Saraswati rama
-
కిడ్నాప్
‘‘ఇగో లచ్చయ్యా... నిజం చెప్పకపోతే మంచిగుండదు.. ఏమనుకుంటున్నవో?’’ బెదిరించాడు ప్రశాంత్. ‘‘ఏందీ... వేలు చూపిస్తే భయపడ్తమా? అసలు మా పోరడ్ని మీరంత గల్సి ఏం జేసిండ్రో చెప్పుండ్రి ముందుగల్ల...?’’ లచ్చయ్యను పక్కకు తప్పిస్తూ ప్రశాంత్‌ను నిలదీసింది సత్తెమ్మ. ‘‘ఆడిమనిషిని ముందుకువెట్టి ఉల్టా దబాయిస్తే అసలు సంగతి పక్కకువోతదనుకోకు లచ్చయ్యా..! చూస్కంట.. ఎట్ల కక్కియ్యాల్నో చూస్త..’’ అనుకుంటూ వెనక్కి వెళ్లిపోతున్న ప్రశాంత్‌ను.. ‘‘ఆ.. చూస్కపో.. మేం కూడా బయటవెస్తం మా పోరడ్ని ఏం జేష్నవో అని’’ ఉక్రోషంతో అరుస్తూ గుమ్మం బయటకు వచ్చింది సత్తెమ్మ. ఆ రాత్రి చీకట్లో అతను కనిపించకుండా వెళ్లేవరకు ఆగి.. లోపలికి వచ్చి భర్తను పట్టుకొని బోరున ఏడ్చేసింది లచ్చవ్వ...‘‘ఏం పాపం జేసినమంటవ్ మనం? అత్తగారి మాటలిని పెద్దోడు అట్ల కాకుంటవాయె.. షిన్నోడింత షెయ్కొచ్చే అని అనుకునేటాల్లకు ఈడిట్లయిపాయే.. ఏం బతుకుది.. మనకే ఎందుకిట్లయితాంది?’’ అంటూ! భార్యను ఓదారుస్తూనే ‘‘పోరడేమైమాపాయెనే’’అనుకుంటూ కలవరపడ్డాడు లచ్చయ్య. ‘‘బాపూ.. అనిల్‌గాడు మస్కట్ల పనిదొర్కతదన్నడు.. పోతనే’’ అని పట్టుబట్టిండు. మెట్‌పల్లిల ఆడంతటల ఆడే డ్రైవింగ్ నేర్సుకున్నడు.. అనిల్‌ని వట్టుకొని లైసెన్స్ తెచ్చుకున్నడు.. ఇగో.. ప్రశాంత్ తాన్నే మస్కట్ వీసాకి పైసలు గట్టిండు.. మొస్సమర్లకుండ జేసుకున్నడు ఇవన్నీ. ఆడ కంపెనీల పనిదొరికి వీసా అచ్చినరోజు పోరడి సంతోషం జూడాల.. షిన్నసన్న సంతోషం గాదు.. ‘‘బాపూ.. నువ్వేం రందివెట్టుకోకు.. మంచి జీతమే ఉందే.. పైసలు వంపిస్తా.. అమ్మ పైలం. నువ్వు సుత ఏం కష్టపడకు’’ అని చెప్పి పోయిండు అని గుర్తు చేసుకున్న లచ్చయ్య.. మళ్లీ వెంటనే ‘‘సత్తి.. పోరడేమైపాయెనే’’ అంటూ మెలకువలోనే కలవరించినట్టు అడిగాడు. భర్త తీరులో ఏదో తేడా అనిపించి ఆయన గుండెలో తలదాచుకొని ఏడుస్తున్నదల్లా ఒక్కసారిగా తలపైకెత్తి లచ్చయ్య మొహంలోకి చూసింది. అతని చూపులు ఎక్కడో ఉన్నాయి.. నిమిష నిమిషానికి అదే మాట.. ‘‘పోరడేమైపాయెనే..’’అంటూ! ‘‘ఓరి భగవంతుడా.. మల్లా ఏం కష్టం దెచ్చినవురా.. ’’ అనుకుంటూ రెండు చేతులతో తలకొట్టుకుంటూ మొత్తుకోవడం మొదలుపెట్టింది. ‘‘ అన్నా.. ఇప్పటికిప్పుడు లక్షన్నర కట్టమంటే ఎట్లా కడ్తాన్నా..’’ బతిమాలుతున్నడు ప్రశాంత్. ‘‘ఏం మజాక్ జేస్తున్నవా? బొంబై జగదీష్ అటే ఏమనుకున్నవ్ బే? బొక్కలు తెల్లగ జేస్తబిడ్డా!’’ ప్రశాంత్ కాలర్ పట్టుకొని కళ్లెర్ర జేస్తూ జగదీష్. ‘‘ నిజంగనే నాకు దెల్వదు అన్నా.. కాలర్ ఇడ్షిపెట్టన్నా.. ఎవరన్నొస్తే ఇజ్జత్ వోతది ప్లీ...’’ ప్రశాంత్ విన్నపం పూర్తికాకుండానే ‘‘ గీ ఊర్లె.. ముత్తెమంత ఆఫీస్‌కే నీకు ఇజ్జత్ ఉంటే బొంబైల రిజిష్టర్ ఏజెన్సీ బే నాది.. నాకెంతుండాలే? మస్కట్ సేuŠ‡ .. నా షెవులు విండి పైసలు వసూలు జేస్కున్నడు.. నువ్వు వంపిన పిల్లగాడు ఎయిర్పోర్ట్ నుంచి పారిపోయిండు అని. ఆ పైసలు ఎవడిస్తడు.. నీ అయ్యనా.. తాతనా? ఇజ్జతట ఇజ్జత్’’ అంటూ విసురుగా ప్రశాంత్ చొక్కా కాలర్ వదిలేశాడు జగదీష్. ఆ విసురుకి వెళ్లి అక్కడే ఉన్న గోడకు కొట్టుకున్నాడు ప్రశాంత్. అతను సర్దుకొని లేచేలోపే ఆఫీస్ టేబుల్ సొరుగు తెరిచాడు జగదీష్. అది చూసి కంగారు పడుతూ ‘‘అవి ఇంకో పిల్లగాని వీసా పైసలన్నా.. ప్లీజ్.. వారం రోజులు టైమ్ ఇయ్యి. నిన్ననే పోరడోల్ల ఇంటికి వొయ్యి ఆల్ల అవ్వ, బాపుని అడిగిన, రేపు అల్ల అన్ననీ అడిగి ఎట్లనన్న పైసలిప్పిస్త.. ప్లీజ్..’’ అంటూ సొరుగులోంచి డబ్బులు తీస్తున్న జగదీష్‌ను అడ్డుకోబోయాడు ప్రశాంత్. చేతికందిన డబ్బును వెంటనే ప్యాంట్ జేబులో కుక్కుకుంటూ అడ్డొచ్చిన ప్రశాంత్‌ను.. ‘‘చల్ బే..’’అని పక్కకు తోసేసి వెళ్లిపోయాడు జగదీష్. ‘‘సత్తెమ్మా.. మీ పిల్లగాడు మస్కట్‌కు వొయిండు. అక్కడి ఎయిర్‌పోర్ట్‌ల దిగిండు. అక్కడిదాకైతే సంగతి తెల్సింది. ఆడ్నుంచి ఏడికి వోయిండు అనేదే తెలుస్తలేదు మరి’’ ఎస్ఐ చెప్పాడు. ‘‘ఆడిదాంక వొయినోడు ఏడికి వోతడు సారూ..’’ ఏడ్చి ఏడ్చి ఎండిపోయిన కళ్లల్లో దిగులు, తడారిపోయి ఆందోళన చేరిన గొంతుతో సత్తెమ్మ. ‘‘ఇంకేంది.. పనిచూపిచ్చిన సేuŠ‡కు చెట్టాగొట్టి.. ఇంకేండికో చెక్కేసిండు’’ కసి తీర్చుకుంటూ ప్రశాంత్. ‘‘ఏయ్ ఛుప్ ’’ టేబుల్ మీద చరుస్తూ ప్రశాంత్‌ను గద్దించాడు ఎస్ఐ. ‘‘ అట్ల పొయ్యేంత తెలివిగల్లోడుకాదు సార్.. మా పోరడు’’ దీనంగా సత్తెమ్మ. ‘‘అనిల్ తప్ప ఆడెవరన్నా దోస్తులున్నట్టు... ఆడిక్కూడా కూడా పోతా అన్నట్టు ఏమన్నా చెప్పిండా మీ పొల్లగాడు?’’ ఆరా తీసే ప్రయత్నంలో ఎస్ఐ. తల అడ్డంగా ఊపుతూ ‘‘నువ్వే అనిల్‌కి ఫోన్ చేస్తివి గదా సారూ.. ఓల్లు తెల్వదు ఈడ ఆడికి.. అని అనిల్ కూడా చెప్పే కదా..’’ వివరణ ఇచ్చింది సత్తెమ్మ. రాత్రి పదకొండు... సత్తెమ్మకు నిద్ర పట్టట్లేదు. ఇంట్లోకి వాకిట్లోకి తిరుగుతోంది. ఎప్పట్లా లచ్చయ్య కలత నిద్రలో ఉన్నాడు. సెల్‌ఫోన్ మోగింది. పట్టించుకోకుండా నిరాసక్తంగా.. నిర్లిప్తంగా మంచినీళ్ల కుండ దగ్గరకు వెళ్లి.. నీళ్లు తాగింది సత్తెమ్మ. ఆగి పోయి మళ్లీ మోగడం మొదలుపెట్టింది ఫోన్. ‘‘పోలీస్ కంప్లయింట్ ఇచ్చినా ఈ ప్రశాంత్ గాడికి సోయిరాలే.. అద్దెమ్మరాత్తిర్కీ ఫోన్ చేసి సతాయిస్తుండు’’ అని సణుక్కుంటూ ఫోన్ కట్ చేయబోయింది.. కొత్త నంబర్ కనపడింది. ఆత్రంగా లిఫ్ట్ చేసింది.. ‘‘ ‘‘హలో...’’ ‘‘హలో... అమ్మా..’’ అన్న ఆ గొంతు విన్న సత్తెమ్మకు దుఃఖం ఆగలేదు. ‘‘ఒరేయ్ .. పోరడా .. ఏడికి వొయినవ్రా..’’ మాటను ఏడుపు అడ్డుకుంటూండగా అడిగింది కొడుకును. ఆ పిల్లాడు ఏడుస్తూనే ఉన్నాడు. ఎంతోసేపటికి తనను తాను నిభాయించుకుని జరిగింది చెప్పాడు. అతను మస్కట్ ఎయిర్‌పోర్ట్‌లో దిగి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసుకొని బయటకు వచ్చాడు. తనను పికప్ చేసుకునే ఏజెంట్ ఉండమన్న చోటే నిలబడ్డాడు. ఎవరో ఒకతను తననే చూస్తూ గమనిస్తూ కనిపించేసరికి అతనే తనను పికప్ చేసుకునే వ్యక్తి అనుకొని వెళ్లాడు. ఆ వ్యక్తీ ఈ అబ్బాయిని చూసి ఎదురొచ్చాడు. విష్ చేసి. ఈ అబ్బాయి బ్యాగ్ తీసుకొని గబగబా ముందుకు నడిచి.. వెహికిల్‌లో పెట్టాడు. అతనే ఏజెంట్ అనే నమ్మకం రూఢీ అయిపోయింది అబ్బాయికి. వెహికిల్‌లో కూర్చున్నాడు. చాలా దూరం ఎడారి గుండా ప్రయాణం చేయించి ఓ చోట దింపాడు. పాకలాంటిది ఉంది అక్కడ. ఒంటెలున్నాయి. వాటిని చూసుకోవడమే పని అన్నాడు. కాని ఆ అబ్బాయికి దొరికిన ఉద్యోగమేమో డ్రైవర్‌గా. ఏమీ అర్థంకాలేదు. అదే అడిగాడు వచ్చీరాని హిందీలో ఆ వ్యక్తిని. సమాధానంగా ఆ వ్యక్తి.. అబ్బాయిని కొట్టాడు. తర్వాత అర్థమైంది ఆ పిల్లాడికి.. కిడ్నాప్ అయ్యానని. -
ఎంత పనిజేసిండు.. పాపిష్టోడు
‘‘ప్రభాకరన్నా.. ఆడ మా అన్న తాన పైసలున్నయో లెవ్వో.. ఎన్ని తిప్పలువడ్తున్నడో ఏమో.. ఏం దెలుస్తలేదు. మా అమ్మకు దెల్వకుండ గీ పైసలు దాస్కొని తెచ్చిన.. ఎట్లనన్న జేసి మా అన్న జాడ వట్టి గీ పైసలియ్యి, ఫోన్ చెయ్‌మని జెప్పు’’ అంటూ వాళ్లమ్మ చూడకుండా కర్చీఫ్ మూటను తన చేతిలో పెట్టిన సవిత మాటలే గుర్తొస్తున్నాయ్ ప్రభాకర్‌కి. నిద్రపట్టక పక్కమీద అటూ ఇటూ దొర్లుతున్నాడు. బలవంతంగా కళ్లు మూసుకున్నాడు.. ‘‘ప్రభాకర్.. మా పిల్లిచ్చిన పైసలు పైలం. మొన్న యూరియా కాడ లైన్ల నిలవడి నిలవడి దస్కిదిని ఆల్ల బాపు పానం ఇడ్శిండు. నా మెడల పుస్తెల్తాడుంటి ఏం జేస్తదని అమ్మిన. లగ్గంకొచ్చిన పిల్లకు వనికొస్తయని కాపాయం జేసిన పైసలవి. నాకు దెల్వదనుకొని నీ షేతిల వెట్టింది. మావోడి అతపత దొరికితే మా కష్టం జెప్పుజరా..’’ కఠినంగా అన్న అనసూయవ్వ మాటలు ఛెళ్లున చరిచి.. దిగ్గున కూర్చోబెట్టాయి. బయట జోరు వాన.. కిటికీలోంచి ఈదర ఇంట్లో వాతావరణాన్ని చల్లబరుస్తున్నా... చెమటతో తడిసి ముద్దయిపోయాడు ప్రభాకర్. లేచి.. వాల్ హ్యాంగర్కున్న షర్ట్ జేబులోంచి సిగరెట్, అగ్గిపెట్టె తీసుకొని.. ఆ చీకట్లోనే దారి తడుముకుంటూ.. శబ్దం రాకుండా తలుపు తెరిచి.. వసారాలో నిలబడ్డాడు. పళ్ల కింద సిగరెట్‌ను నొక్కి పట్టి.. కసిగా అగ్గిపుల్ల వెలిగించి సిగరెట్‌కు అంటించాడు.. పశ్చాత్తాపాన్ని కాల్చిబూడిద చేసేయాలన్నట్టుంది.. సిగరెట్ పొగను ఎగబీలుస్తునప్పుడు అతని ముఖ కవళిక. పొగను ముక్కులోంచి.. నోట్లోంచి వదులుతూ పైజామా జేబులోంచి కర్చీఫ్ మూటను బయటకు తీసి గుప్పిటి తెరిచాడు. రెండు వేల నోట్ల మధ్యలో కొన్ని వందల నోట్లు.. వాటి మధ్యలో అయిదు వందల నోట్లు.. మడిచిన కట్ట. అవి ఎన్నున్నాయో కూడా లెక్కబెట్టుకున్నట్టు లేరు.. కర్చీఫ్లో కుక్కి మూటగట్టి తన చేతిలో పెట్టారు. ప్రభాకర్ కళ్లల్లో నీళ్లు.. చటుక్కున్న గుప్పిటి మూసి ఆ కర్చీఫ్ మూటను జేబులో పడేశాడు. సిగరెట్ పొగను పూర్తిగా బయటకు వదలకుండా.. గుక్క మీద గుక్క పొగను పీల్చి కాలిపోయిన ఆ పీకను బొటనవేలు, మధ్యవేలును రింగులా చుట్టి సిగరెట్నూ అల్లంత దూరంలోకి విసిరాడు. వాన చినుకులు పడి దాని సెగ ఆరిపోయింది. రెండు చేతులు పైకెత్తి చూరుకింద ఉన్న గుంజలను పట్టుకుని బయటపడ్డ సిగరెట్కేసి చూడసాగాడు తదేకంగా. మనసు గతాన్ని కళ్లముందుకు తెచ్చింది... మస్కట్‌లో ఒక ఫ్రెండ్ కలిపించిండు సురేష్‌ను. ఇంటర్ పాసై తను పనిచేస్తున్న కన్స్ట్రక్షన్ సైట్లోకే కార్ డ్రైవర్‌గా వచ్చిండు. ‘‘ఇంటర్ పాసయినవ్.. ఆడ్నే సదుకోకుండా గీడికొచ్చినవ్ తమ్మీ’’ అడిగిండు తను. ‘‘యెవులసంతోని బగ్గ అప్పులయినయ్.. షెల్లెకు పెండ్లి జెయ్యాలే.. గందుకే’’ చెప్పిండు. ‘‘పిల్లగాడు మస్తు మంచోడ్రా.. మా ఊరే. ఈడ సుత మా రూమ్‌లనే ఉంచుకున్నం’’ చెప్పిండు తన దోస్త్.. సురేష్ భుజం మీద చేయివేసి ప్రేమగా కొడుతూ! గట్ల సురేష్ తనగ్గూడా దగ్గరైండు. అటెన్కల నెలకే గా దోస్త్ ఇండియాకొచ్చి.. మల్లా సౌదీకి వోయిండు. గాని జాగల.. గా రూమ్‌లకు తను వొయిండి. సురేష్ మాలెస్సనే క్లోజ్ అయిండు. ఆల్ల బాపు, అమ్మ, సవిత ఫోన్ జేస్తే అడ్పదడ్ప తనగ్గూడ ఇస్తుండే మాట్లాడమని. ‘‘అరే.. ప్రభాకరన్నా.. మీది మా పక్కపొంటి ఊరే’’అని సవిత సంబర పడ్తుండె. ఒకసారి శుక్రవారం దేవుళ్లకు జేసుకుంటే ఊరికి వొయ్యి తన పెండ్లాం, పిల్లలనూ పండుక్కి తెచ్చుకున్నడు బాపు... ఈ తలపులతో ప్రభాకర్ కళ్లలోని నీటి ఊట చెంపల మీద నుంచి జారుతోంది. పట్టించుకునే స్థితిలో లేడు. ఎంత పనిజేసిండు.. పాపిష్టోడు.. పాపం పోరడొచ్చి ఆర్నెల్లన్న కాలే.. ఈ షేతులతోనే జైలుకి వట్టిచ్చిండు... కడుపులోంచి దుఃఖం తన్నుకొస్తుంది. ఏం జేస్తడు? తనగ్గూడా పైసలు కావాలే.. ఇంటికాడ జేసిన అప్పులు తీరాలే.. మస్కట్కొయ్యి మూడేండ్లయిందన్న ముచ్చట్నే గానీ.. యేడాద్దాకా కరెక్ట్‌గా పనే లేకుండే.. అగో గప్పుడే ‘‘ఖబ్రీ’’ గురించి దెల్సింది. ముందుగల్ల తన ఇలాఖా మనుషుల జోలికివోనేలేదు.. పాకిస్తానోల్లను, బంగ్లాదేశోల్లనే వట్టిచ్చిండు. పైస.. ఏ పాపమన్నా జేయిస్తది.. బాపు ఖీసాలకెంచి చారాణా, ఆఠాణా దొంగతనం జేసినప్పుడల్లా బాపమ్మ గొణుగుతుండే.. పైసా.. పైసా ఏం జేస్తవే అంటే అయినోడిని పగజేస్తా అన్నదట అని. నిజంగనే.. పైస మీద పావురం.. గా పిల్లగాన్ని పగ జేసింది. ఆ పిల్లగాడికి దెల్వదు.. తలనొప్పి గోళీలు గల్ఫ్‌ల బ్యాన్ అన్న సంగతి. తనకు దెల్సు అయినా చెప్పలే. రెండుమూడు పాకెట్లు దెచ్చుకున్నడు. ఎయిర్‌పోర్ట్‌ల కెంచి ఎట్ల దప్పిచ్చుకున్నడో మరి! గా పైసల ఆశ గోళీల గురించి పోలీసులకు ఖబర్ ఇచ్చేదాకా మనసునవట్టనియ్యలే. నాలుగునెల్లయితుంది సురేష్ జైల్లవడి. గా పొల్లగానిగ్గూడా దెల్వదు.. గా పనిజేసిన ఖబ్రీ ఎవరో! థూ.. గీ బతుకుల మన్నువడా... దుఃఖం ఆగలేదు ప్రభాకర్‌కు. ఏడుస్తూ కూలబడిపోయిండు. ఆ చప్పుడుకి లోపల్నుంచి బయటకు వచ్చింది అతని భార్య సువర్ణ. కళ్లు నులుముకుంటూనే.. ‘‘అయ్యో.. ఏమైందే గిట్ల కూలవడ్డవ్?’’ అంది భర్తను లేపుతూ! ‘‘గింత రాత్రి గీడున్నవ్.. మల్లా సిగరెట్టా?’’ నిద్రమత్తు పోయి కోపం వచ్చింది ఆమెకు. కాదు అన్నట్లు తలూపుకుంటూ కళ్లు తుడుచుకున్నాడు ప్రభాకర్. ఆ చీకట్లోనూ భర్త పరిస్థితి అర్థమైంది ఆమెకు. ‘‘ఏందే.. ఏడుస్తున్నవా?’’ అంది అతని దగ్గరకు వస్తూ! ‘‘ఉహ్హూ.. ఏం లేదు నువ్ పో.. పోయ్యి పండుకో’’అన్నడు మొహం ఆమెకు కనిపించకుండా పక్కకు తిప్పుకుంటూ! కానీ ఆమె వెళ్లలేదు.. నిజం తెలుసుకునే పట్టూ వీడలేదు. ‘‘మాపటికెంచి చూస్తూన్న.. గా పొల్ల, అనసూయవ్వ అచ్చిపోయిన్నుంచి నువ్వు మంచిగలేవు. నాకు అర్థమైతలేదనుకున్నవా?’’ గట్టిగానే అడిగింది. అంతే ఆమెను పట్టుకొని ఏడ్చేశాడు అతను. ‘‘అయ్యో.. ఏందే.. సురేష్కేమన్నా అయిందా ఏందీ?’’ గాభరాగా అడిగింది. ‘‘నేనే... జేష్న’’ రెండు చేతులతో గుండె మీద బాదుకుంటూ ఏడ్చాడు. బిక్కమొహం వేసింది సువర్ణ. సవిత ఇచ్చిన కర్చీఫ్ మూటను జేబులోంచి తీసి భార్య చేతిలో పెడ్తూ ‘‘గా పిల్లకు మొహం ఎట్ల జూపియ్యాల్నే’’ అన్నాడు బాధ నిండిన గాద్గదిక స్వరంతో. ఆ మూటను, భర్తను అయోమయంగా చూస్తూ అడిగింది.. ‘‘సంగతేందో నా మైండ్లవల్లేదస్సలు?’’ అని. ‘‘గా పొల్లగాడ్ని నేనే జైలుకివట్టిచ్చిన. నాలుగునెల్లైంది. ఆల్ల బాపు వోయిండని గూడా ఆడికి దెల్వదింకా!’’ అంటూ భార్యను పట్టుకొని ఏడుస్తూనే ఉన్నాడు ప్రభాకర్. ‘‘ఎంత పనిజేసినవ్? మనకిద్దరాడవిల్లలున్నరు మర్శిపోయినవా? అసలు ఎందుకు వట్టిచ్చనవ్?’’ భర్త భుజాలు పట్టుకుని నిలదీస్తోంది సువర్ణ. జవాబుగా దుఃఖమే వస్తోంది అతణ్ణించి. - సరస్వతి రమ -
తంబూరా మోగిందో.. ప్రాణం ఆగిపోవాల్సిందే!
