఆ గౌరవం మనం చేసే పనుల ద్వారా ఎలా సంపాదించుకోవాలో భగవద్గీత చెబుతుంది. మనలో దాగిన ఆత్మశక్తిని మనకి చూపించి, మనల్ని మనం ఉద్ధరించుకునే శక్తినిస్తుంది గీత. బ్యాడ్‌లక్! ఇవ్వాళ ఒక సినిమా డివిడి 150 రూపాయలు పెట్టి కొంటున్నాం. అదే భగవద్గీత పుస్తకం మార్కెట్‌లో పది రూపాయలకు దొరుకుతుంది. అంటే తాత్కాలిక ఆనందం ఖరీదు.. శాశ్వతమైన జ్ఞానం చవకగా దొరుకుతోందన్నమాట. నిజమే మరి... జ్ఞానం చవగ్గా దొరక్కపోతే అందరికీ చేరదుకదా! జీవితం అంటే ఏమిటో, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్పే ‘భగవద్గీత’ లాంటి మేనేజ్‌మెంట్ గ్రంథం యువతరానికి అవసరం లేదంటారా!
 
     ‘భగవద్గీత’ ప్రాజెక్టు ఏ దశలో ఉంది, మీరు ఆశిస్తున్న ప్రయోజనం?
 700 శ్లోకాల గీతాగానం ప్రాజెక్టు పూర్తయ్యింది. మొత్తం గీతాగానం వ్యవధి 12 గంటలు. 18 అధ్యాయాలని, 18 సీడీలుగా రూపొందించాం. ‘గీతాపారాయణం’ కూడా దీనికి అనుబంధంగా ఇటీవలే రికార్డు చేశాం. ఇక ప్రయోజనం అంటారా... ఫలితాన్ని ఆశించానంటే ‘గీత’ నాకు అర్థంకానట్టే. దేవుడు కోరికని బట్టి ఇవ్వడు. అర్హతని బట్టి ఇస్తాడు. ఈ సంకల్పబలంతోనే అన్నీ వదిలేసి సంపూర్ణ గీతాగానమే ధ్యేయంగా ఆరుసంవత్సరాలపాటు, పట్టుదలతో ‘గీత’ను పూర్తిచేయగలిగాను. జీవితమంటే లక్ష్యాన్ని చేరుకోవడం ఒక్కటే కాదు, ప్రయాణాన్ని ఆస్వాదించడం కూడా. పరమాత్ముడు నాతో చేయించిన ‘గీతాపారాయణం’ అద్భుతమైన అనుభూతుల సమ్మిశ్రమం. ఇంటింటా గీతాజ్యోతిని వెలిగించాలి... అప్పుడే భారతదేశం పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది. ఇదే నేనాశిస్తున్న ప్రయోజనం.
 
     ఒక గాయకుడు ఇంత పెద్ద ప్రాజెక్టుని తలపెట్టి పూర్తి చేయడం ఒక రికార్డేమో కదా!
 మీరంటున్నది ‘గిన్నిస్’ గురించేగా! మనం చేస్తున్నపని, చేరాలనుకుంటున్న రికార్డుకంటే చిన్నదైతే అప్పుడు రికార్డులు గొప్పవవుతాయి. నా దృష్టిలో భగవద్గీత విశిష్ట గ్రంథం - గిన్నిస్‌బుక్ విచిత్ర పుస్తకం. గ్రంథాన్ని తీసుకువెళ్ళి ఎవరైనా పుస్తకంలోకి ఎక్కిస్తారా!
 నా జీవితంలో భగవద్గీత ఒక ప్రాజెక్టు అనుకున్నాను. ఇది పూర్తయ్యే సమయానికి నాకు తెలీకుండా భగవద్గీతే జీవితమైపోయింది. వీలైనన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించి విడుదల చెయ్యడం నా తదుపరి కర్తవ్యం. వీలైనంత ప్రచారం కూడా అవసరం. ‘భగవద్గీత’ ద్వారా వ్యక్తిత్వాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో చెబుతూ ఇప్పటికే ఆంధ్రరాష్ర్టంలోని చాలా కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు మోటివేషన్ లెక్చర్స్ ఇస్తున్నాను.
 
 - డా.పురాణపండ వైజయంతి
 ‘‘ఐదువేల సంవత్సరాల క్రితం మతాలే ఆవిర్భవించని కాలంలో, శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని ప్రపంచంలోని మానవులందరికీ పంచిపెట్టిన జ్ఞాన భాండాగారమే గీత’’
 ‘‘కస్తూరి మృగం తన నుంచే పరిమళం వస్తోందన్న విషయం తెలీక ముక్కుపుటాలు ఎగరేసుకుంటూ అడవంతా తిరుగుతూ ఉంటుందట! మనమూ అంతే. పక్కనే భగవద్గీతని వదిలేసి పొరుగు దేశాలనుంచి వచ్చే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పుస్తకాలను చదువుతుంటాం’’
 ‘‘భగవద్గీత అంటే కర్తవ్యబోధ. దాన్ని చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టి వినిపిస్తే ఉపయోగమేమిటో అర్థం కాదు. ఇది ఉత్తమ జీవన విధానమార్గాన్ని వివరించే పాఠం. వ్యక్తిత్వ వికాస గ్రంథం. అంతేగానీ మరణానికి సంకేతం కాదు’’ ‘‘భగవద్గీత లెక్కల సబ్జెక్టులాంటిది. అర్థమైతే ఈజీయే’’
 
 శ్రీకృష్ణుడి విశ్వరూపం చూస్తూ అర్జునుడు చెప్పిన శ్లోకాలలోని భావోద్వేగం గంగాధరశాస్త్రి గాత్రంలో అద్భుతంగా పలికింది. ఆ రాగ మాధుర్యం నన్ను తన్మయుణ్ణిచేసింది.
 -ఎ.పి.జె అబ్దుల్ కలాం, భారత మాజీ రాష్ర్టపతి
 
 గంగలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం అంటారు. ఇప్పుడు ఆ గంగాధరుడే సంపూర్ణ గీతాగాన గంగలో మనల్ని స్నానం చేయించి ఎంతో పుణ్యాన్నిచ్చారు. ఆయన పాడిన విశ్వరూపం వింటే భగవానుడి విశ్వరూపం కళ్ళముందు సాక్షాత్కరించినట్టనిపించింది. ఇంతగొప్ప అనుభూతినిచ్చిన గానాన్ని నేనింతవరకూ వినలేదు.
 - ఇ.ఎస్.ఎల్. నరసింహన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement