కూచిపూడితో టీచింగ్
కర్ణాటక సంగీతం మొదలు కూచిపూడి, భరతనాట్యం, కథక్, టెంపుల్‌డాన్స్ నేర్చుకుంది అచ్యుత మానస. నేర్చుకున్న కళను అద్భుతంగా అభినయించి అటు గురువుల ఆశీస్సులను, ఇటు ఆహుతుల ప్రశంసలనూ అందుకుంటోంది. ఇంకోవైపు అకడమిక్స్‌లోనూ చురుకుగానే ఉంది. ఇంజనీరింగ్ పూర్తిచేసి ఎమ్‌ఎన్‌సీలో ఉద్యోగమూ సంపాదించుకుంది. తన తండ్రి రవిచంద్ర (డిఐజీ)లాగే సివిల్స్ జాయిన్ అవ్వాలన్నది ఆమె ధ్యేయం. ఆ అభ్యాసమూ మొదలుపెట్టింది. 2010 వరకు ఇంకో ఆలోచనేదీ లేకుండా తన లక్ష్యసాధన దిశగా ప్రయాణం సాగింది. ఆ తర్వాత...
ఆగస్ట్ 15, 2010. అప్పుడు మానస వాళ్ల నాన్న ఉద్యోగరీత్యా గుంటూరులో ఉన్నారు. పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు తల్లి,తండ్రీ సహా తనూ హాజరైంది. స్టేట్‌హోమ్‌లోని పిల్లలు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన వందేమాతరం పాటమీద డాన్స్ చేశారు. మానస మనసు చివుక్కుమంది. తర్వాత ఒక ఈవెంట్‌లో క్లాసికల్ డాన్స్ అని ‘చంద్రముఖి’ సినిమాలోని పాట మీద చేశారు. ‘పిల్లలు కదా ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. అదే క్లాసికల్ డాన్స్ అంటే నమ్ముతారు వాళ్లకేం తెలుసు’ అని అప్పటికైతే సరిపెట్టుకుంది కానీ మనసొప్పలేదు.
ఆ పిల్లలకు శాస్త్రీయ నృత్యం నేర్పించాలనే తపన మొదలైంది. స్టేట్‌హోమ్‌కి వెళ్లింది. పిల్లలను పరిచయం చేసుకుంది. అసలు క్లాసికల్ డాన్స్ ఎలా ఉంటుందో చెప్పింది.. చేసిచూపించింది. జనవరి 26కల్లా వందేమాతరం పాటమీద కూచిపూడి నేర్పించింది. ప్రదర్శన ఇప్పించింది. ‘డాన్స్ అనగానే సినిమా పాటలమీద చేస్తాం’ అనే పిల్లల మైండ్‌సెట్‌ను మార్చేసింది. వాళ్లకోసం ఇంకేదో చేయాలనుకునేలోపే వాళ్ల నాన్నకి హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ అయింది.
హైదరాబాద్‌లో..
గుంటూరు స్టేట్ హోమ్ ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడి స్టేట్‌హోమ్ పిల్లలకూ డాన్స్, సంగీతం నేర్పించాలనుకుంది మానస. కథలు, పాటలతో మొదలుపెట్టి మెల్లగా అడుగుల్లోకి వచ్చింది. ‘కూచిపూడి మై లైఫ్’ అనే పేరుతో ఆ పిల్లలకు శాస్త్రీయ నృత్యం నేర్పిస్తూ శాస్త్రీయ కళల పట్ల అవగాహన కలిగిస్తోంది.
‘‘చదువు, జ్ఞానం రెండూ వేర్వేరని నా ఉద్దేశం. చదువు ఎవరైనా నేర్పిస్తారు. జ్ఞానం కళల వల్ల అబ్బుతుంది. బతకడానికి కావల్సిన ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఈ పిల్లలకు అవి చాలా అవసరం. ఈ లోకంలో తమకెవరూ లేరని, తమనెవరూ చూడరనే ఆత్మన్యూనతలోంచి లోకం తమ దృష్టిని వీరిపై మరల్చుకునే స్థితికి రావడానికి ఈ కళ వీళ్లకు ఒక సాధనంగా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. మొదట్లో ఈ పిల్లలు నాతో చాలా రూడ్‌గా ఉండేవారు. వాళ్లలో ఒక రకమైన కసి కనిపించేది. వీళ్లను డీల్ చేయగలనా? అనుకున్నాను. కానీ తర్వాత్తర్వాత నాకు మంచి స్నేహితులైపోయారు. ఈ పిల్లలతో గడిపినంత సేపు అలౌకిక ఆనందంలో ఉంటాను. ఓ గుడిలో దొరికే ప్రశాంత కనిపిస్తుంది’ అంటుంది అచ్యుత మానస.
అయిదేళ్ల ప్రాయం నుంచే...
అయిదేళ్ల వయసున్నప్పటి నుంచే కర్ణాటక సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టింది మానస. కాస్త ఊహ తెలిసేటప్పటికి తనకు కావల్సింది ఇది కాదు డాన్స్ అనుకుంది. ఆ మాటే అమ్మతో చెపితే.. ఎన్నాళ్లు నేర్చుకుంటుందిలే.. అని డాన్స్‌లో చేర్పించింది అమ్మ. అలా కాజా వెంకట సుబ్రహ్మణ్యం దగ్గర కూచిపూడి, డాక్టర్ దేవేంద్ర పిళై దగ్గర భరతనాట్యం, పండిట్ అంజుబాబు దగ్గర కథక్, ఓలేటి రంగమణి దగ్గర టెంపుల్‌డాన్స్ నేర్చుకుంది అచ్యుత మానస.
డివీడి..
మానస గురువు అయిన కాజా వెంకట సుబ్రహ్మణ్యం నృత్యదర్శకత్వంలో ‘కూచిపూడి నృత్యాభినయ వేదిక .. నాట్యం మోక్షమార్గం’ పేరుతో చిత్రించిన డీవీడీని త్వరలోనే విడుదల చేయబోతోంది మానస. ఈ వేడుక ఆరంభవేళ కాజా వెంటక సుబ్రహ్మణ్యం కొరియోగ్రఫీలో స్టేట్‌హోమ్ పిల్లలతో నాట్యప్రదర్శన ఇప్పించబోతోంది. ‘లెర్నింగ్.. షేరింగ్.. డిస్కస్’ ఇది అచ్యుత మానస పాటించే జీవనసూత్రం. ఇదే సూత్రాన్ని స్టేట్‌హోమ్ పిల్లలకూ నేర్పించే గురుతర బాధ్యతను నిర్వర్తిస్తోంది! నిజమైన కళాసేవ చేస్తోంది!
- సరస్వతి రమ