‘‘మనమెందుకు దొంగల్లా రాత్రిళ్లు బయలుదేరాలి? ఎంచక్కా పొద్దున్నే వెళదాం’’ అంది ఇరవయ్యేళ్ల అమ్మాయి. ఒక్కసారిగా ఆ గుంపులో కలకలం. తర్జభర్జనలు. ‘‘ష్.. సైలెన్స్!’’ అంటూ గద్దించింది ఓ పెద్దావిడ. ‘‘ఈ అమ్మాయి చెప్పింది కరెక్టే. మనమెందుకు దొంగల్లా రాత్రిళ్లు వీధుల్లోకి వెళ్లాలి? సూర్యోదయానికి ముందే బయలుదేరుదాం..!’’ కొనసాగించింది ఆ పెద్దావిడ. ‘‘వీధి కుక్కలతో ప్రమాదమేమో.. ఒక్కసారి ఆలోచించండి..’’ అన్నాడు ఆ గుంపులోని ఓ నడివయసు వ్యక్తి. చిన్నాపెద్దా అంతా ఘొల్లున నవ్వారు. ‘‘హుష్షూ... ’’ అని మళ్లీ ఆ గుంపును నియంత్రిస్తూ ‘‘ప్రమాదం లేదు.. ప్రమోదం లేదు. నగర సంకీర్తనకు పొద్దున్నే అందరూ సిద్ధంకండి’’ అని చెప్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ పెద్దావిడ. ఆమె అటు వెళ్లిందో లేదో.. ఆ గుంపులో మళ్లీ సందడి మొదలైంది. ఓ పాతికేళ్లమ్మాయి తన ముందు కూర్చున్న ఆరేళ్ల పిల్ల జుట్టులోంచి పేలు తీస్తూ పొరపాటున జుట్టునూ లాగింది. ‘‘అబ్బా.. ’’ అంటూ ఆ పిల్ల ఆ పాతికేళ్లమ్మాయిని గిల్లింది ప్రతీకారంగా. ‘‘ఒసేవ్.. పేలే...’’అంటూ ఆ పిల్ల నెత్తి మీద మొట్టికాయ వేసింది ఆ పాతికేళ్లమ్మాయి. ఇంకోవైపు.. ‘‘ఒరేయ్.. నా చొక్కా వదల్రా..?’’ అంటూ పదేళ్లబ్బాయి వెంటపడ్డాడు పద్దెనిమిదేళ్ల కుర్రాడు. ‘‘ఇది నాది.. మొన్న రాత్రి నాలుగోనంబర్ వీధిలోని డాబా మీద ఆరేసుంటే ఎత్తుకొచ్చా’’ అంటూ వాడు ఆ కుర్రాడికి అందకుండా పరిగెత్తుతూనే ఉన్నాడు. ఆ చిన్న చిన్న గొడవలు, అల్లర్లు, అలకలతో ఆ పొద్దు గడిచింది. సూరీడు.. ఆ ఊరి తూరుపు కొండను ఇంకా ఎక్కలేదు. ఆ చూరు కింది వాళ్లంతా లేచి రెడీ అయిపోయారు. నుదుటన విబూది రాసుకున్నారు. నలుగురు నలుగురు కలిసి వరుస కట్టి.. ఆ సమూహంతో బయలుదేరింది. సణుగుడుగా మొదలైన సంకీర్తన.. ఊళ్లోకి వచ్చేసరికి పెద్ద రాగంగా మారింది. ఒక్కసారిగా ఆ ఊళ్లోని జనమంతా ఉలిక్కిపడి లేచారు. ఒక్క క్షణం అయోమయం. సమయం చూసుకున్నారు. అయిదు గంటలు! ఈ సంకీర్తన ఎప్పటిలా రాత్రి వస్తుందని ..నిద్రను ఎగరగొడ్తుందని.. అసలు నిద్రపోకుండా కాచుక్కూచున్నారు. ఇంకొంతమందేమో ..ఆ సంకీర్తన గుంపులో కనిపించే తమ వాళ్లను చూడ్డం కోసం కిటికీ కన్నాల్లోంచి.. చూరు సందుల్లోంచి కళ్లను వేల్లాడేశారు. అలా వేచి వేచి కళ్లు కాయలు కాచినా ఆ సంకీర్తన సమూహం రాకపోయేసరికి ఆ అలసటతో ఎప్పుడు నిద్రలోకి జారుకున్నారో తెలియనేలేదు. ఇదిగో ఇప్పుడు ఇలా.. ఆ గళంతో ఒక్కసారిగా మెలకువ వచ్చింది. ఆత్రం.. బెరుకు.. భయం.. కలవరం.. అన్నీ ఒక్కసారి చుట్టుముట్టాయి అందరినీ! రానురానూ ఆ సంకీర్తన దగ్గరవుతోంది. జనాల్లో గుబులు, అలజడి మొదలైంది. ఆ సంకీర్తన సమూహం తమ ఊరికొచ్చి వారం అవుతోంది.. ముందు రెండు రోజులు ఊరంతా బాగా ఎంజాయ్ చేసింది. తర్వాత రెండు రోజులు ఆ కర్ణకఠోర గళాలు ఊరి చెవులను చిల్లులు పడేలా చేసింది. ఆ తర్వాత నుంచి ఆ సమూహంలోని మనుషులు.. వాళ్లు చేసే పని వెన్నులోంచి వణుకు పుట్టించడం మొదలుపెట్టింది. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు.. ఎక్కడుంటున్నారో తెలియదు. భిక్షాటన చేస్తారు. భిక్షగా వాళ్లు కోరేది ఆహారాన్ని కాదు.. మనుషులను. ఈ నిజం అనుభవంలోకి వచ్చిన రెండు రోజులకే ఊళ్లో సగం మందికి వెరుపు జ్వరాలు పట్టుకున్నాయ్. ఈ మసక వెలుతురు కూడా అలాంటి భయాన్నే కలిగిస్తోంది. ఓ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే ఆ సంకీర్తన గుంపులో ఉన్న ఎనిమిదేళ్ల పిల్లాడు ఆ ఇంటి వాకిట్లో ఆగిపోయాడు. ఆ పిల్లోడి కంటే నాలుగు అడుగులు ముందుకు కదిలిన ఆ గుంపు ఆగిపోయింది. అలాగే అక్కడే నిలబడి చేతుల్లో ఉన్న తంబూర తంత్రులను ఒక్కసారిగా మీటారు శ్రుతి, లయ ఏమీ లేకుండా! ఒక్కసారిగా ఆపారు.... మళ్లీ మీటారు.. మళ్లీ ఆపారు. చివరిసారిగా మీటారు. ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయ్. ఇంట్లోని వాళ్లంతా వచ్చి గేట్ దగ్గర నిలబడ్డారు. ఆ పిల్లాడిని చూసి హతాశులయ్యారంతా! అతను ఆ ఇంటివాడే. ఆ సభ్యులకు కొడుకు, మనవడు, మేనల్లుడు, తమ్ముడు అవుతాడు. ఆ అబ్బాయి ఆ ఇంటి వైపు మొహం తిప్పకుండానే చేతిని చాచి చూపుడువేలితో ఆ సభ్యుల్లోని ఒక వ్యక్తిని చూపించాడు. ఆ వ్యక్తి ఈ అబ్బాయికి మేనమామ అవుతాడు. ఆ అబ్బాయి అలా చూపించే సరికి ఆ ఇంట్లో వాళ్లంతా ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. ఆ గుంపు అదే పనిగా శ్రుతి, లయ లేకుండా తంబూరలు వాయించడం మొదలుపెట్టింది. ఎనిమిదేళ్ల కుర్రాడు ముందుకు కదిలాడు. వెనకాలే ఆ పిల్లాడి మేనమామ అడుగులు కదిపాడు.. వణుకుతూ! సమూహం కూడా ముందుకు సాగింది. మేనమామకు గతం గుర్తుకొస్తోంది. ఆ పిల్లాడి పట్ల తను ప్రవర్తించిన తీరు గుర్తొచ్చింది. ఆ దారిపొడువునా ఆ పాశవిక తలపోతలే! ఆ గుంపులోని ఇంకో మనిషి మరో ఇంటి ముందు ఆగేదాకా సాగిన ఆ ప్రయాణంలో అతనికి తన మీద తనకే అసహ్యం వేసింది. విరక్తి కలిగింది. ఆ జీవితాన్ని అంతం చేసుకోవాలన్న కోరిక బలంగా పుట్టింది. ఆ సమూహం తంబూరాలు మీటుతూనే ఉంది.. శ్రుతిలయ తప్పి! ఆ వ్యక్తి తన చేతులతో తానే గొంతు నులుముకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఒక్కసారిగా తంబూరాల మోత ఆగింది. ‘‘ఎవరికి మూడిందో’’ అనుకున్నారు ఊళ్లోని మిగిలిన జనాలు! ఇంకో ఇంటి వాకిట్లో పాతికేళ్ల అమ్మాయి ఆగింది. నాలుగు అడుగులు ముందు ఆగిన సమూహం... మూడుసార్లు తంబూరాలు మీటింది.. ఆపింది.. ఈసారి ఆ ఇంట్లోంచి ఒక్కడే వ్యక్తి వచ్చాడు. అతను.. ఆ పాతికేళ్లమ్మాయి భర్త. మిగిలిన సభ్యులున్నా.. అతనే వచ్చాడు.. విషయమై అర్థమై! మళ్లీ తంబూరాలను వెర్రి ఆవేశంతో మీటుతూ ఆ సమూహం ముందుకు నడిచింది. అందరి తలలూ కిందకి వేసి ఉన్నాయి. అందరి మొహాలను కప్పేస్తూ కిందికి జాలువారిన ఆ జుట్టు నేలను ఊడుస్తోంది. వాళ్లను అనుసరిస్తూ క్షణంలో ఆ గుంపులో కలిసిపోయింది ఆ పాతికేళ్ల అమ్మాయి. ఆ భర్తకు పశ్చాత్తాపం మొదలైంది. మగపిల్లాడే కావాలని ఆ అమ్మాయికి నరకం చూపించాడు. హింసించాడు. తను చేసిన తప్పు తెలిసొచ్చి... గట్టిగా ఏడుస్తూ నేల మీద కూలబడిపోయాడు. వెంటనే సమూహం తంబూర నాదాల్ని తీవ్రం చేసింది.. శ్రుతిలయ లేకుండా. ఆ భర్త.. నేలమీదున్న రాయిని తీసుకొని తల కొట్టుకోవడం మొదలుపెట్టాడు. తంబూరా తంత్రులు మోగుతూనే ఉన్నాయ్.. ఆ చప్పుడికి మెదడు చిట్లేలా. తల పగిలి రక్తం చిమ్ముతున్నా ఆ నొప్పి.. బాధ తెలియట్లేదు అతనికి. అలా కొట్టుకొని కొట్టుకొని చలనం లేకుండా పడిపోయాడు ఆ భర్త! తంబూరాలూ ఆగిపోయాయి! ముందుకు నడుస్తూ నడుస్తూ ఆ సమూహమూ చీకట్లో అదృశ్యమైపోయింది... గాల్లో కలిసిపోయింది. - సరస్వతీ రమ -
చిత్రంగా అన్నీ ఒకేసారి మాయం
రాత్రి తొమ్మిది గంటలు... ఓ పదిపదిహేను మంది కల్లు ముంతలు ముందు పెట్టుకొని కూర్చుని ఉన్నారు. సాయంకాలం ఆరు గంటల నుంచి తాగుతూనే ఉన్నారు. ఆ ఊళ్లో కాని.. ఆ ఊరికి ఉన్న నాలుగు పొలిమేరల్లో కాని ఎక్కడా ఒక్క తాటి చెట్టూ లేదు.. ఈత చెట్టూ లేదు. అయినా కుండల కొద్ది కల్లును తీసుకొచ్చి అమ్ముతున్నారు.. వీళ్లు తాగుతున్నారు. ‘‘అరేయ్.. య్యీ క్షొత్త క్షళ్లు దుక్కాణం భల్లే ఉంద్షిరా... ’’ అన్నాడు ఒకడు మాటా.. శరీరమూ తూలుతూ. ‘‘అవ్వన్రర్రేయ్య్య్... ర్రెండ్రోజ్జుల్లే అయ్యింది ఈ క్షొట్టు ప్పెట్టి.. య్యెంత్ష గ్గిర్రాక్కో షూడూ.. ’’ అన్నాడు ఇంకొకడు.. చుట్టూ ఉన్న అందరినీ చూపించడానికి గాల్లోకి ఎత్తిన చేయి.. సత్తువ లేక జారిపోతుండగా! ఇంతలోకే అక్కడున్న ఇంకో నలుగురు ఏదో మాటా మాటా పెరిగి.. తాగిన మైకంలో కొట్టుకునే దాకా వెళ్లారు. అలా ఓ అరగంట గడిచింది. ఆ కల్లు రుచికి ఆ కంపౌండ్లోంచి కదల్లేకపోతున్నారంతా! తెచ్చిన పైకం అయిపోయింది. అప్పటిదాకా తియ్యగా మాట్లాడుతూ కల్లుతోపాటు మంచింగ్‌కి చేపల ఫ్రై, మిరపకాయ బజ్జీలూ వేడివేడిగా వడ్డించిన వాళ్లు కసురుకోసాగారు. ‘‘మ్మాద్ది.. ఇద్దే ఊ.......ర్రు కదా స్సామ్మీ... న్నమ్మండీ... ఈ అప్.. అప్.. య్యేందదీ... ఆ.. య్యీ అప్ప్పూపూ... ర్రేప్పట్టిద్ది క్షల్పి ర్రేప్పు క్కల్లు మ్ముంతలో పెట్షి త్తెస్స్..స్సా’’ అన్నాడు ఓ నలభై ఏళ్ల వ్యక్తి. ‘‘ ఇవ్వాళ మత్తు పీల్చుకో.. రేపు కల్లు పోస్తా.. అంటే కుదర్దు కదా సారూ. డబ్బిస్తేనే కల్లు’’ షరతు పెట్టింది కల్లుకొట్టు యజమానురాలు తన భర్తేదో మాట్లాడుతుంటే మాట్లాడనివ్వకుండా. ‘‘నేను మట్లాడబోతుంటే నువ్వెందుకు మధ్యలో వచ్చావ్?’’ భార్యను విసుక్కున్నాడు ఆ భర్త. ‘‘చూశాలే.. కిందటూళ్లలో ఏం మాట్లాడావో! ఇదిగో.. ఈ మాయదారిగాళ్ల మత్తు మాటలకు లొంగిపోయావో.. పాక పీకేసుకొని పోవాల్సిందే గానీ.. నువ్వు బో.. నేను మాట్లాడ్తా’’ అంటూ భర్తను అక్కడి నుంచి పంపించేసింది ఆమె. విసవిసా అక్కడి నుంచి వెళ్లిపోయాడు భర్త. ‘‘ఏమయ్యోయ్.. కొట్టు కట్టేస్తున్నాం గానీ యిక లేవండీ...’’ అంటూ అందరినీ అదిలించడం మొదలుపెట్టింది. రేపు డబ్బులిస్తాం.. ఈ పూటకు ఇంకాస్త కల్లు పొయ్యండని బతిమాలుకున్నారంతా. ‘‘కుదర్దు అంటే కుదర్దు’’ కరాఖండిగా చెప్పింది ఆమె. ఆ పాక తలుపు మూయబోతుంటే అందరూ కలిసి ఒక్కసారిగా దాడికి దిగారు.. ‘‘ఎలా కట్టేస్తావ్’’ అంటూ. ‘‘అయితే ఇళ్లకెళ్లి డబ్బుతేపోండి’’ అంది ఆమె నింపాదిగా! తోకముడిచారంతా. వాళ్ల వాలకం చూసి ‘‘ఇంట్లో కూడా డబ్బు లేనప్పుడు ఎందుకు ఈ అర్భాటాలు? పొండి.. సొమ్మున్నప్పుడే రండి’’ అంటూ మళ్లీ ఆమె పాక తలుపుమూయబోతుంటే.. ‘‘ఆగ్గాగ్గు..! షొ.. షొ.. ష్షొమ్మంట్టే గ్గుర్ర్... త్తొష్షింద్ది.. మాయ్యాలి.. ష్షొమ్ములు వ్వాక్కేన్నా.. డబ్బ్లు ఇష్షే ద్దాక్కా...’’ అన్నాడొక ముప్పై అయిదేళ్ల వ్యక్తి. ‘‘డబుల్ ఓకే.. ఇప్పుడు తెస్తావా?’’ రెచ్చగొడుతూ ఆమె. ‘‘ఊ.... ’’ అంటూ తూలుతూ.. కనురెప్పలు మూస్తూ తెరుస్తూ అక్కడి నుంచి కదిలాడు అతను. ‘‘మీరు కూడా మీ ఆడోళ్ల సొమ్ములు తెచ్చి ఈ కల్లుకోసం తాకట్టు పెట్టుకోవచ్చు’’ అంది టేబుల్ మీదున్న కల్లు సీసాలను చూపిస్తూ ఆ యజమానురాలు. అంత మత్తులోనూ ఇళ్లకు వెళ్లడానికి వాళ్లు తటపటాయిస్తుంటే.. ‘‘ఈ కల్లు కావాలంటే సొమ్ము తేవాల్సిందే. మీ ఇష్టం.. తెస్తామంటే.. మీరొచ్చేదాకా కొట్టు మూసేయను’’ హామీ ఇస్తున్నట్టు చెప్పింది ఆ యజమానురాలు. భరోసాతో వాళ్లు ఇళ్లకు వెళ్లారు. పొద్దంతా కష్టం చేసొచ్చి.. అలసిపోయి పడుకున్న భార్యల, తల్లుల మెడలో ఉన్న బంగారు తాళి, కాళ్లకున్న వెండి కడియాలు, పిల్లల కాళ్లకున్న వెండి పట్టీలు అన్నిటినీ తీసుకెళ్లిపోయారు ఆ మదిర కోసం. ఆ రాత్రంతా కల్లుతాగి మత్తులో ఆ పాకముందే మట్టిలో చిత్తుగా పడిపోయారు. తెల్లవారింది... నిద్రలేచిన ఆడవాళ్లు ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉండడంతో ముందు ఉలిక్కిపడ్డారు. తర్వాత ‘‘ఈ దొంగ సచ్చినోళ్లు తప్పతాగి ఏ రాత్రో వచ్చి అన్నం తినడానికి తలుపులను తన్ని ఉంటారు’’ అనుకుంటూ ఉన్న ఆ రెండు గదుల ఇంటిలో ముందు గదిలో చూశారు. వసారాలోనూ చూశారు. కనిపించలేదు. వంటింట్లో అన్నం తిన్న ఆనవాళ్లూ కనిపించలేదు. ఇంటికొచ్చిన వాళ్లు ఆ మైకంలో మళ్లీ ఎక్కడికి వెళ్లిపోయారో అనుకుంటూ పనుల్లో పడ్డారు. కాసేపటికే పిల్లలు.. ‘‘అమ్మా.. పట్టీల్లేవు’’ అంటూ ఏడుస్తూ తల్లుల దగ్గరకు వచ్చారు. ‘‘అరే రాత్రికి రాత్రే ఏమయ్యాయి? పైగా ఆ ఊళ్లోని ఇళ్లల్లోని పిల్లలందరి కాళ్లకు ఒకేసారి ఎలా పోతాయి? దొంగలు పడ్డారా?’’ అని సంశయిస్తూ తమ మెడలను తడుముకున్నారు ఆ స్త్రీలు. తాళి లేదు. కాళ్లనూ చూసుకున్నారు కడియాల్లేవ్’’ అంతే అందరి గుండె ఝల్లుమంది. ‘‘దొంగలు పడ్డారా ఏంటీ?’’ అనుకుంటూ వీథుల్లోకి వచ్చారంతా. మాట్లాడుకున్నారు. మథన పడ్డారు. సరే.. ఇంతకీ ఊళ్లోని మగవాళ్లేరీ? ఎంత తాగుడికి బానిసలైనా అర్ధరాత్రికైనా ఇంటికి చేరేవారు. కాని చిత్రంగా ఓ రెండుమూడు రోజులగా .. ఆ కొత్త కల్లు కొట్టు వచ్చినప్పటి నుంచి వాళ్ల తీరు మారింది. గమనించినా.. తాగుబోతు నాయాళ్లు అని పట్టించుకోలేదు. ఇంటి తలుపులు బార్లా తెచిరి ఉండడం.. సొమ్ములు మాయమవడం.. ఆలోచిస్తుంటే కంక్లుజన్ దొరికింది వాళ్లకు. అంతే చీపురు కట్టలు, పొయ్యిలో కర్రలు, రోకలిబండలు తీసుకొని ఆ స్త్రీ దండు కొత్త కల్లు కొట్టు దగ్గరకు పరిగెత్తారు. వాళ్లు అక్కడికి చేరే సరికి ఆ ఊరి మగవాళ్లంతా సోయిలేకుండా పడి ఉన్నారు.. అక్కడ కల్లు కొట్టు కాదు కదా.. కనీసం ఆ ఆనవాలే లేదు. ఖంగుతిన్న మహిళామణులు అదే చీపుర్లతో భర్తలను తట్టి నిద్రలేపారు. మత్తు వీడిన వాళ్లూ హతాశులయ్యారు. ‘‘ఈ ఊరు బాగా వర్కవుట్ అయిందిరా డింభక్! మీ అమ్మ భలే యాక్ట్ చేసింది. లేకపోతే ఈ సొమ్ములు వచ్చేవి కావు’’ అన్నాడు అతను. ‘‘ఈ రాత్రే ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నామా?’’ అడిగింది భార్య. ‘‘ఈ రాత్రే ఏంటీ.. ఇప్పుడే రండి నాతో’’ అంటూ ఆ ఊరి శ్మశానంలోని మర్రి చెట్టు మీద నుంచి గాల్లోకి ఎగిరాడు అతను. ఆ వెంటే అతని కుటుంబమూ గాల్లోకి ఎగిరింది. - సరస్వతి రమ -
అది జడ కాదు.. ఉరితాడు
‘‘వావ్... వండర్ఫుల్.. వాట్ ఏ ప్లేస్!’’ అన్నాడు ధర్మసాగర్.. చుట్టూ ఉన్న ప్రకృతిని ఆహ్వానిస్తున్నట్టుగా రెండు చేతులూ గాల్లో చాపి.. గుండె నిండా గాలిపీల్చుకొని ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ . ఏటవాలు ప్రాంతం పక్కనే నది.. మూడు పాయలుగా చీలిపోతూ.. మళ్లీ కలుస్తూ జడలా! చుట్టు పక్కల పచ్చని చెట్లు.. కనుచూపు మేరలో ఉత్తర దిక్కున కొండలు.. అద్భుతం! ఆ చోటుకి ఆయన రావడం అయిదోసారి అతను ఇండియాకు వచ్చిన ఈ ముప్పై రోజుల్లో. ‘‘ఇన్నాళ్లూ ఈ చోటు నా కంట పడకుండా ఎలా ఉంది అవినాశ్?’’ ఆశ్చర్యపోతూ ధర్మసాగర్. ‘‘కొండల్లో దాక్కొని సర్’’ వెటకారంగా అవినాశ్. ఆ వెటకారాన్ని గ్రహించే స్థితిలో లేడు ధర్మసాగర్. తన మనసులోని పథకం పేపర్ మీద బ్లూప్రింట్‌గా మారిన తీరును.... తెల్లవారి అదే ప్లేస్‌లో తన ఫ్యాక్టరీకి జరగబోయే శంకుస్థాపనను తలుచుకుంటున్నాడు. ఉప్పొంగుతోంది సంతోషం! అతని యాటిట్యూడ్ చిరాగ్గా ఉంది అవినాశ్‌కు. ఆ అబ్బాయి తండ్రి, తాతకు ధర్మసాగర్ వాళ్ల కుటుంబంతో అనుబంధం ఉంది. ధర్మసాగర్ వాళ్ల పొలాలను అవినాశ్ తాత, తండ్రే చూసేవారు. ఆ స్నేహంతోనే ఇప్పుడు తనతో ఈ అన్యాయాన్ని చేయిస్తున్నారనే కోపం, బా«ధను వెటకారంగా బయటపెడ్తున్నాడు అవినాశ్. ‘‘ఇంత వేగంగా.. ఇంత ఈజీగా అయిపోతుందని అనుకోలేదు తెల్సా?’’ ధర్మసాగర్ మాటతో ఆలోచనల్లోంచి బయటపడ్డాడు అవినాశ్. ‘‘సర్... ’’ అన్నాడు రెండు దవడలూ నొక్కిపడుతూ. ‘‘ఇదే అమెరికాలో, యూరప్‌లో అయితే ఎన్వారాన్మెంట్కి హార్మ్, ఇన్హ్యూమన్థింగ్ అంటూ సవాలక్ష ఆంక్షలు.. వేలకోటి పర్మిషన్ల హార్డిల్స్తో మొండిచెయ్యి చూపించేశాళ్లు’’ ధర్మసాగర్. ‘‘ఇక్కడైతే డబ్బు పడేస్తే చాలు పర్మిషన్లు వచ్చిపడ్డాయ్ కదా సర్’’ వెటకారంగానే అవినాశ్. ఎప్పటిలాగే పట్టించుకోలేదు ధర్మాసాగర్. ‘‘అవును.. నేనుకున్నదానికంటే కూడా తక్కువ ఖర్చులో నా ఫ్యాక్టరీకి పర్మిషన్ వచ్చింది’’ అని ముక్తాయింపు ఇచ్చి.. ‘‘అవినాశ్...’’పిలిచాడు. ‘‘సర్.. ’’ అయిష్టం «ధ్వనించింది ఆ స్వరంలో. అక్కడ ఏ కొత్త మనిషి ఉన్నా దాన్ని పసిగట్టేవాడే. కాని ధర్మాసాగర్కే పట్టడంలేదు. ‘‘అదిగో.. అక్కడ.. జలవిహార్ లాంటిది ప్లాన్ చేస్తా భారీ ఎత్తున. ఇదిగో ఇటు వైపు రిసార్ట్స్.. ’’ అంటూ నది మూడు పాయల తీరాలను చూపిస్తూ ధర్మాసాగర్ చెప్తూంటే అతణ్ణే తీక్షణంగా చూడసాగాడు అవినాశ్. ‘‘ఒరేయ్.. తెలియకుండానే మన కుటుంబానికి అంతోఇంతో సాయం చేశాడు ఆయన. నీ చదువుకీ కాస్తోకూస్తో ఆయన పరపతిని ఉపయోగించుకున్నాం. ఇప్పుడు నువ్వు మొండికేసినా... అతను ఆ ప్రాజెక్ట్ ఆపడు. ఇంకా పెద్ద స్థాయికి వెళ్లయినా తెచ్చుకోగలడు. వాళ్లంతా కూడితే అరాచకమేరా! ఆ ఊరివాళ్లు మరింత ఇబ్బంది పడ్తారు. నేను చెప్పేది చెప్పా.. ఆనక నీ ఇష్టం’’ అంటూ పెద్ద బండను తన నెత్తిమీద పెట్టాడు తండ్రి. నిదానంగా విశ్లేషించుకున్న అవినాశ్‌కు తండ్రి చెప్పిందీ కరెక్టే అనిపించింది. తను కాదంటే ఇంకా పై స్థాయికి వెళ్లి మరింత నాశనం చేస్తాడు ఆ ఊరిని. తన పరిధిలోనే కానిస్తే పోతుంది అని వీలైనంత తక్కువ నష్టం జరిగేలా ఆ ఫ్యాక్టరీ ప్లాన్‌ను తయారు చేయించాడు. అయినా జరగబోయేది మామూలు నాశనం కాదు.. గలగలపారే ఆ నది విషం అయిపోతుంది. పండే పంటలు, ఆ పరిసరాల్లోని గాలి, చెట్టు, చేమ.. గొడ్డు, గోద.. మనుషులు అన్నీ.. అంతా.. అందరూ విషమే! అవినాశ్ కళ్లల్లో నీళ్లు.. అటు తిరిగి తన రెండు చేతులను చూసుకున్నాడు. ‘‘ఛీ.. ఈ చేతులతోనా ఈ పని చేస్తోంది’’ అనుకుంటూ తలకొట్టుకోబోతుంటే.. ఓ మెరుపు... ఎదురుగా.. నదిలో! భ్రాంతా? నిజమా? అనుకుంటూ కళ్లు నులుముకొని మళ్లీ చూశాడు. నిజమే. నదిలో అమ్మాయి.. కాదు.. నదే.. కాదు అమ్మాయి.. అవును.. కాదు.. అవును .. కాదు.. అయోమయం.. విస్మయం అవినాశ్‌లో! అర్థంకాక మళ్లీ పరీక్షగా చూశాడు. ఏమీలేదు అక్కడ. అంతా మామూలుగానే ఉంది. పాపం.. వెర్రితల్లికి జరగబోయే విపత్తేం తెలుసు? అమాయకంగా.. ప్రశాంతంగా ఎలా ప్రవహిస్తుందో?’’ బాధగా మూలిగింది అవినాశ్ మనసు! మళ్లీ ఇటు వైపు తిరిగి ధర్మసాగర్‌ను చూశాడు. అతని లోకంలో అతను ఉన్నాడు. సూర్యాస్తమయం అయింది. పక్షులన్నీ గోల చేస్తూ గూళ్లకు చేరుతున్నాయి. పడమటి ఎర్రటి కాంతి నీళ్లల్లో ప్రతిబింబిస్తోంది. అదోరకంగా మారిపోయింది వాతావరణం. అక్కడ ఉండాలనిపించలేదు అవినాశ్‌కు. ‘‘పొద్దు పోయింది.. వెళదాం సర్.. చిట్టడవే అయినా.. చీకటి పడితే ప్రమాదమే’’ అంటూ జీప్ వైపు నడిచాడు అవినాశ్. కదల్లేక కదల్లేక కదులుతూ అవినాశ్‌ను అనుసరించాడు ధర్మసాగర్. చిట్టడవి దాటగానే.. ఓ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గెస్ట్‌హౌస్‌లో ధర్మసాగర్ బస. తన రూమ్ కిటికీలోంచి చూస్తే.. నది కనిపిస్తుంది. వెన్నెల్లో మెరిసే దాని సోయగాన్ని కళ్లల్లో నింపుకోవచ్చు. ధర్మసాగర్‌ను ఆ గెస్ట్‌హౌస్‌లో దింపేసి ఊళ్లోకి వెళ్లిపోయాడు అవినాశ్. రాత్రి.. భోజనాలయ్యాక.. కిటికీ దగ్గరున్న స్టడీ టేబుల్ ముందు కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. తన బ్లూ ప్రింట్‌ను టేబుల్ మీద పరిచి అంగుళం అంగుళం తడిమిచూసుకున్నాడు. కళ్లద్దాలు ముక్కు మీదకు జారుతోంటే పైకి తోసుకుంటూ ప్రతి చిన్న డీటైల్నూ మళ్లీ మళ్లీ సమీక్షించుకున్నాడు. ‘‘పర్ఫెక్ట్’’ అనుకుంటూ నిద్రకుపక్రమించాడు. హోరు.. గర్జించట్లేదు.. రొద పెడ్తోంది. మెదడును డిస్టర్బ్చేసే రొద! చలి.. శరీరాన్ని గడ్డకట్టించే చలి! అంతకంతకూ ఎక్కువై.. ధర్మసాగర్‌ను నిద్రలేపింది. కళ్లు తెరిచి చూశాడు.. ఏమీ అర్థం కాలేదు. లేచినిలబడ్డాడు. ఎక్కడో ఆరుబయట ఉన్నట్టు మాత్రం తెలుస్తోంది.. వెన్నెల వెలుతురును బట్టి. చుట్టూ పరికించాడు. ‘‘అర్రే.. తను ఫ్యాక్టరీ కట్టే స్థలం..!’’ అనుకుంటూ ఎదురుగా చూశాడు. నది లేదు. కళ్లు చిట్లించి మరీ చూశాడు. ఇసుక తిన్నెలు తప్ప నీటి జాడే లేదు. చుట్టురా తిరిగాడు. చెట్టు, చేమ, కొండలు, గుట్టలు.. అన్నీ అలాగే ఉన్నాయ్. నది.. దాని మూడు పాయలు తప్ప! ఎవరో తోసేసినట్టు దబ్బున కిందపడ్డాడు ‘‘అబ్బా.. అని నడుం పట్టుకుంటూ తలెత్తాడు.. షాక్! అంటే.. అంటే.. తను ఇప్పటిదాకా.. నోరు తెరిచాడు.. మాట పడిపోయింది. తెల్లని చీరలో ప్రశాంత వదనంతో ఓ స్త్రీ మూర్తి... నదిని మూడు పాయలుగా చేసి అల్లిన జడతో! ధర్మాసాగర్ కిందపడేదాకా ఆ జడలోనే ఉన్నాడు. ఇక్కడికి అతణ్ణి తీసుకొచ్చిందీ ఆ జడే! ఆ స్త్రీ.. ఒక్కసారిగా వెనకనున్న జడను ముందుకు వేసింది తలను కాస్త కదిపి.. అంతే ఆ ఇసుకతెన్నెలను మీంచి పరవళ్లు తొక్కుతూ ఆ చెట్టూచేమా పాదాలను తాకుతూ.. ఉప్పెనై ముందుకొచ్చింది.. చెవులు చిల్లులు పడే ఘోషతో ! ధర్మసాగర్... వణికిపోతున్నాడు. ఆమె మొహంలో చిరునవ్వు చెదరలేదు. నవ్వుతూనే ఆ ఏటవాలు ప్రాంతాన్ని.. దాని మీదున్న ఫ్యాక్టరీ కట్టే స్థలాన్నీ.. అక్కడ నిలబడి ఉన్న ధర్మసాగర్నూ ఆ జడలో చుట్టేసింది. ఊపిరి ఆడలేదు ధర్మసారగ్కు. వెళ్లి.. తనెప్పుడూ పరుగులుపెట్టే చోట ఆ జడను విప్పేసింది ఆ స్త్రీ మూర్తి. తెల్లవారింది.. ఎప్పటిలా మూడు పాయలుగా ప్రశాంతంగా సాగిపోతోంది ఆ నది. -
బీ47 గదిలో ఏముంది?
‘‘హాయ్...’’ అంటూ పక్కకు జరుగుతూ క్లాస్ రూమ్ బెంచి మీద చోటిచ్చాడు శ్రవణ్. ‘‘హలో’’ అని బదులిచ్చాడు కాని ఆ అబ్బాయి పక్కన కూర్చోవడానికి సంశయపడ్డాడు చందు. వెళ్లి వెనక బెంచీలో కూర్చున్నాడు. తర్వాత ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు వచ్చారు.. వాళ్లెవరూ కూడా శ్రవణ్ కూర్చున్న బెంచీ మీద కూర్చోలేదు. చోటు లేకపోయినా మిగిలిన బెంచీల మీదే సర్దుకున్నారు. శ్రవణ్ తప్ప ఈ బెంచీ మీద ఎవరూ లేరు. ఎందుకో అర్థం కాలేదు. తనేమైనా శుభ్రంగా కనిపించడం లేదా? నోట్లో దుర్వాసనేమైనా వస్తోందా? అని క్లాసెస్ అయిపోయాక బాత్రూమ్లోకి వెళ్లి చూసుకున్నాడు. అద్దంలో తనను తాను చూసుకుంటే మురికిగా ఏమీ కనిపించలేదు. కొత్త బట్టలు కావు కాని.. ఇస్త్రీ బట్టలే వేసుకున్నాడు. నీట్‌గానే ఉన్నాడు. కుడి అరచేయి నోటికి అడ్డం పెట్టుకొని తన శ్వాసను చెక్ చేసుకున్నాడు. చక్కగా ఉంది. మరెందుకు? అని ఆలోచించుకుంటూ క్యాంటీన్ దగ్గరకు వెళ్లాడు. క్లాస్మేట్స్ అంతా అక్కడే ఉన్నారు. శ్రవణ్‌ను చూసి కరచాలనం చేస్తూ అందరూ పరిచయం చేసుకున్నారు. పక్కన కూర్చోమంటూ చోటు చూపించారు. క్లాస్‌రూమ్‌లో వాళ్ల ప్రవర్తనకు, క్యాంటీన్లో వాళ్ల తీరుకు పొంతన లేదు. తెల్లవారి కూడా అదే పరిస్థితి. శ్రవణ్ పక్కన .. ఆ బెంచీమీద ఎవరూ కూర్చోలేదు. విరామ సమయంలో క్యాంటీన్ దగ్గర మాత్రం ఎలాంటి అరమరికల్లేకుండా.. ఆప్యాయంగా ఉన్నారు. ఎంత ఆలోచించినా ఆ తేడా ఎందుకో అర్థంకాలేదు శ్రవణ్‌కు. ఆ రాత్రి.. హాస్టల్లో .. భోజనాల దగ్గర.. రెండు రోజుల విచిత్రమైన ఎక్స్‌పీరియెన్స్ నుంచి తేరుకోని శ్రవణ్ బెరుకు బెరుకుగానే ప్లేట్లో భోజనం వడ్డించుకొని చివరన ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. కెలుకుతున్నాడు కాని ముద్ద దిగడం లేదు. ఆలోచనలన్నీ తన ఇల్లు, గడిపిన జీవితం చుట్టూనే ఉన్నాయి. పేద కుటుంబం. రెండు ఎకరాల పొలం, రెండు గదుల పెంకుటిల్లు తప్ప అరగజం జాగా లేదు ఇంకెక్కడా. ఆ వ్యవసాయం కూడా.. వానల్లేక కుంటు పడింది. చాలామంది లాగే అప్పుల బాధ భరించలేని తండ్రి పురుగుల మందు తాగి చనిపోయాడు. తల్లి తన పొలం ఇంకొకరికి కౌలుకిచ్చి కూలీగా మారింది. శ్రవణ్‌కు ఒక చెల్లి.. టీటీసీ ట్రైనింగ్‌లో ఉంది. ఈ పట్టణంలో ఆ అమ్మాయి లేడీస్ హాస్టల్లో.. తను యూనివర్శిటీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. తల్లి దగ్గర్నుంచి డబ్బులు ఆశించకూడదని ఇద్దరూ పని చేసుకుంటూ చదువుకుంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పీజీ ఎంట్రెన్స్ రాశాడు. సీట్ వచ్చింది. ఒక లక్ష్యంతో యూనివర్శిటీలోకి అడుగుపెట్టాడు. పూటకో అనుభవం ఎదురవుతోంది. క్లాస్మేట్స్ మంచోళ్లా? తను చెడ్డవాడా? గతం గుర్తొచ్చో.. నిస్సహాయత వల్లో తెలీదు కాని కళ్లల్లో నీళ్లు తిరిగాయి శ్రవణ్‌కి. అటూ ఇటూ చూసి.. గబగబా కళ్లు తుడుచుకుని తినడం మొదలుపెట్టాడు. ‘‘ఎందుకేడుస్తున్నావ్?’’ ఆ ప్రశ్న వినిపించేసరికి ఉలిక్కిపడి పక్కకు చూశాడు శ్రవణ్. ఒక అబ్బాయి... క్లాస్మేట్ అయితే కాదు. క్లాస్‌లో చూడలేదు. బహుశా.. సీనియరో.. జూనియరో..! ‘‘నేనేం ఏడ్వట్లేదు’’అన్నాడు నీళ్లు తాగుతూ శ్రవణ్. ‘‘క్లాస్‌రూమ్‌లో జరుగుతున్నదానికి హర్ట్ అయ్యావా?’’నింపాదిగా ఆ అబ్బాయి. ‘‘నీకెందుకు?’’ అన్నట్టు అతణ్ణి చూసి అక్కడి నుంచి విసావిసా వెళ్లిపోయాడు శ్రవణ్. రాత్రి...పదకొండు.. బెడ్ మీద దిండుకి చేరగిల పడి పుస్తకం చదువుకుంటున్నాడు శ్రవణ్. ఇంతలోకే ఫోన్ మోగింది. ‘‘చెల్లే అయ్యుంటుంది’’ అనుకుంటూ ఫోన్ చూశాడు. చెల్లెలే. లిఫ్ట్ చేసి.. క్షేమసమాచారాలు, ఆరోజు జరిగిన విషయాలూ మాట్లాడుకొని ఫోన్ పెట్టేశాడు. ఆవులిస్తూ పుస్తకం మూసేశాడు. బెడ్ ల్యాంప్ ఆర్పేస్తూ దుప్పటి కప్పుకున్నాడు. కాసేపటికి పక్కనుంచి గురక మొదలైంది. మంచి నిద్రలో ఉన్న శ్రవణ్‌కు కాస్త డిస్టర్బెన్స్‌గా అనిపించింది. అటు తిరిగి పడుకున్నాడు. ఈసారి ఇంకాస్త ఎక్కువైంది గురక శబ్దం. తల కిందున్న దిండును చెవులకు అడ్డంగా పెట్టుకున్నాడు. ‘‘భయపడకు.. భయపడితే ఓడిపోతావ్! సాధించాలి’’అన్న మాటలు వినిపించాయి. దిగ్గున లేచి కూర్చున్నాడు. పక్కనే చీకట్లో ఒక ఆకారం కనిపించింది. తుఫాను ఈదురు గాలుల చలిలోనూ శ్రవణ్‌కు ముచ్చెమటలు పట్టాయి. భయపడ్తూనే బెడ్‌ల్యాంప్ స్విచ్ ఆన్ చేశాడు. వెలగలేదు. వణుకుతున్న కాళ్లతోనే బెడ్ దిగి మూలనున్న ఆ గది లైట్ బటన్ నొక్కాడు. ఒక్క వెలుగు వెలిగి ఫట్‌మని శబ్దం చేస్తూ ఆరిపోయింది లైట్. ఆ లిప్తకాలంలోనే బెడ్ మీద ఉన్న ఆకారం కనిపించింది. ఆ రాత్రి డైనింగ్ టేబుల్ మీద తన పక్కన కూర్చున్న అబ్బాయే. ఇక్కెడికెలా వచ్చాడు? మిగిలినవన్నీ ఫిలప్ అయ్యి.. ఇదొక్క గదే ఖాళీగా ఉందని తనకు ఇచ్చారు. క్లాస్రూమ్ బెంచీ లాగే ఈ గదినీ తనతో షేర్ చేసుకోవడానికి ఎవరూ రాలేదు. హాస్టల్లోని అన్ని గదులూ ఒక వరుసలో ఉంటే ఈ బీ 47 ఒక్కటే.. వాటికి దూరంగా విసిరేసినట్టు ఉంటుంది. చదువుకోవడానికి ప్రైవసీ దొరుకుతుందని.. సంతోషడ్డాడు తను. ఈ గోలేంటి? భయంతో పాటు ఆలోచనలూ తీవ్రమయ్యాయి. ‘‘నేనున్న గదిలోకి వీడెక్కడి నుంచి వచ్చాడని ఆశ్చర్యపోతున్నావ్ కదూ? ఇది నా గదే.. నీ కన్నా ముందు!’’ అంటూ ఆ ఆకారం గాల్లోకి లేచి శ్రవణ్ ముందున్న స్టడీ టేబుల్ కుర్చీని కిర్రున లాక్కుంటూ అందులో కూర్చుంది. ‘‘భయపడకు. నిన్నేమనను. నీకు తోడుగా ఉండడానికే వచ్చా!’’ అంది ఆ ఆకారం. ‘‘అసలు నువ్వ్వ్..వ్వెవరూ...’’ భయంతో శ్రవణ్ మాటలు తడబడ్డాయి. ‘‘నా పేరు అంగద్. ఇక్కడే ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ చేశా. యూనివర్శిటీ ఫస్ట్ కూడా. రేపు నీ సీనియర్స్‌ను అడుగు నా గురించి. పీహెచ్‌డీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు హాస్టల్లో గొడవలు జరిగాయి. మా క్లాస్మేట్స్ కొంతమంది ఒక అమ్మాయిని ఏడిపించారు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆమె నాతో చనువుగా ఉండేది. దాన్ని ఆసరాగా చేసుకొని నా క్లాస్మేట్స్ ఆమె ఆత్మహత్యకు నేనే కారణమన్నట్టుగా ఓ సూసైడ్ నోట్ రాసి ఆమె చేతిలో పెట్టారు. అంతా నా మీదకు వచ్చింది. హెడ్స్ అందరికీ నిజం తెలిసినా.. నోరు విప్పలేదు. ఈ విషయం ఊళ్లో ఉన్న మా పేరెంట్స్‌కి చేరింది.. పరువు తీశాననే బాధతో సూసైడ్ చేసుకున్నారు. నా మీద నిందకన్నా.. మా పేరెంట్స్ నన్ను నమ్మలేదనే నిజంతో చాలా హర్ట్ అయ్యా.. ’ ‘ఇదే గదిలో ఆ రోజు రాత్రి నేనూ ఆత్మహత్య చేసుకున్నా. ప్రాణం పోయింది కాని చదువుమీదున్న పాశం పోలేదు. అందుకే ఇక్కడే తచ్చాడుతున్నా. నువ్వు కూర్చుంటున్న బెంచి మీదే కూర్చునే వాడిని. అలవాటుగా.. ఆ బెంచి మీద కూర్చున్న వాళ్లతో స్నేహం చేద్దామని.. ఈ గదిలో ఉంటున్నా వాళ్లకు తోడుగా ఉందామని.. మాట్లాడ్డం మొదలుపెడితే... దయ్యమంటూ వెలివేశారు. ఎవరినీ నా దగ్గరకు రానివ్వకుండా చేశారు. ఇన్నాళ్లకు నువ్వు ఒక్కడివే.. ధైర్యంగా ఈ గదిలోకి అడుగుపెట్టావ్. ఆ బెంచి మీద కూర్చుంటున్నావ్. భయపడకు నిన్నేం చేయను. సబ్జెక్ట్స్‌లో డౌట్స్ ఉంటే అడుగు.. చెప్తా.. టీచర్‌లాగా. తోడుంటా.. అన్నలాగా!’’ చెప్తోంది ఆ ఆకారం. క్లాస్మేట్స్ ప్రవర్తన వెనక రహస్యం తెలిసింది. బిగుసుకుపోయాడు శ్రవణ్. - సరస్వతి రమ -
రావిచెట్టుకు రక్తం కారుతోంది..!
‘‘శాంతమ్మా.... శాంతమ్మా....’’ పిలుస్తూ గేట్ తోసుకుని లోపలికి వచ్చేశాడు లింబాద్రి వగరుస్తూ! ఆ గాబరా.. తొందర చూసి.. ‘‘ఏమైందీ’’ అంటూ వసారాలోకి వచ్చింది శాంతమ్మ. ‘‘బయట ఉన్న రావి చెట్టును కొట్టేస్తారట’’చెప్పాడు అదే గాబరాతో. ‘‘ఎవరూ’’ అంతే నింపాదిగా ఆమె. ‘‘రోడ్డేదో పెద్దగ చేస్తారట.. ఆ ఆఫీసర్లు కొలతలు తీసుకుంటూ మాట్లాడుకుంటూంటే విన్నా అమ్మా.. ’’ ఇంకా గాబరాపాటు పోలేదు అతని గొంతులో. ఆమె గుండెలో రాయిపడ్డట్టయింది. మెడ కాస్త పైకెత్తి వీధిలోకి చూసింది. లింబాద్రి చెప్పినట్టుగానే బయటేదో హడావిడిగా ఉంది. నిజానికి ఓ నెల కిందటి నుంచి అంటున్నారు వీధిలో వాళ్లు... ఆ రోడ్డును వెడల్పు చేస్తారట అని. కాని ఆ చెట్టు మీదకు ఎవరి దృష్టీ పోలేదు. కాళ్లూచేతులూ ఆడ్డం లేదు శాంతమ్మకు. తన మామగారు నాటిన మొక్క. ఇప్పుడు వృక్షమైంది. తను పెళ్లిచేసుకొని వచ్చిన కొత్తలో ఆ పరిసరాలు ఇప్పటిలా లేవు. చాలా నిర్మానుష్యంగా ఉండేవి. అసలది అప్పుడు ఓ కాలనీయే కాదు. అక్కడో ఇల్లు.. ఇక్కడో ఇల్లు విసిరేసినట్టుగా ఉండేవి. తనే ఆ ఇంటి ఆఖరి కోడలు. తన తర్వాతే తన ఆడపడచు పెళ్లి అయింది. ఇంట్లో పనంతా చేసుకొని సాయంకాలం పూట ఆ చెట్టు కిందే కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్లు తోడికోడళ్లు.. ఆడపడచు. తెల్లవారికి కూరలు తరుక్కోవడమూ అక్కడే. ఆ ఇంట్లోని పిల్లల హోంవర్క్, చదువు, ఆటలు, పాటలు అన్నీ ఆ చెట్టు నీడలోనే. ఆ చెట్టుతో తన అనుబంధం మరింత ప్రత్యేకమైనది. శాంతమ్మ భర్త సంజీవ్ దుబాయ్‌లో పనిచేసేవాడు. ఎప్పుడో యేడాదికి ఒక్కసారి వచ్చి పదిహేను రోజులుండిపోయేవాడు. అతను దుబాయ్‌లో ఉన్నప్పుడు పంపిన ఉత్తరాలను ఆ చెట్టుకిందే ఏకాంతంగా కూర్చొని చదువుకునేది. తిరిగి జాబు అక్కడే రాసేది. పిల్లాడు పుట్టాక.. ఆ చెట్టు కిందే ఆడిస్తూ అన్నం తినిపించేది. పాటలు, పద్యాలు.. అన్నీ ఆ చెట్టు సాక్షిగానే సాగాయి. ఇంట్లో అత్త, మామలతో మాట పట్టింపు వచ్చినా.. ఆ చెట్టుతోనే చెప్పుకొని ఏడ్చేది. పుట్టింట్లో అన్నా, వదిన మర్యాద తక్కువైనా చెప్పుకోవడానికి ఆ చెట్టే దిక్కు. అన్నదమ్ములంతా ఆస్తిని పంచుకోవాలనుకున్నప్పుడు .. కేవలం ఆ చెట్టు కోసమే మిగిలిన వాటా డబ్బులు చెల్లించి ఆ ఇంటిని తీసుకొమ్మని భర్తను పోరింది శాంతమ్మ. ‘‘ఈ పాతిల్లు ఎందుకు? వేరే చోట చక్కగా కట్టుకుందామని భర్త చెప్పినా వినకుండా. శాంతమ్మ కొడుక్కి అప్పటికి పందొమ్మిదేళ్లు.. వాడూ ఆ ఇల్లే కావాలని పట్టుపట్టాడు. దాంతో సంజీవ్ కాదనలేక పోయాడు. గతంలోంచి బయటకు వచ్చి వడివడిగా.. వీధిలోకి వెళ్లింది శాంతమ్మ. తలుపులు గడియ వేసి ఆమె వెనకే వెళ్లాడు లింబాద్రి. అతను శాంతమ్మకు తోబుట్టువు కంటే ఎక్కువ. ‘‘ఏంటండీ.. రావి చెట్టును కొట్టేస్తున్నారా?’’ అడిగింది అక్కడున్న ఆర్ అండ్ బీ వర్కర్స్‌ను. ‘‘అవును మేడం.. వైడెనింగ్‌లో తప్పేట్టు లేదు’’ చెప్పాడు సూపర్వైజర్. ‘‘ఇది ఏళ్ల నాటి చెట్టండి.. అలా ఎలా కొట్టేస్తారు?’’ వాదనకు దిగింది శాంతమ్మ. ‘‘తప్పదు.. ’’ అంటూ రోడ్డు మీద పెట్టిన కెమెరా ట్రైపాడ్‌ను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు అతను. మిగిలిన వాళ్లూ ఎవరిపనుల్లో వాళ్లు పడ్డారు. శాంతమ్మ ఏదో చెప్తున్నా వినిపించుకోలేదు వాళ్లు. దిగులుగా ఆమె ఆ చెట్టు దగ్గరకు వెళ్లింది. ఒక్కసారిగా చెట్టు తలూపినట్టు కొమ్మలన్నీ కదిలాయి సన్నగా సవ్వడి చేస్తూ! అక్కడున్న అందరి అటెన్షనూ చెదిరింది వర్కర్స్ సహా. చెట్టు వైపు చూశారు. అది తన కొమ్మలన్నిటినీ వంచి శాంతమ్మతో ఏదో చెప్పుకుంటున్నట్టు అనిపించింది వాళ్లకు. శాంతమ్మా.. ఆ చెట్టుతో మాట్లాడుతోంది... ‘‘నీకేం కాదు.. నేనున్నాగా! కాపాడుకుంటా’’ అంటూ. విస్తుపోయారంతా. ఆ చెట్టు కాండాన్ని కాసేపు నిమిరి ఇంట్లోకి వెళ్లిపోయింది. ఆ వెనకే లింబాద్రి వెళ్లబోతుంటే... అక్కడున్న వాళ్లంతా ఆపారు. ‘‘ఏంది సామీ.. ఆయమ్మ.. ఆ చెట్టుతో ఏందో మాట్లాడుతాంది?’’ అని. వాళ్లందరినీ గంభీరంగా ఓ చూపు చూసి.. ఏమీ జవాబు చెప్పకుండా మౌనంగా శాంతమ్మ వాళ్లింట్లోకి వెళ్లిపోయాడు. రాత్రి.. శాంతమ్మను ఎంత బతిమాలినా మెతుకు ముట్టలేదు. అలాగే పడుకుండిపోయింది. బాధతో లింబాద్రీ ఏమీ తినలేదు. వాకిట్లోకి వచ్చాడు. వీధిలైట్ వెలుగులో.. ఎదురుగా రావి చెట్టు.. దీనంగా.. కనపడింది లింబాద్రికి. గేట్ మీద రెండు చేతులు పెట్టి ఆ చేతులకు తన చుబుకం ఆనించి రావిచెట్టునే చూడసాగాడు. ఆ రోజు బాగా గుర్తు... ప్రత్యూష్ పందొమ్మిదో పుట్టనరోజు.. సంజీవ్ సర్ బండీ కొనిపెట్టాడు. ఆ సంతోషం ఆ పిల్లాడి కళ్లల్లో మెరుస్తూ ఉంది. ఫ్రెండ్స్‌కి చూపిస్తానని వెళ్లాడు. జీవంతో రాలేదు. యాక్సిడెంట్లో పోయాడు. తీసుకొచ్చి ఈ చెట్టుకిందే పడుకోబెట్టారు. చిత్రంగా ఆ రోజు నుంచి ఆ చెట్టు తీరు మారిపోయింది. ఓ మనిషి పూనినట్టు.. ఇంకా చెప్పాలంటే అచ్చంగా ప్రత్యూష్లా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దాన్ని ముందు కనిపెట్టింది తనే! పిల్లాడి శవం ఇంకా తీయకముందే శోకదేవతలా ఉన్న శాంతమ్మ చెవిలో చెప్పాడు చిన్నగా. శాంతమ్మ కొడుకును చూడ్డం మానేసి చెట్టును చూడ్డం స్టార్ట్ చేసింది. నిజంగా తన కొడుకులాగే అనిపించింది ఆ రావి చెట్టు. పిల్లాడి దేహాన్ని శ్మశానానికి తీసుకెళ్తుంటే.. ఏడుస్తూ వెంట పరిగెత్తబోయిన శాంతమ్మను ఈ చెట్టు కొమ్మలు వెనక్కి లాగినట్టు ఒక్కడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. షాక్‌లో ఉందేమోనని అనుకున్నారు. ఆ రోజు ఆ చెట్టు చెప్పింది ఆమెతో.. ‘‘అమ్మా.. నేనక్కడికీ వెళ్లలేదు. ఇక్కడే ఉన్నా.. నీతోనే ఉంటా.. నేనే ప్రత్యూష్ని’’ అని. ఆ మాటలు లింబాద్రికీ వినపడ్డాయి. మూడో రోజు ప్రత్యూష్కి ఇష్టమైన వంటకాలను చేసి చెట్టు మొదట్లో పెట్టింది. మరుక్షణమే ఆ విస్తరి ఖాళీ అయింది. అప్పుడు.. ఆ చెట్టు మీద ప్రత్యూష్ ఉన్నాడని శాంతమ్మ రూఢి చేసుకుంది. ఆ క్షణం నుంచి ఇప్పటిదాకా.. దాన్ని కన్న బిడ్డకంటే జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది. చెట్టంత కొడుకు పోయాడన్న దిగులుతో మంచం పట్టిన శాంతమ్మ భర్త యేడాదికే తుది శ్వాస విడిచాడు. అయినా అంతగా బాధపడలేదు ఆమె. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు అంతా ముక్కున వేలేసుకున్నారు. అర్థం చేసుకోగలిగిన వాళ్లు కొడుకు పోయిన షాక్ నుంచి ఇంకా తేరుకోలేదని సమాధానపడ్డారు. ‘‘మామా...’’పిలిచినట్టయింది. గేట్ తీసుకొని చెట్టు దగ్గరకు వెళ్లాడు లింబాద్రి. ‘‘చెప్పు బాబూ..’’ లింబాద్రి. ‘‘అమ్మ భోంచేయలేదు కదూ..’’ ‘‘ఉహూ.. నీ మీదే దిగులుతో ఉంది’’ చెప్పాడు లింబాద్రి. ‘‘నా గురించి చింత వద్దు.. అమ్మను జాగ్రత్తగా చూసుకో’’ వెళ్లి చెట్టును హత్తుకున్నాడు లింబాద్రి. అతని కళ్లల్లో నీళ్లు. ‘‘సార్.. అది చెట్టు కాదు సార్.. దయ్యం’’ భయంతో పారిపోతూ చెప్పారు చెట్టును నరికేయడానికి వచ్చిన కూలీలు. ‘‘ఏమైంది.. ఆ చెమటలేంటి? ఆ కంగారేంటీ?’’ సూపర్వైజర్ అయోమయంగా. ‘‘గొడ్డలితో వేటు వేసిన చోటల్లా రక్తం వస్తోంది సార్.. పొయ్యి చూడండి.. వరద కట్టింది రక్తం. మావల్ల కాదు.. మేం పోతున్నాం.. ’’ అంటూ పరిగెత్తారు ఆ కూలీలు. ఏమీ అర్థంకాని సూపర్వైజర్.. చెట్టు దగ్గరకు వెళ్లి చూశాడు. నిజంగానే రక్తం.. కాలువై పారుతుంది. అక్కడున్న జనమంతా హాహాకారాలు చేస్తున్నారు. నిశ్చేష్టుడైపోయాడు సూపర్వైజర్. - సరస్వతి రమ -
శ్మశానంలో ఊయల..
వేసవి రాత్రి.. ఆరుబయట.. చల్లగా ఉంది. ఆమె తన గూడు ముందే ఉన్న వేప చెట్టుకి ఊయల కట్టే ప్రయత్నం చేస్తోంది. ఆ చప్పుడికి లోపలి నుంచి ఓ కేక.. మూలుగులా! ‘‘ఏం చేస్తున్నావే బయట?’’ ‘‘వేప చెట్టుకు ఊయల కడ్తున్నానమ్మా...!’’ చేస్తున్న పని మీద నుంచి దృష్టి మరల్చకుండానే సమాధానమిచ్చింది ఆమె. ‘‘రాత్రివేళల్లో చెట్ల కింద ఉండకూడదు తెలుసా?’’ హెచ్చరిక లోపలి నుంచే. వెనక్కి తిరిగి.. ‘‘అమ్మా.. ’’ అని నవ్వుతూ విసుక్కుంది. ఆ అమ్మకూడా నాలుక కర్చుకున్నట్టుంది మాటలేదు. కాసేపటికి ఏదో తట్టినట్టు ‘‘ఊయల దేనితో కడ్తున్నావే?’’ సందేహం వెలిబుచ్చింది. ‘‘ఊ... తాళ్లు’’ అంది చెట్ట కొమ్మ మీదకి వేసిన తాళ్లను కిందకి లాగుతూ! ‘‘తాళ్లా? ఎక్కడివి?’’ మళ్లీ ప్రశ్న. ‘‘అమ్మా... ఈ చెట్టు మీద వేల్లాడినవన్నీ పోగేశా... తెలిసీ అడుగుతావేంటీ?’’ తాళ్లను లాగడంలో అలసిపోయినట్టుందేమో.. నడుం మీద చేతులు పెట్టుకొని సేద తీరుతూ చిరు కోపాన్ని ప్రదర్శించింది ఆమె. ఇంతలోకే పక్కనే పిట్ట గోడ మీదున్న ఫోన్ గుర్ర్... గుర్ర్.. మంటూ వైబ్రేట్ అయింది. ‘‘అబ్బా... ఈ టైమ్‌లో ఎవరో..’’ అని చిరాకు పడుతూ ఫోన్ అందుకుంది. ‘‘హాయ్’’ ‘‘హెలో.. వాట్సప్?’’ ‘‘పడుకున్నావా?’’ అంటూ వరుసగా మూడు మెసేజ్‌లు ఉన్నాయి. ‘‘పట్టువదలని పరాక్రముడు.. ’’అనుకుంటూ.. ఆ మూడు మెసేజ్‌లకు రిప్లయ్ ఇచ్చింది..‘‘పడుకోలేదు.. ఊయలూగుతున్నా’’ అని! అవతలి నుంచి వెంటనే రెస్పాన్స్. ‘‘వావ్.. వెన్నెల్లో ఊయలా?’’ అంటూ. ఆమె..ఆ వెంటనే.. ‘‘ వెన్నెల్లో కాదు.. చీకట్లోనే.. రేపు అమావాస్య..’’ అంటూ కన్నుగీటే ఇమోజీతో రిప్లయ్ ఇచ్చింది అవతల మెసేజ్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి.. ఆమె ఇంప్రెషన్ కోసం తండ్లాడుతున్నాడు గత కొద్ది రోజులుగా! ఆ ఊళ్లో జరిగిన ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఆమెను చూశాడు. అప్పటి నుంచి మనసు పారేసుకున్నాడు. ఎలాగో ఆమె నంబర్ సంపాదించాడు. పలకరించాలంటే భయపడ్డాడు. ఈ పరిచయం.. పరిచయం వరకే ఉంటే ఓకే.. కాని ప్రేమగా మారి ముందుకు వెళితే.. తను ఆమెతో ఉండగలడా? సాధ్యమా? సాధ్యం కాకపోతే ఆ అమ్మాయి పరిస్థితి? ‘‘ముందు మాట్లాడు.. తర్వాత సంగతి తర్వాత’’ అంటూ మెదడు ధైర్యమిచ్చి.. ప్రోత్సహించింది. అలా మొదలైన ఆ ఫోన్ మెసేజ్ కమ్యూనికేషన్‌ను అంతవరకే పరిమితం చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. కాదు.. అతను అంతవరకే ఉండేలా ఆమె నియంత్రిస్తోంది. ఇప్పుడు.. ప్రస్తుత సందర్భంలో.. అదే అనుకుంటున్నాడు.. ఆ కన్నుగిటే ఇమోజీకి జవాబివ్వకుండా.. ‘‘కలిసి ఉండడం సాధ్యం కాకపోతే అనవసరంగా ఆ అమ్మాయి పరిస్థితేంటో అని ఎంత పిచ్చిగా ఆలోచించాడు? ఇన్ని రోజులైనా ఆమె తన సంభాషణతో ఈ పరిచయాన్ని ఒక అంగుళం కూడా ముందుకు తీసుకెళ్లలేదు. ఇలాంటి గట్టి పిల్లనా తను తేలిగ్గా అంచనా వేసింది?’’ అని. అలా అనుకుంటున్నాడే కాని.. ఆమె ఆ ముక్తసరి.. ముక్కుసూటి తీరు.. అతనిలో పట్టుదలను పెంచుతోంది. ఎలాగైనా ఆమెను.. కలవాలి అని. ఇంకా చెప్పాలంటే ఆ పిల్లను ప్రేమించడం మొదలుపెట్టాడు. అందుకే ఆ క్షణాన ఆమెకు మెసేజ్ పెట్టాడు.. ‘‘నిన్ను కలవాలనుంది’’ అని. ఆమె ఆ మెసేజ్‌ను చూడకుండా ఇగ్నోర్ చేసింది. షాపింగ్ మాల్లోని లేడీస్ సెక్షన్లో న్యూ ఎరైవల్స్ దగ్గర అమర్చిన డ్రెసెస్‌ను ఆసక్తిగా గమనిస్తోంది ఆమె. ‘‘హాయ్’’ అన్న పిలుపు వినిపించి ఉలిక్కిపడి చూసింది. నవ్వుతూ అతను. ‘‘ఓ హాయ్’’ తేరుకుంటూ ఆమె. ‘‘డ్రెస్ కొంటున్నావా?’’ అతను. ‘‘లేదు.. చూస్తున్నా’’ ఆమె. అతను నవ్వాడు. ‘‘అవునూ.. ఇంతకుముందే ఈ షాప్ అంతా కలియ తిరిగాను. ఎక్కడా కనపడలేదు నువ్వు! అంత హఠాత్తుగా ఎలా ప్రత్యక్షమయ్యావ్?’’ ఆశ్చర్యపోతూ ఆమె. ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. ప్రసన్నంగా ఉంది ఆమె మొహం. ‘‘ఇదే మంచి అవకాశం.. మనసులో ఉన్నది చెప్పేయ్’’ రెచ్చగొడుతోంది అదని మెదడు. ఏదో వినిపడినట్టు వెంటనే అతని వైపు చూసింది ఆమె ‘‘ఏమన్నా అన్నారా?’’ అంటూ. అనలేదన్నట్టు.. అన్నాను అన్నట్టు తల అడ్డదిడ్డంగా ఊపుతూ ‘‘నువ్వంటే నాకు ఇష్టం.. నీతో కలిసి బతకాలనుంది’’ చెప్పాడు టపీమని. తాపీగా అతని కళ్లల్లోకి చూసింది ఆమె. ‘‘నిజం... నువ్ లేకుండా ఉండలేను.. నీ కోసం ఈ లోకాన్ని కూడా వదులుకుంటా’’ అతను. అలాగే చూస్తూ ఆమె. ‘‘ప్లీజ్.. చెప్పు..’’ ఆమె మౌనం అతనికి భారమైంది. ఆమె గబగబా తన సెల్ఫోన్లో ఏదో టైప్‌చేసి అతని ఫోన్ నంబర్‌కి సెండ్ చేసి.. ఫోన్ చూసుకో అన్నట్టు సైగ చేసింది. చూశాడు అతను. అడ్రస్.. ‘‘ఎవరిది?’’ అడిగాడు. ‘‘మాదే.. రాత్రి ఇంటికి రా.. ఇంట్లో ఎవరూ ఉండరు. చెప్తాను’’ అంది. అతని మొహంలో ఆనందం. ‘‘సరే మరి.. నేను వెళ్తా’’అంది లేచి నిలబడుతూ! రాత్రి.. పదకొండు అవుతోంది.. ఆమె చెప్పిన అడ్రస్‌కు వచ్చాడు. ఒక్క వీధి దీపం తప్ప అక్కడ ఇళ్లే కాదు జనసంచారమే లేదు. అయినా కాస్త ముందుకు నడిచాడు. వేప చెట్టు.. దానికి కట్టి ఉన్న ఊయలా కనిపించాయి. ‘‘హమ్మయ్యా.. వచ్చేశా’’ అనుకుని గబగబా ముందుకు నడిచాడు. పెద్ద ప్రహరీ.. పెద్ద గేట్.. గేట్ తీసుకొని లోపలికి వెళ్లాడు. బయటి స్ట్రీట్ లైట్ వెలుతురు పడి.. శ్మశానం స్పష్టంగా దర్శనమిస్తోంది.. భయంగా వేపచెట్టు వైపు చూశాడు.. ఊయల ఊగుతోంది.. నెమ్మది నెమ్మదిగా వేగం పెంచుకుంటూ! - సరస్వతి రమ -
పసుపునీళ్ల స్నానం
‘‘ప్రణయ్.. లవ్యూ.. నన్ను అర్థం చేసుకో.. ప్లీజ్’’ ఫోన్లో ఆడ గొంతు బతిమాలుతోంది. ‘‘ఇప్పుడు చెప్తున్నావా లాస్యా? నీ రెస్పాన్స్ కోసం మూడేళ్లు మీ రూమ్ ముందు కుక్కలా కాపుకాశా! యేడాది నుంచయితే కనపడకుండా మాయమయ్యావ్. ఎక్కడికి వెళ్లావో తెలియదు. ఇప్పుడు సడెన్‌గా ఫోన్..’’ ఆవేదనగా ప్రణయ్. ‘‘అయ్యో.. అవన్నీ గుర్తు చేయకు ప్రణయ్.. అన్నిటికీ.. అన్నిటికీ సారీ. ఇప్పుడు నీ ఇంటి ముందు నేను కుక్కలా కాపుకాయడానికి సిద్ధమే’’ అన్నది అవతలి గొంతు అంతకంటే వేదనగా. ‘‘జస్ట్ స్టాపిట్ లాస్యా! రెండు రోజుల్లో నా పెళ్లి. ఇప్పుడు నేనేం చేయలేను. నిన్ను మర్చిపోయా. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ’’ అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు ప్రణయ్. వెంటనే మళ్లీ ఫోన్ వచ్చింది. ‘‘లాస్యా..’’ కాస్త కటువుగా అంటూనే కట్ చేశాడు. మళ్లీ ఫోన్. మళ్లీ డిస్కనెక్ట్. మళ్లీ ఫోన్. ‘‘ఇలాగైతే రిజెక్ట్ లిస్ట్‌లో పెట్టేస్తా’’ విసుగ్గా ప్రణయ్. అనడమే కాదు పెట్టేశాడు కూడా! లాస్య చేస్తూనే ఉంది. కొన్ని గంటలు.. వేల కాల్స్. కోపంతో పళ్లు కొరుకుతోంది. పిడికిళ్లు బిగించింది. గోడకేసి కొట్టుకుంటోంది. ∙∙ ‘‘అక్కా.. ప్రణయ్ కనిపించట్లేదు’’ తోటి కోడలి చెవిన వేసింది జయ కంగారుగా. ‘‘ఏంటీ..’’ అర్థంకానట్టు అయోమయంతో ప్రణయ్ తల్లి వైశాలి. గబగబా భర్త దగ్గరకు పరిగెత్తింది వైశాలి. విషయం చెప్పింది. క్షణాల్లోనే ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. ప్రణయ్ వాళ్ల నానమ్మయితే... ‘‘అయ్యో.. పెళ్లికొడుకుని చేసే వేళ.. ఇదేం పనే తల్లీ..’’ అంటూ ఊరంతా వినిపించేలా రాగం అందుకుంది. ‘‘అబ్బా.. అత్తయ్యా! ఏం కాలేదు. మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి’’ అంటూ ఆవిడ రెక్క పట్టుకుని బలవంతంగా గదిలోకి లాక్కెళ్లింది జయ. ‘‘ఇదిగో ప్రమీలా.. పెద్దమ్మకేం కావాలో చూడు’’ అని గట్టిగా పనమ్మాయికి పురమాయించి వాళ్లత్తగారు చూడకుండా ఆ పిల్ల చెవిలో ‘‘ఆవిడ్ని బయటకు రానివ్వకు’’అని చెప్పి వెళ్లిపోయింది జయ. ఇంట్లో సభ్యులంతా వసారాలో సమావేశమయ్యారు. పెళ్లికి వచ్చిన దగ్గరి బంధువులతో సహా. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రణయ్ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి అడుగుతోంది అతని మేనత్త ‘‘మా వాడికి లవ్ ఎఫైర్ ఏమైనా.. ’’ అని. ‘‘అలాంటిదేం లేదు ఆంటీ’’ అన్నారు వాళ్లంతా ముక్త కంఠంతో. ‘‘కానీ.. రాత్రి ఏదో ఫోన్ వచ్చినట్టుంది ఆంటీ.. ప్రణయ్‌కి?’’ డౌట్‌గా ప్రణయ్ ఫ్రెండ్స్ గ్రూప్‌లోని ఓ అమ్మాయి. ‘‘ఎవరు? నీకేమన్నా తెలుసా?’’ ఆదుర్దాగా మేనత్త. తల అడ్డంగా ఊపింది ఆ అమ్మాయి. మిగిలిన వాళ్లకేసీ చూసింది మేనత్త. తెలీదన్నట్టే ఎక్స్ప్రెషన్ వాళ్ల మొహాల్లోనూ! నిట్టూరుస్తూ వైశాలి దగ్గరకు వెళ్లింది మేనత్త. ప్రణయ్ సెల్‌ఫోన్‌కి కాల్ చేస్తున్నాడు వాళ్ల నాన్న. అది అవుటాఫ్ కవరేజ్ ఏరియా అని వస్తోంది. ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ప్రణయ్ మిస్సింగ్.. టాక్ ఆఫ్ ది విలేజై.. పెళ్లి కూతురు తరపు వాళ్లకూ తెలిసింది. పెళ్లి కూతురు షాక్. తర్వాత ఫెయింట్. ఆమె తండ్రి హుటాహుటిని ప్రణయ్ వాళ్ల ఊరు వచ్చేశాడు. గుండె పట్టుకొని కుర్చీలో కూలబడ్డాడు. ∙∙ ‘‘మీరంతా ఎవరు?’’ ప్రణయ్. అతని ముందున్న వాళ్లంతా ఘొల్లున నవ్వారు. ఆ నవ్వులో... ఆ గుంపులో మసగ్గా తనకు పరిచితమైన రూపమే! వాళ్లందరి వెనక నుంచి నెమ్మదిగా ముందుకు వచ్చింది... లా...స్యా.... ‘‘లాస్యా’’ పిలిచాడు గాబరాగా. బదులుగా నవ్వు.. తెరలు తెరలుగా! ప్రణయ్‌కి కంగారు పుట్టించేంతగా. ‘‘లాస్యా... వీళ్లంతా ఎవరు?’’ చేతులను దగ్గరకు తెచ్చుకోబోతూ అడిగాడు. కానీ రాలేదు. ఠక్కున నవ్వు ఆపి ప్రణయ్ వైపే చూస్తోంది ఆమె. కాసేపు తీక్షణంగా... ఇంకాసేపు ప్రేమగా.. మరికాసేపు లాలనగా.. చిరాగ్గా ఉంది ప్రణయ్‌కి. తనని తాను చూసుకున్నాడు. ఒంటి మీద పెళ్లి బట్టలు కనపడ్డాయి.. ఏంటిది? పెళ్లి ఎల్లుండి కదా.. అనుకున్నాడు. తనను కట్టేసి ఉంచారు. కిడ్నాప్ చేశారా? తెంచుకోయాడు. రాలేదు. గుంపులో ఉన్న వాళ్లంతా గట్టిగా అరిచారు. ఏదో లాగినట్టయిన బాధతో. ఆ అరుపుకి ఉలిక్కి పడ్డాడు ప్రణయ్. మళ్లీ తెంచుకోబోయాడు. ఈసారి అంతకన్నా గట్టిగా అరిచారు. అప్పుడు చూసుకున్నాడు. తనను కట్టేసింది తాళ్లతో కాదు. పొడుగాటి జడలతో. అదిరిపడ్డాడు. మళ్లీ వాళ్లంతా నవ్వుతున్నారు. అందరూ ఒకే వయసు వాళ్లు కాదు. వందేళ్లు.. ఎనభై ఏళ్లు.. డెబ్బై ఏళ్లు.. యాభై ఏళ్లు.. నలభై ఏళ్లు..ముప్పై ఏళ్లు.. పాతికేళ్లు... రకరకాల వయసుల వాళ్లు. నడుం వంగిపోయి ఒకరు.. పళ్లూడిపోయి ఒకరు.. ముడతల చర్మంతో ఒకరు.. గారపళ్లతో ఒకరు.. బూడిదరంగు కళ్లతో ఒకరు.. భయంతో బిగుసుకుపోయాడు ప్రణయ్. లాస్య.. అతనికి దగ్గరగా వచ్చింది. ‘‘ఇంకెప్పుడు పెళ్లి? త్వరగా తాళి కట్టించండి లేకపోతే వీడు పారిపోతాడు’’ అంటోంది వందేళ్లావిడ. ‘‘అవును పారిపోతాడు. చేసేద్దాం.. చేసేద్దాం. పూలు, పళ్లు తెండి.. ఒరేయ్ బాజాభజంత్రీలూ.. వాయించడర్రా... ’’ అంటూ కేకేసింది ఇంకోవిడ. బాజాభజంత్రీలు మొదలయ్యాయి.. చెవులు చిల్లులు పడేలా. ‘‘అమ్మాయ్.. పూలు పెడ్తాను రా ’’ అంటూ ఇంకోవిడ లాస్య జడలో జిల్లేడు పూలమాల తురమసాగింది. ప్రణయ్‌కి ప్రాణాంతకంగా ఉంది ఈ వ్యవహారమంతా. యాభై ఏళ్ల ఆవిడ వచ్చి ప్రణయ్ నుదుటికి బబ్బేరు గింజ బాసికం కట్టింది. ఇంకొంతమంది గుంపు వచ్చి ప్రణయ్‌ని అమాంతం ఎత్తుకోబోయారు. ‘‘వదలండి.. నాకు ఈ పెళ్లి వద్దు.. ప్లీజ్ నన్ను వదలండి’’ అంటూ గింజుకుంటున్నాడు. ‘‘ఒరేయ్.. ఏమొచ్చిందిరా..?’’అంటూ ఒక్కటిచ్చాడు ప్రణయ్‌కి వాళ్ల బాబాయ్. దిగ్గునలేచి కూర్చున్నాడు. ఒళ్లంతా తడుముకొని చూసుకుంటున్నాడు. నుదుటి మీద చేయి పెట్టి ఏదో వెదుక్కుంటున్నాడు. అతని వాలకం చూసిన బాబాయ్ ‘‘ ఏమైందిరా? అలా తడుముకుంటున్నావ్?’’ అడిగాడు. ‘‘ఏంలేదు బాబాయ్.. ’’ అని జవాబు చెప్తూనే మనసులో అనుకున్నాడు.. ‘‘కలా.. !? బతికిపోయా’’ అని. ‘‘ప్రణయ్.. లే..లే.. నాలుగు దాటకముందే వెళ్లాలి. లేచి గబుక్కున మొహం కడుక్కో..’’ అంటూ టూత్ బ్రష్, పేస్ట్ అతని చేతిలో పెట్టింది మేనత్త. ∙∙ ‘‘నానమ్మా... ఇక్కడెందుకు పసుపు నీళ్ల స్నానం చేయిస్తున్నారు?’’ అడిగింది ప్రణయ్ స్నేహితురాలు. ‘‘ఈ ఊరి ఆచారం. ఎప్పుడో వెనకట.. పెళ్లి కాని వాళ్లు, పెళ్లయ్యీ ఏ ముచ్చటా తీరని వాళ్లు చనిపోయి దయ్యాలై ఈ చెట్టునెక్కాయట. వాటిని శాంతింప చేయడానికి ఈ చెట్టు కింద పెళ్లికొడుక్కి పసుపు నీళ్లు పోయడం ఆనవాయితీ అయిపోయింది. అలా పోయకపోతే పెళ్లి కూతురు రూపంలో దయ్యమే వచ్చి కాపురం చేస్తుందని అంటారు. అలాంటివి జరిగాయట కూడా’’ నానమ్మ. జడలు వేళ్లాడదీసినట్టుగా ఉంది ఊరవతలున్న ఆ మర్రి. తల మీద నుంచి పసుపు నీళ్లు్ల కళ్లలోకి జారడంతో తల వంచుకుని రెండు చేతులతో కళ్లను గట్టిగా తుడుచుకుని తెరిచాడు.. ఒళ్లో బబ్బేరు బాసికం.. జిల్లేడు పూలు. ఝల్లుమంది ప్రణయ్‌కి. ఒక్క ఉదుటున లేచి నిలబడ్డాడు. చలేస్తోందేమో అనుకొని మేనత్త టవల్ తెచ్చిచ్చింది. ఒళ్లు తుడుచుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు.. జిల్లేడు పూల జడను ముందుకు వేసుకొని.. నుదుట మీద చింతపిక్క కళ్యాణ తిలకం.. బబ్బేరు గింజ బాసికం కట్టుకొని పెళ్లికూతురులా లాస్య.. నవ్వుతూ! -సరస్వతి రమ -
పాత్రకు... ప్రీతిపాత్రుడు
నటనకు పరిపూర్ణతను ఇచ్చిన నటుడు సయీద్ జాఫ్రీ! ఆరడుగుల ఎత్తు, ఆకర్షణీయమైన ముఖం, బేస్ వాయిస్ లాంటి ప్లస్ పాయింట్స్ ఏమీ లేకుండానే... అవన్నీ ఉన్న నటులను సైతం ఆయన అడుగు దూరంలో ఉంచగలరు! సయీద్ జాఫ్రీని చూసి హాలీవుడ్ నటడు సీన్ కేనరీ జంకిందీ, కెమెరా ముందు సయీద్ ఈజ్‌ను చూసి రిచర్డ్ అటెన్‌బరో ముచ్చట పడిందీ అందుకేనేమో! సయీద్ 1929 జనవరి 8న పంజాబ్‌లో జన్మించారు. పై చదువుల తర్వాత ఢిల్లీకి వచ్చాక థియేటర్ మీద దృష్టిపెట్టారు. యూనిటీ థియేటర్ పేరుతో డ్రామా కంపెనీ ప్రారంభించాడు. అమెరికాలో షేక్స్పియర్ నాటకాలను ప్రదర్శించిన తొలి భారతీయ నటుడు సయీదే. లండన్‌లోని అకాడమీ ఆఫ్ డ్రమెటిక్ ఆర్ట్‌లో చేరి నటనకు మెరుగులద్దుకున్నారు. రంగస్థల సేవలకు 1995లో ‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ అంపైర్’ అవార్డ్ అందుకున్నారు. ప్యారలల్... కమర్షియల్: డెబ్భైల్లో ఇటు ప్యారలల్ మూవీ డెరైక్టర్స్‌కి, అటు కమర్షియల్ మూవీ డెరైక్టర్స్‌కి అభిమానపాత్రుడు సయీదే. ప్రేమ్‌చంద్ రాసిన ‘షత్రంజ్ కే ఖిలాడీ’ కథను అదే పేరుతో సత్యజిత్‌రే తెరకెక్కిస్తే, చదరంగ వ్యసనపరుడైన మీర్ రోషన్ అలీ పాత్రను పోషించారు సయీద్. ఆ సినిమా పేరు వినగానే సయీద్ జాఫ్రీనే కళ్ల ముందు మెదులుతారు. సత్యజిత్రేకే కాదు... శ్యామ్‌బెనెగల్, సాయి పరాంజపే లాంటి గొప్ప దర్శకులకూ ఆయన మోస్ట్ వాంటెడ్ యాక్టర్. హైదరాబాద్ పాతబస్తీలోని మెహబూబ్‌కి మెహందీని నగర శివార్లకు తరలించిన నేపథ్యంలో ఆ కథాంశంతో శ్యామ్‌బెనెగల్ తెరకెక్కించిన ‘మండీ’ సినిమాలో అగ్రవాల్గా, సాయి పరాంజపే ‘చష్మే బద్దూర్’లో పాన్‌డబ్బా ఓనర్ లలన్ మియాగా జస్ట్ జీవించారు! ‘రామ్ తేరీ గంగా మైలీ’ లాంటి కమర్షియల్ సినిమాలైతే ఆయనకు బాహే హాత్ కా ఖేల్! ‘గాంధీ’లో సర్దార్ పటేల్ రోల్లో ఒదిగిపోయారు. హాలీవుడ్ అండ్ టెలివిజన్: ‘ఎ ప్యాసేజ్ టు ఇండియా, ది మ్యాన్ హూ వుడ్ బి కింగ్’... ఇలా ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలతో హాలీవుడ్ ఆయనను సత్కరించింది. గ్యాంగ్స్టర్స్, ది జ్యువెల్ ఇన్ ద క్రౌన్ , తందూరీ నైట్స్ వంటి సీరియల్స్‌లో సయీద్‌ని చూపించుకొని గర్వపడింది టెలివిజన్. నటనను వృత్తిలా కాక శ్వాసలా భావించారు సయీద్. అందుకే, ప్రేక్షకులు బ్యానర్, కథ, దర్శకుడు, హీరో హీరోయిన్లతో సంబంధం లేకుండా పోస్టర్ మీద సయీద్ బొమ్మ కనపడితే సినిమాకు వెళ్లేవారు. ఈ ఇమేజ్ ముందు ఏ స్టార్డమ్ నిలుస్తుంది! ఈ ప్రతిభకు ఏ గ్లోబల్ అవార్డ్ కొలమానం అవుతుంది? 86 ఏళ్ల సయీద్ బ్రెయిన్ హెమరేజ్‌తో నవంబర్ 15న అల్విదా చెప్పి వెళ్లిపోయారు కానీ అభిమానులు ఆయనకు అల్విదా చెప్పలేదు.. చెప్పలేరు. వెండివెలుగులో సయీద్ జాఫ్రీ... ఇమ్మోర్టల్. - సరస్వతి రమ -
వద్దు బాస్...వదిలేద్దాం!
సోల్ / అసహనం ఇదో భౌతిక ఉద్వేగం! ఉద్వేగం మానసికమైనది కదా! మరి ఈ ‘భౌతిక ఉద్వేగం’ ఏమిటి? ఇన్టాలరెన్స్ అన్నమాట. అంటే అసహనం. అసహనంలో మైండ్ కన్నా ముందు, భౌతికమైన పరిణామాలేవో పనిచేస్తాయి. అందుకే అసహనాన్ని ‘భౌతిక ఉద్వేగం’ అనడం! సామాన్యుల దగ్గర్నుంచి అసామాన్యుల దాకా ఏదో ఒక రకంగా.. ఎప్పుడో అప్పుడు.. లేదంటే అప్పుడప్పుడు ఇంకా కాదంటే ఎప్పుడూ వాళ్ల వాళ్ల మానసిక స్థితిగతులననుసరించి ఈ ఉద్వేగానికి గురికాక తప్పరు. ఆ మాటకొస్తే దేశాలు, సమాజాలూ అసహనాన్ని మోసాయి.. మోస్తున్నాయి! పర్యవసానాలూ అనుభవించాయి... అనుభవిస్తున్నాయి.. ఏ కాలానికి ఆ కాలం కొత్తే కాబట్టి పాత పాఠాలనే కొత్తగా నేర్చుకోవడానికి నేటికీ సిద్ధంగా ఉన్నాయి. అడిగింది అందకపోతే చిన్నపిల్లలకు అసహనం... ఆశించింది దొరక్కపోతే యువతలో అసహనం! ఇంట్లో తన మాట సాగకపోతే భర్తకు అసహనం.. ఆదరణ కరువైతే భార్యలో అసహనం! అహం ఓడిపోయే అసహనం పురుషుడైతే... అస్తిత్వం కోల్పోయిన అసహనం స్త్రీది! ఇక కులజాఢ్యం, మతమౌఢ్యం, వర్ణవివక్ష, అధికార దాహం, ఆక్రమణకాంక్ష, అగౌరవం.. మొత్తం మానవజాతి అసహనానికి కారణాలు! కరువు, వరదలు, భూకంపాలు, సునామీలు, గ్లోబల్‌వార్మింగ్ వంటివన్నీ ప్రకృతి అసహనానికి నిదర్శనాలు! ఏదైనా, ఎవరైనా తను మెచ్చినట్లు, తనకు నచ్చినట్లు ఉండకపోవడం అనే దగ్గర్నుంచే అసహనం మొదలవుతుంది. ఈ భావన మనిషి నుంచి సమాజానికి విస్తరిస్తే ఫలితమూ అంతే పరిధిలో ఉంటుంది. పుక్కిటనున్న పురాణాలను కదిపినా... చరిత్రగా మిగిలిన గతాన్ని కదిలించినా ఉదాహరణ హెచ్చరికలు కోకొల్లలు! రామాయణ, భారతాలూ... పురాణాల్లో సహనం ప్రస్తావన ఉన్నా కనిపించేది మాత్రం ఎక్కువగా అసహనమే! రామాయణంలోని రావణాసురుడి పాత్ర అసహనానికి అసలైన ఉదాహరణ. సీతాస్వయంవరంలో శివుడి విల్లు విరవలేని ఓటమి దగ్గర మొదలైన రావణుడి అసహనం.. తన చెల్లెలు శూర్పణఖ ముక్కుచెవులను లక్ష్మణుడు ఖండించడంతో పీక్‌కి చేరుతుంది. రాముడితో యుద్ధానికి నగారా మోగిస్తుంది. రావణుడి అసహనం అతడిని పరాజితుడిని చేస్తే.. రావణుడు అంటే అతడి తమ్ముడు విభీషణుడికి ఉన్న అసహనం, వాలిసుగ్రీవులిద్దరికీ ఒకరంటే ఒకరికి ఉన్న అసహనం ఈ యుద్ధంలో రాముడిని విజేతగా నిలబెట్టాయి! లంకలో బందీగా ఉన్న ‘సహనశీలి’ సీత హనుమంతుడితో వెళ్లడానికి నిరాకరించడం కూడా ఒకరకంగా రాముడి మీద అమెకున్న అసహనంగా అనుకోవచ్చేమో! ఆయనే వచ్చి తీసుకెళ్లాలని ఆమె ఆశ. ఆ ఆశ నెరవేరడంలో జరిగే జాప్యం వల్ల వచ్చిన అసహనం అది. మహాభారతానికి వస్తే అది అన్యాపదేశంగా బోధించింది అసహనాన్నే. అందులోని వృద్ధ పాత్రల నుంచి కుర్ర పాత్రల దాకా అందరిదీ అసహనమే. చివరకు కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పింది కూడా అసహనం గురించిన లెసనే! గతం... అంతా అసహనాల పుట్టే! చరిత్రలో నమోదైన ఏ యుద్ధానికి అయినా నాంది అసహనమే. అతిపెద్ద సామ్రాజ్యాలుగా పేరొందిన రోమ్ నుంచి మొగల్దాకా అన్ని రాజ్యాలు, రాజవంశాలు అసహనానికి బానిసలుగానే బతికాయి. అసహనం ఆసరాతోనే క్రుసేడులనే యుద్ధాలూ వీరంగం చేశాయి. ఆధునిక ప్రపంచ యుద్ధాలకూ ఆజ్యంపోసింది అసహనమే. మొదటి ప్రపంచయుద్ధానికి సామ్రాజ్య విస్తరణ కాంక్ష విత్తు నాటితే రెండో ప్రపంచ యుద్ధానికి జాత్యహంకారమనే అసహనం బీజమైంది. తత్ఫలితమే హిట్లర్ పేరుపక్కన నియంత అనే సఫిక్స్ చేరింది. ప్రాంతాల మధ్యే కాదు... అసహనం మనిషి నుంచి సమూహానికి పాకి ప్రాంతాలుగా విడగొట్టిన దుదృష్టకర సంఘటనలూ ఉన్నాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇండియా, పాకిస్తానే! కులం, మతం, చివరకు చర్మం రంగును సాకుగా చేసుకొని మనుషుల మధ్య సంబంధాలను చెడగొట్టి వివక్ష అనే పదాన్ని సృష్టించిన ఘనతా అసహనానిదే. అంటరానితనాన్ని ఉనికిలోకి తెచ్చిన కీర్తీ దానిదే. వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ కూల్చిన అపకీర్తీ దానికే! ఆఫ్టనిస్తాన్‌ను మట్టిదిబ్బగా మిగిల్చిన దోషమూ అసహనానిదే. ఇజ్రాయేల్, పాలెస్తీనాల మధ్య సాగుతున్న మారణహోమం తాలూకు పాపభారాన్ని మోస్తున్నదీ అసహనమే. ఆగని ఆగడం... ‘అసహనం’ మిగిల్చిన భయోత్పాతాలు భూతంలా వర్తమానాన్ని వెంటాడుతున్నా... దాన్ని జయించే సాహసం చేయట్లేదు ప్రపంచం. పైగా కొత్తగా సాధించుకున్న సాంకేతికత దానికి శక్తినిచ్చే పోషకంగా మారింది. చాలా సౌకర్యంగా మనకు తెలియకుండానే మన సహనాన్ని రీప్లేస్ చేస్తోంది. అందుకే అప్పుడు భూమి కోసం దానిమీదున్న మనుషులతో యుద్ధం చేస్తే ఇప్పుడు భూమిలో ఉన్న వనరుల కోసం మనుషులకు మనుగడ లేకుండా చేస్తోంది అసహనం. భరిస్తున్న ప్రకృతిని కూడా గిల్లుతోంది. ప్రకోపంతో కంపిస్తున్న ప్రకృతి పట్ల డిజాస్టర్ మేనేజ్మెంట్తో నిర్లక్ష్యంగానే ఉంటోంది తప్ప సహనంతో చెలిమితో దాన్ని మేనేజ్ చేసుకోవాలనే ఇంగితాన్ని మాత్రం గ్రహించట్లేదు. నాగరికత అంటే మనం నేనుగా మారడం కాదు.. నేను మనం అవడం! సహనం నేనును మనంగా చూపిస్తుంది. అసహనం మనల్ని నేనుగా మారుస్తుంది! నేను మనంగా ఆలోచించడమే మతం... అంటే ఇప్పటికీ మనం అసహనానికి వెట్టిచేస్తూ అనాగరికులుగానే ఉన్నామన్నమాట! మన దేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలే దీనికి అద్దం పడుతున్నాయేమో! - సరస్వతి రమ ఆటమ్... అసహనమ్! రెండో ప్రపంచ యుద్ధంలో అటం బాంబ్‌ను ఉపయోగించడంలో యూదులు కీలకపాత్ర వహించారట. జర్మనీలోని నాజీల అసహనానికి గురైన యూదులు ఆ యుద్ధంలో నాజీల మీదే ఆటమ్బాంబ్ను ప్రయోగించాలని పథకం పన్నారు. కానీ వాళ్లు సరెండర్ కావడంతో ఆ బాంబ్ జపాన్‌మీద ప్రయోగించారట. ప్రపంచంలో ఎక్కువ అసహనాన్ని అనుభవించింది యూదులు అని చరిత్ర చెబుతోంది. మూడొంతుల ప్రపంచాన్ని ఆక్రమించిన రోమన్ సామ్రాజ్యం, దాని చక్రవర్తులు మొదట్లో పరమత సహనశీలురుగానే ఉన్నారట. పౌరులు చక్రవర్తికి విధేయులుగా ఉండాలనే పట్టింపు తప్ప వారి మతవిశ్వాసాల జోలికి వెళ్లలేదట. కానీ తర్వాత కాలంలోనే అధికార దురహంకారంతో పరమత అసహనానికి లోనయ్యారట. -
నదిలో ఈత ఒడ్డున ఆట
అల్లం రాజయ్య... తెలుగు సాహిత్యంలో తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చిన రచయిత రాత... చేత ఒక్కటై నడుస్తున్న వ్యక్తి! సామాజికార్థిక అంశాలే ఆయన కథలకు నేపథ్యాలు! ఈ చైతన్య స్రవంతి గోదావరితో తన జ్ఞాపకాలను పంచుకున్నారిలా... నేను పుట్టింది మంథని (కరీంనగర్ జిల్లా)దగ్గరున్న గాజులపల్లిలో. గోదావరి మా ఊరికి ఆరు కిలోమీటర్లు. మా ప్రాంతంలో శివభక్తులు ఎక్కువ. ప్రతి శివరాత్రికి దాదాపు వంద గ్రామాలవాళ్లు గోదావరికి వచ్చేవాళ్లు స్నానాల కోసం. మా చిన్నప్పుడు అదో అద్భుతమైన జ్ఞాపకం. తెల్లవారు జామున నాలుగు గంటలకే లేచి కచ్చడాలు కట్టుకొని అందరం గోదావరికి వేళ్లేవాళ్లం. ఎడ్లబళ్లు వరుసగా బారులు తీరి వెళ్తుంటే భలేగుండేది. హోలీ పండుగకైతే మా ఆటలన్నీ గోదావరితోనే. హైస్కూల్ వరకు మంథనిలో చదివాను. మంథనికి గోదావరి కిలోమీటరే. టైమ్ దొరికితే చాలు పిల్లలమంతా కలసి గోదావరికి వెళ్లేవాళ్లం. నదిలో ఈతలు... నది ఒడ్డున ఆటలు. ఊహ తెలిశాక... గోదావరితో పరిచయం వేరు. అది నేర్పే పాఠాలు వేరు. ఊహ తెలిశాక గోదావరి ఎన్నో పాఠాలు నేర్పడం మొదలు పెట్టింది. చుట్టూ అంత పెద్ద ప్రవాహం ఉన్నా పంటలకు చుక్క నీరందని పరిస్థితి..? ఎందుకు? అన్న ఆలోచన వచ్చింది. ప్రశ్నించడం స్టార్ట్ చేసి పోరాటం చేసే స్థాయికి వెళ్లాం. ‘మా నీళ్లు మాకెందుకివ్వరు’ అన్నది చాలా జన్యూన్ కాజ్! సమస్యను పరిష్కరించకుండా ఉద్యమాన్ని అణచివేశారు. గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం రైతుసంఘాలు పెట్టాం. సాహిత్య వేదికగా ప్రజాఉద్యమాల్లో భాగస్వామ్యం పంచుకుంటున్న విప్లవ రచయిత అల్లం రాజయ్య. ఆయన ప్రతి రచనా చైతన్య స్ఫూర్తే! అతడు, మహదేవుని కల, మనిషిలోపలి విధ్వంసం వంటి వంద కథలు, కొలిమంటుకుంది, ఊరు, అగ్నికణం, వసంతగీతం, కొమురం భీం వంటి నవలలూ రాశారు. గోదావరి పేరుతో... 1975లో ఉద్యోగ నిమిత్తం గోదావరి అవతలి నుంచి ఇవతలికి వచ్చాను. అంటే ఆదిలాబాద్ జిల్లాకు వచ్చాను. అక్కడున్నప్పుడే ‘గోదావరి’ కలం పేరుతో పొయెట్రీ రాశాను. కథలు రాశాను. కథల్లోను గోదావరి ఉండేది. ఆ మాటకొస్తే తెలంగాణ గోదావరి... వేల ఏళ్ల కిందటే అద్భుతమైన సాహిత్యాన్నిచ్చింది. అన్వేషణను నేర్పింది. అసలు ఈ రోజు దేశంలో ఎలాంటి ఉత్పత్తి సంబంధాలు ఉండాలి? మనుషులు ఎలా బతకాలి అనేది నేర్పింది. ఇన్నింటినిచ్చిన మా గోదావరి ఏం ఆశించింది? ఏమీ ఆశించలేదు. తాగ్యం నేర్పింది. జల్... జంగల్... జమీన్ అనే నినాదమైంది మాకు. మా గుండెల్లో పరుగులెత్తుతున్న గోదావరి అదే! సంభాషణ: సరస్వతి రమ గోదావరి తీరాన... పలుకుబడులు... వ్యవహారాలు! గోదావరి ప్రాంతంలోని సామెతలకు ఎంతో జనాదరణ ఉంది. గ్రామీణ జనం ఎక్కువగా వీటిని వాడుతుంటారు. ఇక్కడి జన వ్యవహారంలో, వ్యావహారిక భాషలో కలిసిపోయిన అనేక సామెతలలో కొన్ని. ఏదారంటే... గోదారన్నట్లు అంబటేరు వచ్చింది అత్తా అంటే... కొలబుర్ర నా చేతిలో ఉంది కోడలా... అన్నదట లంక మేత... గోదారి ఈత కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లు చొల్లంగి తీర్థానికి చోడిగింజలు బల్లకట్టు దాటాక బోడిమల్లయ్య అన్నట్లు ఏట్లో వేసినా ఎంచి వేయాలన్నట్లు పుస్తెల తాడు అమ్మి అయినా పులసలు తినాల్సిందే కొత్తనీటికి చేపలెదురెక్కినట్లు కాకినాడ కాజా, ఆత్రేయపురం తాండ్ర మజా పుణ్యానికని గోదారి స్నానానికెళితే మొసలి ఎత్తుకెళ్లిందట గోదాట్లో నీరెంత ఉన్నా కడవైతే కడివెడే, గరిటైతే గరిటెడే... ఏతాం పాటకు ఎదురు పాట లేదన్నట్లు ఏదారీ లేకపోతే గోదారే... గోదారమ్మొచ్చి గోరంత దీపం పెట్టిందన్నమాట... గోదారెండితే, రైతుల కడుపుమండినట్లేమరి... గోదారి నిమ్మనంగా... జనం చల్లంగా... గోదారి తల్లి పక్కనే ఉంటే ఉక్కపోతా తక్కువే... -
ఇంకెన్ని చావులు చదవాలి?
అక్షరాలను ఆస్వాదిస్తారనుకుంటే చావుని చప్పరిస్తున్నారు. ఊరికి మొనగాళ్లవుతారనుకుంటే ఉరికి బలైపోతున్నారు. ప్రకాశిస్తారనుకుంటే కిరోసిన్‌లో అగ్నిస్నానాలు చేస్తున్నారు. మనకు ధైర్యమిస్తారనుకుంటే... దగా చేసి వెళ్తున్నారు. అక్షరాలపై సవారీ చేస్తారనుకుంటే... అంపశయ్యలెక్కుతున్నారు. ఆకాశాన్ని తాకుతారనుకుంటే... మట్టికరుస్తున్నారు. చదవలేక, చావుని వాళ్లు కోరుకుంటుంటే... వాళ్ల చావుల్ని చదవలేక మనం కుమిలిపోతున్నాం. చదవలేక, కక్కలేక మింగుతున్న విషానికి విరుగుడు కావాలి. ఈ కడుపుకోతను మాన్పే చదువులను కనిపెట్టాలి. ఈ ఏడాది జూన్ 26 శుక్రవారం: గుత్తి మండలం, ఎంగిలిబండ గ్రామం. దేవరాజ్, లక్ష్మీదంపతుల కొడుకు ఎ. నారాయణస్వామి. గుత్తిపట్టణంలోని మహాత్మా జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) సెకండియర్ చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఫస్టియర్ మ్యాథ్స్ రెండు పేపర్లలో ఫెయిల్ అయ్యాడు. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయాడు. 25వ తేదీ గురువారం రాత్రి ఇంట్లో విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమించి శుక్రవారంనాడు ప్రాణాలు వదిలాడు. జూన్ 24 బుధవారం: యాడికి మండలం పి.వెంగన్నపల్లి గ్రామం. నాగేశ్వర్, రాజా మునీశ్వర్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి.. ముగ్గురూ మంచి స్నేహితులు. ఊళ్లోని జిల్లాపరిషత్ స్కూల్లో టెన్త్ చదువుతున్నారు. రాజా మునీశ్వర్‌రెడ్డికి చదువుకన్నా వ్యవసాయం అంటే ఇష్టం. నాగేశ్వరేమో ఇంటి గొడవలతో కలతచెంది ఉన్నాడు. చంద్రశేఖర్ రెడ్డి అమాయకుడు. మునీశ్వర్ రెడ్డి, నాగేశ్వర్లు ఎలా చెబితే అలా! మొత్తానికి రకరకాల వ్యక్తిగత కారణాల వల్ల ముగ్గురికీ చదువంటే అనాసక్తతే. పైగా ఇప్పుడు టెన్త్కొచ్చారు. అది బోర్డ్ ఎగ్జామ్ అని, చాలా కష్టపడి చదివితే కానీ పాస్ అవలేమని అంతా అంటుంటే భయం పెట్టుకున్నారు. దాంతో ఇంట్లో పోరు మొదలుపెట్టారు చదువుకోకుండా వ్యవసాయం పనులు చేస్తామని. వ్యవసాయం తర్వాత చెయ్యొచ్చు. ముందు చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని తల్లిదండ్రులు పిల్లలకు నచ్చచెప్పి బడికి పంపారు. కానీ వాళ్లు బడికి వెళ్లినట్టే వెళ్లి వేరుశనగ విత్తనాలను నిల్వచేయడానికి ఉపయోగించే విషపు గుళికలను మింగి ఆత్మహత్య చేసుకున్నారు. జూన్ 3 బుధవారం: కర్నూలుకి చెందిన పుల్లంరాజు (బీఎస్ఎన్ఎల్లో అధికారి), కుమారిల కూతురు స్వర్ణకుమారి. అనంతపురం మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ ఫస్టియర్ చేస్తోంది. సరిగ్గా చదవలేకపోతున్నాననే మానసిక ఒత్తిడికి లోనయింది. అదే విషయాన్ని ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేసుకుంది. జూన్ మూడో తారీఖున స్వర్ణ పుట్టిన రోజు. రెండో తారీఖు అర్ధరాత్రి కేక్‌కట్ చేసి ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంది. ఆనందంగా గడిపింది. ఇంతలో ఏమయిందో ఏమో... హాస్టల్లోని తన రూమ్ 121లో.. ఎవరూలేని సమయం చూసి ఫ్యాన్‌కి ఉరేసుకొని ఉసురు తీసుకుంది.. తండ్రికి ఉత్తరం రాసిపెట్టి మరీ. ఆ సూసైడ్ నోట్లో ... ‘మీరు నా కోసం చాలా కష్టపడుతున్నారు. కానీ నేను చదవలేకపోతున్నా. ఎంత చదువుతున్నా ఏమీ గుర్తుండట్లేదు. ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవుతా. నా ఫెయిల్యూర్ని మీరు తట్టుకోలేరు! సారీ డాడీ.. సారీ మమ్మీ! లవ్ యూ బోత్! ఫర్ గివ్ చేయండి!’ అని ఉంది. ఈ నాలుగూ ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క అనంతపురం జిల్లాలోనే జరిగిన సంఘటనలు. ఏడాది క్రిందట ఆగస్టు 28 గురువారం: నెల్లూరు జిల్లా దగదర్తి మండలం, తిమ్మారెడ్డిపాలెంకు చెందిన పందొమ్మిదేళ్ల సుభాషిణి టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేస్తుండేది. ఫస్టియర్‌లో ఒక సబ్జెక్ట్ తప్పింది. దానికి సంబంధించి ఏం మథన పడిందో ఏమో... సప్లిమెంటరీ పరీక్ష రాసిన రోజే అంటే 2014, ఆగస్ట్ 28 సాయంకాలం ఇంట్లో ఎవరూలేని సమయం చూసుకొని కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. చికిత్స పొందుతూ మరణించింది. అంతకుముందు ఏడాది విశాఖపట్నం, మధురవాడలోని గాయత్రి ఇంజినీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న ఓంకార్ తన సబ్జెక్టులు అర్థం కావడం లేదని, ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని తరచు స్నేహితులతో అంటుండేవాడు. ఆ క్రమంలో ఓ రోజు హాస్టల్లోనే ఉండిపోయాడు. లంచ్ బ్రేక్‌లో తోటి విద్యార్థులు వచ్చి చూస్తే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు! నిజామాబాద్ జిల్లా బడా భీమ్గల గ్రామానికి చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని గురజాల స్రవంతి కూడా ఇలా ఆత్మహత్య చేసుకున్న అమ్మాయే. ఆమె ఆదిలాబాద్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో థర్డ్ ఇయర్ చదువుతోంది. సెలవులకు ఇంటికి వెళ్లినప్పుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చదువులో ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అంతా అనుకున్నారు. ఒత్తిడిని తట్టుకోలేకే... పై సంఘటనల్లోని విద్యార్థుల నేపథ్యం వేరయినప్పటికీ వారందరి ఆత్మహత్యలకు కారణం ఒక్కటే... ఒత్తిడి. అయితే ఇవి మచ్చుకు కొన్ని సంఘటనలు మాత్రమే. ప్రయివేట్ స్కూళ్లు, కళాశాలలు, ఇంజనీరింగ్, మెడిసిన్ డిగ్రీల మీదున్న మోజు.. సమాజం వాటికి ఇస్తున్న విలువ.. ప్రతిభను ర్యాంకుల్లో కొలిచే పద్ధతి.. ఇవన్నీ పిల్లల మీద తెలియని ఒత్తిడిని మోపుతున్నాయి. తట్టుకోలేని సున్నిత మనస్కులైన విద్యార్థులు ఆత్మహత్యలతో అర్ధంతరంగా సెలవు తీసుకుంటుంటే తట్టుకొని నిలబడిన పిల్లలు యంత్రాల్లా మారుతున్నారు. ఈ రెండూ దుష్పరిణామాలకు దారి తీసేవే! ఇలాంటి పరిణామాలు సంభవించకుండా అటు టీచర్లు, ఇటు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. - సరస్వతి రమ, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఎప్పటికప్పుడు వాకబు చేస్తుండాలి ఇలాంటి ఘటనలను నివారించడంలో ఇటు తల్లిదండ్రుల పాత్రా, అటు టీచర్ల పాత్ర కూడా కీలకమే. ఇంట్లో పిల్లాడి ప్రవర్తనలో తేడాలొస్తే తల్లిదండ్రులు స్కూల్లో టీచర్లను వాకబు చేయాలి. అలాగే స్కూల్లో పిల్లాడు ఎవరితో కలవకుండా ఉంటుంటే టీచర్లు తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాలి. మొత్తంగా పేరెంట్స్, టీచర్స్ ఇంటరాక్ట్ అవుతూంటే ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరక్కుండా ఆపొచ్చు. అలాగే పేరెంట్స్ పిల్లల శక్తిసామర్థ్యాలను దృష్టిలో పెట్టుకునే భవిష్యత్ ప్రణాళికలు వేయాలి. - డాక్టర్ పి. వీరజారావు, సైకాలజిస్ట్ అండ్ అసిస్టెంట్‌ప్రొఫెసర్, ఉస్మానియా వ్యక్తిత్వ నిర్మాణానికి చోటు ఉండాలి చదువులు, మార్కుల విషయంలో పిల్లలపై ఒత్తిడి రావడానికి మూలకారణం వారి భావి జీవితం పట్ల పెద్దల్లో అభద్రతా భావం ఉండడమే. సమాజంలో ఏదో ఒక వృత్తి లేదా ఉపాధి లభించి గౌరవప్రదంగా జీవించడానికి అనువైన పరిస్థితులు ఏర్పడే వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. మన విద్యా విధానం విద్యార్థులను యంత్రాలుగా తయారు చేస్తోంది తప్ప జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలిగిన వ్యక్తిత్వ నిర్మాణానికి తోడ్పడడం లేదు. - ఎస్.గోవిందరాజులు, రాష్ట్ర కన్వీనర్, ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ -
పెళ్లా? తొందరేంటి!
పదిహేనేళ్ల క్రితం అమెరికాలో ఈ ధోరణి మీద ఏకంగా సినిమాయే వచ్చింది, జూలియా రాబర్ట్స్ నటించిన రనవే బ్రైడ్. పెళ్లికి సిద్ధమవుతుంది. పెళ్లిరోజు పారిపోతుంది. పెళ్లంటే అంత కన్ఫ్యూజన్ హీరోయిన్‌కి. ఇప్పుడు మనమ్మాయిలు కూడా, ‘పెళ్లిలో ఏముంది.. స్వేచ్ఛను పోగొట్టుకోవడమూ, టెన్షనూ తప్ప’ అని పెళ్లిని ఆమడదూరంలో ఉంచుతున్నారు. షి హాజ్ మూవ్డ్ ఫార్ అహెడ్. ఒకప్పుడు అమ్మాయి సెటిల్ అవడం అంటే ఒక అయ్య చేతిలో పడడం. ఇవాళ అమ్మాయి సెటిల్ అవడం అంటే కెరీర్లో మగవాడికి దీటుగా లేదా బెటర్‌గా నిలవడం. అలాంటప్పుడు పెళ్లికి వాటిజ్ ద హర్రీ అనుకుంటున్న అమ్మాయిలకు ఇది క్లారిటీయా... కన్ఫ్యూజనా తెలుసుకుందామని... ‘వెన్ ఈజ్ ది రైట్ టైమ్ టు గెట్ మ్యారీడ్?’ అంటూ కొత్త ప్రశ్నను లేవదీసింది ‘టైటాన్ రాగా’ వాచ్ యాడ్ ! ‘ఫ్రెండ్స్‌కి పెళ్లి అయిపోయిందని, చుట్టపక్కాలు అడుగుతున్నారని, వాలంటైన్స్‌డే రోజు ఒంటరిగా గడపాల్సి వస్తుందని, చెల్లెలు పెళ్లికి లైన్లో ఉందని, మాతృత్వపు ఘడియలు మించిపోతున్నాయని... పెళ్లి చేసుకోకు... యు ఫైండ్ ఎ మ్యాన్ హూ డిజర్వ్స్ యువర్ టైమ్... అప్పుడే పెళ్లి చేసుకో’ అంటూ కత్రినాకైఫ్‌తో చెప్పించింది. టైటాన్ లాంటి కంపెనీ, కత్రినా కైఫ్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకొని ఈ యాడ్‌ని తయారుచేసిందంటే అంత ఆషామాషీ వ్యవహారం అయ్యుండదు. ఎందుకంటే పెద్ద కంపెనీలు యాడ్ చేసేముందు మార్కెట్ రీసెర్చ్‌ను నిర్వహిస్తాయి. అంటే పెళ్లికి కరెక్ట్ టైమ్ ఏదీ అని చెప్పించే ముందు టైటాన్ కూడా అలాంటి రీసెర్చ్‌ను చేసే ఉంటుంది. అంటే టైటాన్ రాగా యాడ్‌లో కత్రినా చెప్పిన అభిప్రాయం టైటాన్ కంపెనీ చేసిన మార్కెట్ రీసెర్చ్‌కి అద్దం. ‘పెళ్లి బంధంలో ఉన్న అమ్మానాన్నలు హ్యాపీగా ఉన్నారా? తనకున్న స్వేచ్ఛాస్వాతంత్య్రాలు వాళ్లకున్నాయా? పెళ్లి వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకంగా ఉన్నప్పుడు మూడుముళ్ల కోసం తొందరపడ్డమెందుకు? మనసును అర్థం చేసుకున్న వాడు దొరికే దాకా ఆగుదాం’.. అనుకుంటున్న అమ్మాయిల భావమే ఆ యాడ్ అయి ఉండొచ్చు! ఈ నేపథ్యంలో అమ్మాయి పెళ్లికి ఏది సరైన సమయం అంటూ సాక్షి ఫ్యామిలీ కొందరిని అడిగింది.. వాళ్లు వెలిబుచ్చిన అభిప్రాయాలివి... - సరస్వతి రమ, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి తొందరపాటు తగదు ఏ విషయంలో తొందరపడినా సరిదిద్దుకోవచ్చేమోగానీ పెళ్లి విషయంలో తొందరపడితే మాత్రం సరిదిద్దుకోలేం. భర్త చెడు అలవాట్లు ఉన్నవాడు కావొచ్చు. ‘గే’గా రుజువు కావొచ్చు. కట్నం కోసం వేధించేవాడు కావొచ్చు. కాబట్టి మనసుకు నచ్చగానే పెళ్లి చేసేసుకోకూడదు. ఆ వ్యక్తి తగినవాడేనా అని బాగా ఆలోచించాలి. ఆ ఆలోచన సత్ఫలితాలను ఇచ్చిన టైమే పెళ్లికి రైట్ టైమ్. - జయసుధ, నటి రూలేం లేదు పెళ్లనేది వయసుతో కాదు మనసుతో ముడి పడినదని నా ఫీలింగ్. ఫలానా వయసులోనే పెళ్లాడాలని రూలేం లేదు. మనసుకు నచ్చిన వ్యక్తి ఎప్పుడు తారసపడితే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ 18ఏళ్ల వయసులోనే మంచి జీవిత భాగస్వామి దొరికితే చేసుకోవచ్చు. 70 ఏళ్ల తర్వాత దొరికినా చేసుకోవచ్చు. నా మటుకు నాకు రైట్ పర్సన్ దొరికినప్పుడే పెళ్లికి రైట్ టైమ్. - దీక్షా సేథ్, నటి ఏళ్లు వచ్చాయని పెళ్లి చేసేసుకోవాలా? పెళ్లనేది అంత సులభంగా తీసుకొనే నిర్ణయం కాదు. పదేళ్లుగా సినీ రంగంలో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నా. ఇక్కడ నుంచి మంచి భవిష్యత్తును నిర్మించుకోగలుగుతా. ఈ పరిస్థితుల్లో ప్రేమ, పెళ్లి అంటూ ఇప్పటికిప్పుడు దీన్ని వదులుకోదల్చుకోలేదు. - కంగనా రనౌత్, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’, ‘క్వీన్’ చిత్రాల హీరోయిన్ అప్పుడు పిల్లల్ని కనొద్దు అబ్బాయి కన్నా అమ్మాయి త్వరగా పరిణతి చెందుతుంది. కాబట్టి డిగ్రీ లేదా పీజీ అవగానే అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయ్యాలి. లేట్ అయితే అనారోగ్యంగా ఉన్న పిల్లలు పుట్టే ప్రమాదం ఉంది. ఒకవేళ ఉద్యోగం చేస్తూ పదేళ్లు ఎంజాయ్ చేశాకే పెళ్లి అనుకుంటే మాత్రం పిల్లల్ని కనకూడదు. సరికదా, అసలు పెళ్లి జోలికి వెళ్లకపోవడమే మంచిది. - స్వాతి సోమనాథ్, నృత్యకళాకారిణి నిర్ణయించుకునే శక్తి ఉండాలి తన జీవితానికి సంబంధించి తనే నిర్ణయాలు తీసుకోగలిగిన శక్తి అమ్మాయికి ఉన్నప్పుడే పెళ్లీడు వచ్చినట్టు. ఈ స్వయం నిర్ణయాధికారం ఎప్పుడు ఉంటుంది? ఆమె ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్ అయినప్పుడే కదా! - సి. వనజ, సీనియర్ జర్నలిస్ట్ పద్దెనిమిదే కరెక్ట్ నాకు 32 ఏళ్లు. వాళ్ల కన్నా నా శాలరీ తక్కువని, నేను పనిచేసే కంపెనీ చిన్నదని.. ఇలాంటి సిల్లీ రీజన్స్‌తో అమ్మాయిలు నన్ను రిజెక్ట్ చేశారు. ఈ ఎక్స్‌పీరియెన్స్ నాకో సత్యాన్ని తెలిపింది. అమ్మాయిలను ప్రొఫెషనల్ డిగ్రీస్ చదివించకూడదు. ఇదివరకటిలాగే పద్దెనిమిదేళ్లు నిండగానే పెళ్లి చేసేయ్యాలి. ఎయిటీన్ ఈజ్ ద కరెక్ట్ ఏజ్ ఫర్ గర్ల్స్. - ఎన్. అరవింద్, సాఫ్ట్వేర్ ఉద్యోగి మనసుకు నచ్చినప్పుడే... పెళ్లికి ఫలానా ఏజ్ అనేది ప్రాతిపదిక కాదు. అలాగే తల్లి కావడానికి బయోలాజికల్ క్లాక్నూనేను విశ్వసించను. ఈ రెండిటి ప్రాతిపదికగా పెళ్లి చేసుకొని తర్వాత నేనెందుకు ఈ పనిచేశానని బాధపడ్డవాళ్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి వ్యక్తిని కలిసినప్పుడు.. ఈ వ్యక్తితో జీవితం పంచుకుంటే బాగుండు అని అనిపించినప్పుడే పెళ్లి వయసు వచ్చినట్టు. - ఉమా సుధీర్, ఎన్డీటీవీ కరెస్పాండెంట్ మెచ్యూరిటీ వచ్చాకే... మన దేశంలో పెళ్లి అంటే కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే సంబంధమున్న అంశం కాదు.. రెండు కుటుంబాలతోనూ ముడిపడ్డ తంతు. కాబట్టి ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏ ఆడపిల్లకి ఆ ఆడపిల్ల.. ఏ జంటకు ఆ జంట యూనిక్. దీన్నర్థం చేసుకునే మెచ్యూరిటీ వచ్చినప్పుడే పెళ్లికి కరెక్ట్ టైమ్ అంటాన్నేను. - మాధవీలత గంజి, ఫ్యామిలీ కౌన్సెలర్, సోషల్ యాక్టివిస్ట్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఫస్ట్ ఎడ్యుకేషన్, తర్వాత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్.. ఈ రెండూ అమ్మాయికి తప్పనిసరి. వీటితో పాటు ఫిజికల్‌గా, మెంటల్‌గా మెచ్యురిటీ రావాలి. లైఫ్‌లో సెటిల్ అయ్యాను.. జీవితాన్ని పంచుకోవడానికి ఓ తోడు కావాలని అమ్మాయికి అనిపించినప్పుడే పెళ్లికి కరెక్ట్ టైమ్. ఆ తోడును సెలెక్ట్ చేసుకునే చాయిస్ కూడా అమ్మాయికే ఉండాలి. - బిందు నాయుడు, టీవీ సీరియల్ రచయిత్రి సపోర్ట్ చేస్తా... నేనైతే టైటాన్ రాగా యాడ్‌లోని కత్రినా ఒపీనియన్‌ని సపోర్ట్ చేస్తా. నేను రెండేళ్లుగా గూగుల్‌లో జాబ్ చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే లైఫ్ అంటే తెలుస్తోంది. ఆస్వాదిస్తున్నాను. ఇంకో టూ ఇయర్స్ వరకు పెళ్లి చేసుకోవద్దనుకుంటున్నా. నా పెళ్లికి అదే రైట్ టైమ్. అయితే పెళ్లి కొడుకును వెదికే బాధ్యత పేరెంట్స్‌దే. వాళ్లు చూసిన సంబంధాల్లో నాకు నచ్చిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకుంటా! - సుధా సురక్షిత రాణి, సాఫ్ట్వేర్ -
మహిళలను చూస్తే... మగాళ్లకెందుకో భయం!
కవర్ స్టోరీ ప్రతిరోజూ మహిళలది కావాలిగానీ, ఈ ఒక్కరోజును ప్రత్యేకంగా మహిళా దినోత్సవం అనడంలో ఔచిత్యం ఏమిటి? ఎందుకంటే, జనాభాలో దాదాపు సగభాగమున్న మహిళలు, అవకాశాల్లో మాత్రం సమభాగాన్ని నేటికీ అందుకోలేకపోతున్నారు కనుక. వెనుకబడిన దేశాల్లోనూ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ మాత్రమే కాదు, ఘనత వహించిన అగ్రరాజ్యాల్లోనూ మహిళలకు సమప్రాతినిధ్యం కరువే. అయినా ఏటా మహిళా దినోత్సవం రోజున మాత్రం మన పాలకులు మహిళల విజయగాథలను మననం చేసుకుని ఆనంద పరవశులైపోతారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలను, అన్యాయాలను తలచుకుని ఆగ్రహం చెందుతారు. ఆ రోజు గడచిపోయాక ఇక అంతా మామూలే. కనీసమైన హక్కుల కోసం పోరాడాల్సిన దుస్థితి మహిళలకు నేటికీ తప్పడం లేదు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లోని మహిళలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఇలా ఉన్నాయి... ఒక్క మహిళా దినోత్సవం నాడే కాదు పురుషులు పాల్గొంటే మేలు... మహిళాదినోత్సవం గత కొన్నేళ్లుగా ఎలా జరుగుతోందో మనందరికీ తెలుసు. కొన్ని ఉపన్యాసాలు, కొన్ని సన్మానాలు, ఆ ఒక్కరోజుకూ అందరు మహిళలకూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు; వారి ‘దినం’ మీద కొందరు పురుషోత్తముల ఛలోక్తులు; టీవీ ఛానెళ్లలో చర్చలు; దినపత్రికల్లో పేజీల కేటాయింపులు; పార్టీ కార్యాలయాల్లో మహిళా సభ్యులకు సన్మానాలు; కొన్ని దుకాణాల్లో డిస్కవుంట్లు - చెప్పిన కథలే చెప్పుకోవడాలు; విన్న సందేశాలే వినడాలు. ఈ మాటల వల్ల, సన్మానాల వల్ల ఫలితం ఏమిటి? ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరానికి ఏం సాధిస్తున్నాం? ఉన్నతోద్యోగాలలో మహిళల సంఖ్య పెరిగింది. సంపన్నుల జాబితాలో వాళ్లకూ చోటు దక్కుతోంది. నిజమే, కానీ మహిళలకు రాజకీయాల్లో తగిన ప్రాతినిధ్యం లేదు. మహిళలపై హింస (అత్యాచారాలు, హత్యలు, మానసిక హింసలు) ఏ మాత్రం తగ్గలేదు; బాలికల అక్షరాస్యత పెరగలేదు; స్త్రీలకు కుటుంబ భారం ఏ మాత్రం తగ్గలేదు; వరకట్న చావులు అంతరించలేదు. లైంగిక వేధింపులూ అదే స్థాయిలో ఉన్నాయి. మహిళాదినోత్సవం నాడు మళ్లీ ఇవన్నీ మాట్లాడుకుంటాం. ఆవేశపడతాం; ఆనందపడతాం. చాలా సభల్లో మాట్లాడేవాళ్లూ, వినేవాళ్లూ ఆడవాళ్లే. రోలూ, మద్దెల మాట్లాడుకున్నట్టు. దానికంటే ఎవరిలోనైతే మార్పు రావాలో వారి చేత మాట్లాడించి, వాళ్లను శ్రోతలుగా చేస్తే కొంత ప్రయోజనం ఉంటుంది. స్త్రీల పట్ల గౌరవం చూపే, స్త్రీల సమస్యలపై కృషి చేసే పురుషులను మహిళా దినోత్సవంలో పాత్రధారులను చేస్తే మంచిదేమో అనిపిస్తుంది. టీవీలో వచ్చే ప్రభుత్వ ప్రకటనలోలా, ‘‘మగపిల్లలను ఆడపిల్లలా ఏడవొద్దని చెప్తాం. ఆడపిల్లలను ఏడిపించవద్దని ఎందుకు చెప్పం?’’ బహుశా మహిళాదినోత్సవాన్ని పురుషులు ఎక్కువగా జరిపితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నేననుకుంటాను. - సి.మృణాళిని, కాలమిస్ట్, రచయిత్రి ముందడుగు వేయాలనే తపన ఉండాలి! మనకు అన్ని రంగాల్లోనూ అవకాశాలుంటాయి. వాటిని ఉపయోగించుకోవడానికి చొరవ చూపాల్సింది మనమే. ఉదాహరణకు స్పోర్ట్స్ రంగంలోకి రావడానికి చాలామంది వెనుకడుగు వేస్తుంటారు. కానీ క్రీడల వల్ల శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటాం. ఉన్నత చదువులు చదువుకోవడానికి స్పోర్ట్స్ కోటాలో సీటు తెచ్చుకోవచ్చు. క్రీడారంగంలోని వారికి ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. వృత్తి ప్రవృత్తి రెండింటిలోనూ రాణించవచ్చు. ముందడుగు వేయాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలి. అప్పుడే మహిళలు మగవాళ్లతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. - నైనా జైస్వాల్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి కొత్త స్ట్రాటజీ కావాలి విమెన్స్ మూవ్మెంట్ వల్ల మహిళలకు సంబంధించి కొత్త ఆలోచనలు, కొత్త చూపు వచ్చాయి. ఆచరణకు మాత్రం ఆమడదూరంలోనే ఉన్నాయి. నేడు విమెన్స్డేగా మనం జరుపుకుంటున్న నాటి పోరాటం వల్ల మహిళల సమస్యలను విశ్లేషించడం మొదలైంది. ఆ సమస్యలను గుర్తించడానికి మెథడాలజిస్ వచ్చాయి. బాగుంది... కానీ ఆ మూవ్మెంట్ డిఫరెంట్ లేయర్స్లోకి వెళ్లలేదు. ఇన్నేళ్లయినా మహిళలకు ఈక్వల్ రైట్స్ రాలేదు. తన జీవితానికి సంబంధించి ఆమె నిర్ణయాధికారం పొందలేదు. ఇప్పటికీ మహిళ పట్ల పరాధీన, సెక్సువల్ ఆబ్టెక్ట్ ధోరణే అమలవుతోంది. ఇది ఒక్క భారతదేశంలోనేకాదు, ఎంతో అభివృద్ధి చెందినవని చెప్పుకుంటున్న యూరోపియన్ కంట్రీస్‌లోనూ అంతే! స్త్రీ ఎదుర్కొంటున్న రేప్, డ్రెస్‌కోడ్ నిర్ణయించడం, కాప్ పంచాయితీలు వంటి బయటి హింస గురించే మాట్లాడుకుంటున్నాం కానీ ఇంట్లో హింసను చెప్పుకోవడంలేదు. కాబట్టి విమెన్స్ డేను ఒక ఉత్సవంగా జరుపుకొంటూనే వివిధ వర్గాల్లోని మహిళల సమస్యలను గుర్తించి, వాటిలో కామన్‌గా ఉన్న సమస్యలకు ఒక ఉమ్మడి ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసుకొని వాటి పరిష్కారం కోసం ఉద్యమం కొనసాగించాలి. నిర్భయ సంఘటన జరిగినప్పుడు వచ్చిన కదలిక మిగిలిన సమస్యల మీదా రావాలి. ప్రభుత్వ పాలసీల్లో మార్పు తీసుకురాగలగాలి. దానికోసం ఓ కొత్త స్ట్రాటజీని ఏర్పాటు చేసుకోవాలి! - విమల, కవి, రచయిత ఏం దినోత్సవమో ఏమో! ఏం మహిళా దినోత్సవమో ఏమో... ఇత్తులేసే దగ్గర నుంచి మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకునేవరకూ అన్నీ నేనే చేసుకోవాలే. ఇదే మా దినం. ఇదితప్ప నాకేం తెల్వదు. బిడ్డలుంటే ఏంది? ఎవరి తిప్పలు వాళ్లకుంటయి కదా! వికారాబాద్ దగ్గర చెంచల్పేట ఊరు మాది. రెండెకరాల పొలముంది. నా భర్తకు యాక్సిడెంట్ అయింది. రెండు లక్షలదాకా ఖర్చుపెట్టి వైద్యం చేయించిన. పొలంల అన్ని రకాల ఆకుకూరలు ఏస్త. రోజు పొద్దుగాలే ఐదింటికి బస్సెక్కి వచ్చి ఈడ సిటీల అమ్ముకుని సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి మర్రుత. మహిళారైతులకు ఆ సాయం చేస్తం, ఈ సాయం చేస్తం అని సర్కారోళ్లు చెప్తరు గాని ఏం చెయ్యరు. గిదోదో మహిళా దినముంటున్నరు కదా కనీసం ఆ రోజైనా మా రైతుల గురించి ఆలోచిస్తే బాగుంటది. - కసమమ్మ, మహిళా రైతు మనల్ని మనం విశ్లేషించుకోవచ్చు... పరిగెడుతున్న నేటి కాలంలో అందరం బిజీ అయిపోయాం. ఎందుకలా పరిగెడుతున్నామో అర్థం కాదు. ఏదో ఒక రోజు ఆగి మనల్ని మనం ప్రశ్నించుకోవడం, తెలుసుకోవడం, ఇంతవరకు జరిగిందేమిటి అని విశ్లేషించుకోవడం... ఇవన్నీ మన మంచికే! ఇలాంటి సమయంలో సమాజంలో నేటి స్త్రీ గురించి ఆలోచనాత్మకంగా మాట్లాడే నలుగురి మాటల వల్ల మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. లేకపోతే జీవితం అలా గడచిపోతూనే ఉంటుంది. అలాగే ఒక వేదికమీద అన్ని వర్గాల వారు కలిసి, స్త్రీల సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు మనమూ ఏదైనా చేయూతనివ్వగలమా అనే దిశగా ఆలోచిస్తాం. ఆ విధంగా సమాజానికి మనమూ కొంత సేవ చేసినవారమవుతాం. సమానత్వం కోసం పోరాడే క్రమంలో ఏయే శక్తులు అవసరమో కూడా తెలుసుకొని ఉండటం మంచిదే. అందుకే మహిళా దినోత్సవం లాంటి ఒక రోజు తప్పక ఉండాలి. - అలేఖ్య పుంజల, కూచిపూడి నృత్యకారిణి ఇది శుభ పరిణామం గత కొన్ని దశాబ్దాలుగా మహిళా ఉద్యమంలో యువతులు చాలా చురుగ్గా ఉన్నారు. నిజంగా ఇది సంతోషించదగ్గ విషయం. మహిళా ఉద్యమం జీవితంలోనే కాదు ప్రకృతిలో కూడా అంతర్భాగమనే విషయాన్ని తెలియజేస్తోందీ పరిణామం. - గీతా రామస్వామి ప్రచురణకర్త, హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ మూడు నెలల బతుకు ఏం దినమమ్మా... మహిళా దినమా? గారోజు ఏం చేస్తరు? మాలాంటి పేద మహిళలకు ఏమన్న ఇస్తరా? మాకు మా ఊర్ల దేవుని ఉత్సవాలు తప్ప ఇంకేదెల్వదు. మాది మెదక్ జిల్లా దగ్గర కంచెర్ల ఊరు. మేం ఏడంతా ఏదురుచూసేది ఎండకాలం కోసమే. ఈ మూడునెలలే కదా కుండలు అమ్ముడువోయేది. రోజంతా ఎండల గూసోని ఈ కుండలమ్ముకుంటేగాని మాకు బతుకు ఎల్లదు. ఎండకాలమొస్తనే నాకు చేతుల నాలుగు పైసలాడుతయి. ఆటితోనే ఏడంతా గడపాలే. పూర్వం ఊళ్ల వానాకాలం, చలికాలం పనులకు పోయేటోళ్లం. ఇప్పుడు పనులకు పోనీకి పంటలేడున్నయ్. ఈ సిటీల ఏదన్న పని చేసుకుందామంటే పని తక్కువ, మందెక్కువ. మీరంటున్న దినంనాడైనా మా పేద మహిళల కష్టాలు గుర్తుచేసుకుంటే మంచిగుంటది. - గంగమ్మ, కుండల వ్యాపారి మహిళలను చూస్తే... మగాళ్లకెందుకో భయం! ఫలానా రంగాలకే పరిమితం అనే పరిధుల్ని చెరిపేసి మహిళలు ముందుకెళ్తున్నారు. నేను చిత్రరంగాన్ని, రాజకీయరంగాన్ని దగ్గరగా చూశాను. మగవాళ్లలో మహిళ ముందుకెళ్తుంటే చూసి భరించలేని తత్వమే ఎక్కువ! మహిళల మీద జరుగుతున్న దాడులను చూస్తుంటే మనం ఆధునిక సమాజంలో ఉన్నామా, ఆటవిక సమాజంలో ఉన్నామా అనే సందేహం కలుగుతోంది. దీనంతటికీ కారణం... ఇంట్లో పిల్లలకు మంచీచెడూ చెప్పే పరిస్థితి తగ్గింది. పైగా విద్యావ్యవస్థలోనూ నైతికత గురించి పాఠాలు ఉండటం లేదు. మార్కెట్ ఆధారిత విద్యాంశాలకు పెద్ద పీట వేసే క్రమంలో మోరల్ ఎడ్యుకేషన్ పక్కకు తప్పుకొంది. దీనికి ఇళ్లల్లో ఇంటర్నెట్ అందుబాటులో ఉండటమూ ఓ కారణమే. పిల్లల్లో మార్పు వచ్చిందని తల్లిదండ్రులు గమనించే లోపే జరగాల్సిన అనర్థాలెన్నో జరిగిపోతున్నాయి. చైనాలో ప్రభుత్వమే ఈ బాధ్యత తీసుకుంది. ఇంటర్నెట్లో అభ్యంతరకరమైన సైట్లను బ్లాక్ చేసింది. అలాంటి నిర్ణయం మన ప్రభుత్వమూ తీసుకోవాలి. ఇన్ని అవరోధాలు ఎదురవుతున్నా మహిళ సవాళ్లను ఎదుర్కొంటూ మనోనిబ్బరంతో ముందుకు సాగుతోంది. వివక్ష రహిత సమాజ స్థాపన జరిగే వరకు ఇదే ధైర్యంతో నడుచుకోవాలి. - రోజా సెల్వమణి, నగరి ఎం.ఎల్.ఎ. (ఆంధ్రప్రదేశ్) ఈ దినం చేసే సాయం ఏమిటి? మహిళా దినోత్సవమా? మాలాంటి కూలోళ్లకు అలాంటి దినోత్సవాల గురించి ఏం తెలుస్తుంది! శ్రీకాకుళం జిల్లా నుంచి బతుకుతెరువుకి ఐదేళ్లక్రితం నగరానికొచ్చాం. మగోడి సంపాదన కడుపు నింపడానికే సరిపోవడం లేదు. పిల్లల్ని చదివించుకోవాలంటే మాలాంటి పేదోళ్లు తట్ట ఎత్తక తప్పడం లేదు. సంటిపిల్లల్ని చంకనెత్తుకుని పనులకొస్తున్నాం. లేదంటే పస్తులే. మాకుండే సమస్యలు, వచ్చే రోగాలు, పడే తిప్పలు ఇంట్లోవాళ్లతో చెప్పుకునే అవకాశం లేనప్పుడు పనిచేసే చోట మాతోటోళ్లతో చెప్పుకుంటాం. వాళ్లు చెప్పే ఓదార్పు మాటలు మాకు చానా సాయం చేస్తాయి. మగోడిలా కష్టపడుతున్న ఆడోళ్లకు ఈ దినం చేసే సాయమేందో మాబోటోళ్లకు తెలియదు. - కుమారి, భవన నిర్మాణ కార్మికురాలు గౌరవంగా చూసిన రోజే... స్త్రీల వేషధారణ మీద ఇటీవల చాలా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒక ఇంట్లో అమ్మాయి జీన్స్ వేసుకోవడం సాధారణంగా కనిపిస్తే, అదే మరో ఇంట్లో అసాధారణంగా కనిపించవచ్చు. ఇది చాలా మంది ఒప్పుకోని నిజం. స్త్రీ వ్యక్తిత్వాన్ని చులకనగా చూసే భావం మగవారిలో పోవాలి. ప్రకృతి పరంగా స్త్రీ కన్నా పురుషుడు బలవంతుడు అయ్యి ఉండవచ్చు. కానీ, మహిళకు మగవారికన్నా శక్తియుక్తులు వెయ్యి రెట్లు అధికంగా ఉన్నాయి. ప్రేమ, ఓర్పు, క్షమల్లో స్త్రీదే ప్రథమ పాత్ర. అంతటి శక్తిమంతురాలిని చిన్ననాటి నుంచి తల్లిదండ్రులే తమ పెంపకంలో తేడా చూపి వెనుకబాటుతనానికి లోను చేస్తుంటారు. వంట చేసే పని ఉంటే అమ్మాయిని చేయమంటారు. బయటకు వెళ్లే పని ఉంటే అబ్బాయిని పంపుతారు. ‘ఫలానా పని అమ్మాయిది, ఫలానా పని అబ్బాయిది’ అనే తేడాలు పోవాలి. - శిల్పారెడ్డి, మోడల్, డిజైనర్ పెళ్లయితే ఉద్యోగం మానాలా? మా దగ్గర బిటెక్, ఎంటెక్ చదివిన అమ్మాయిలు హఠాత్తుగా ఓ రోజు ‘పెళ్లి కుదిరింది, అత్తగారి తరఫు వాళ్లు ఉద్యోగం మానేయమంటున్నారు’ అంటుంటారు. పెళ్లయితే ఉద్యోగం మానేయడం ఎందుకు? స్థూల జాతీయోత్పత్తి పెరగాలని ప్రణాళికలు సిద్ధం చేసే పాలనా యంత్రాంగాలు సగం మానవ వనరులను నిరుపయోగంగా వదిలేసి అభివృద్ధి ఎలా సాధించగలమని ఆలోచించడం లేదు. అభివృద్ధి చెందిన ఏ దేశాన్నయినా చూడండి... మహిళలు, మగవాళ్లు ఇద్దరూ పనిచేస్తారు. పని అంటే ఉద్యోగమే కాదు. చేతనైన పని ద్వారా కుటుంబానికి ఆర్థిక స్వావలంబన చేకూర్చడం! అదే జరిగిన రోజు భర్త చనిపోతే ఇల్లు గడవక వీధిన పడే కుటుంబాలే ఉండవు. - సుచిత్ర ఎల్లా, మేనేజింగ్ డెరైక్టర్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అలాగైతే రోజూ ఉత్సవమే! విష్ యు హ్యాపీ ఉమెన్స్‌డే. ఇది మహిళలే కాదు అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. మహిళల విజయాలు, కష్టాలు మహిళలకు మాత్రమే సంబంధించినవనుకోవడం వల్లే సమస్యలు పెరుగుతున్నాయి. మహిళకు కష్టం వచ్చిందంటే సమాజానికి కూడా సమస్య వచ్చినట్టేనని గుర్తించాలి. స్త్రీ రక్షణ ఒక్క పోలీసులదే కాదు. మహిళలపై పెరుగుతున్న దాడుల సంఖ్య మన సమాజం పోకడని నిర్ణయిస్తుంది. మా డిపార్టుమెంట్ తరపున షీ టీమ్ చక్కగా పనిచేస్తోంది. ఇక్కడ నేను సంతోషంగా చెప్పే విషయం ఏంటంటే... చాలామంది మగవాళ్లు ‘మేం ఏ రకంగా సహకరించగలము’ అంటూ మా షీ టీమ్‌ని సంప్రదిస్తున్నారు. ఇలాంటి మార్పు మహిళలకు రోజుకో మహిళాదినోత్సవాన్ని ఇస్తుంది. - స్వాతి లక్రా, అడిషనల్ సిపి, క్రైమ్ రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి, సరస్వతి రమ, నిర్మలారెడ్డి, భువనేశ్వరి -
కంటే కొడుకునే కనాలి!
అప్పుడెప్పుడో.. ఉయ్యాల్లోనే బిడ్డల పెళ్లిళ్లు అవడం విన్నాం.. కొండొకచో కన్నాం కూడా! ఇప్పుడు ఉయ్యాల్లో బిడ్డల్ని విక్రయించడం సర్వసాధారణం!. ఎక్కడో నాగరికత (మనమనుకునే నాగరికత) లేని ప్రాంతాల్లో కాదు.. ఇక్కడే ఈ నగరం నడిబొడ్డునే!. - సరస్వతి రమ కొన్ని నెలల కిందట జరిగిన సంఘటన.. ఒక తల్లికి అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు. కొడుకు కోసం నాలుగో కాన్పూ చూసింది అత్తింటి వాళ్లు వంశాంకురం కావాలన్నారని. ఆ వంశం గొప్పదనం నాలుగు కాలాలకు కాదుకదా.. కనీసం ఆ నాలుగు కాలనీలక్కూడా తెలియదు. కొడుకు లేక ఆస్తి దాయాదుల పాలవుతుందేమో అని అనుకోవడానికి ఏడు తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిపరులూ కారు. ఆ మాటకొస్తే ఈ తల్లి పురిటికీ పైసల్లేవ్. అయినా నాలుగో కాన్పుకీ సాహసం చేసింది. ఆడపిల్లే పుట్టింది. ఆ బిడ్డను చూసి కన్నతల్లి సహా భర్త, అత్తమామలంతా ముఖాలు ముడుచుకున్నారు. పాలు పట్టనివ్వలేదు మళ్లీ అమ్మాయే పుట్టేసరికి రెండు రోజులు బాధపడ్డా మూడోరోజు సర్దుకుంది తల్లి. పసిబిడ్డను అపురూపం చేయసాగింది. ఇది సహించలేకపోయారు అత్తింటి వాళ్లు. ఆకలితో ఏడుస్తుంటే పాలు పట్టబోతుంటే బిడ్డను లాక్కుపోయారు. ఊపిరి బిగబట్టి ఏడుస్తున్న పిల్ల సొమ్మసిల్లి పోయే వరకు చోద్యం చూశారు తప్ప తల్లికి ఇవ్వలేదు. కన్నపేగు కదులుతుంటే బిడ్డనివ్వమని అత్త కాళ్లు పట్టుకుంది, భర్తనూ బతిమాలింది. ఈడ్చి తన్నారు. ఆ దెబ్బకు స్పృహ కోల్పోయింది ఆమె. ఆ తర్వాత తేరుకొని చూస్తే ఇంట్లో చంటిపిల్ల లేదు. చిట్టిచెల్లెలు కోసం ఇల్లంతా వెతుకుతున్న తల్లిని చూసిన ముగ్గురు బిడ్డలు ‘అమ్మా.. చెల్లెల్ని నాన్న, నానమ్మ ఎవరికో ఇచ్చి పైసలు తీసుకున్నరు’అని చెప్పారు. తల్లి నెత్తిమీద పిడుగు పడ్డట్టయింది. నిలదీద్దామంటే, ఇంట్లో ఆ ఇద్దరూ లేరు. వచ్చాక అడిగితే ‘ఐదువేలకు అమ్మేసినం. నీ డెలివరీ ఖర్చెక్కడి నుంచి తెస్తం’ అని ఎదురుప్రశ్న వేశారు. ఆ మాటలు విన్న తల్లి హతాశురాలైంది. ఇప్పుడు.. ఇది జరిగి తొమ్మిదినెలలైంది. ఇప్పటికీ ఆ బిడ్డ తలపుల్లో ఆ తల్లి పిచ్చిదైపోయింది. ‘చంటిది ఏడుస్తుంది పాలు పట్టాలే’ అంటూ తిరుగుతుంటుంది. తల్లి ఆలనాపాలనా లేక మిగిలిన ముగ్గురు ఆడపిల్లలూ బాధపడుతున్నారు. ఆ ముగ్గురులో ఆఖరు పిల్లను మాత్రమే స్కూల్‌కి పంపించి తతిమా ఇద్దర్ని ఇంట్లో పనికి నానమ్మకు సాయంగా ఉంచాడా తండ్రి. అయితే అటు బిడ్డను అమ్ముకున్నామన్న పశ్చాత్తాపం ఇటు ఆ భర్తలోకానీ, అత్తలో కానీ లేశమాత్రం లేవు. భార్య మతిస్థిమితం కోల్పోయిందని ఈమధ్యే రెండో పెళ్లికీ ప్రయత్నిస్తే కాలనీవాసులు దాన్ని తప్పించారట. రెండో పెళ్లి ద్వారా అయినా కొడుకుని కనాలని వాళ్ల ఆశ. సభ్యసమాజంలోని మనుషుల తీరు ఇది! -
ఏం చేయాలి అక్కా..!
అమ్మాయిలు అన్నిట్లో ముందుండాలి.. సగం అవకాశాలను అందుకుంటూ ఆకాశంలో సగమై కనిపించాలి! ఆశ బాగుంది.. సాధించాలనే ఆరాటమూ ఉంది.. ప్రయత్నమూ కనిపిస్తోంది.. ఇదే తీరులో ఆ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే శక్తులూ వీలున్న చోటల్లా తమ వికారాన్ని ప్రదర్శిస్తునే ఉన్నాయి!. అందుకు ఓ ఉదాహరణ.. - సరస్వతి రమ ప్రశాంతి (పేరు మార్చాం) స్పోర్ట్స్ గర్ల్. ఎనిమిదో తరగతి చదువుతోంది. తను ఆడే గేమ్‌లో మెరుపు కదలికలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తుంది. తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. ఊళ్లో వ్యవసాయం చేసుకుంటారు. తను పట్టణంలోని హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. చిన్నప్పటి నుంచి ఆటలంటే ప్రాణం. బిడ్డ ఆసక్తికి అడ్డుకట్ట వేయకుండా.. ఆడపిల్ల అయినా అన్నిట్లో ఉండాలనే కోరికతో పట్నంలో ఉంచారు. ప్రతి టోర్నీలో ప్రశాంతి గెలుపు ఆ తల్లిదండ్రుల్ని మురిపిస్తూనే ఉంది. ఈ మధ్య.. పిల్ల బాగా భయపడుతోంది. ఇదివరకటి ఉత్సాహం కనిపించట్లేదు. ప్రాక్టీస్‌కి వెళ్లాలంటే భయంతో చెమటలు పడుతున్నాయి. తన క్లాస్మేట్స్, ఆటలోని బ్యాచ్‌మేట్స్ గమనించారు. కారణం అడిగితే చెప్పట్లేదు. సెల్‌ఫోన్ రింగవుతుంటే చాలు నిలువెల్లా వణికిపోతోంది. ఈ అమ్మాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్లేయర్ (జూనియర్). అదే ఆటకు చెందిన తెలంగాణ స్టేట్ ప్లేయర్స్‌తో మంచి స్నేహం ఉంది. సీనియర్స్‌ని అక్కా.. అంటూ ఆప్యాయంగా మాట్లాడుతుంది. వాళ్లూ ఈ పిల్లను అంతే ఇదిగా చూస్తారు. ఆ చనువుతోనే ఓ అక్కకు తన ప్రాబ్లం చెప్పాలనుకుంది. ఫోన్ చేసింది.. ‘అక్కా.. సర్ (ఆ అమ్మాయి ఆడే ఆటకు సంబంధించిన ఆ స్టేట్ అథారిటీలోని ఒక అధికారి) నన్ను ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నాడక్కా.. ముద్దు పెట్టుకొమ్మని కూడా అడుగుతున్నాడు. ఊరికే ఫోన్ చేయమని సతాయిస్తున్నాడు. నేను చేయకపోతే తనే చేస్తున్నాడు. అక్కా.. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ విషయం అమ్మావాళ్లకు చెబితే.. అన్నీ మానిపించి ఊరికి తీసికెళ్లిపోతారు. నేను చదువుకోవాలి.. ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా మంచి పేరు సంపాదించుకోవాలి.. ఎలా అక్కా?’ అంటూ బాధను, భయాన్నీ పంచుకుంది. ‘మీ పేరెంట్స్‌కే చెప్పు’అని చెప్పాలనిపించింది ఆ అక్కకు. కానీ తనూ భయపడింది. ఇలాంటివుంటాయని తెలిస్తే తనింట్లో పేరెంట్స్ తనని ఇంటికే పరిమితం చేస్తారు. ‘ఇలా అయితే మళ్లీ పాతరోజులకి వెళ్లడం ఖాయం. ఎవరూ ఆడపిల్లల్ని చదివించరు, తమ లక్ష్యాలను నెరవేర్చుకునే ఛాన్స్ ఇవ్వరు. కానీ ఈ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేయాలి.. ఎలా?’ ఆలోచనల్లో పడింది ఆ సీనియర్! ఇది తాజా సంఘటన. నిన్నమొన్న జరిగిందే! పరిష్కారం ఇంకా దొరకలేదు. ఈ అంశాన్ని మీరు చదివేటప్పటికి కూడా ఆ అధికారి నిర్వాకం బయటపడి ఉండకపోవచ్చు!. ఓ వైపు అంగారక గ్రహం మీద జీవి జాడలు తెలుసుకునేంత విజ్ఞానం.. ఇంకోవైపు భూగ్రహం మీదఆడబిడ్డలను కాపాడుకోవడంలో ప్రాథమిక దశలో కూడా లేని జ్ఞానం! ఈ అసమతుల్యం ఎప్పుడు పోయేను.. బిడ్డలు ఆకాశంలో సగమై ఎప్పుడు నిలిచేను?. -
యకీన్ కా ధోఖా...
ఇది కంచే చేను మేసే సామెతను తలపించే సంఘటన.. బాల్యం చేదు జ్ఞాపకంగా మిగిలినా ముందున్న జీవితాన్ని అందంగా మలచుకోవాలనుకుంటున్న బాలిక కథ! ఆమె పేరు రష్మీ (పేరు మార్చాం). వయసు పదమూడేళ్లు! ..:: సరస్వతి రమ సబిత, మోహన్ (పేర్లు మార్చాం)లకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. స్వస్థలం ఒడిశా. పెద్ద కూతురికి ఎనిమిదేళ్లకే పెళ్లి చేశారు. ఆ పిల్ల అత్తగారి కుటుంబంతో కలసి వలస కూలీగా దేశమంతా తిరుగుతోంది (ఇంతకుమించిన వివరాలేమీ చెప్పలేదు సబిత). రెండో సంతానం కొడుకు. చదువు కోసం ఆ పిల్లాడిని తన తల్లి దగ్గరుంచి ఇటుక బట్టీ కూలీగా ఆ ఊరు, ఈ ఊరు తిరుగుతూ నిజామాబాద్ చేరాడు మోహన్ చిన్న బిడ్డ రష్మీని, సబితను వెంటబెట్టుకొని. ఇది ఆరేళ్ల నాటి సంగతి. అప్పుడు రష్మీకి ఏడేళ్లు. ఆ చిట్టిచేతులూ ఇటుకలు మోసి కాయలు కాశాయి. అక్కడ కొన్నాళ్లున్నాక హైదరాబాద్ బయలుదేరింది ఆ కుటుంబం. ఇక్కడ.. తెలిసినవాళ్ల ద్వారా పాతబస్తీలో మకాం పెట్టారు. పక్కనే ఉన్న ముస్లిం పిల్లలతో పాటు రష్మీ గోట్లు (లక్కగాజులు) తయారుచేసే కార్ఖానాలో పనికి వెళ్లేది. ఆ బస్తీలోనే ఉన్న రెండు మార్వాడీ ఇళ్లల్లో పనిచేసి తనూ అదే కార్ఖానాలో పని చూసుకుంది సబిత. మొదట్లో ఏదో ఒక పని చేసే మోహన్ తర్వాతర్వాత తాగుడుకు బానిసయ్యాడు. కొన్నిరోజులకి నల్లమందూ అతని ఒంటికి పట్టింది. ఆ మత్తు విచక్షణను మింగేసింది. ఉదయం ఏడింటికి వెళ్లి మధ్యాహ్నం మూడింటికల్లా ఇంటికి వచ్చేది రష్మీ. సబితేమో ఆరుగంటలకల్లా వచ్చి మళ్లీ సాయంకాలం ఇళ్లల్లో పనికి వెళ్లేది. తల్లి ఇంటికొచ్చేదాకా నిద్రపోయేది ఆ పిల్ల. ఒకరోజు.. కార్ఖానా నుంచి బాగా అలసిపోయి వచ్చిందో ఏమో ఆదమరిచి నిద్రపోయింది రష్మీ. మత్తు నెత్తికెక్కిన మోహన్‌కి రష్మీ కూతురులా కనిపించలేదు. గాఢనిద్రలో పీడకల వచ్చినట్టుగా ఉలిక్కిపడి లేచిన రష్మీ.. తండ్రి రూపం చూసి భయంతో కేకలేసింది. గింజుకుంది, పారిపోయే ప్రయత్నం చేసింది. శక్తి చాలలేదు. రెండేళ్లు.. సబిత ఇంటికి వచ్చేటప్పటికి వాతావరణంలో తేడా కనిపించింది. బిడ్డ ఒంటిమీది బట్టలు చెదిరి సొమ్మసిల్లి పడి ఉంది. కూతురిని ఆ స్థితిలో చూసి నెత్తిపట్టుకొని ఏడ్చింది. బిడ్డను హాస్పిటల్‌కు తీసుకెళ్దామని తోడు కావాలని భర్తకోసం చూసింది. కనపడలేదు. పక్కింటి వాళ్ల సహాయంతో హాస్పిటల్‌కు వెళ్లింది. స్పృహలోకొచ్చిన రష్మీ మగమనిషిని చూస్తేనే వణికిపోసాగింది. ఈ లోకంలోకి రావడానికి రెండు రోజులు పట్టింది. అప్పుడు చెప్పింది జరిగిన విషయం.. తల్లి గుండెలో తలపెట్టి ఆమె పైటచెంగును గట్టిగా పిడికిలిలో బిగిస్తూ! ఇంటికి తీసుకొచ్చాక ఆ ఇంట్లో క్షణం కూడా ఉండలేకపోయిందా పిల్ల. తల్లిని వదిలితే ఒట్టు. బిడ్డ పరిస్థితి చూసి పక్కనే ఉన్న బ్యాంక్‌కాలనీలోని సునీత అనే టీచర్ సబితకు నచ్చచెప్పి రష్మీని తనింటికి తీసుకెళ్లింది. రష్మీని మామూలు మనిషిని చేయడానికి సునీతకి రెండేళ్లు పట్టింది. ఇప్పుడు.. రష్మీ 5వ తరగతి చదువుతోంది. సునీత దగ్గరే ఉంటోంది. ఓ ఏడాదిన్నర కిందట సబితకు మోహన్ జాడ తెలిసినా ఎవరకీ చెప్పలేదు.. అలాగని తనింటికి రానివ్వనూ లేదు. ఇప్పుడు ఆమెకు బిడ్డ క్షేమమే ముఖ్యం. ఆ బిడ్డకు చదువే లక్ష్యం. పాతగాయం.. అప్పుడప్పుడూ కలవరపెట్టినా భయపడట్లేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది. జిజియాబాయి, ఝాన్సీబాయిల కథలు ఇష్టంగా చదువుతుంది. ఎక్కువగా మాట్లాడదు.. పెదవులపై చిరునవ్వు చెరగనీయదు. ‘బాగా చదువుకోవాలి.. సావిత్రిబాయి పూలేలా మంచి టీచర్ కావాలి’ అంటుంది. -
పసి హృదయాలపై గాయం
నేటి బాలికలే రేపటి మహిళలు. మరి ఆ రేపటి మహిళలు ఇప్పుడెంత సేఫ్‌గా ఉన్నారు? ఇంట్లోనో, స్కూల్లోనో, ఆట స్థలాల్లోనో ఎక్కడో ఓ చోట... ఏదో ఓ సమయంలో వేధింపులకు గురవుతున్నారు. బంధువులో, ఇరుగుపొరుగు వారో... ఎవరైతేనేం మృగాళ్లు... ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చిన్నారులను మొగ్గలోనే చిదిమేస్తున్నారు. మన నగరమూ అందుకు మినహాయింపేమీ కాదు. దేశం మొత్తం బేటీ బచావో అంటోంది? మరి హైదరాబాద్ మాటేమిటి? రానున్న మార్చి 8 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో చిన్నారుల స్థితిగతులపై వరుస కథనాలు.. ..:: సరస్వతి రమ నగరంలోని పాతబస్తీ... షాహీన్ ఉమెన్స్ రిసోర్స్ సెంటర్. మధ్యాహ్న సమయం... ఓ పదేళ్ల అమ్మాయి చాపమీద ఓ పుస్తకాన్ని పరుచుకుని, వంగి తదేకంగా పెన్సిల్‌తో డ్రాయింగ్ వేస్తోంది. పక్కనే మరో అమ్మాయి ఈ లిటిల్ ఆర్టిస్ట్‌కి సలహాలిస్తోంది. ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లు. ఒక అమ్మాయి పేరు సనా. పన్నెండేళ్లున్న వాళ్లక్క పేరు నేహ. ఇక్కడెందుకున్నారు? అనేగా సందేహం. నేహ, సనా మెహమూదా బేగం పిల్లలు. పాతబస్తీలోని తలాబ్‌కట్టలో ఉంటుందీ కుటుంబం. ఎనిమిదేళ్ల కిందట నేహ, సనా తండ్రి చనిపోయాడు. పెయింటర్‌గా పనిచేస్తున్న మహ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది మెహమూదా బేగం. ఆ ఇద్దరికీ ఓ పాప. జీవితం సాఫీగా సాగిపోతే వాళ్ల ప్రస్తావనే ఇక్కడ వచ్చేది కాదు. ఏమైంది? కొన్నాళ్లకి సవతి తండ్రి ఇస్మాయిల్ అంటేనే నేహ, సనాలిద్దరూ వణికిపోసాగారు. కారణం నేహతో సవతి తండ్రి ఇస్మాయిల్ ప్రవర్తన. ‘అబ్బా(నాన్న) సిగరెట్ కాల్చి అక్క చేతులు, నుదుటిమీద వాతలు పెట్టేవాడు. ఓ సారైతే అక్క బట్టలు చించి తననేదో చేయబోయాడు’ అని ఆ భయంకరమైన ఘటనను వణుకుతూ గుర్తు చేసుకుంది సనా. భర్త ప్రవర్తన చూసిన మెహమూదా, షాహీన్ సంస్థ సహాయంతో పిల్లలిద్దరినీ హాస్టల్లో వేసి చదివించాలనుకుంది. విషయం పసిగట్టిన ఇస్మాయిల్ ఎత్తువేసి తన కూతురితోపాటు సనాని తీసుకుని బీజాపూర్ వెళ్లాడు. తను చెప్పినట్లు వినకపోతే సనా జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. అంతేకాదు పెద్ద కూతురు నేహ పట్ల తనకున్న కోరికను చెప్పాడు. అసలు మెహమూదాను పెళ్లి చేసుకుందే నే హ కోసమని మనసులో ఉన్న దురుద్దేశాన్ని వెళ్లగక్కాడు. భర్త దురాలోచన విన్న మెహమూదాకు వెన్నులోంచి వణుకొచ్చింది. ఎలాగైనా తన పిల్లలను రక్షించుకోవాలనుకుంది. భర్తతో పోరాటానికి సిద్ధమైంది. షాహీన్ నిర్వాహకురాలు జమీలా నిషాత్ సహకారంతో భవానీ నగర్ పోలీస్ స్టేషన్లోభర్త మీద కిడ్నాప్ కేసు పెట్టింది. మూడు రోజుల తరువాత పోలీసులు ఇస్మాయిల్‌ను రప్పించారు పిల్లలతో సహా. అయితే పోలీసుల కన్నుగప్పి భార్యా, పిల్లలను తీసుకొని తలాబ్కట్టనుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు ఇస్మాయిల్. అతనితో ఎప్పటికైనా ప్రమాదమేననుకున్న నేహ, సనాలిద్దరిని తీసుకుని షాహీన్ సంస్థ గడప తొక్కింది. ఇప్పుడు... గతం తాలూకు భయం వీడి నేహ, సనాలిద్దరూ స్వేచ్ఛగా బతుకుతున్నారు. హాయిగా చదువుకుంటున్నారు.‘బాగా చదువుకుని పెద్దయ్యాక టీచర్నవుతాను. నాలాంటి పిల్లలకు చదువు చెప్తాను. ఆడపిల్లగా పుట్టినందుకు ప్రౌడ్‌గా ఫీలవమని చెప్తాను’ అని అంటుంది నేహ. ‘అబ్బా.. రోజూ తాగొచ్చి అమ్మను కొట్టేవాడు. ఇంట్లోకి డబ్బులిచ్చేవాడు కాదు. ఎప్పడూ గొడవలే. భయంభయంగా గడిపేవాళ్లం. ఇప్పుడు మాకు బాగుంది. నచ్చిన పని చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను నాకు నచ్చిన బొమ్మలేసుకుంటున్నాను. పెద్దయ్యాక మంచి ఆర్టిస్టు కావాలనుకుంటున్నా’ అని చెబుతుంది సనా... వేసే బొమ్మ మీద నుంచి దృష్టి మరల్చకుండానే! -
షోవియట్
2014.. ఫోర్త్ జులై.. సంగీత దర్శకుడు కీరవాణి జన్మదినం సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలి’ ఆయన ఇంటర్వ్యూని ప్రచురించింది. అందులో ‘మీకు దొరకవు అనుకుంటున్నవేంటి?’ అన్న ప్రశ్నకు ఆయన చెప్పిన అయిదు అంశాల్లో ‘తీమోర్.. అతని దళం’ అన్న రష్యన్ పుస్తకం పేరు కూడా ఉంది. ఆ రోజు సాయంకాలానికల్లా కీరవాణి మెయిల్‌కి ఆ పుస్తకం పీడీఎఫ్ రూపంలో వచ్చింది. అది చదివిన కీరవాణి ఆ మెయిల్ పంపిన వ్యక్తి ఫోన్ నంబర్ కనుక్కున్నారు. రాత్రి పదింబావుకు ఆ వ్యక్తికి ఫోన్ చేసి ‘థ్యాంక్స్ అండీ.. నా బర్త్‌డేకి మంచి గిఫ్ట్ పంపినందుకు’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఇలా సోవియట్ సాహిత్యాన్ని ఇష్టపడేవారికి, చదవాలని ఆశపడేవారికి ఆన్లైన్లో చేరవేస్తున్న వ్యక్తి అనిల్ బత్తుల. ఆన్లైనే కాదు ఆఫ్‌లైన్ తెలుగు సాహితీ ప్రియులకూ సుపరిచితుడాయన! ఒకప్పటి సోవియట్ లిటరేచర్ను ఈ తరానికి అందిస్తున్న ఆ సాహితీ గని పరిచయం... ..:: సరస్వతి రమ http://sovietbooksintelugu.blogspot.in/2014/07/blogpost_34.html అనిల్‌కి వాళ్లమ్మ వల్ల పుస్తకాలు పరిచయం అయ్యాయి. చిన్నప్పుడు ఓ పత్రికలో డైలీ స్ట్రిప్‌గా వచ్చే నండూరి రామ్మోహనరావు ‘కాలయంత్రం’ సీరియల్‌ను చదివాడు. దాన్ని ఓ పుస్తకంలా కుట్టుకొని మరీ దాచుకున్నాడు. కాలక్రమంలో అది ఎక్కడో పోయింది. పెద్దయ్యాక దాని గురించి ఎంత వెతికినా దొరకలేదు. అదే పుస్తకాల సేకరణకు నాంది పలికింది. ఒకసారి ఆయన ప్రముఖ కవి శివారెడ్డి కుమారుడు శ్రీకాంత్‌ను కలిశాడు. ఆ కలయికే సోవియట్ సాహిత్యాన్ని ఆయనకు పరిచయం చేసింది. మనసుదోచిన జమీల్యా తనని కలవడానికి వచ్చిన అనిల్‌కు ‘జమీల్యా’, పతంజలి ‘చూపున్న పాట’ పుస్తకాలనిచ్చాడు శ్రీకాంత్. జమీల్యా తన మనసును దోచింది. అంతకు ముందొకసారి కోఠిలో పుస్తకాలు కొంటుంటే రష్యన్ చరిత్ర కథలు, గాథలు కనిపించింది. 400 పేజీల పుస్తకం 35 రుపాయలే. దాని గురించి ఏమీ తెలియకపోయినా అన్ని పేజీల బుక్ 35 రూపాయలకే వస్తుందని కొన్నాడు. చదివాడు. బాగా నచ్చింది. ఎమ్‌సీఏలో చేరాక భవిష్యత్ దృష్ట్యా ఇంగ్లిష్ మీద పట్టు సాధించాలనుకున్నాడు. దానికీ సాహిత్యాన్నే సాధనంగా మలచుకున్నాడు. ఇంగ్లిష్ లిటరేచర్ చదవడం స్టార్ట్ చేశాడు. ఆంగ్లం మీద పట్టూ వచ్చింది. హిటాచీలో ఉద్యోగమూ దొరికింది. అప్పుడు బ్లాగ్స్ పరిచయమయ్యాయి. ‘మనుసులో మాట’ అనే బ్లాగ్ చూశాడు. అందులో ‘ఉక్రేనియన్ జానపద గాథలను పట్టేశాను’ అన్న పోస్ట్ చదివాడు. అది ఆయన్ని పట్టేసింది. తన చిన్నప్పటి పుస్తకం ‘కాలయంత్రం’, దానికోసం తన వెదుకులాట గుర్తుకొచ్చాయి. ఆ పోస్ట్ కిందున్న నలభై అయిదు కామెంట్లను చదివాడు. అందులో సోవియట్ పుస్తకాల పేర్లెన్నో ఉన్నాయి. ‘వర్షంలో నక్షత్రాలు’, ‘ఎర్రజుట్టు కోడిపుంజు’ వంటి వింతవింత పేర్లు. ఆ పోస్ట్‌ల సారాంశం ‘ఈ పుస్తకాలేవీ ఇప్పుడు దొరకట్లేదు.. ఎవరి దగ్గర ఏ పుస్తకాలున్నా స్కాన్‌చేసి నెట్లో పెడితే షేర్ చేసుకోవచ్చు’ అని. కానీ ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడనుకున్నాడు అనిల్.. ఆ చైల్డ్‌హుడ్ మెమరీస్‌ని పోగుచేయడానికి తనెందుకు కదలొద్దు అని! మొదలైందిలా.. ఆఫీస్ విజిటింగ్ కార్డ్స్ వెనకాల సోవియట్ పుస్తకాల పేర్లన్నిటినీ రాసుకున్నాడు. ఎక్కడికి వెళ్లినా, పుస్తకప్రియులు ఎవరు కలిసినా ఆ పేర్లు చదివి వినిపించి ఏ పుస్తకాలున్నాయో కనుక్కునేవాడు. పెద్దగా స్పందనలేదు. అప్పుడే ఆర్టిస్ట్ మోహన్ పరిచయం అయ్యారు. విషయం తెలుసుకుని తన దగ్గరున్న రెండుమూడు పుస్తకాలిచ్చారు. రిటైర్డ్ లైబ్రేరియన్ గంగాధర్ కలిసి ‘ఏదీ నీదగ్గరున్న లిస్ట్ ఒకసారి చదువు’ అన్నారు. అనిల్ చదవడం స్టార్ట్ చేశాడు. నలభై పుస్తకాల జాబితాలో ముప్పై పుస్తకాలకు ‘ఉంది’ అని జవాబిచ్చారు గంగాధర్. వాళ్లింటికెళ్లి వాటిని తీసుకొచ్చాడు. వాటిని జిరాక్స్ తీయించి తిరిగిచ్చేశాడు. గంగాధర్ స్నేహితుడు సైదాచారి మరో ఏడు పుస్తకాలిచ్చాడు. ఇలా రెండేళ్లుగా సోవియట్ సాహిత్యాన్ని సేకరించే పనిలో పడ్డాడు అనిల్. ఆశ్చర్యపరిచిన ప్రతిస్పందన... ఎవరికి ఏ పుస్తకాలంటే ఇష్టమో తెల్సుకొని వాళ్లకు వాటినిస్తూ, తనకు కావల్సిన సోవియట్ బుక్స్‌ని తీసుకుంటూ 200 పుస్తకాలను పోగుచేశాడు. ఫిక్షనే కాకుండా కమ్యూనిజం, సోషలిజం, సైన్స్, రష్యన్ డిక్షనరీతోపాటు అన్నిరకాల పుస్తకాలున్నాయి. వాటన్నిటినీ స్కాన్‌చేసి, పీడీఎఫ్ కూడా చేయించాడు. సోవియట్ సాహిత్యమంటే ఆసక్తి ఉన్న అందరి మెయిల్ ఐడీలను సంపాదించి పుస్తకాలు వాళ్లకు మెయిల్ చేసేవాడు. వాళ్ల ప్రతిస్పందన చూసి ఆశ్చర్యపోయాడు అనిల్. ‘మీరు పంపిన ఈ పుస్తకం కోసం నలభై ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నామ’ని ఒకరు, ‘ఇది జీవితంలో మళ్లీ చదవలేననుకున్నాన’ని ఇంకొకరి స్పందన. తాను పోగుచేసిన పుస్తకాలతో ఇటీవల లామకాన్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. దీనికీ విశేష స్పందనే! ఈ తరం పిల్లలకు అందాలి.. ‘నా ఫ్రెండ్ అజయ్‌ప్రసాద్‌తో కలిసి మూడువేల పుస్తకాలతో హోమ్లైబ్రరీని మెయిన్టైన్ చేస్తున్నా. సోవియట్ యూనియన్ పతనమయ్యాక ఆ సాహిత్యం మన దగ్గరకి రావడం లేదు. అంతకుముందున్నవే మిగిలాయి. వాటిని పదిలంగా ఉంచాలి. మనముందు తరం బాల్యంలో ఆస్వాదించిన సోవియట్ సాహిత్యాన్ని ఈ తరం పిల్లలకూ అందించాలి. ఈ పుస్తకాల సేకరణ, భద్రపరచడం కోసం నా సమయాన్ని, డబ్బునీ ఖర్చుపెడుతున్నా. ఎందుకు అని ప్రశ్నించకుండా సహకరిస్తున్న నా భార్య మాధవీలతకు హృదయపూర్వక ధన్యవాదాలు. పిల్లల బర్త్‌డే పార్టీలకు వందలు వందలు పెట్టి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే బదులు.. ఆ ఖర్చులో ఒక వంతు పెట్టి ఇలాంటి పుస్తకాలను ప్రింట్ చేయించి పిల్లలకు పంచితే ఎంతో విలువైన కానుకనిచ్చినవాళ్లవుతారు. ఆలోచించండి’ అని పేరెంట్స్‌కు విజ్ఞప్తి చేస్తున్నాడు అనిల్. -
రమణుల రంగస్థలం
సరసిజ.. ఎ థియేటర్ ఫర్ విమెన్! తెలుగులో మొట్టమొదటి మహిళా రంగస్థలం.. 23న అభినయానికి సిద్ధం కానుంది! వ్యవస్థాపకులు.. ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి. ఈ సందర్భంగా ఆమె పరిచయం.. ఈ ప్రయత్నం వెనక కారణమూ ఆమె మాటల్లో.. - సరస్వతి రమ నాటకంపై ఉన్న ఇష్టమే సరసిజ ఏర్పాటుకు కారణం. ఒకప్పుడు రంగస్థలం చాలా ప్రభావంతమైన మాధ్యమం. అలాంటి నాటకం ఇప్పుడు ఆనవాలుగానే మిగిలింది. మునపటి వెలుగు రావాలంటే కొత్త తరాన్ని ఆకర్షించాలి. ఇది వరకు నాటకాల్లో స్త్రీ పాత్రలు కూడా పురుషులే వేసేవారు. సురభి వచ్చాక స్త్రీలూ రంగప్రవేశం చేశారు. కానీ, ఆ ముచ్చట ఇప్పుడు లేదు. సెంట్రల్ యూనివర్సిటీ వంటి చోట్ల థియేటర్ ఆర్ట్స్ కళాకారులు ఉన్నారు. కానీ వాళ్ల ఫోకస్ అంతా హిందీ, ఇంగ్లిష్ నాటకాలపైనే. తెలుగు రంగస్థలంపై యువతుల అభినయం వికసించాలి. వాళ్లను ఈ దిశగా ప్రోత్సహించేందుకు ఈ థియేటర్ ఫర్ విమెన్‌ను స్థాపించాను. నాటకంపై ఆసక్తి ఉన్నవాళ్లంతా ఆహ్వానితులే. సరసిజ.. అచ్చంగా మహిళల కోసం.. మహిళలచే.. మహిళలే భాగస్వాములుగా నడిచే థియేటర్!. ఆసక్తి ఎలా కలిగింది.. మా నాన్నకు నాటకాలంటే చాలా ఇష్టం. నా చిన్నప్పుడు ఆయన అబ్బూరి రామకృష్ణారావుతో కలసి తెనాలిలో ‘నటాళి’ అనే నాటక సంస్థను పెట్టారు. నాన్నతో కలసి నాటకాలకు వెళ్లేదాన్ని. బాలానందంలో పాల్గొనేదాన్ని కూడా. 1974లో అనుకుంటా.. విజయనగర్ కాలనీలో లలితకళాసమితి వేస్తున్న నాటికలో స్త్రీ పాత్రలున్నాయి.. ఆసక్తి ఉన్న కళాకారులు కావాలనే ప్రకటన చూసి నా ఫ్రెండ్ నన్ను తీసుకెళ్లింది. ఇద్దరం సెలక్టయ్యాం. అలా ‘ప్రేమానుబంధం’ అనే నాటికలో మొదటిసారి వేషం వేశా. ఆ టైమ్‌లోనే రాసిన ‘కళ్యాణి పెళ్లి’ ద్వారా నాటక రచన ప్రస్థానమూ మొదలైంది. 1996లో గంట నిడివి ఉన్న ‘జీవన సమరం’ రాశాను. అది రేడియోలో ప్రసారమైంది. 2000లో ఒక స్టేజ్ నాటకం రాసే అవకాశం వచ్చింది. ఓ రోజు ‘ఇన్వైటెడ్ ఆడియెన్స్ ప్రొగ్రెసివ్’ అనే సంస్థ వాళ్లు ‘ఓ కామెడీ ప్లే కావాలి రాస్తారా ?’అని అడిగారు. అప్పటి వరకూ సీరియస్ ప్లేలు రాస్తున్న నాకు ఇది ఓ రకంగా టాస్కే. పెళ్లి కుదరడం అనే అంశాన్ని తీసుకుని ఆ రాత్రికిరాత్రే ‘మ్యాచ్ ఫిక్సింగ్’ అనే ప్లే రాసి తెల్లారేసరికల్లా వాళ్లకు ఇచ్చేశాను. రవీంద్రభారతి ఆడిటోరియంలో ఆ నాటకానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఈ ప్లే రైట్స్ తీసుకుని తన కితకితలు సినిమాలో వాడారు. ఇప్పటికీ చాలా వేదికలపై ఈ నాటకాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. మా అమ్మాయి రాజేశ్వరి సహా ఇంకా చాలామంది ఈ నాటకాన్ని అమెరికాలాంటి దేశాల్లో ప్రదర్శించారు. ‘ప్రసిద్ధ తెలుగు హాస్య నాటికలు’ అనే విశాలాంధ్ర వారి సంకలనంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం, పానుగంటి, విశ్వనాథ సత్యనారాయణలాంటి ప్రముఖుల సరసన నాకూ స్థానం కల్పించారు. ఈ గౌరవాన్ని మించిన పురస్కారం నాకు లేదు, ఉండదు కూడా. అసలు రచనకు స్ఫూర్తి? మా నాన్న జర్నలిస్ట్, రైటర్ కూడా. ఇంటి నిండా పుస్తకాలుండేవి. అమ్మ (అనసూయ)కూ పఠానాసక్తి ఎక్కువే. అదే అలవాటు నాకూ వచ్చింది. దీంతో రాయాలనే ఆసక్తి కలిగింది. అదే మాట నాన్నతో చెబితే.. ‘ముందు చందమామ కథలు రాయమ’న్నారు. రెండుమూడు రాశాను. అంతబాగా లేవు. రేడియో అన్నయ్య రావూరి భరద్వాజ గారు నాన్నకు చాలా క్లోజ్. ‘ఆయన దగ్గరకు వెళ్లు.. పిల్లల కోసం కథలు ఎలా రాయాలో నేర్పిస్తారు’ అని సలహా ఇచ్చారు నాన్న. రావూరి గారిని కలిస్తే.. ‘యువవాణి’లో నాచేత ఓ స్కిట్ రాయించారు. రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన రోజులవి. దాన్ని కాన్సెప్ట్‌గా తీసుకుని ‘చందమామ’ అని రాశాను. అందరూ మెచ్చుకున్నారు. అప్పటి నుంచి రచనా వ్యాసంగాన్ని సీరియస్‌గా తీసుకున్నాను. రేడియోతో ఆగక.. పెళ్లాయ్యాక రెండుమూడేళ్లు గ్యాప్ వచ్చినా రచన ఆగిపోలేదు. ఇదంతా ఎనభైల విషయం. అప్పుడు ‘యువవాణి’లో స్త్రీల కార్యక్రమాలను తురగ జానకీరాణి గారు చూసేవారు. నా మొదటి రేడియో కథ ‘వర్ధమాన రచయిత్రి’. ఆవిడకది చాలా నచ్చింది. ‘రేడియోతో ఆగకుండా.. పత్రికలకూ నీ రచనలు పంపు’ అని చాలా ఎంకరేజ్ చేశారు. అలా పత్రికలకూ పంపడం మొదలుపెట్టాను. మయూరి అనే మ్యాగజైన్లో ‘కలలుకన్న రాధ’ అనే కథ మొదటిసారిగా అచ్చయింది. తర్వాత ఆంధ్రభూమి, ప్రజాశక్తి మొదలు ఎన్నో పత్రికలు, విపుల లాంటి మాసపత్రికలకూ కథలు పంపుతూ వచ్చాను. ఇప్పటి వరకు పంపిన ఏ కథా అచ్చుకాకుండా తిరిగి రాలేదు. ‘తోటమాలి’ బాగా పేరు తెచ్చిన కథ. ‘అపూర్వ’నా తొలి కథా సంకలనం. అపురూప, అలనాటి చెలిమి ఒక కల, ఒప్పందం లాంటి సంకలనాలు, సంపుటాలు వెలువడ్డాయి. నవలలూ రాశాను. అన్నిటిలో మహిళా సమస్యలే ఇతివృత్తాలు. సరసిజ ఆశయం.. ‘ఈ విమెన్ థియేటర్ ద్వారా స్త్రీ గళాన్ని వినిపిస్తాం. మన దగ్గర ఇంకా నిరక్షరాస్యత ఉంది. మూఢనమ్మకాలు కనిపిస్తున్నాయి. వీటి నిర్మూలనకు ఈ థియేటర్‌ను వేదిక చేయాలనుకుంటున్నాం. బతికే కళను పరిచయం చేయాలనుకుంటున్నాం. భవిష్యత్తులో దీన్ని ఓ ఇన్స్టిట్యూట్గా మార్చే ఆలోచనా ఉంది. వి.ధనలక్ష్మి ఉపాధ్యక్షురాలిగా, సాయి మాధురి కార్యదర్శిగా, జె.భానుమతి కోశాధికారిగా సాగబోతున్న మా విమెన్ థియేటర్‌కి, దాని లక్ష్యసాధనకు ఇతర రచయిత్రులూ సహకరిస్తారని ఆశిస్తున్నా’నని వివరించారు విజయలక్ష్మి. -
కూచిపూడితో టీచింగ్
కర్ణాటక సంగీతం మొదలు కూచిపూడి, భరతనాట్యం, కథక్, టెంపుల్‌డాన్స్ నేర్చుకుంది అచ్యుత మానస. నేర్చుకున్న కళను అద్భుతంగా అభినయించి అటు గురువుల ఆశీస్సులను, ఇటు ఆహుతుల ప్రశంసలనూ అందుకుంటోంది. ఇంకోవైపు అకడమిక్స్‌లోనూ చురుకుగానే ఉంది. ఇంజనీరింగ్ పూర్తిచేసి ఎమ్ఎన్సీలో ఉద్యోగమూ సంపాదించుకుంది. తన తండ్రి రవిచంద్ర (డిఐజీ)లాగే సివిల్స్ జాయిన్ అవ్వాలన్నది ఆమె ధ్యేయం. ఆ అభ్యాసమూ మొదలుపెట్టింది. 2010 వరకు ఇంకో ఆలోచనేదీ లేకుండా తన లక్ష్యసాధన దిశగా ప్రయాణం సాగింది. ఆ తర్వాత... ఆగస్ట్ 15, 2010. అప్పుడు మానస వాళ్ల నాన్న ఉద్యోగరీత్యా గుంటూరులో ఉన్నారు. పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు తల్లి,తండ్రీ సహా తనూ హాజరైంది. స్టేట్‌హోమ్‌లోని పిల్లలు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన వందేమాతరం పాటమీద డాన్స్ చేశారు. మానస మనసు చివుక్కుమంది. తర్వాత ఒక ఈవెంట్లో క్లాసికల్ డాన్స్ అని ‘చంద్రముఖి’ సినిమాలోని పాట మీద చేశారు. ‘పిల్లలు కదా ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. అదే క్లాసికల్ డాన్స్ అంటే నమ్ముతారు వాళ్లకేం తెలుసు’ అని అప్పటికైతే సరిపెట్టుకుంది కానీ మనసొప్పలేదు. ఆ పిల్లలకు శాస్త్రీయ నృత్యం నేర్పించాలనే తపన మొదలైంది. స్టేట్‌హోమ్‌కి వెళ్లింది. పిల్లలను పరిచయం చేసుకుంది. అసలు క్లాసికల్ డాన్స్ ఎలా ఉంటుందో చెప్పింది.. చేసిచూపించింది. జనవరి 26కల్లా వందేమాతరం పాటమీద కూచిపూడి నేర్పించింది. ప్రదర్శన ఇప్పించింది. ‘డాన్స్ అనగానే సినిమా పాటలమీద చేస్తాం’ అనే పిల్లల మైండ్‌సెట్‌ను మార్చేసింది. వాళ్లకోసం ఇంకేదో చేయాలనుకునేలోపే వాళ్ల నాన్నకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. హైదరాబాద్‌లో.. గుంటూరు స్టేట్ హోమ్ ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడి స్టేట్‌హోమ్ పిల్లలకూ డాన్స్, సంగీతం నేర్పించాలనుకుంది మానస. కథలు, పాటలతో మొదలుపెట్టి మెల్లగా అడుగుల్లోకి వచ్చింది. ‘కూచిపూడి మై లైఫ్’ అనే పేరుతో ఆ పిల్లలకు శాస్త్రీయ నృత్యం నేర్పిస్తూ శాస్త్రీయ కళల పట్ల అవగాహన కలిగిస్తోంది. ‘‘చదువు, జ్ఞానం రెండూ వేర్వేరని నా ఉద్దేశం. చదువు ఎవరైనా నేర్పిస్తారు. జ్ఞానం కళల వల్ల అబ్బుతుంది. బతకడానికి కావల్సిన ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఈ పిల్లలకు అవి చాలా అవసరం. ఈ లోకంలో తమకెవరూ లేరని, తమనెవరూ చూడరనే ఆత్మన్యూనతలోంచి లోకం తమ దృష్టిని వీరిపై మరల్చుకునే స్థితికి రావడానికి ఈ కళ వీళ్లకు ఒక సాధనంగా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. మొదట్లో ఈ పిల్లలు నాతో చాలా రూడ్‌గా ఉండేవారు. వాళ్లలో ఒక రకమైన కసి కనిపించేది. వీళ్లను డీల్ చేయగలనా? అనుకున్నాను. కానీ తర్వాత్తర్వాత నాకు మంచి స్నేహితులైపోయారు. ఈ పిల్లలతో గడిపినంత సేపు అలౌకిక ఆనందంలో ఉంటాను. ఓ గుడిలో దొరికే ప్రశాంత కనిపిస్తుంది’ అంటుంది అచ్యుత మానస. అయిదేళ్ల ప్రాయం నుంచే... అయిదేళ్ల వయసున్నప్పటి నుంచే కర్ణాటక సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టింది మానస. కాస్త ఊహ తెలిసేటప్పటికి తనకు కావల్సింది ఇది కాదు డాన్స్ అనుకుంది. ఆ మాటే అమ్మతో చెపితే.. ఎన్నాళ్లు నేర్చుకుంటుందిలే.. అని డాన్స్‌లో చేర్పించింది అమ్మ. అలా కాజా వెంకట సుబ్రహ్మణ్యం దగ్గర కూచిపూడి, డాక్టర్ దేవేంద్ర పిళై దగ్గర భరతనాట్యం, పండిట్ అంజుబాబు దగ్గర కథక్, ఓలేటి రంగమణి దగ్గర టెంపుల్‌డాన్స్ నేర్చుకుంది అచ్యుత మానస. డివీడి.. మానస గురువు అయిన కాజా వెంకట సుబ్రహ్మణ్యం నృత్యదర్శకత్వంలో ‘కూచిపూడి నృత్యాభినయ వేదిక .. నాట్యం మోక్షమార్గం’ పేరుతో చిత్రించిన డీవీడీని త్వరలోనే విడుదల చేయబోతోంది మానస. ఈ వేడుక ఆరంభవేళ కాజా వెంటక సుబ్రహ్మణ్యం కొరియోగ్రఫీలో స్టేట్‌హోమ్ పిల్లలతో నాట్యప్రదర్శన ఇప్పించబోతోంది. ‘లెర్నింగ్.. షేరింగ్.. డిస్కస్’ ఇది అచ్యుత మానస పాటించే జీవనసూత్రం. ఇదే సూత్రాన్ని స్టేట్‌హోమ్ పిల్లలకూ నేర్పించే గురుతర బాధ్యతను నిర్వర్తిస్తోంది! నిజమైన కళాసేవ చేస్తోంది! - సరస్వతి రమ -
లవ్లీ జర్నీ
ప్రశాంత్ లహోటి, రేఖ లహోటి YOU AND I "Success in marriage does not come merely through finding the right mate, but through being the right mate" అన్నాడు బార్నెట్ ఆర్ బ్రిక్నర్. ఆర్టిస్ట్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ రేఖ లహోటి, ఇంజనీర్ అండ్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ ప్రశాంత్ లహోటి.. ఈ ఇద్దరూ అంతే! ఒకరికొకరు సరి జోడు అనుకొని జతకూడలేదు. జంట ప్రయాణంలో ఒకరికొకరు తగిన తోడుగా తమనుతాము మలచుకుంటున్నారు. ఆ సర్దుబాటు, దిద్దుబాటే వాళ్ల వైవాహిక బంధాన్ని నిత్యనూతనంగా ఉంచుతోంది! ఆ దంపతుల ముచ్చట్లు... ..:: సరస్వతి రమ ‘జాతకాలు కుదిర్చిన పెళ్లి మాది’ అని మొదలుపెట్టారు ఇద్దరూ! సంభాషణకు ముందు రెండు కుటుంబ నేపథ్యాల్లోకి వెళ్తే.. ప్రశాంత్ బెంగాలీ అయినా పుట్టింది, పెరిగింది అంతా ఇక్కడే. ఆ మాటకొస్తే 150 ఏళ్ల కిందటే వాళ్ల పూర్వీకులు ఇక్కడికొచ్చి స్థిరపడ్డారు. అందుకే ‘నేను పక్కా హైదరాబాదీ’ అంటాడాయన. రేఖ పుట్టిపెరిగిందంతా కోల్‌కతాలోనే. ప్రశాంత్‌తో కొంగుముడివేసుకున్నాకే హైదరాబాద్ ఆమెకు పరిచయమైంది. వ్యక్తిత్వాలు,నేపథ్యాలు కన్నా.. ‘నేను చిన్నప్పటి నుంచి బబ్లీ టైప్. పదిహేనోయేట నుంచే డ్రైవింగ్ చేసేదాన్ని. కలివిడితనం ఎక్కువ. దాంతో మా ఇంట్లో వాళ్లంతా నేను లవ్ మ్యారేజే చేసుకుంటానని ఫిక్స్ అయిపోయారు. కానీ నేను మాత్రం భిన్నంగా ఆలోచించాను. పుట్టిపెరిగిన కోల్‌కతాలోనే స్థిరపడాలని అనుకోలేదు. బయటి ప్రపంచంలోకి వెళ్లాలనుకున్నాను. కాబట్టి పెద్దలు చూసిన సంబంధానికి ఓకే అన్నాను’ అంటారు రేఖ. ‘మా బంధువుల ద్వారా ఈ సంబంధం ఖాయం అయింది. మా వ్యక్తిత్వాలు, మా నేపథ్యాల కన్నా మా జాతకాలే ముందు మమ్మల్ని కలిపాయి’ అంటూ పెళ్లయిన తీరు చెప్పారు ప్రశాంత్. పూర్తి విరుద్ధం.. ‘స్వభావరీత్యా మేమిద్దరం పూర్తి విరుద్ధం’ అని ఆమె అంటుంటే ‘అందుకే మా రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉంది’ అని పూరించారు ఆయన. ‘నాకు కోపమెక్కువ’ అని రేఖ, ‘నాకు ఓపిక ఎక్కువ’ అని ప్రశాంత్, ‘తను చాలా ఉదారంగా ఉంటారు’ అని ఆమె, ‘రేఖ తన మేనేజ్మెంట్ స్కిల్స్‌తో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది’ అని ఆయన, ‘ప్రశాంత్ ఇంట్రావర్ట్. ఆయనకెప్పుడైనా కోపమొస్తే ఎక్స్‌ప్రెస్సే చేయడు. ఆయన అలక తీర్చే చాన్సే ఇవ్వడు’ అని ఆమె, ‘రేఖ వెరీ ఎక్స్‌ప్రెసివ్’ అని ఆయన.. ఇలా ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాలకు కంప్లయింట్స్ అండ్ కాంప్లిమెంట్స్ రూపమిచ్చారు. కళాకృతి.. ‘మా ఇద్దరి బిడ్డ’ అంటారిద్దరూ ముక్త కంఠంతో. ‘నిజానికి రేఖ మంచి ఆర్టిస్ట్’ అని ప్రశాంత్ కితాబిచ్చేలోపే ‘ఎనిమిదో ఏటనుంచే బొమ్మలు గీసేదాన్ని. డిగ్రీ తర్వాత ఫైనార్ట్స్ కూడా చేశాను. పెళ్ల్లయ్యాక నా మనసు ఫ్యాషన్ డిజైనింగ్ వైపు మళ్లింది. మా అత్తమామల ఎంకరేజ్‌మెంట్‌తో ఫ్యాషన్ డిజైనింగ్ చేశా. నేను బొమ్మలేయడం కంటే ఎక్కువగా ప్రశాంత్ ఆర్ట్‌ని ఇష్టపడతాడు. ఆయన ఈస్తటిక్సెన్స్కి నిలువెత్తు నిదర్శనమే కళాకృతి ఆర్ట్ గ్యాలరీ’ అని భర్త కళాభిరుచిని వివరించారు రేఖ. ‘దాదాపు 20 ఏళ్ల కింద కళాకృతిని ఏర్పాటు చేశాం. ఆ ఆలోచన వచ్చిన వెంటనే రేఖతో షేర్ చేసుకున్నాను. తనకూ నచ్చింది. అయితే ఆ రోజే అనుకున్నాం.. మా గ్యాలరీ ప్యూర్ ఆర్ట్‌కి డయాస్లాగా ఉండాలి తప్ప కమర్షియల్ ప్రాఫిట్‌కి చానల్‌లా కాదు అని. ఇప్పటికీ ఆ విషయంలో రాజీ లేదు’ అని చెప్తారు ప్రశాంత్. ‘కళాకృతి..ఆలోచన ఆయనది. అనుసరణ నాది. కళాకృతి కాకుండా మా ఇద్దరికీ సపరేట్ కెరీర్ ఉంది. ఆయన బిల్డర్. నాకు బొటిక్ ఉంది. అయినా కళాకృతి మా ఇద్దరి గారాలపట్టి. ఎంత బిజీగా ఉన్నా ఆర్ట్ గ్యాలరీకి సంబంధించిన ఏ అంశాన్నీ అలక్ష్యం చేయం. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూ సరికొత్త వర్క్ కొలువుదీరేలా ప్రయత్నిస్తుంటాం. అలా త్వరలోనే చక్కటి కాఫీ తాగుతూ నచ్చిన పెయింటింగ్‌ను ఆస్వాదించే కాఫీడేనూ స్టార్ట్ చేయబోతున్నాం’ అని భవిష్యత్ కార్యాచరణను తెలిపారు రేఖ. స్మార్ట్ థింకింగ్ అండ్ హార్డ్‌వర్కింగ్ మీ ఇద్దరి ప్రొఫెషనల్ జర్నీని ఒక వాక్యంలో వర్ణించండి అంటే ‘ఆయనది స్మార్ట్ థింకింగ్ నాది హార్ట్వర్కింగ్’ అని చెప్పారు రేఖ. ‘కళాకృతికి సంబంధించిన విషయం తప్ప మా ఇద్దరి కెరీర్లో ఒకరికొకరం జోక్యం చేసుకోం’ అంటారు ప్రశాంత్. ‘ఆయన అద్భుతమైన ఐడియాలిస్తారు’ అని రేఖ అంటుంటే ‘తను వాటిని అంతకన్నా అద్భుతంగా చేసి చూపిస్తుంది’ అంటారు ప్రశాంత్. ‘మా అమ్మాయికి ఆయన పోలికే. అబ్బాయికి నా పోలిక.వాళ్లిద్దరూ కూర్చున్నచోట అలా ఐడియాలిస్తుంటే మేమిద్దరం కష్టపడుతుంటాం’ అంటారు రేఖ నవ్వుతూ. వ్యత్యాసాలు ఒక్కటయ్యేదెప్పుడు? ‘పిల్లల విషయంలో’ ఏకకంఠంతో ఇద్దరూ. ‘పిల్లల పెంపకంలో మా ఇద్దరి ఆలోచనలు, అనుసరణలు ఒకేరకంగా ఉంటాయి. వాళ్లతో గడిపే సమయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వం’ అంటారిద్దరూ. ప్రశాంత్, రేఖ.. పేజ్ త్రీ కపుల్. ‘ఫ్రెండ్ సర్కిల్‌కి సంబంధించీ ఇద్దరం ఒకేలా ఉంటాం. తొందరగా కొత్తవాళ్లతో క్లోజ్ అయిపోం.నచ్చినవాళ్లు తక్కువమందే. వాళ్లతోనే చాలా సన్నిహితంగా ఉంటాం. గెట్ టు గెదర్స్ కూడా మాకు చాలా వాల్యుబుల్. షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్‌కే ఇంపార్టెన్స్ ఇస్తాం’ అని చెప్తారు ప్రశాంత్. లవ్లీ జర్నీ.. ‘తప్పొప్పులు, భిన్నాభిప్రాయాలు ఏ జంటకైనా సాధారణం. అయితే అవి ఆర్గ్యుమెంట్స్‌గా కాక డిస్కషన్స్గా ఉంటే అండర్స్టాండింగ్ పెరుగుతుంది. మా మధ్య డిస్కషన్సే ఎక్కువ’ అని రేఖ అంటారు. ‘తప్పయినప్పుడు సారీ చెప్పడాలు ఉండవ్. ఆ తప్పును సరిదిద్దుకొని ఇంకోసారి అలాంటిది రిపీట్ చేయకుండా చూసుకుంటాం. అంతే!’ ప్రశాంత్ మాట.‘సరిదిద్దుకున్నామంటేనే ఈ తప్పును అడ్మిట్ చేసుకున్నట్టే కదా’ రేఖ సమర్థింపు. ‘కాలం గడుస్తున్నాకొద్దీ ఇండివిడ్యువల్‌గా ఇద్దరం పరిణతి చెందుతూనే ఉంటాం కదా. ఒకరి మెచ్యూరిటీ ఒకరికి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పుతూనే ఉంటుంది’ ఉభయుల కామెంట్. ‘ఏమైనా ఇట్స్ ఎ లవ్లీ జర్నీ’ అంటూ ఈ సంభాషణకు అందమైన ముగింపునిచ్చారు ఇద్దరూ!. -
రైడ్ ఫర్ రైట్
ఏటా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు.. పదహారు రోజులను ‘16 Days of Activism against Gender Violence' ప్రచార దినాలుగా జరుపుతారు. అందుకే ప్రపంచ దేశాలకు ఈ 16 రోజులు చాలా ప్రాముఖ్యమైనవి. ‘ఆరెంజ్’ (నారింజ) కలర్‌ను ఈపచారానికి చిహ్నంగా కూడా స్థిరపరిచారు. మిగిలిన దేశాల్లో చాన్నాళ్ల కిందటే ఇది మొదలైనా మన దేశం ఈ ఏడాదే దీనికి నాంది పలికింది. హైదరాబాదూ అందులో భాగస్వామ్యం పంచుకుంది. ఇక్కడి అమెరికన్ కాన్సులేట్ కూడా వాదా ఫౌండేషన్, వాయిస్ ఫర్ గర్ల్స్ సంస్థలతో కలిసి ‘రైడ్ ఫర్ రైట్’ అనే పేరుతో క్యాంపెయిన్ మొదలుపెట్టింది. - సరస్వతి రమ రైడ్ ఫర్ రైట్ అంటే.. జెండర్ ఈక్వాలిటీని చాటడమే! అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలకూ అవకాశం కల్పించాలనేది రైడ్ ఫర్ రైట్ ఉద్దేశం. అందుకే మహిళా డ్రైవర్ తన ఆటోలో వాదా, వాయిస్ ఫర్ గర్ల్స్ స్వచ్ఛంద సంస్థల వాలంటీర్స్ను కూర్చోబెట్టుకొని ప్రచారానికి వెళ్తోంది. ఆటోపై జెండర్ ఈక్వాలిటీకి సంబంధించిన పోస్టర్స్, బ్యానర్లూ ఉన్నాయి. జంటనగరాల్లోని కాలేజ్‌లు, బహిరంగ ప్రదేశాలకు వెళ్లి యువత దగ్గర స్త్రీ, పురుష సమానత్వంపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు ఈ వాలంటీర్స్. ఆటోలో ప్రయాణిస్తూ పక్కనే వెళ్తున్న పాదచారులనూ జెండర్ ఈక్వాలిటీ, మహిళల మీద హింసలేని స్థలాల గురించి, మహిళా సాధికారత సాధించిన రంగాల గురించి అడుగుతున్నారు. వీడియో కెమెరాలతో వాటిని రికార్డ్ చేస్తున్నారు. పదో తారీఖు వరకు వీలైనన్ని ప్రదేశాలను చుట్టి తీసుకున్న వీడియో ఫుటేజ్‌ను కూర్పు చేస్తారు. త ర్వాత దాన్ని అమెరికన్ కాన్సులేట్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద చర్చకు పెట్టనుంది. ‘మహిళలపై హింస అనేది ఇప్పుడు ఒక ప్రాంతానికో, దేశానికో పరిమితమైంది కాదు. ఇది ప్రపంచ సమస్య. అందుకే దీని పరిష్కారానికీ ప్రపంచమంతా నడుంకట్టాలి. ఆ దిశగా మొదలైందే 16 డేస్ ఆఫ్ యాక్టివిజమ్ అగెనైస్ట్ జెండర్ బేస్డ్ వయోలెన్స్. అందులో భాగంగానే మేము ఈ ‘రైడ్ ఫర్ రైట్’ క్యాంపెయిన్‌ను స్టార్ట్ చేశాం. దీనివల్ల మహిళల మీద జరుగుతున్న హింస, వివక్ష గురించి హైదరాబాద్ యూత్ ఎలా ఆలోచిస్తోందో తెలిసే అవకాశం కలుగుతోంది. ఈ సమస్యకు వాళ్ల దృష్టిలో కారణాలు, పరిష్కారాలకు వాళ్లిచ్చే సూచనలు, అభిప్రాయాలూ తెలుస్తున్నాయి. ఈ 16 రోజుల ప్రచారం ప్రపంచంలోని ప్రతి ఒక్కరు జెండర్ ఈక్వాలిటీ కోసం మనమేం చేయగలమనే ఆలోచనను రేకెత్తిస్తోంది’ అని వివరించారు అమెరికన్ కాన్సులేట్ స్పోక్స్‌పర్సన్ ఏప్రిల్ వెల్స్. కొసమెరుపు.. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో స్త్రీల మీద హింస, వివక్ష ఎక్కువ అంటారు. అణచివేత పోరాటాన్ని నేర్పుతుంది. పోరాటం విజయాన్ని తథ్యం చేస్తుంది. ఇందుకు నిదర్శనం మన దేశమే. మిగిలిన రంగాల సంగతలా ఉంచి వైమానిక రంగాన్ని తీసుకుంటే మన దగ్గర పదకొండు శాతం మంది మహిళా పైల ట్లు ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. అక్కడ ఉంది మూడు శాతమే!. అసలు హింస అనే పదమే వినిపించొద్దు.. ఈ రోజు ఇలా క్యాంపెయిన్ చేస్తున్నామంటే దానర్థం ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అనేగా. నా దృష్టిలో జెండర్ ఈక్వాలిటీ కోసం ఇలాంటి క్యాంపైన్లు లేని రోజు రావాలి. అంటే ఈ సమస్య అనేది లేకుండా పోవాలి. ఏడాదికొకసారి జరిగే ఈ పదహారు రోజులతో అంతా తుడిచిపెట్టుకుపోదు. అయితే దీన్నో ప్రారంభంగా భావించి ఈ స్పూర్తిని ఏడాదంతా ఏదో ఒకరకంగా కొనసాగించాలి. యూత్ చాలామంది ఈక్వాలిటీ ఉండాలని ఆలోచించడం శుభపరిణామం. పాతికేళ్లలోపు కుర్రాళ్లంతా ఈక్వాలిటీకి ఓటేస్తున్నారు. నలభై, యాభైల్లో ఉన్న మగవాళ్లు ఆడవాళ్లు, మగవాళ్లు వేరనే అభిప్రాయాన్నే కలిగి ఉన్నారు. భవిష్యత్ అంతా యువతదే కాబట్టి భయపడాల్సిన పనిలేదు. - సురేష్‌రాజు, వాదా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రైడ్ ఫర్ రైట్ డ్రైవర్ నారాయణమ్మ.. నిజాంపేట ప్రాంతంలో పదేళ్ల నుంచి ఆటో నడుపుతున్నారు. రోడ్ సేఫ్టీ మీద పనిచేసే వాదా ఫౌండేషన్ సహకారంతో మరో నలుగురు స్త్రీలకూ ఆటో నడపడంలో శిక్షణనిచ్చారు ఆమె. రోజూ ఉదయం 11 గంటల వరకు ఆటో నడిపి మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రైడ్ ఫర్ రైట్ క్యాంపెయిన్‌కి వెళ్తున్నారు. ‘ఆరెంజ్ కలర్ టీషర్ట్, ఆరెంజ్ కలర్ బ్యానర్స్‌తో ఆటోలో వెళ్తుంటే చాలామంది కుతూహలంగా చూస్తున్నారు. ఆ కుతూహలాన్ని రేకెత్తించడమే ఈ క్యాంపెయిన్ లక్ష్యం. చాలామంది ఆటో దగ్గరకి వచ్చి ‘ఏంటి లా వెళ్తున్నారు’ అని అడుగుతున్నారు. అప్పుడు విషయాన్ని చెప్తున్నాం. మహిళలపై హింస ఆగాలి, అందరూ సమానంగా ఉండాలి. మగవాళ్ల పని, ఆడవాళ్ల పని అని వేరుగా ఉండొద్దు అని స్పష్టంగా చెప్తున్నారు కూడా. వాళ్ల అభిప్రాయాలు వింటుంటే సంతోషంగా ఉంది’ అని మాట పంచుకుంది నారాయణమ్మ. మిశ్రమ అభిప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది యువకులు ‘ఆడవాళ్లు అన్ని పనులూ చేయలేరు. వాళ్ల పరిమితులను దృష్టిలో పెట్టుకొని మెదిలితేనే బాగుంటుందన్న ఒపీనియన్‌ను వ్యక్తపరచారు. ఆశ్చర్యం వేసింది. అలాంటి వాళ్ల ఆలోచనల్లో మార్పు తేవడానికి ఇలాంటి క్యాంపెయిన్ల అవసరం చాలా ఉంది అనిపించింది. అమ్మాయిలకూ ఆత్మవిశ్వాసం కావాలి అని తెలుస్తోంది కొంతమంది అమ్మాయిల మాటలు వింటుంటే.. - శరణ్య, వాయిస్ ఫర్ గర్ల్స్ -
న్యూక్లియర్ రిలేషన్
ఆధునికత .. అనుబంధాలనూ హత్తుకుంది! అత్తాకోడలు,ఆడపడుచు, అల్లుడు..అనే బంధాలు మర్యాద చట్రంలోంచి బయటపడి ఆప్యాయత వరస కలుపుకొన్నాయి! ఇలాంటి అనురాగాలు న్యూక్లియర్ ఫ్యామిలీని అల్లుకుంటున్నాయి! మనుషులు కలిసుండి మనసులు కలహించుకునే బదులు మనుషులు దూరంగా ఉన్నా మనసులు కలిసుండే ఈ మోడర్న్ రిలేషన్సే బావుంటున్నాయని అంటున్నారు మూడు తరాల ప్రతినిధులు. - సరస్వతి రమ ఒకప్పటి ఉమ్మడి కుటుంబాల్లో.. అత్తగారు చెప్పిందే వేదం. ఇంట్లో పనులు అత్తగారికి నచ్చినట్టు చేయాలి. ఆమె కనుసన్నల్లో మెలగాలి. బయట పనులన్నీ మామగారి బాధ్యత. ఇక్కడ కోడలికే కాదు కొడుకుకూ పెద్దగా అధికారాల్లేవ్. కొడుకు అనే బంధానికి కాస్త వెసులుబాటు ఉంటుంది. అటువైపు వరుసలో అల్లుడు రాచమర్యాదలను అందుకుంటుంటాడు. అల్లుని ముందుకి రావడం అత్తగారికి అమర్యాద. మంచిచెడులు ఏవైనా కూతురి ద్వారా తెలపాల్సిందే తప్ప అల్లుడిని అడిగే ధైర్యం అత్తింటివాళ్లకు లేదు. ఇప్పటి కుటుంబాల్లో.. కుటుంబసభ్యులంతా కలసి ఉండే కల్చర్ లేదు. అత్తగారు నిలబడి ఉన్నా కూర్చొని మాట్లాడే స్వేచ్ఛ కోడలికి ఉంది. ‘అత్తయ్యా.. నాకు ఫలానా వంటకం తినాలని ఉంది.. అరగంటలో ఇంటికొస్తాను వేడివేడిగా వండి పెట్టండి’ అని హక్కుగా అడిగే ఇంటి అల్లుళ్లు కనపడుతున్నారు. ఇరుగుపొరుగుతో షాపింగ్ వెళ్లి కోడలికి సూట్ అయ్యే డ్రెస్‌ను కొనిపెట్టే అత్తా ఉంది. ఉద్యోగస్తురాలైన కోడలి మంచిచెడులే కాదు ఆమె సమస్యలనూ పంచుకొని.. ధైర్యాన్నిచ్చే అత్తమ్మా దర్శనమిస్తోంది. అత్తామామల ముప్పయ్యో వివాహ వార్షికోత్సవానికి సెకండ్ హానీమూన్ ట్రిప్‌ని సర్ప్రైజ్ గిఫ్ట్‌గా అందిస్తున్న అల్లుళ్లూ ఉంటున్నారు. కొడుకు విదేశాల్లో ఉంటే తానే కొడుకై వాళ్ల యోగక్షేమాలను కనిపెడుతున్నాడు. మనవళ్లను, మనవరాళ్లకు పక్కన పడుకోబెట్టుకుని కథలు వినిపించే అవకాశం అమ్మమ్మ, నానమ్మలకు ఈ తరం ఇవ్వకపోయినా... స్కైప్‌లో ముచ్చట్లు పెట్టి తృప్తిపడే సౌకర్యాన్ని మాత్రం ఇస్తోంది! ఇలా ఆధునికతను హత్తుకున్న ఈ అనుబంధాలను ఆస్వాదించే కుటుంబాలూ లేకపోలేదు. నో ఎండ్ ఫర్ ఆత్మీయత.. కాలంలో వచ్చిన వేగం ఉమ్మడికుటుంబాలను పొట్టలో దాచుకొని చిన్న కుటుం బాలకు ప్రాణం పోసి ఉండొచ్చు. అంతమాత్రాన అనుబంధాలను మాయం చేయలేదు. ఇదిగో లాంఛనంగా ఉన్న కుటుంబమర్యాదలను పక్కకు తప్పించి దగ్గరితనాన్ని పెంచిందిలా! అయితే ఇదంతా నాణానికి ఓ పార్శ్వం మాత్రమే కావొచ్చు కూడా! స్మార్ట్ రిలేషన్స్.. ‘నౌ ఐయామ్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్. నాకు మునిమనమరాలు కూడా ఉంది. అంటే అయిదు తరాలు చూశానన్నమాట. ఎన్నో మార్పులు. ముఖ్యంగా అనుబంధాల విషయంలో. ఇప్పుడు చదువుకున్నవాళ్ల శాతం పెరిగింది. ఆ చదువు విజ్ఞతను, లాజిక్‌నూ నేర్పుతోంది కాబట్టి ఈ తరం కుటుంబ బంధాలను సంక్లిష్టం చేసుకోకుండా సున్నితంగా మలచుకుంటోంది. అంతకుముందు అత్తగారిమీదే నడిచేది. నాకు అత్తగారి హోదా వచ్చేటప్పటికి నేను ఇండిపెండెంట్‌గా ఉండాలనుకున్నాను.. నా కోడలికీ ఆ స్వేచ్ఛనివ్వాలనుకున్నాను. అలాగే ఉన్నాంకూడా. హ్యాపీగా ఉన్నాం. అనుబంధాల్లో ఏమాత్రం తేడాలేదు. ఇంకా ఈ తరమైతే స్మార్ట్ రిలేషన్స్‌ని కోరుకుంటోంది. ఈ మార్పులో ఉన్న సానుకూల అంశం ఏంటంటే.. ఇదివరకు ఉమ్మడికుటుంబాల్లో మనుషులు కలిసుంటే కలతలు పెంచుకునేవాళ్లు. ఈర్ష్య, అసూయలుండేవి. ఇప్పుడవి లేవు. అంత టైమ్ కూడా ఇప్పటివాళ్లకు లేదనుకోండి. మనుషులు దూరంగా ఉన్నా మనసులు కలిసుంటే చాలు అన్న సూత్రం ఇప్పుడు కనిపిస్తోంది. మంచిదే కదా’ అంటారు ప్రముఖ రచయిత్రి డాక్టర్ కామేశ్వరి. ఫ్రెండ్‌గా ఉంటే చాలు.. ‘నాకు ఒక కూతురు, కొడుకు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. నేను కొన్నాళ్లు ఉమ్మడి కుటుంబానికి కోడలిని. ఇప్పుడూ కొడుకు, కోడలితో కలిసే ఉంటాం. అయినా నేను ఎదుర్కొన్న సమస్యలు నా కోడలికి లేవు. కొడుక్కి సంబంధం కుదరగానే కోడలికి ఫేస్బుక్ ఫ్రెండ్నయ్యా. అలాగే కూతురి పెళ్లి కుదరగానే మా అల్లుడూ నాతో ఆన్లైన్ చాటింగ్ చేసేవాడు (వాళ్లు ఆస్ట్రేలియాలో ఉంటారు). ఇద్దరూ నన్ను ఓ అమ్మలా భావించేవారు. భావిస్తున్నారు కూడా. నా కోడలు అడిగింది మీ ఇంటి కోడలిగా నానుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనెలా ఉండాలనుకుంటున్నారు?’ అని. నన్ను మీ అమ్మలా అనుకొని ఓ ఫ్రెండ్‌లా ఉంటే చాలమ్మా అని చెప్పాను. అలాగే ఉంటున్నాం. అన్నీ షేర్ చేసుకుంటుంది. అటు అల్లుడూ అంతే కొడుకులా ఉంటాడు’అని రచయిత్రి జ్యోతి వలభోజు చెప్తుంటే వాళ్ల కోడలు ప్రీతి ‘ నేను బీటెక్ చేశాను. జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నా. నాకు మా అమ్మవాళ్లింట్లో ఉన్నట్టే ఉంటుంది. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవ్. ఫ్రెండ్లీగా ఉంటారు అత్తమ్మ. మా ఆడపడచు దీప్తి.. తనూ అంతే. మేమిద్దరం వదినామరదళ్లులా ఉండం. కజిన్స్‌లా ఉంటాం.’ అంటుంది. ఇద్దరితోపాటు మూడో కొడుకు.. ‘నాకు ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి. ముగ్గురికీ పెళ్లిళ్లు అయ్యాయి. అల్లుడు రాము మా ఇద్దరు కొడుకుల్లానే ఉంటాడు. అమ్మా అనే పిలుస్తాడు. వాళ్లమ్మకు ఏది కొంటే నాకూ అది కొంటాడు. నా కొడుకులతోనూ ఓ ఫ్రెండ్‌లా ఉంటాడు. బావా అని ఎప్పుడూ పిలుచుకోరు వాళ్లు. స్నేహితుల్లా ఒరేయ్ అనే పిలుచుకుంటారు. అమ్మాయి వాళ్లు దుబాయ్‌లో ఉంటారు. వాళ్లకో బాబు. వాడికి మూడేళ్లు. కథలు, కబుర్లు చెప్పాలని అమ్మమ్మగా చాలా అనిపిస్తుంది. అందుకే వాళ్లమ్మ పనిలో ఉంటే స్కైప్‌లో వాడిని నాకు కనెక్ట్ చేసేస్తుంది. ఆమె పనయ్యే వరకు ఆ కంప్యూటర్లోనే వాడితో ఆడుకుంటా’ అని మోడర్న్ రిలేషన్‌కి అచ్చమైన ప్రతి నిధిలా ఉన్న పద్మాసూర్యప్రకాశ్రెడ్డి చెప్తారు.